Skip to main content

ఇంటర్ ఉత్తీర్ణులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు

ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొలువు దీరేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. కంబైన్‌‌డ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) - 2014 పేరిట లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరో మూడు నెలల్లో జరిగే ఈ పోటీ పరీక్ష స్వరూపం ఏమిటి? అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఏ బాటలో అడుగులు వేస్తే అభ్యర్థులు కృతకృత్యులవుతారనే విషయంపై విశ్లేషణ.

పరీక్షా స్వరూపం:
లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షను రెండు భాగాలుగా విభజించారు. 1 రాతపరీక్ష 2 నైపుణ్య పరీక్ష. రెండు పోస్టులకు రాతపరీక్ష (పేపర్-1)ఒకేలా ఉంటుంది. పేపర్-2లో లోయర్ డివిజన్ క్లర్క్‌కు స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు టైపింగ్ పరీక్ష ఉంటుంది.
ఉద్యోగం పేరు ఖాళీలు
లోయర్ డివిజన్ క్లర్క్: 991
డేటా ఎట్రీ ఆపరేటర్: 1,006
మొత్తం: 1,997
ముఖ్యాంశాలు
  • విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (ఆగస్టు 1, 2014నాటికి)
  • వయో పరిమితి:18-27ఏళ్ల మధ్య అంటే 02-08-1987 తర్వాత 01-08-1996కు ముందు జన్మించి ఉండాలి. కేటగిరీల వారీ వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
  • దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 19-07-2014
  • గడువు: 19-08-2014 సాయంత్రం 5.30 గంటలలోపు
  • దరఖాస్తు రుసుం: రూ. 100. మహిళా అభ్యర్థులు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ లతోపాటు మాజీ సైనికోద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలానా రూపంలో లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
  • ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
  • పరీక్ష తేదీ: నవంబర్ 2, నవంబర్ 9
  • వెబ్‌సైట్: ssconline.nic.in
    ssconline2.gov.in.
ఎంపిక ప్రక్రియ:
పేపర్-1 రాత పరీక్ష, పేపర్-2 నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్) లలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష పేపర్-1
లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రాత పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో (ఇంగ్లిష్ పేపర్ మినహా) రూపొందిస్తారు. అన్ని ప్రశ్నలూ బహుళైచ్ఛికాలు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
రాత పరీక్షా వ్యవధి 2 గంటలు. ప్రత్యేక అవసరాలు గల వారికి గం. 2.40 నిమిషాలు.
పరీక్ష వేళలు: ఉదయం 10 నుంచి 12 వరకు

పేపర్-1: స్వరూపం
అంశం ప్రశ్నల సంఖ్య మార్కులు
జనరల్ ఇంటలిజెన్స్ 50 50
ఇంగ్లిష్ 50 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
జనరల్ అవేర్‌నెస్ 50 50
పేపర్-1కు సన్నద్ధమవ్వండిలా
జనరల్ ఇంటెలిజన్స్
ఈ విభాగంలో పోలికలు-బేధాలు, సమస్య సాధన,విశ్లేషణ, అనాలజీ (నంబర్,ఫిగర్ వర్డ్) జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, అరిథమెటిక్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, నాన్ వెర్బల్ సిరీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పటికే ఇతర ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ విభాగం సులువుగానే ఉంటుంది. ఎక్కువ మోడల్ పేపర్లను సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో నంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆన్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభ నష్టాలు, బారువడ్డీ, డిస్కౌంట్స్, మెన్సురేషన్, టైమ్-డిస్టెన్స్, టైమ్-వర్క్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, బార్ డయా గ్రమ్స్, పై చార్టులు, బీజగణితం, రేఖా గణితం, త్రికోణమితి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ 6 నుంచి 10 తరగతులకు చెందిన గణిత పాఠ్య పుస్తకాల సిలబస్‌లో ఉంటాయి. పేపర్-1 కి సంబంధించి నాలుగు విభాగాల్లో 50 మార్కులు సంపాదించే విభాగం ఇదొక్కటే. కాబట్టి అభ్యర్థులు ఎక్కువ దృష్టి సారించాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి.
-బి. రవిపాల్‌రెడ్డి
డెరైక్టర్, సిగ్మా, హైదరాబాద్

