Skip to main content

విస్తృత అవకాశాల వేదిక.. ఫార్మసీ

ఎంసెట్ రాసిన విద్యార్థులకు చక్కని ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.. ఫార్మసీ కోర్సులు.. దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తుండడం.. విస్తృతమవుతున్న పరిశోధనల దృష్ట్యా.. ఫార్మసీ రంగంలో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది.. దీంతో ఈ రంగం వేలాది అవకాశాలకు వేదికగా మారింది.. ఫలితంగా ఫార్మసీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫార్మసీ రంగం ప్రస్తుతం విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫార్మసీ కెరీర్ అవకాశాలతోపాటు ప్రముఖ కాలేజీల్లో గతేడాది కటాఫ్ ర్యాంకుల వివరాలు...

ఫార్మసీకి సంబంధించి డి.ఫార్మసీ (డిప్లొమా ఇన్ ఫార్మసీ), డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి), బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ), ఎంఫార్మసీ (మాస్టర్ ఆఫ్ ఫార్మసీ) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ):
ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ). ఈ కోర్సులో రెండో ఏడాది నుంచి సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. ఇందులో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఔషధాల తయూరీ నుంచి సక్రమ వినియోగం వరకూ.. పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా.. మానవ శరీర నిర్మాణంపై అవగాహన పొందేలా.. వ్యాధుల తీవ్రత గుర్తింపు, నివారణ మార్గాలను కనుగొనడంలోనూ నైపుణ్యం సాధించేలా శిక్షణ ఉంటుంది. ఈ క్రమంలో మొదటి ఏడాది రెమీడియల్ మ్యాథమెటిక్స్/రెమీడియల్ బయాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్, రెండో ఏడాదిలో ఫార్మాస్యూటికల్ యూనిట్ ఆపరేషన్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, స్టాటిస్టికల్ మెథడ్స్-కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజికల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మూడో ఏడాదిలో ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ, ఫార్మాకోగ్నసీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, నాలుగో ఏడాదిలో ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మసీ అడ్మినిస్ట్రేషన్, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మోకైనటిక్స్, ఫ్రాజెక్ట్ వర్క్, సెమినార్, ఇండస్ట్రియల్ టూర్, వైవా తదితర అంశాలు ఉంటాయి. ఉస్మానియా, ఆంధ్రా, ఎస్వీయూ యూనివర్సిటీల పరిధిలలో కలిపి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని దాదాపు 200కిపైగా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో సుమారు 10 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా బీ.ఫార్మసీలో ప్రవేశం కల్పిస్తారు. 50 శాతం సీట్లను ఎంపీసీ అభ్యర్థులతో, 50 శాతం సీట్లను బైపీసీ అభ్యరులతో భర్తీ చేస్తారు.

డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మ్.డి):
ఫార్మసీ విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న కోర్సులు పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా లేవని భావించి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ప్రవేశపెట్టిన వినూత్న కోర్సు.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్.డి). ఈ కోర్సులో ప్రవేశించడానికి అర్హత.. ఇంటర్మీడియెట్ (ఎంపీసీ, బైపీసీ). ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్.తో సమానమైదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫార్మసీ కోర్సులన్నీ ఎక్కువ శాతం థియరీ ఆధారితంగా ఉండడంతో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు కూడా ఆరేళ్ల ఈ కోర్సులో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో ఐదేళ్లు క్లాస్‌రూం టీచింగ్, ప్రాక్టికల్స్ సమ్మిళితంగా ఉంటుంది. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్. కోర్సులో మొత్తం 35 థియరీ సబ్జెక్టులను బోధిస్తారు. రెండో ఏడాదిలో హ్యూమన్ అనాటమీ అంశాలను బోధిస్తారు. ప్రతి ఫార్మ్.డి. కళాశాలకు తప్పనిసరిగా ఆసుపత్రి ఉండాలని లేదా కనీసం ఆసుపత్రితో అవగాహన కుదుర్చుకోవాలనే నిబంధనను విధించారు. ప్రతి విద్యార్థి... పది మంది రోగులను ప్రాక్టికల్‌గా పరిశీలించాలి. కోర్సు నాలుగైదు సంవత్సరాల్లో వారానికి పది గంటలు వార్డుల్లో రౌం డ్లు నిర్వహించడం తప్పనిసరి. ఐదో ఏడాది ఉదయం పూట క్లాసులు, మధ్యాహ్నం వార్డ్ రౌండ్లు తప్పనిసరి. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్. రాష్ట్రంలో దాదాపు 40కిపైగా కళాశాలలు ఫార్మ్.డి. కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.

