Skip to main content

ఈ-విద్య వినూత్నం

సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానంలో వృద్ధి భారతీయ విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి పునాదులు వేసింది. ఇంటర్నెట్ విస్తృతి కారణంగా ‘ఈ-విద్య’ ఆవిర్భవించి, శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ ఏటికేడు అధికమవుతోంది. ఒక అంచనా ప్రకారం వచ్చే ఏడాది నాటికి ఈ-లెర్నింగ్ రెవెన్యూ 51.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం స్థితిగతులు, కోర్సులు, ప్రయోజనాలు తదితరాలపై ప్రత్యేక కథనం....
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడంతో అదే స్థాయిలో భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతోంది. 2011-16 మధ్య కాలంలో ఈ-లెర్నింగ్ సగటున 7.6 శాతం వార్షిక అభివృద్ధిని నమోదు చేసుకోనుంది. ఆసియాలో అత్యధికంగా 17.3 శాతం వృద్ధి నమోదు కానున్నట్లు అంచనా. ఇది తూర్పు ఐరోపాలో 16.9 శాతం, ఆఫ్రికాలో 15.2 శాతం, లాటిన్ అమెరికాలో 14.6 శాతంగా నమోదు కానుంది.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రయోజనాలు
  • ఆన్‌లైన్ కోర్సులను ఎవరైనా, ఎక్కడి నుంచైనా పూర్తిచేసే సౌలభ్యం.
  • తక్కువ ఖర్చుతోనే కోర్సులు పూర్తిచేసే అవకాశం.
  • విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే కోర్సులను సైతం ఇంట్లోనే ఉండి, పూర్తిచేసే అవకాశం.
  • ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతుల బోధన పాఠాలు.
  • నచ్చిన సమయంలో కోర్సును అభ్యసించే అవకాశం.
  • అధిక నాణ్యమైన కోర్సు మెటీరియల్ లభ్యత.
  • వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేగంగా పొందే వీలు.
  • ప్రయాణ, వసతి ఏర్పాట్లు వంటి ఖర్చులు ఉండకపోవడం.
  • అభ్యసన వాతావరణంపై అభ్యర్థికి నియంత్రణ ఉండటం.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్- విశిష్ట లక్షణాలు
  • లైవ్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా ఒక చోట కూర్చొన్న ఇన్‌స్ట్రక్టర్ వేర్వేరు ప్రాంతాల్లోని విద్యార్థులకు ఒకే సమయంలో కోర్సుకు సంబంధించిన అంశాలను వివరిస్తూ మార్గదర్శకుడిగా నిలవవచ్చు.
  • ముందే రికార్డు చేసిన లెక్చర్స్, డాక్యుమెంటరీలు, ఇతర వీడియో కంటెంట్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. వీటిని తేలిగ్గా యాక్సెస్ చేయొచ్చు. టెక్ట్స్ ఫార్మాట్‌లోనూ మెటీరియల్ ఉంటుంది.
  • వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థి-విద్యార్థి అనుసంధానానికి వీలవుతుంది. సంప్రదాయ తరగతి గది వాతావరణాన్ని వర్చువల్‌గా సృష్టించుకోవచ్చు.
  • సాధారణగా ప్రింటింగ్ మెటీరియల్‌ను ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి వీలుకాదు. దీనికి కొంత సమయం అవసరమవుతుంది. అదే వర్చువల్ టెక్స్ట్‌పుస్తకాలను తక్కువ సమయంలో అప్‌డేట్ చేసేందుకు వీలవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.
  • డిజిటల్ వైట్ బోర్డులు, వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థ, మల్టీమీడియా సిస్టమ్స్, 3డీ సిస్టమ్స్ వంటి సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ఈ-లెర్నింగ్ ప్రక్రియ శక్తిమంతమవుతోంది.
నైపుణ్యాలను పెంచుకునేందుకు...
  • ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతుండటంతో దేశ, విదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు ఈ-కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిలో చాలా కోర్సులు ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి.
  • కోర్సులు అందించే వెబ్‌సైట్లో వివరాలు పొందుపరిచి, లాగిన్ అయి నచ్చిన కోర్సును ఎంపిక చేయొచ్చు.
  • కోర్సు పూర్తయ్యాక ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్లు కూడా అందుతాయి. అందువల్ల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆన్‌లైన్ కోర్సులు అద్భుత అవకాశం కల్పిస్తున్నాయి.
  • ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు వృత్తి పరంగా ఉన్నత అవకాశాలు సొంతం చేసుకునేందుకు ఆన్‌లైన్ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి అవసరంగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితరాలపై పరిజ్ఞానం అవసరమవుతోంది. ఇలాంటి వారికి ఈ-కోర్సులు ఉపయోగపడతాయి.
‘మూక్’మ్మడిగా విద్యార్జన
  • ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో మ్యాసివ్లీ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (మూక్) కొత్త ఒరవడిని సృష్టించింది. భారీ సంఖ్యలో విద్యార్థులు, లెక్చరర్లను వెబ్ ద్వారా అనుసంధానించడం (లైవ్ లెక్చర్స్, వర్చువల్ క్లాస్‌రూం..) వంటి వాటి ద్వారా మూక్ గొప్ప విజయాలు సాధించింది. ఇది 2008లో ఆవిష్కృతమైనప్పటికీ, 2012లో ప్రజాదరణ పొందిన లెర్నింగ్ విధానంగా గుర్తింపు పొందింది.
  • మూక్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ నిర్వహణ సంస్థలు.. వివిధ విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని, కోర్సులను ఆన్‌లైన్లో చేసేందుకు వీలుకల్పిస్తున్నాయి.
  • విదేశాల్లో చదివే అవకాశం ముఖ్యంగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్), హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత విదేశీ సంస్థల్లో చదివే అవకాశం అందరికీ లభించదు. ఇలాంటి వారు ఆయా సంస్థల భాగస్వామ్యమున్న మూక్ వెబ్‌సైట్ల ద్వారా కోర్సులు పూర్తిచేసి, స్టడీ అబ్రాడ్ కోరికను నెరవేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఈడీఎక్స్ (www.edx.org)ను 2012లో హార్వర్డ్ యూనివర్సిటీ, మిట్ ఏర్పాటు చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు ఇందులో భాగస్వామ్యం ఉంది. ఇందులో ఆర్కిటెక్చర్, డేటా అనలిటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, హ్యుమానిటీస్, మ్యూజిక్, మెడిసిన్.. ఇలా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే సదరు సంస్థ ద్వారా క్రెడెన్షియల్ లభిస్తుంది. కోర్సు ద్వారా లభించిన స్కిల్స్‌ను రెజ్యూమె లేదా లింక్డిన్‌లో అప్‌డేట్ చేసి కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు.