ఇంగ్లిష్
  • ఇందులో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంట నీమ్స్, స్పెల్లింగ్స్, మిస్ స్పెల్ట్ వ ర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఒన్ వర్డ్ సబ్ స్టిట్యూషన్, ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, పాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్, కన్వర్షన్ ఇన్‌టు డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ నరేషన్, షఫ్‌లింగ్ ఆఫ్ సెంటె న్స్ పార్ట్స్, షఫ్‌లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ పాసేజ్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్, వొకాబ్యులరీ, పాసివ్ వాయిస్ , డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటిపై ప్రాథమిక అవగాహన కోసం ప్రామాణిక డిక్షనరీ, గ్రామర్ బుక్‌లను అధ్యయనం చేయాలి.
  • వీటితోపాటు స్టడీ మెటీరియల్, పాత ప్రశ్నపత్రాల సరళిని తెలుసుకోవాలి.
  • రోజూ ఒక ఇంగ్లిష్ దిన పత్రికను చదవడం, ఇంగ్లిష్ వార్తలు వినడం, జాతీయ టీవీ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలను చూస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
ప్రొఫెసర్ పి.వి.సిహెచ్.శాస్త్రి
హెచ్‌ఓడీ, ఐడీఎస్ (ఇంగ్లిష్)

జనరల్ అవేర్‌నెస్
  • వర్తమాన వ్యవహారాలు, పర్యావరణం - సామాజిక జీవనం నుంచి ప్రశ్నలు వస్తాయి. భారత్ చుట్టూ ఉండే సరిహద్దు దేశాలు, వాటి సంస్కృతి, సంబంధాలు, భౌగోళిక స్వరూపం మీద కూడా అడగవచ్చు. జాగ్రఫీ, భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగం అంశాలపైనా ప్రశ్నలు వస్తాయి. పదోతరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదవాలి.
  • ఇక వర్తమాన వ్యవహారాలు, క్రీడలు, విజేతలు, అవార్డులకు సంబంధించి రోజూ రెండు ప్రామాణిక దినపత్రికలు (తెలుగు, ఇంగ్లిష్) చదవాలి. ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన ప్రధాన సంఘటనలను నోట్స్ రాసుకోవాలి. ప్రామాణిక జీకే బుక్స్ చ దవాలి.
ఎన్. విజయేందర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్

రిఫరెన్స్ బుక్స్
  • క్వికర్ మ్యాథ్స్: ఎం.థైరా
  • ఆబ్జెక్టివ్ మ్యాథ్స్: ఆర్.ఎస్.అగర్వాల్
  • రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్, కిరణ్ ప్రకాశణ్
  • ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్. చాంద్ పబ్లికేషన్స్ వర్డ్ నెవర్ మేడ్ ఈజీ
పేపర్-2
స్కిల్ టెస్ట్ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు): 15 నిమిషాల్లో 2000 -2200 కీ ఇంప్రెషన్స్ ఎంట్రీ చేయాలి.
టైపింగ్ టెస్ట్ (లోయర్ డివిజన్ క్లర్క్): ఇంగ్లిష్ మాధ్యమంలో నిమిషానికి 35 పదాలు, హిందీలోనైతే 30 పదాలను టైప్ చేయాలి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, గుంటూరు,
కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్టణం.

దరఖాస్తు పంపాల్సిన
చిరునామా:
రీజనల్ డెరైక్టర్ (ఎస్.ఆర్),
స్టాఫ్ సెలక్షన్ కమిషన్,
ఇ.వి.కె. సంపత్ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్, కాలేజ్ రోడ్, చెన్నై, తమిళనాడు, 600006

తెలియని వాటిని వదిలేయండి
Bavitha స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎంత మంది పరీక్ష రాస్తున్నారు అనే దానికంటే మనం ఎంతవరకు చదివాం? ఏమేర ఆత్మ విశ్వాసంతో ఉన్నామన్నదే ముఖ్యం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ కొద్దిగా క్లిష్టమైన అంశాలు. కాబట్టి వాటిలో బాగా పట్టున్న వాటిపైనే సాధన చేయాలి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో మెరుగైన స్కోరింగ్‌కు శ్రమించాలి. ఈ రెంటిలో ఎవరైతే 90 మార్కులకు పైగా సాధిస్తారో వారికి దాదాపు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో అంశానికి రెండు గంటలు కేటాయించాలి. రోజూ వాటికి సంబంధించిన బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. పరీక్షకు ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది కాబట్టి ఇప్పటినుంచే ప్రణాళికతో సన్నద్ధమైతే మంచిది. స్కిల్ టెస్ట్‌లపైనా నిత్యం సాధన చేయండి. వీటికి రోజుకు గంట కేటాయిస్తే సరిపోతుంది. టైపింగ్ వేగం ఏరోజు ఎంత ఉందో? అంచనా వేసుకుంటూ మరుసటి రోజుకు ఆ వేగాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నించండి. నెగెటివ్ మార్కులతో అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా తెలిస్తేనే సమాధానం రాయండి. కొందరు 160 సరైన సమాధానాలను గుర్తించినా మిగిలిన 40 ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తారు. ఇక్కడే వారి విజయావకాశాలు దెబ్బతింటాయి. మంచి మెటీరియల్, పాత ప్రశ్న పత్రాలు చూస్తే అవగాహన ఏర్పడుతుంది.
Published date : 15 Aug 2014 02:51PM

Photo Stories