Skip to main content

రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తు మీదే..!

ప్రస్తుత కరోనా కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఆన్‌లైన్ విధానంలో రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
భవిష్యత్తులో రోబోటిక్స్ హవా కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో రోబోటిక్స్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. మూక్స్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా రోబోటిక్స్ కోర్సుల్లో చేరుతున్నారు. రోబోటిక్స్ కోర్సుల పట్ల యువతలో క్రేజ్‌కు భవిష్యత్ అవకాశాలు ఎత్తయితే.. డ్రోన్స్, రోబోల తయారీల్లో ఉండే ఫన్ మరొక కారణంగా నిలుస్తోంది. అందుకే కొద్దికాలంగా రోబోటిక్స్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.

అన్ని రంగాల్లో రోబో...
  • రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రోబోటిక్స్ సేవలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దీంతో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదని అంచనా.
  • ఫార్చ్యూన్ మ్యాగజీన్ 2025 నాటికి తయారీ రంగంలో ఆటోమేషన్ వినియోగం 25 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది.
  • అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, లా అండ్ ఆర్డర్(సర్వైవలెన్స్, పోర్టల్స్), షిప్పింగ్(మెటీరియల్ మూమెంట్), స్పేస్ రీసెర్చ్ టెస్టింగ్‌లో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది.
  • జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు స్వయం చోధిత(సెల్ఫ్ డ్రైవింగ్) కార్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి.
  • పముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇంజనీర్లు, ఏఐ టెక్నాలజీపై బిలియన్ డాలర్లు వెచ్చించింది.
కమ్యూనికేషన్..
ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో వినియోగించేందుకు మనం రోబోలను తయారుచేస్తున్నాం. కాగా, ఈ కోర్సులో రోబోలు, వాటితో మనిషి ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటారు. కుర్టిన్ యూనివర్సిటీ ఈ కోర్సును ఈడీఎక్స్ ద్వారా ఆఫర్‌చేస్తోంది. ఈ కోర్సులో ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభమైంది. కోర్సు వ్యవధి నాలుగు వారాలు.

రోబోటిక్స్..
కొలంబియా యూనివర్సిటీ రోబోటిక్స్ కోర్సును ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది. ప్రస్తుతం ఈడీఎక్స్‌లో ఈ కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌కు అవకాశం ఉంది. కోర్సులో 2డీ, 3డీ స్పేషియల్ రిలేషన్‌షిప్స్, కైనటిక్ చైన్స్ తదితర టెక్నిక్స్ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి 10 వారాలు.

మెకట్రానిక్స్..
ఈ కోర్సును జార్జియా టెక్ యూనివరిసటీ ఈడీఎక్స్ ద్వారా అందిస్తోంది. ఇందులో విద్యార్థులు మెకట్రానిక్స్‌కు సంబంధించిన ఫండమెంటల్స్, కోర్ కాన్సెప్టులను అధ్యయనం చేస్తారు. అలాగే సెన్సార్ల తయారీ, ఇంట్రస్టింగ్ రోబోటిక్ పరికరాల తయారీ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు. ఏప్రిల్ 28 నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభమైంది.
Published date : 27 May 2020 03:20PM

Photo Stories