ఈ-విద్యతో ఉన్నత భవిష్యత్తు!
భారత్‌లో ఈ-విద్య
దేశంలో ఆన్‌లైన్ కోర్సుల్లో చెప్పుకోదగ్గది నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్). ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తూ ఇంజనీరింగ్, సైన్స్ విద్యలో నాణ్యతను పెంచడమే ఎన్‌పీటీఈఎల్ లక్ష్యం. ఏడు ఐఐటీలు (ఐఐటీ బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ-బెంగళూరు) ఉమ్మడిగా కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులను ఎవరైనా పూర్తిచేయొచ్చు. వెబ్‌సైట్లో వీడియో కోర్సులు, వెబ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. పాఠాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కోర్సుకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చరల్ డైనమిక్స్, స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ వంటి కోర్సులు ఉన్నాయి.
  • కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిచ్చే దిశగా కదులుతోంది. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్ (స్వయం) మూక్ పోర్టల్ ద్వారా ఉచితంగా కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల నిర్వహణ, గ్రేడింగ్ విధానంపై చర్చలు జరుగుతున్నాయి. ‘స్వయం’ కోసం ఐఐటీ, ఐఐఎస్సీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వీడియో పాఠాలను రూపొందిస్తున్నాయి.
  • డిజిటల్ లిటరసీ, ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇవి దేశంలో ఆన్‌లైన్ విద్య విస్తరణకు దోహదపడతాయి.
  • ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోణంలో స్కూల్, కళాశాల, మిడ్ లెవెల్ ప్రొఫెషనల్ కోర్సులకు సమాన ప్రాధాన్యం లభిస్తోంది.
  • పోటీ పరీక్షలకు సంబంధించి ఎక్కువ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఐఐటీ-జేఈఈ, బిట్‌శాట్, ఏఐపీఎంటీ వంటి పోటీపరీక్షల ప్రిపరేషన్‌కు ఉపయోగపడేలా కంటెంట్‌ను అందుబాటులో ఉంచే పోర్టల్స్ చాలా ఉన్నాయి. కొత్తగా మరిన్ని వస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లను రాసేందుకు వీలుకల్పించే పోర్టల్స్ ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. చాలా పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహిస్తుండటం వల్ల ప్రాక్టీస్ కోణంలో ఈ సైట్లకు డిమాండ్ పెరిగింది.
ఈ-విద్యకు ఉజ్వల భవిష్యత్తు
  • ఈ-కామర్స్ తర్వాత దేశంలో ఈ-ఎడ్యుకేషన్‌కు భారీగా డిమాండ్ పెరగనుందన్న అంచనాలతో ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. విదేశీ భాషలు, ఎంప్లాయ్‌బిలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఇలా వివిధ రకాల నైపుణ్యాలను అందించే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్ భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్నాయి.
  • ‘‘కంపెనీ ప్రస్తుత అవసరాలకు సరిపోయే స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగులను తొలగిస్తున్నారు’’ వంటి మాటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ కోతలు ఎక్కువగా మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రొఫెషనల్స్‌కు స్కిల్స్ అందించే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో (www.simplilearn.com) ఉంటున్నాయి. ఇలాంటి కోర్సుల్లో బిగ్ డేటా అండ్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ సర్వీస్ అండ్ ఆర్కిటెక్చర్ వంటివి మొదటి వరుసలో ఉంటున్నాయి.
  • ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఏ స్కిల్స్‌కు డిమాండ్ బాగా ఉందో గుర్తించి, అప్పటికప్పుడు ఆయా నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులను అందుబాటులోకి తెచ్చే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్స్(www.edukart.com) ఉన్నాయి. ఇలాంటి సైట్స్ ట్రెండింగ్ కోర్సులను అందిస్తూ గుర్తింపు సాధిస్తున్నాయి. విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి.
  • టీచింగ్ ఫ్యాకల్టీకి ఆన్‌లైన్ కోర్సుల వల్ల ప్రయోజనం ఉంటోంది. సంబంధిత సబ్జెక్టుపై అప్‌డేట్ నాలెడ్జ్‌ను పెంపొందించుకునేందుకు ఈ-కోర్సులు ఉపయోగపడుతున్నాయి.
  • ఇప్పటి వరకు డిస్టెన్స్ కోర్సులు అందిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఉదాహరణకు సింబయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్.. ఐ-లెర్న్ క్యాంపస్ ద్వారా వర్చ్‌వల్ క్లాస్‌రూమ్స్, ఈ-మెంటారింగ్, సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్, ఈ-లెర్నింగ్ సీడీల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
అవసరమైన స్కిల్స్
ఆన్‌లైన్ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసేందుకు ఔత్సాహికులకు కొన్ని ప్రాథమిక నైపుణ్యాలు అవసరం..
  • కీ బోర్డు, మౌస్ వంటి పరికరాలను ఉపయోగించే నైపుణ్యాలు
  • ఫైళ్లు, ఫోల్డర్ల నిర్వహణ (సేవ్, కాపీ, మూవ్..)
  • సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్, సెక్యూరిటీ అండ్ వైరస్ ప్రొటెక్షన్
  • ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ వంటి టూల్స్ వినియోగం
  • ఇంటర్నెట్ స్కిల్స్ (కనెక్టింగ్, యాక్సెసింగ్, బ్రౌజింగ్...)
  • ఆన్‌లైన్ కమ్యూనికేషన్ టూల్స్‌ను ఉపయోగించే నైపుణ్యం
  • కంపోజింగ్ స్కిల్స్
  • సెల్ఫ్ మోటివేషన్
  • టైమ్ మేనేజ్‌మెంట్
  • యాక్టివ్ లెర్నింగ్ నైపుణ్యాలు
టాప్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లు

