Skip to main content

Aero and Pharma Varsities: స్వయంగా ప్రతిపాదనను తెచ్చిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్‌లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Aero and Pharma Varsities
హైదరాబాద్‌లో ఏరో, ఫార్మా వర్సిటీలు!

వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్‌ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్‌ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్‌ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్‌కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్ గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది.

చదవండి: 

ఫార్మా పీజీకి మార్గం.. ప్రతి నెల రూ.12,400 స్కాలర్‌షిప్‌..

అవకాశాలతరంగం... ఫార్మా రంగం

అనుమతిలేని ‘ఫార్మా టెక్నాలజీ’ కోర్సుల్లో చేరితే రిజిస్ట్రేషన్‌ చేయం: టీఎస్‌ ఔషధ మండలి

ఫార్మా రంగంలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు సైతం ఉద్యోగాలు..!

సరికొత్త అన్వేషణలు:

ఏరోనాటికల్‌ విభాగంలో భారత్‌లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్‌లో ఈ సెక్టార్‌లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్‌ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మంచి పరిణామమే

ఫార్మా, ఏరోనాటికల్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. 
ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్

Published date : 16 Apr 2022 03:19PM

Photo Stories