Best School: ఉత్తమ పాఠశాల.. రైల్వేస్కూల్
ఖుర్దా జిల్లా జట్నీ మండలం పరిధిలో వరుసగా రెండేళ్లు ఉత్తమ పాఠశాలగా గుర్తింపు సాధించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష నగదు పురస్కారం అందుకోవడం విశేషంగా పాఠశాల ప్రిన్సిపాల్ సబితకుమారి తెలిపారు. పాఠశాల వార్షికోత్సవం పురస్కరించుకుని ఆమె వివరించిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా తాకిడితో గత 2 ఏళ్లుగా వార్షికోత్సవం నివారించినట్లు గుర్తుచేశారు. 2021, 2022 సంవత్సరాల్లో రైల్వే పాఠశాల ఉత్తమ పాఠశాలగా రాష్ట్రప్రభుత్వం గుర్తింపు సాధించిందన్నారు. ఈ పాఠశాల ఒడియా మాధ్యమ విద్యార్థులు ముఖ్యమంత్రి మేధా భృతికి యోగ్యమైన ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 2021, 22లో మెట్రిక్యులేషన్(పదో తరగతి) బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఉత్తీర్ణులుగా నిలిచి ముఖ్యమంత్రి మేధా భృతికి అర్హత సాధించారు.
చదవండి: Open schools: 18 నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఈ జాబితాలో సమగ్రంగా 10మంది విద్యార్థులు స్థానం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మేధా భృతి మంజూరు చేసింది. మరో నలుగురు ముఖ్యమంత్రి భాషా భృతి పొందేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్‌ఈ) నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల ఒడియా భాషలో 90శాతం పైబడి మార్కులు సాధించి ఈ భృతికి అర్హత సాధించారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ముఖ్యమంత్రి భాషా భృతి మంజూరైనట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు 8వ తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్)కు అర్హత సాధించారు. వీరికి వరుసగా 4 ఏళ్ల పాటు ఏటా రూ.12,000ల చొప్పున మంజూరవుతుందని వివరించారు.
చదవండి: విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాల పెంపుదల
శతశాతం ఉత్తీర్ణత..
10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి వార్షిక పరీక్షల్లో 98శాతం, ప్లస్2 శ్రేణిలో 95శాతం ఉత్తీర్ణత సాధించి ఉన్నత పాఠశాల గుర్తింపు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. క్రీడలు, సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యకలాపాల్లో పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉంటున్నారు.
చదవండి: సైనిక్ స్కూల్‌కు ఇద్దరు ఎంపిక
వార్షికోత్సవం సృజనాత్మకం..
వార్షికోత్సవం పురస్కరించుకుని పలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. వర్ధమాన పరిస్థితులకు అద్దంపట్టే పలు అంశాల ఇతివృత్తంగా ప్రదర్శించిన కార్యక్రమాలు అతిథులు, ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వార్షికోత్సవానికి తూర్పుకోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం రింకేష్‌రాయ్, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శుభలక్ష్మి జెనా, అదనపు మండల రైల్వే అధికారి(ఓపీ) కల్యాణ్ పట్నాయక్, ఇంఫ్రా ఏడీఆర్‌ఎం శుభ్రజ్యోతి మండల్ అతిథులుగా విచ్చేసి విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఏటా పాఠశాల సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలు తూర్పుకోస్తా రైల్వే పరిధిలో విశేష గుర్తింపు సాధిస్తున్నాయని అతిథి వర్గం అభినందించింది.
చదవండి: ప్రత్యేక పిల్లలకు భరోసా