Skip to main content

ఆన్‌లైన్ Vs డిస్టెన్స్ కోర్సులు...

సంతోష్‌కి ఎంబీఏ చేయాలనుంది.. కానీ, క్యాట్, మ్యాట్, ఐసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేంత సమయం, డబ్బు రెండూ లేవు. మరి సంతోష్ తన ఆశయాన్ని వదులుకోవాల్సిందేనా? అంటే ఎంతమాత్రం అవసరం లేదు.. ఎందుకంటే... గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎంబీఏ పూర్తిచేసే మార్గాలు ఇప్పుడు అనేకం!!
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్:
అదొక ప్రముఖ ఇన్‌స్టిట్యూట్.. ఒక కోర్సుకు సంబంధించి అందుబాటులో ఉన్న సీట్లు 60. కానీ, వచ్చిన దరఖాస్తులు 6,000కు పైనే! అంటే... 5,940 మందికి నిరాశ తప్పదు! అదే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అయితే సీట్ల సంఖ్యకు ఎలాంటి పరిమితి ఉండదు.. ఎందరు నమోదు చేసుకున్నా అవకాశం దక్కుతుంది.
  • టెక్నాలజీ అభివృద్ధితో భారత్ ఇ-ఎడ్యుకేషన్ రంగంలో వేగంగా ముందుకెళ్తోంది. స్కిల్స్‌ను పెంపొందించుకునేందుకు విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఖ్య భవిష్యత్‌లో మరింతగా పెరగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
  • కేపీఎంజీ నివేదిక ప్రకారం భారత్‌లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రధానంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు యూజీ, పీజీ ఇ-లెర్నింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. యూజీ, డిప్లొమా కోర్సులతో పోల్చితే ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ ఆన్‌లైన్ కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా మెట్రో, టైర్ 1 నగరాల్లో 36 శాతం మంది ఆన్‌లైన్ ఎంబీఏ, పీజీడీఎం; 19 శాతం మంది ఎంసీఏ; 18 శాతం మంది ఎంటెక్; 14 శాతం బీఈడీ, ఎంఈడీ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు.
  • 2021 నాటికి భారత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 1.96 బిలియన్ డాలర్లకు, ఆన్‌లైన్ కోర్సులు చేసే వారి సంఖ్య 96 లక్షలకుపైగా ఉంటుందని అంచనా.

ప్రిపరేషన్.. ఆన్‌లైన్‌లో !
రాబోయే రోజుల్లో వివిధ పరీక్షలకు ప్రిపరేషన్, మాక్‌టెస్ట్‌ల పరంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ఆధారపడే విద్యార్థుల సంఖ్య మరింతగా పెరగనుంది. జేఈఈ మెయిన్, నీట్, క్యాట్, బ్యాంక్ పీవో, క్లాట్, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ప్రత్యామ్నాయాలుగా నిలవనున్నాయి. ఇప్పటికే అందుబాటులో వివిధ రకాల మొబైల్ అప్లికేషన్లు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్ ను అందిస్తున్నాయి.
  • స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య పెరగడం కూడా ఆన్‌లైన్ కోర్సుల వృద్ధికి కీలకంగా నిలుస్తుంది. 2021 నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లు వినియోగించే వారి సంఖ్య 470 మిలియన్లకు చేరుతుందని అంచనా.
  • ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులు ఎక్కువగా థియరీకి పరిమితమవుతున్నాయి. భవిష్యత్తులో వర్చువల్ క్లాస్‌రూమ్ కాన్సెప్ట్‌ని మరింతగా అభివృద్ధి చేసి, ప్రాక్టికల్స్ కోణంలోనూ ముందుకెళ్లే అవకాశముంది.

విస్తృతికి కారణాలు..
  1. సంప్రదాయ విధానాలతో పోల్చితే తక్కువ ఖర్చు.
  2. నాణ్యమైన విద్య లభించడం.
  3. ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులతో ఉపాధి అవకాశాలు పెరగడం.
  4. సమయం పరంగా వెసులుబాటు ఉండటం.
  5. స్వయం, డిజిటల్ ఇండియా; ఎన్‌పీటీఈఎల్ వంటి కార్యక్రమాలపై అవగాహన పెరగడం.

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ :
ఉన్నతవిద్యకు దూరమైన వారు తమ కలను సాకారం చేసుకోవడానికి ఇప్పుడు మార్గాలు అనేకం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా ఉన్నత చదువుల కోరికను నెరవేర్చుకోవచ్చు. జాతీయస్థాయిలో ఇగ్నో దూర విద్యా విధానంలో బ్యాచిలర్, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. రాష్ట్ర స్థాయి ఓపెన్ యూనివర్సిటీలు, యూనివర్సిటీల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు దూరవిద్యా విధానంలో కోర్సులు అందిస్తున్నాయి.

ప్రయోజనాలు..
  1. రెగ్యులర్ విధానంలో ఉన్నతవిద్యకు దూరమైన వారికి మంచి ప్రత్యామ్నాయం.
  2. ఆర్థిక వెసులుబాటులేని వారు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను పూర్తిచేసుకోవచ్చు.
  3. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను పూర్తిచేసి.. పదోన్నతులు పొందొచ్చు.
  4. సెలవులు, వారాంతాల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారు కాబట్టి సమయం పరంగా కలిసొస్తుంది.
  5. రెగ్యులర్ విధానంతో పోల్చితే కోర్సులో ప్రవేశానికి అర్హతల్లో వెసులుబాటు ఉంటుంది.
  6. వయో పరిమితి నిబంధనలు ఉండవు.

ప్రతికూలతలు...
  1. రెగ్యులర్ విధానంతో పోల్చితే తక్కువ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటాయి.
  2. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కరిక్యులం.. ప్రధానంగా బేసిక్స్‌పైనే దృష్టిసారిస్తుంది.
  3. ఇంటర్న్‌షిప్స్, ఇండస్ట్రీ విజిట్స్ లేకపోవడంతో రియల్ టైం ఎక్స్‌పోజర్ తక్కువ.
  4. వర్క్, స్టడీని బ్యాలెన్స్ చేస్తూ చదవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
  5. ప్లేస్‌మెంట్ అవకాశాలు ఉండవు.

మెటీరియల్ ప్రత్యేకంగా...
ఇగ్నో బీఏ, ఎంఏ, ఎంబీఏ వంటి డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సులతోపాటు వినూత్న సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఇగ్నో కోర్సుల్లో చేరిన వారికి అందించే మెటీరియల్ ప్రత్యేకంగా రూపొందించాం. కాబట్టి ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ సందేహాలు ఉంటే వారంతాల్లో స్టడీ సెంటర్లలో నిర్వహించే కౌన్సెలింగ్ సెషన్స్ లో నివృత్తి చేసుకోవచ్చు.
- ఎస్.ఫయాజ్ అహ్మద్, ఇగ్నో రీజనల్ డెరైక్టర్, హైదరాబాద్.
Published date : 25 Jul 2018 05:55PM

Photo Stories