Skip to main content

NDA: శుభ‌వార్త‌: నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ)లోకి ఇక మహిళా శక్తి

త్రివిధ బలగాల్లో ఇక మహిళా శక్తి తమ సత్తా చాటనుంది. నేషనల్‌ డిఫన్స్ అకాడమీ (ఎన్ డీఏ)లోకి మహిళల్ని చేర్చుకోవడానికి త్రివిధ బలగాల అధిపతులు తమంతట తాముగా నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
NDA
నేషనల్‌ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ)లోకి ఇక మహిళా శక్తి

మహిళలు ఎన్ డీఏ ప్రవేశ పరీక్ష రాయడానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి మరికాస్త సమయం పడుతుందని సెప్టెంబర్‌ 8న సుప్రీం దృష్టికి తీసుకువెళ్లింది. ‘‘త్రివిధ బలగాల అధిపతులు మహిళల్ని ఎన్ డీఏలో చేర్చాలని నిర్ణయించాయి. ఏ రంగంలోనైనా సంస్కరణలు ఒక్క రోజులు జరగవు. మహిళల్ని చేర్చుకోవడానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేంద్రానికి మరింత సమయం పడుతుంది’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి సుప్రీంకు చెప్పారు. ఒకసారి ఎన్ డీఏలో చేరిన వారు అక్కడ నుంచి శాశ్వత కమిషన్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది ఎన్ డీఏలోకి మహిళలను తీసుకోకపోవడం వివక్షనేనంటూ కుశా కుర్లా దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్ కౌల్, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం గతంలో విచారణ జరిపి ఈ ఏడాది నవంబర్‌ 14న జరగనున్న ఎన్ డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రం త్రివిధ బలగాలతో చర్చించిన మీదట మహిళల్ని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది నవంబర్‌ 14న జరగనున్న ఎన్ డీఏ ప్రవేశ పరీక్ష నుంచి మహిళలకు మినహాయింపునివ్వాలని దీనిపై ఇంకా విధివిధానాలు రూపొందించాలని కేంద్రం కోరింది. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు సాయుధ బలగాల్లో సమానత్వంపై త్రివిధ బలగాలే ముందడుగు వేసి నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించే పరిస్థితులు తెచ్చుకోకూడదని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్‌ 20లోగా కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు సెప్టెంబర్‌ 22కి వాయిదా వేసింది. 


 

Published date : 09 Sep 2021 03:21PM

Photo Stories