ఈడీఎక్స్ ద్వారా నాణ్యమైన ఆన్‌లైన్ కోర్సులు

 
ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల ద్వారా ఈడీఎక్స్ నాణ్యమైన ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా నచ్చిన ఆన్‌లైన్ కోర్సులను పూర్తిచేయొచ్చు. ఇప్పటి వరకు హార్వర్డ్ యూనివర్సిటీ అందించిన ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్ కోర్సులో 8 లక్షల మంది చేరారు. ఇంట్రడక్షన్ టు లినక్స్, ఇంట్రో టు కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఇంట్రో టు కంప్యుటేషనల్ థింకింగ్ అండ్ డేటా సైన్స్, కాలేజ్ రైటింగ్ సిరీస్ కోర్సులు పాపులారిటీలో ముందంజలో ఉన్నాయి. ఈడీఎక్స్ విద్యార్థుల సగటు వయసు 29 ఏళ్లు. ఈడీఎక్స్ విద్యార్థుల్లో 30 శాతంతో అమెరికా తొలిస్థానంలో నిలవగా, భారత్ (10 శాతం) రెండో స్థానంలో ఉంది. బయాలజీ, బిజినెస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, స్టాటిస్టిక్స్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన అంశాల్లో ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులను, మూక్స్‌ను ఈడీఎక్స్ అందుబాటులో ఉంచుతోంది.
- రేచెల్ లాపాల్, ఈడీఎక్స్.ఆర్గ్.
Published date : 24 Dec 2015 04:46PM

Photo Stories