Skip to main content

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో విజయం సాధించండిలా..!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌–1 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఏడో తేదీన ముగియనుంది. ప్రిలిమ్స్‌ పరీక్షను మార్చి 31న నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. అంటే.. ప్రిలిమ్స్‌కు ఇప్పటినుంచి అందుబాటులో ఉన్న సమయం కేవలం రెండు నెలలు! అంతేకాకుండా.. ఈసారి ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:15 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెబుతున్న నేపథ్యంలో.. ప్రిలిమ్స్‌ గట్టెక్కడం నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు.
 అయితే సిలబస్‌పై అవగాహన.. సరైన ప్రిపరేషన్‌ వ్యూహాలు.. ఆత్మవిశ్వాసమనే ఆయుధం తోడుగా.. ముందుకుసాగొచ్చు. అభ్యర్థులకు ఉపయోగపడేలా గ్రూప్‌–1 సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ వ్యూహాలు, సక్సెస్‌ టిప్స్‌...

ఏపీపీఎస్సీ 169 పోస్టులతో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఇందులో 125 తాజా పోస్టులు కాగా, 44 క్యారీ ఫార్వర్డ్‌ పోస్టులు. గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్టు(ప్రిలిమ్స్‌) మార్చి 31న జరగనుంది.

పరీక్ష స్వరూపం :

  • గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్టు రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌)లో చరిత్ర, సంస్కృతి; రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు; భారత్, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు; భౌగోళిక శాస్త్రం.. విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
  • పేపర్‌ 2 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌)లో రెండు విభాగాలు (ఎ, బి) ఉంటాయి. ప్రతి విభాగంలో 60 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పార్ట్‌ ఏలో... జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ; అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్‌ ఎబిలిటీస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌ బిలో రెండు ఉప విభాగాలు.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; ప్రాంతీయ, జాతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కరెంట్‌ ఈవెంట్స్‌.. ఉన్నాయి. వీటిలో ప్రతి విభాగం నుంచి 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.

పేపర్‌ 1.. సమగ్ర అవగాహన
చరిత్ర, సంస్కృతి :
  • ఈ విభాగంలో 6 అంశాలను పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రధానంగా సంస్కృతిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష విధానాన్ని సివిల్స్‌ తరహాలో మార్చిన నేపథ్యంలో.. సివిల్స్‌ ప్రశ్నల శైలిని పరిశీలించడం లాభిస్తుంది. యూపీఎస్సీ, ఇతర జాతీయ స్థాయి పరీక్షల్లో సంస్కృతి–సంబంధిత అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ట్రెండ్‌ ఏపీపీఎస్సీ పరీక్షల్లోనూ కొనసాగే అవకాశముంది. కాబట్టి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారనే విషయాన్ని గుర్తించేందుకు అభ్యర్థులు ప్రయత్నించాలి.
  • ఈ విభాగం నుంచి సాపేక్ష తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రిపరేషన్‌ పరంగా కంపారిటివ్‌ (పోల్చి) స్టడీ విధానాన్ని అనుసరించాలి. సింధు–వేద నాగరికతలు, బౌద్ధ–జైన మతాలు, భక్తి–సూఫీ ఉద్యమం తదితరాలను పోల్చుతూ చదవడం లాభిస్తుంది.
  • ‘కళలు–శిల్పకళ’ కీలక అంశంగా నిలుస్తుంది. అభ్యర్థులు ప్రధానంగా దేవాలయ శిల్పకళపై దృష్టిపెట్టాలి. అజంతా, ఎల్లోరా తదితర శిల్పాలు, వాటి మధ్య ఉన్న సాపేక్ష అంశాల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలపై ప్రశ్నలు అడగవచ్చు.
  • ఈ విభాగంలో మరో కీలక అంశం... ‘భాష–సాహిత్యం’. ప్రాచీన భాషలు–గుర్తింపు, బౌద్ధ–జైన మత గ్రంథాలు, ఆయా కాలాల్లో ప్రముఖ గ్రంథాలు–రచయితలు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
  • మౌర్యులు, కుషాణులు, గుప్తులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, కాకతీయులు తదితర రాజవంశాలు–వారి పరిపాలన, ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన కలిగి ఉండాలి.
  • పైన పేర్కొన్న అంశాలతోపాటు ఢిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం, మొగలులు, 1857 తిరుగుబాటు, గవర్నర్‌ జనరల్స్, మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్, అంబేద్కర్, వల్లబాయ్‌పటేల్‌ తదితరుల గురించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలను చదివితే..ఈ విభాగంలో 25 మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

