Skip to main content

మూక్స్.. నెట్టింట్లో యూనివర్సిటీ

కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదినప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs). ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్‌పై ఫోకస్..

మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. ఒకరకంగా చెప్పాలంటే.. దూర విద్యావిధానంలో ఇదో వినూత్న విధానం. నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్న ఇన్‌స్టిట్యూట్‌లలోకోర్సులను ఆన్‌లైన్‌లో అభ్యసించే పద్ధతి.. మూక్స్. ఫలితంగా విద్యార్థులు తమ ఇంటి నుంచే ఇంటర్నెట్ సహకారంతో కోర్సులను అభ్యసించి పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఒకప్పుడు ఆన్‌లైన్ విధానంలో కేవలం ఇన్‌స్టిట్యూట్‌ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్‌తోపాటు వీడియో లెక్చర్స్, విద్యార్థులు, ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల కోర్సులను సైతం నామమాత్రపు ఫీజులతో ఇప్పుడు నేరుగా మూక్స్ ద్వారా అభ్యసించొచ్చు. అందుకే మూక్స్ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్న విద్యార్థుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.

మూక్స్ తీరుతెన్నులు
మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్‌కు.. మూలం ఈ-లెర్నింగ్. ఇందులో నిర్దిష్ట సమయంలో మాత్రమే అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. అదే మూక్స్ విధానంలో.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం చేసుకుంటాయి. తద్వారా.. కోర్సు ఔత్సాహికులు ఏ సమయంలోనైనా సంబంధిత కరిక్యులంకు అనుగుణంగా లెక్చర్స్‌ను అందిపుచ్చుకునే వీలుంటుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా.. తమకు ఇష్టమైన ఇన్‌స్టిట్యూట్‌లలో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సులకు నమోదు చేసుకుని సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఇలా విదేశీవిద్యను అభ్యసించాలనే కోరిక కూడా నెరవేరుతుంది.

భారత విద్యార్థులకు ఎంతో మేలు
మూక్స్ విధానం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేసేదని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి కోర్సుల నాణ్యత ప్రమాణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. మూక్స్ విధానం ఎంతో ఉపయుక్తమైనది. సామాజిక- ఆర్థిక- భౌగోళిక పరిస్థితుల కోణంలోనూ ఎంతో మేలు చేకూర్చే విధానం.. మూక్స్ రూపంలో కోర్సుల అభ్యసనం. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్-స్టూడెంట్ నిష్పత్తి సగటున 1:40గా ఉంటోంది. ఈ నేపథ్యంలో క్లాస్‌రూంలో అధ్యాపకులు చెప్పే అంశాలన్నింటినీ అవగతం చేసుకోవడం కష్టమైందే. అదేవిధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు కూడా మూక్స్ పరిష్కారం చూపుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు సదరు కోర్సు కంటెంట్ ఆసాంతం స్వయంగా తెలుసుకోవడంతోపాటు.. సదరు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నిరంతరం ప్రొఫెసర్లతో సంప్రదిస్తూ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విస్తృతంగా ఉండే కోర్సు కంటెంట్‌ను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కుదించి లైవ్ వీడియో లెక్చర్స్‌ను అందించడం, వర్చువల్ క్లాస్ రూం సదుపాయం కల్పించడం మూక్స్ మరో ప్రత్యేకత.

అమెరికాలో మొదలై.. భారత్‌లో వృద్ధి సాధిస్తున్న మూక్స్
మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల ఆవిష్కరణ అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ సంస్థలు ఆన్‌లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూం పేరుతో పలు కోర్సులను అందించడం ప్రారంభించాయి. ఈ విధానానికి భారత విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. మూక్స్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కోర్సులకు 20లక్షల మంది పేరు నమోదు చేసుకుంటే.. అందులో 2లక్షల 50వేల మంది మన విద్యార్థులే ఉండటం విశేషం. ప్రపంచలోనే మూక్స్ పద్ధతిలో అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దాంతో అమెరికాలోని మూక్స్ కోర్సుల ప్రొవైడర్స్ భారత్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం కుదుర్చుకుని కోర్సులందిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియన్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. కేవలం భారత విద్యార్థులు లక్ష్యంగా ఎడెక్స్ సహకారంతో ‘ఎంగేజింగ్ ఇండియా’ పేరిట ఇంగ్లిష్/హిందీ భాషల్లో 10 వారాల కోర్సుకు ఆవిష్కరణ చేసింది. ఓ మూక్స్ కోర్సును రెండు భాషల్లో ముఖ్యంగా హిందీలో అందించడం ఇదే తొలిసారి.