అవకాశాలు:
సరికొత్త ఔషధాల ఆవిష్కరణ.. అందుకోసం వైరస్ కారకాలు, నిరోధకాలపై విస్తృత పరిశోధనలు.. ఔషధాల ఉత్పత్తి, నాణ్యతా నిర్వహణ, పంపిణీ... ఆధునిక సమాజంలో ఇదో నిరంతర , తప్పనిసరి ప్రక్రియ. దాంతో నేడు ఫార్మసీ అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది.ఫార్మసీ అభ్యర్థులు సొంతంగా ఫార్మసీలను స్థాపించుకొని.. స్వయం ఉపాధినీ పొందొచ్చు. బీఫార్మసీ అభ్యర్థులకు.. ఔషధ తయారీ సంస్థల్లో ప్రారంభస్థాయిలో అనలిస్ట్, క్వాలిటీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్.. మధ్యస్థాయిలో అసిస్టెంట్ మేనేజర్, సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్మసీ రంగానికి సంబంధించి ఎంత ఉన్నత విద్యను అభ్యసిస్తే... అంత ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. ప్రభుత్వ రంగంలో.. ఫార్మసిస్ట్‌లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హులు. విదేశాల్లోనూ ఫార్మసీ అభ్యర్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్‌గా ప్రాక్టీస్ చేయాంటే మాత్రం అక్కడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఫార్మ్.డి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఔషధ ప్రమాణాలు ఒకేవిధంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన కారణంగా ఫార్మ్.డి. అభ్యర్థులకు మరింత డిమాండ్ ఏర్పడనుంది. ఈ కోర్సుతోపాటు క్లినికల్ రీసెర్చ్‌లో ‘సాస్’, ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎన్నో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. అంతేకాకుండా అమెరికాలో ఫార్మసీ ఉద్యోగాలకు అవసరమైన ‘నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ (నాప్‌లెక్స్)కు హాజరయ్యే అర్హత ఈ కోర్సుతో లభిస్తుంది. దాంతో అమెరికాలో ఉద్యోగం పొందే వీలుంటుంది.

వేతనాలు:
ఫార్మసీ రంగంలో జీతాలు ఆక ర్షణీయంగానే ఉంటాయి. ప్రారంభ స్థాయిలో నెలకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు సంపాదించవచ్చు. ఎంఫార్మసీ అభ్యర్థులు ప్రారంభంలోనే నెలకు రూ. 20 వేల జీతంతో కెరీర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మా టెస్టింగ్ ల్యాబ్‌లు, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని డయూగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు.
(ఇంటర్ మార్కులాధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా డి.ఫార్మసీలో, పీజీఈసెట్/జీప్యాట్ ద్వారా ఎం.ఫార్మసీ కోర్సులో ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీ విధానంలో బీఫార్మసీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.)

పాక్టికల్ అప్రోచ్‌తో..పటిష్టమైన కెరీర్
Bavitha  బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు ఔత్సాహికులకు ప్రధానంగా ఆవశ్యకమైంది ప్రాక్టికల్ అప్రోచ్. సిలబస్‌లో 90 శాతం మేరకు థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమైనవే. ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూపుల విద్యార్థులు అర్హులైన ఈ కోర్సులో ఇటీవల కాలంలో బైపీసీ విద్యార్థుల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో సీట్లు లభించని విద్యార్థులకు తొలి ప్రత్యామ్నాయంగా బీఫార్మసీ నిలుస్తోంది. నాలుగేళ్ల కోర్సులో రాణించాలంటే కెమిస్ట్రీ, ఫార్మకాలజీ సబ్జెక్ట్‌లలో పట్టు సాధించడం కీలకం. దీంతోపాటు అన్ని సబ్జెక్ట్‌ల బేసిక్స్‌పై ముందు నుంచే నిరంతర అవగాహన ఏర్పరచుకోవాలి. గ్రూప్ డిస్కషన్స్, స్పెషల్ లెక్చర్స్‌కు హాజరవడం వంటి వాటి ద్వారా కొత్త అంశాలు తెలుసుకునేందుకు యత్నించాలి. ఇక.. కెరీర్ పరంగా ప్రస్తుతం బీఫార్మసీకి మంచి ఆదరణ లభిస్తోంది. పరిశ్రమలు, బోధన రంగం, ప్రభుత్వ విభాగాల్లో ఉపాధి లభిస్తోంది. అయితే విద్యార్థులు బీఫార్మసీతో సరిపెట్టకుండా ఎంఫార్మసీని లక్ష్యంగా పెట్టుకుంటే మరింత ఉన్నత స్థానాలు అందుకోవచ్చు. ఎంఫార్మసీ పూర్తి చేస్తే పరిశ్రమలతోపాటు, విద్యా సంస్థల్లో ఏఐసీటీఈ స్కేల్‌తో అధ్యాపకులుగానూ స్థిర పడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఆర్ అండ్ డీలో అడుగు పెట్టాలనుకునే వారికి ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలు మంచి స్పెషలైజేషన్లుగా నిలుస్తున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ కోరుకునే విద్యార్థులకు ఫార్మాస్యుటికల్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీలు చక్కటి స్పెషలైజేషన్లు. ఇప్పుడు కొన్ని సంస్థలు బీఫార్మసీ డిగ్రీ ఆధారంగానే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా నియామకాలు చేపట్టి.. భవిష్యత్తులో ఆ అభ్యర్థులు ఎంఫార్మసీ చేసే విధంగా స్పాన్సర్‌షిప్‌ను కూడా అందిస్తున్నాయి. కాబట్టి కెరీర్ సెటిల్‌మెంట్ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Published date : 04 Jul 2014 12:27PM

Photo Stories