Skip to main content

విద్యార్థులకు ఉపయోగపడే అప్రెంటీస్‌.. సరికొత్తగా సవరణల దిశగా!

అప్రెంటీస్‌.. డిప్లొమా, ఐటీఐ, ఇతర ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు.. రియల్‌ టైమ్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు మార్గం! ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉపాధికి చక్కటి మార్గం అప్రెంటీస్‌ శిక్షణ! అందుకే.. వృత్తి విద్యా కోర్సులు చదివిన విద్యార్థులు.. అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ కోసం అన్వేషిస్తుంటారు.

అప్రెంటీస్‌ను మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా తాజాగా నేషనల్‌ అప్రెంటీస్‌ ప్రమోషన్‌ స్కీమ్‌కు సవరణలు చేస్తూ.. పలు ప్రతిపాదనలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌(ఎంఎస్‌డీఈ) మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది! పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే ఈ సవరణలకు ఆమోదం లభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. అప్రెంటీస్‌ స్కీమ్‌ కొత్త ప్రతిపాదనలు.. విద్యార్థులకు లభించే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

అప్రెంటీస్‌ విధానం ద్వారా విద్యార్థులు తాము చదువుకున్న విభాగానికి సంబంధించిన సంస్థల్లో నిర్దిష్ట వ్యవధిలో ట్రైనీగా శిక్షణ పొందుతారు. ఆ తర్వాత ఎన్‌సీవీటీ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌) నిర్వహించే టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. అప్రెంటీస్‌ సర్టిఫికెట్‌ సొంతమవుతుంది. ఇందుకోసం ఇప్పటికే కేంద్రం పలు స్కీమ్‌లు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. అప్రెంటీస్‌ యాక్ట్‌–1961, అప్రెంటీస్‌ రూల్స్‌–1992,2016లో నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌లను తెచ్చింది. 2016లో రూపొందించిన నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రమోషన్‌ పథకం.. 2019–20 విద్యా సంవత్సరం నాటికి యాభై లక్షల మందికి అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ లక్ష్యాలను సమర్థంగా చేరుకునేలా.. తాజాగా అమెండ్‌మెంట్‌ ఇన్‌ అప్రెంటీస్‌ యాక్ట్‌–1961 పేరిట సరికొత్త ప్రతిపాదనలు రూపొందించింది. ఈ సవరణ బిల్లును త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది.

2016 స్కీమ్‌ ప్రోత్సాహకాలు..
2016లో అమల్లోకి తెచ్చిన నేషనల్‌ అప్రెంటీస్‌ ప్రమోషన్‌ స్కీమ్‌తో.. విద్యార్థులకు, వారిని నియమించుకునే సంస్థలకు పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా అప్రెంటీస్‌ ట్రైనీలకు చెల్లించే స్టయిఫండ్‌ మొత్తంలో 25 శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాకుండా ట్రైనీలకు శిక్షణ కార్యకలాపాలకు సంబంధించి అయ్యే వాస్తవ వ్యయంలో యాభై శాతం అందిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం–30 కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సంస్థలు తమ మొత్తం ఉద్యోగుల్లో 2.5 నుంచి 15 శాతానికి సమాన సంఖ్యలో అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకోవాలి. అదే విధంగా 4 నుంచి 29 మంది సిబ్బంది ఉన్న సంస్థలు కూడా మొత్తం ఉద్యోగుల్లో 15 శాతానికి సమాన సంఖ్యలో అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకునే అవకాశం కల్పించింది.

సవరణ బిల్లు..
తాజాగా అప్రెంటీస్‌షిప్‌ యాక్ట్‌ సవరణ బిల్లు ప్రకారం– విద్యార్థులు తమ అర్హతలకు అనుగుణంగా తయారీ రంగానికి చెందిన సూక్ష, చిన్న, మధ్య తరహా సంస్థలే కాకుండా.. ఇతర రంగాల సంస్థల్లోనూ అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ పొందే అవకాశం లభించనుంది. టెక్నికల్‌ కోర్సులతోపాటు, సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు కూడా అప్రెంటీస్‌ శిక్షణ పొందేలా ఎంఎస్‌డీఈ చర్యలు తీసుకుంటోంది.

విద్యా సంస్థల్లోనూ అప్రెంటీస్‌..
తాజా సవరణ బిల్లులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం.. విద్యా సంస్థల్లోనూ అప్రెంటీస్‌ ట్రైనీ నియామకాలు జరిగేలా చూడటం. దీనివల్ల అప్రెంటీస్‌ ట్రైనీ అవకాశాలు మరింత విస్తృతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా అప్రెంటీస్‌ శిక్షణ పూర్తి చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే శిక్షణ ఇచ్చే సేవల రంగం, బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ, ఐటీఈఎస్, ఎంఎస్‌ఎంఈ రంగాలకు విద్యా సంస్థలు కూడా జత కలిస్తే.. ఏటా లక్షల సంఖ్యలో అప్రెంటీస్‌ ట్రైనీ అవకాశాలు అందుబాటులోకి వస్తాయంటున్నారు.

