Skip to main content

School Admissions: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల.. సీట్ల సంఖ్య ఇలా..

నెల్లిమర్ల: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Announcement released for admissions in gurukula schools

2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు పాఠశాలల్లో మొత్తం 440 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 1వ తేదీ నుంచి 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలను అధికారులు తాజాగా ప్రకటించారు.

చదవండి: Admissions: ‘ఏకలవ్య’లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ఏడు పాఠశాలలు..440 సీట్లు

జిల్లావ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలున్నాయి. వాటిలో మూడు బాలికల పాఠశాలలు కాగా, నాలుగు బాలుర పాఠశాలలు. బాలుర పాఠశాలల్లో నెల్లిమర్ల పట్టణంలో ఉన్న పాఠశాల పూర్తిగా మత్స్యకార బాలుర కోసం కేటాయించింది.

ఆయా పాఠశాలల్లో ఐదో తరగతిలో మొత్తం 440 సీట్లు భర్తీ చేయనున్నారు. నెల్లిమర్ల బాలికలు, గజపతినగరం బాలురు, గంట్యాడ బాలికలు, బొబ్బిలి బాలుర పాఠశాలల్లో 80 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి, నెల్లిమర్ల మత్స్యకార బాలురు, విజయనగరం బాలురు, కొత్తవలస బాలికల పాఠశాలల్లో 40 చొప్పున సీట్లున్నాయి. నెల్లిమర్ల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి 140 సీట్లు కేటాయించారు. వాటిలో ఎంపీసీ–60,బైపీసీ –40,సీఈసీ–40 సీట్లు ఉన్నాయి.

ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు

గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదోతరగతి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించేవారు. 4వ తరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులపై 50 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలుంటాయి. తెలుగు–10, ఇంగ్లీషు–10, లెక్కలు–15, సైన్స్‌, సోషల్‌ కలిపి 15 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు. విద్యార్థులు జవాబులను ఓఎంఆర్‌ షీట్‌లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా అంతా ఒక యూనిట్‌గా ప్రవేశాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

సీట్ల భర్తీలో రిజర్వేషన్లు

పాఠశాలల్లోని మొత్తం సీట్లలో 74 శాతం బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం కేటాయించింది. బీసీ–ఎ విద్యార్థులకు 20శాతం, బీసీ–బి విద్యార్థులకు 28 శాతం, బీసీ–సి విద్యార్థులకు 3 శాతం, బీసీ–డి విద్యార్థులకు 19 శాతం, బీసీ–ఈ విద్యార్థులకు 4 శాతం సీట్లు కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 6శాతం, అనాథ విద్యార్థులకు 3 శాతం సీట్లు ఈబీసీ/ఇతర కులాల విద్యార్థులకు 2 శాతం రిజర్వ్‌ చేశారు. మత్స్యకార బాలుర పాఠశాలలో 46 శాతం సీట్లను మత్స్యకార విద్యార్థులతోనే భర్తీచేస్తారు. 29 శాతం సీట్లను బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఎస్సీ, 6శాతం సీట్లను ఎస్టీ, 3శాతం అనాథ విద్యార్థులకు, 1 శాతం ఈబీసీ, ఇతర కులాల విద్యార్థులకు కేటాయించారు.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు

గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. ఈ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరంతరాయంగా (2022–23, 2023–24) చదివి ఉండాలి. బీసీ, ఈబీసీ విద్యార్థులు 1.9.2013–31.8.2014 మధ్య జన్మించి, 9నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 1.9.2012–31.8.2016 మధ్య జన్మించి, 9 నుంచి 13 సంవత్సరాల వయసు వారై ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించరాదు.

పాఠశాల సీట్ల సంఖ్య

1) నెల్లిమర్ల(బాలికలు): 80

(ఇంటర్మీడియట్‌–140సీట్లు)
2) నెల్లిమర్ల (మత్స్యకార బాలురు): 40

3) గజపతినగరం (బాలురు): 80

4) గంట్యాడ(బాలికలు): 80

5) విజయనగరం(బాలురు): 40

6) కొత్తవలస(బాలికలు): 40

7) బొబ్బిలి(బాలురు): 80

అవకాశాన్ని వినియోగించుకోవాలి

జిల్లాలోని ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలలు పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశాం. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ పరీక్ష ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాం. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదోతరగతికి, పదోతరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల 1 నుంచి 31వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హత గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– సీహెచ్‌.రమామోహిని, గురుకులాల జిల్లా కన్వీనర్‌, విజయనగరం

Published date : 05 Mar 2024 05:21PM

Photo Stories