 

రాజ్యాంగం–సామాజిక న్యాయం–అంతర్జాతీయ సంబంధాలు :
  • పేపర్‌1లో.. రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలను ఒక విభాగంగా పేర్కొన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలకు సంబంధించి ‘సామాజిక న్యాయం’ అంశాన్ని పాలిటీలో భాగంగా పేర్కొనడం ఇదే తొలిసారి. రాజ్యాంగ పీఠికలోని ‘జస్టిస్‌’ అనే పదం దేశ ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాల గురించి పేర్కొంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న సదరు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ‘రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ’ అంశానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన, కీలక ఘట్టాలు, పాలుపంచుకున్న వ్యక్తులు, పొందుపరిచిన అంశాల మూలం (సోర్సు), గవర్నెన్స్‌ టాపిక్స్‌ కీలకంగా నిలుస్తాయి.
  • పంచాయతీ రాజ్‌ వ్యవస్థ, పబ్లిక్‌ పాలసీ, గవర్నెన్స్‌; పాలనపై ప్రైవేటీకరణ, సరళీకరణ, భౌగోళీకరణల ప్రభావం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • ఈ విభాగంలో పేర్కొన్న ‘అంతర్జాతీయ సంబంధాలు’ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. భారత విదేశాంగ విధానం... ఆయా దేశాలతో ద్వైపాక్షి సంబంధాలు, భారత్‌పై ప్రభావం చూపే అంతర్జాతీయ అంశాలు, పరిణామాలపై ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ఇతర దేశాలతో భారత్‌ కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్‌ను రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావితం చేసే తాజా పరిణామాల గురించి అవగాహన పెంచుకోవాలి. ఇందులో భాగంగా మాల్దీవులు–చైనా మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం, భారత్‌–చైనా సరిహద్దు తగాదాలు, చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్, దక్షిణ చైనా సముద్ర వివాదం, చైనా–నేపాల్‌–భారత్‌ మధ్య సంబంధాలు గురించి అధ్యయనం చేయాలి.

 

ఆర్థికాన్ని అర్థంచేసుకోండి :
పరీక్షలో ‘భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు’ ఒక విభాగంగా ఉంది. అభ్యర్థులు ఈ విభాగాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలను స్వాతంత్య్రానికి పూర్వం, 1947 నుంచి నేటి వరకు, ప్రస్తుత స్థితిలుగా విభజించుకొని చదవాలి. ఆయా కాలాల్లో ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన వృద్ధి, ప్రస్తుత ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి. జాతీయాదాయం అంశాలను అధ్యయనం చేయాలి. సిలబస్‌లో పేర్కొన్న ‘ప్రణాళికలు’పై అవగాహన పెంచుకోవాలి. దేశ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి. వ్యవసాయ రంగంపై ఎక్కువగా దృష్టిపెట్టి చదవాలి. ఆర్‌బీఐ, బ్యాంకింగ్, మానిటరీ పాలసీ, విత్తమార్కెట్లు, సెబీ, భారత పన్నుల విధానం–జీఎస్‌టీ–దాని ప్రభావం, ఫైనాన్స్‌ కమిషన్‌–సిఫార్సులు, ప్రజా వ్యయం, ఫిజికల్‌ పాలసీ, బడ్జెట్‌ తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, దేశ, రాష్ట్ర ఆర్థిక లక్షణాలు, ఈ–గవర్నెన్స్‌ అంశాలు ఈ విభాగంలో కీలకంగా ఉంటాయి.

జాగ్రఫీ.. జయం
భౌతిక, సామాజిక, ఆర్థిక కోణాల్లో జాగ్రఫీని అధ్యయనం చేయాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను వరల్డ్, ఇండియా, ఏపీ జాగ్రఫీలుగా విభజించుకొని చదవాలి. ఇంటర్‌ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో వరల్డ్, ఇండియన్‌ జాగ్రఫీల సమాచారం అందుబాటులో ఉంది. ఏపీ జాగ్రఫీ కోసం ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఫాలో అవ్వాలి.