వర్చువల్‌ ట్రైనింగ్‌..
తాజా సవరణ బిల్లులో.. అప్రెంటీస్‌ ట్రైనింగ్‌లో ఆన్‌లైన్‌– వర్చువల్‌ విధానాలను కూడా అనుమతించాలని ప్రతిపాదించారు. నిర్దేశిత రంగాలు, వృత్తులకు సంబంధించి వర్చువల్‌ విధానంలో ఆన్‌–జాబ్‌ ట్రైనింగ్‌కు అవకాశం లభించనుంది. కరోనా కారణంగా అన్ని రంగాల్లోనూ ఆన్‌లైన్‌ విధానం ఊపందుకుంటోంది. దాంతో అప్రెంటీస్‌ ట్రైనింగ్‌లో వర్చువల్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

విదేశాల్లో అప్రెంటిస్‌..
అప్రెంటీస్‌షిప్‌ యాక్ట్‌ సవరణ బిల్లులో మరో కొత్త ప్రతిపాదన.. విదేశాల్లోనూ అప్రెంటీస్‌కు అవకాశం కల్పించడం. దీని ప్రకారం–దేశంలో ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ విదేశాల్లోనూ కార్యాలయాలు ఉన్న సంస్థలు.. తమ అప్రెంటీస్‌ ట్రైనీలను విదేశీ కార్యాలయాల్లో పనిచేసేందుకు పంపించే అవకాశం కలగనుంది. అంతేకాకుండా అప్రెంటీస్‌ ట్రైనీలు.. తమ సంస్థకు క్లయింట్‌లుగా ఉన్న కంపెనీలకు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తించేలా ప్రతిపాదన చేశారు. దీనివల్ల సదరు ట్రైనీలు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా నైపుణ్యాలు పొందే అవకాశం లభిస్తుంది.

పార్ట్‌ టైమ్‌ అప్రెంటీస్‌..
తాజా బిల్లులో మరో కొత్త ప్రతిపాదన.. పార్ట్‌ టైమ్‌ అప్రెంటీస్‌షిప్‌. దీని ప్రకారం.. విద్యార్థులు తమ స్వీయ ఆసక్తికి అనుగుణంగా పార్ట్‌ టైమ్‌ విధానంలో.. ఒకవైపు చదువుకుంటూనే తమ కోర్సుకు సరితూగే సంస్థల్లో అప్రెంటీస్‌ ట్రైనింగ్‌లో చేరొచ్చు. ఇందుకోసం యూనివర్సిటీ, లేదా తమ కాలేజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

స్టాఫింగ్, రిక్రూటింగ్‌ సంస్థల ద్వారా..
అప్రెంటీస్‌ ట్రైనీల నియామకంలో థర్డ్‌ పార్టీ అగ్రిగేటర్స్‌గా పిలిచే స్టాఫింగ్, రిక్రూటింగ్‌ కన్సల్టెన్సీల ద్వారా నియామకాలు చేసుకునే విధంగా సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ తాజా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. దీని ప్రకారం.. సదరు స్టాఫింగ్‌ సంస్థలు అప్రెంటీస్‌ పోర్టల్‌లో కంపెనీలు పేర్కొన్న ఖాళీలు, అర్హతలకు తగిన వ్యక్తులను గుర్తించి వారికి శిక్షణ సదుపాయాలు కల్పిస్తాయి. అదే విధంగా ట్రైనీలకు సంస్థల తరఫున నియామకాలు ఖరారు చేయడం వంటివి చేస్తాయి. ఇలా సంస్థలకు, విద్యార్థులకు మధ్య అనుసంధాన వేదికలుగా స్టాఫింగ్‌ సంస్థలు వ్యవహరిస్తాయి.

పరీక్ష విధానంలో మార్పులు..
నూతన సవరణ బిల్లులో అప్రెంటీస్‌షిప్‌ పరీక్ష, సర్టిఫికెట్‌ జారీ విధానంలోనూ మార్పులు ప్రతిపాదించారు. నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ సర్టిఫికెట్‌ అవసరం లేని కోర్సులకు సంబంధించి ట్రేడ్‌ టెస్ట్‌కు హాజరవ్వాలా వద్దా అనేది సంస్థలు, ట్రైనీల ఆసక్తి మేరకు వ్యవహరించొచ్చని పేర్కొన్నారు. నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరైన విభాగాల విద్యార్థులు, ప్రభుత్వం నుంచి నిధులు కోరుకుంటున్న వారు.. తప్పనిసరిగా నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ ట్రేడ్‌ టెస్ట్‌కు హాజరై సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది.