ఐఐటీ-ముంబైతో మొదలు
అంతర్జాతీయ మూక్స్ ప్రొవైడర్స్ భారత్‌లో ప్రవేశించడం ఐఐటీ-ముంబైతో మొదలైంది. మూక్స్ సర్వీస్ ప్రొవైడర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎడెక్స్.. ఐఐటీ-ముంబైలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు అందిస్తోంది. మరో మూక్స్ ప్రొవైడర్ ‘కోర్స్ ఎరా’.. ఐఐటీ-ఢిల్లీతో ఒప్పందం ద్వారా వెబ్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా కోర్సును అందిస్తోంది. వీటితోపాటు ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-చెన్నైలు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదేబాటలో మరిన్ని మూక్స్ ప్రొవైడింగ్ ఆన్‌లైన్ సంస్థలు పయనిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, మరికొన్ని జాతీయ హోదా ఉన్న ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు.. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉపక్రమిస్తున్నాయి.

అకడెమిక్స్.. ఇండస్ట్రీ
మూక్స్ విధానంలో కోర్సుల ద్వారా అకడెమిక్ నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరం కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. కారణం.. కొన్ని మూక్స్ ప్రొవైడింగ్ సంస్థలు ఆయా సంస్థల కరిక్యులం, పరిశ్రమ అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాటికనుగుణంగా సిలబస్ రూపకల్పన చేసి కొన్ని ప్రత్యేక విభాగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఇలాంటి తరహాలో మూక్స్ సర్టిఫికేట్స్ అందుకుని ఉద్యోగాలు పొందుతున్నారు.

మూక్స్.. ముఖ్య విభాగాలు
గత రెండు, మూడేళ్లలో ఆవిష్కృతమై ప్రాథమిక దశలో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్‌లో.. ప్రస్తుతం అధిక శాతం సెన్సైస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో వీటి సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.

కావాల్సిన మౌలిక సదుపాయాలు
మూక్స్ విధానంలో కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్, జావా స్క్రిప్ట్ సాఫ్ట్‌వేర్, ఏవీ సాఫ్ట్‌వేర్స్, హెడ్‌ఫోన్స్. ఇవి ఉంటే ఆన్‌లైన్ విధానంలో మూక్స్ కోర్సులను ఇంటి నుంచే అభ్యసించొచ్చు. ఈ మౌలిక సదుపాయాల విషయంలోనూ మూక్స్ ప్రొవైడర్స్ ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుని.. మరింత మంది విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘కోర్స్ ఎరా’ సంస్థ మూక్స్ కోర్సుల్లో నమోదు, లెక్చర్స్ వీక్షించడం వంటి సదుపాయాలను మొబైల్ ఫోన్ ద్వారా పొందే విధంగా మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించింది. ఇలా.. మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు.. మారుతున్న టెక్నాలజీతోపాటు తమ స్వరూపాన్ని, తీరుతెన్నులను కూడా మార్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత విద్య ఔత్సాహికులకు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మూక్స్ ప్రొవైడర్స్
ప్రొవైడర్:
ఎడెక్స్
వెబ్‌సైట్: www.edx.org
పాల్గొనే యూనివర్సిటీలు: మిట్, హార్వర్డ్ యూనివర్సిటీ, యూసీ బెర్కిలీ, క్యోటో వర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్.

ప్రొవైడర్: కోర్స్ ఎరా;
వెబ్‌సైట్: www.coursera.org
పాల్గొనే యూనివర్సిటీలు: స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, యూనివ ర్సిటీ ఆఫ్ వర్జీనియా

ప్రొవైడర్: ఐవర్సిటీ;
వెబ్‌సైట్: www.iversity.org
పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్.

ప్రొవైడర్: ఫ్యూచర్ లెర్న్;
వెబ్‌సైట్: www.futurelearn.com
పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఓపెన్ యూనివర్సిటీ, మొనాష్, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, వార్‌విక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్.

ప్రొవైడర్: అకడెమిక్‌ఎర్త్
academicearth.org
పాల్గొనే యూనివర్సిటీలు: యూసీ బెర్కిలీ, యూసీఎల్‌ఏ, మిచిగాన్, ఆక్స్‌ఫర్డ్.

ఇంకా..
ది ఓపెన్ యూనివర్సిటీ;
వెబ్‌సైట్:
www.open.ac.uk
ఎలిసన్; వెబ్‌సైట్: www.alison.com
ఓపెన్ లెర్నింగ్; వెబ్‌సైట్: www.openlearning.com
యుడాసిటీ; వెబ్‌సైట్: www.udacity.com
ఎడ్యుకార్ట్; వెబ్‌సైట్: www.edukart.com

మూక్స్‌తో ప్రయోజనాలు
  • మిట్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల కోర్సులు చదువుకునే అవకాశం.
  • గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు ఆస్కారం.
  • నిరంతర నమోదు అవకాశం
  • నిరంతర అధ్యయనం
  • అధ్యాపకులతో నేరుగా సంభాషించే అవకాశం
  • నచ్చిన సమయంలో క్లాసులు వినే సౌలభ్యం
  • తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం
  • మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కెరీర్ ఉన్నతికి తోడ్పాటు
Published date : 21 Apr 2014 02:27PM

Photo Stories