పేపర్‌ 2... చాలా కీలకం :

  • పేపర్‌–2 పార్ట్‌ ఏలో.. ‘జనరల్‌ మెంటల్‌ అండ్‌ సైకలాజికల్‌ ఎబిలిటీస్‌’ మొదటి విభాగంగా ఉంది. ఇందులో జనరల్‌ ఎబిలిటీ నుంచి నంబర్‌ బేస్డ్, లెటర్‌ బేస్ట్, జనరల్‌ ప్రశ్నలు వస్తాయి. పని–దూరం, పని–కాలం, శాతాలు, సరాసరి, వైశాల్యం, చుట్టుకొలత, సంఖ్యామానం తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 1 నుంచి 60 వరకు స్క్వేర్‌లు, 1 నుంచి 20 క్యూబ్‌లను కంఠస్థం చేయాలి. తద్వారా నంబర్‌ బేస్డ్‌ ప్రశ్నలను సులభంగా సాధించేందుకు వీలవుతుంది. అలాగే ఎ నుంచి జెడ్‌ వరకు.. జెడ్‌ నుంచి ఎ వరకు.. ఇంగ్లిష్‌ అక్షరాలను, వాటి స్థాన విలువలను గుర్తుపెట్టుకోవడం ద్వారా లెటర్‌ బేస్డ్‌ ప్రశ్నలను సాధించొచ్చు. ఈ నైపుణ్యాలు కోడింగ్, డీకోడింగ్‌ ప్రశ్నల సాధనకు ఉపయోగపడతాయి. బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ నుంచి జనరల్‌ ప్రశ్నలు వస్తాయి.
  • సైకలాజికల్‌ ఎబిలిటీస్‌లో భావోద్వేగ ప్రజ్ఞ–కోణాలు, సహానుభూతి, సామాజిక ప్రజ్ఞ, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ టాపిక్స్‌ను ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
  • పేపర్‌–2 పార్ట్‌ బిలో.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ; అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ తాజా ప్రాధాన్యాంశాలు ఉప విభాగాలుగా ఉన్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో.. స్పేస్, డిఫెన్స్‌ టెక్నాలజీ, దైనందిన జీవితంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్, ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్, భారత శక్తి వనరులు, సౌర, పవన విద్యుత్‌లు–ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు కీలకంగా ఉంటాయి. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సులో.. హరిత గృహ ప్రభావం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు–ప్రభావం, విపత్తుల నిర్వహణ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అడవులు, వన్యమృగ సంరక్షణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
  • అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ తాజా ప్రాధాన్యాంశాల కోసం దినపత్రికలు, కరెంట్‌ అఫైర్‌ మ్యాగజీన్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించుకోవాలి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో పరీక్షకు ముందు వరకు జరిగిన కీలక ఘట్టాలు, మార్పులు, వివిధ సూచీలు, వాటిలో భారత్‌ పొందిన స్థానం తదితరాల గురించి తెలుసుకోవాలి.
బేసిక్స్‌తోనే భరోసా..
ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 పరీక్ష శైలి యూపీఎస్‌సీ తరహాలో మారింది. కాబట్టి అభ్యర్థులు బేసిక్స్‌పై పట్టుసాధించాలి. ఇటీవల కాలంలో పోటీ పరీక్షల్లో ఒకటి, రెండు విభాగాలు మినహా దాదాపు అన్ని అంశాల్లో కరెంట్‌ అఫైర్స్‌ మిళిత ప్రశ్నలు అడుగుతున్నారు. సైన్సు అండ్‌ టెక్నాలజీ, ఎకనామిక్స్‌లో ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌కు అధిక∙ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి అభ్యర్థులంతా ప్రిలిమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు మెరుగవుతాయి. ఒక స్థాయిలో ప్రిపేరైన అభ్యర్థులంతా 50శాతం ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించగలుగుతారు. మిగిలిన ప్రశ్నల్లో ఎవరైతే పైచేయి సాధిస్తారో వారికి మెయిన్స్‌ అర్హత లభిస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌!
– ఆర్‌.రామ్‌కుమార్, గ్రూప్‌–1, 2016 విజేత.
Published date : 04 Feb 2019 04:37PM

Photo Stories