స్టయిపండ్‌.. భారం తగ్గేలా
అప్రెంటీస్‌షిప్‌ అనగానే సంస్థలు.. ట్రైనీలకు చెల్లించాల్సిన స్టయిపండ్‌ గురించే ఆలోచిస్తాయి. ఈ స్టయిపండ్‌ చెల్లించడం భారంగా భావించి పలు సంస్థలు అప్రెంటీస్‌ ట్రైనీ నియామకాల విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. అందుకే స్టయిపండ్‌ భారాన్ని తగ్గించే విధంగా తాజా సవరణ బిల్లులో ప్రతిపాదన చేశారు. ముఖ్యంగా స్టయిపండ్‌ షేరింగ్‌ విధానానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. అంటే.. ఏదైనా ఒక ప్రాంతంలో(క్లస్టర్‌లో) ఉన్న సంస్థలన్నీ ఒక బృందంగా ఏర్పడి.. అప్రెంటీస్‌ ట్రైనీలను నియమించుకోవచ్చు. ఆ తర్వాత సదరు ట్రైనీలు ఆ సంస్థలన్నింటిలోనూ విధులు నిర్వర్తించొచ్చు. ఇలాంటి వారికి చెల్లించాల్సిన స్టయిపండ్‌ను సదరు క్లస్టర్‌లోని సంస్థలన్నీ వాటా విధానంలో(షేరింగ్‌) చెల్లించొచ్చు. ఈ ప్రతిపాదన వల్ల చిన్న తరహా సంస్థలకు ఆర్థిక భారం తగ్గుతుందని.. ఫలితంగా సంస్థలు ట్రైనీల నియామకాలకు ముందుకొస్తాయని భావిస్తున్నారు.

స్టయిపండ్‌ రహిత అప్రెంటీస్‌..
అప్రెంటీస్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌లో మరో ముఖ్య ప్రతిపాదన.. స్టయిపండ్‌ లేకుండానే అప్రెంటీస్‌ శిక్షణకు అవకాశం కల్పించడం. ముఖ్యంగా ఒక అకడమిక్‌ ప్రోగ్రామ్‌లో అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ తప్పనిసరిగా ఉండి.. ఆ ట్రైనింగ్‌కు సంబంధించి క్రెడిట్స్‌ విధానాన్ని అమలు చేస్తున్న కోర్సుల విషయంలో ఈ స్టయిపండ్‌ రహిత అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

అప్రెంటీస్‌.. ఉపాధి ఖాయం
అప్రెంటీస్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధికి ఢోకాలేదని చెప్పొచ్చు. ఎంఎస్‌డీఈ వర్గాల సమాచారం ప్రకారం–అప్రెంటీస్‌ సర్టిఫికేషన్‌ పొందిన వారిలో 95 శాతం మందికి సంఘటిత రంగంలోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరిలో 40 శాతం మందికి వారు అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసిన సంస్థల్లోనే కొలువులు ఖరారయ్యాయి. అప్రెంటీస్‌షిప్‌ పూర్తి చేస్తే సదరు అభ్యర్థులకు క్షేత్ర నైపుణ్యాలు లభిస్తాయని కంపెనీలు భావిస్తుం డటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా అప్రెంటిస్‌ శిక్షణ ద్వారా అవసరాలకు అనుగుణంగా పనిచేసే ప్రాక్టికల్‌ సామర్థ్యం కలిగి ఉంటారని కంపెనీలు విశ్వసిస్తున్నాయి.

అమెండ్‌మెంట్‌ ఇన్‌ అప్రెంటీస్‌షిప్‌ యాక్ట్‌–1961.. ముఖ్యాంశాలు

  • సర్వీస్‌ సెక్టార్‌ సంస్థలను కూడా అప్రెంటిస్‌ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన.
  • ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌పైనా అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ దిశగా చర్యలు.
  • ఎన్‌సీవీఈటీ అనుమతించిన స్కిల్‌ కోర్సులను నిర్వహించేందుకు యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లకు అనుమతి.
  • నూతన వేతన కోడ్‌లకు అనుగుణంగా అప్రెంటీస్‌ ట్రైనీలకు కూడా ఆరోగ్య, భద్రత హామీలు.
  • నాలుగు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉన్న సంస్థలు నేరుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విధంగా వెసులుబాటు.

అప్రెంటీస్‌... ప్రయోజనాలు

  • సంస్థలు కోరుకుంటున్న నైపుణ్యాలపై శిక్షణ పొందే అవకాశం.
  • తరగతి గది పాఠాలను, వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే అవకాశం.
  • క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన లభిస్తుంది.
  • అప్రెంటీస్‌ ముగిసే నాటికి పూర్తి స్థాయిలో జాబ్‌ రెడీ స్కిల్స్‌ లభించడం.
  • ఉత్పత్తి, ఇతర రంగాల్లోని సంస్థల నియామకాల్లో అప్రెంటీస్‌ పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యత.

చ‌ద‌వండి: కొలువు సులువు చేసే ఈ స్కిల్స్‌ నేర్చుకోండి.. ఉద్యోగాన్వేష‌ణలో దూసుకుపోండి..

Published date : 06 Jul 2021 03:57PM

Photo Stories