సోషల్ మీడియా కొలువులు...అందిపుచ్చుకునే మార్గాలు
ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతి కారణంగా అక్కడా ఉద్యోగాలు పెరిగాయి. తాజా ట్రెండ్.. సోషల్ మీడియా! యూట్యూబ్, ట్వీటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, లింక్డిన్ వంటి సోషల్ మీడియాలో.. కంటెంట్ క్రియేషన్, డిజైనింగ్, ఎస్‌ఈవో.. ఇలా రకరకాల కొలువులు!! స్మార్ట్ ఫోన్‌తోపాటు, తక్కువ ధరలకే డేటా అందుబాటులోకి రావడంతో.. డిజిటల్ కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా ప్రముఖ మీడియా సంస్థలు కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు అడుగులు వేస్తున్నాయి. సంప్రదాయక ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియా, వెబ్ మీడియాలో కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా కొలువులు.. అవసరమైన నైపుణ్యాలు..
అందిపుచ్చుకునేందుకు మార్గాలను తెలుసుకుందాం...
జాబ్ ప్రొఫైల్స్ ఇవే..
సోషల్ మీడియాలో వివిధ రకాల జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి... » మార్కెటింగ్ నిపుణులు, » సోషల్ మీడియా మేనేజర్లు, » సోషల్ మీడియా స్పెషలిస్టులు, » సోషల్ మీడియా అసోసియేట్స్, » కాపీ రైటర్స్, » కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, » గ్రాఫిక్ డిజైనర్, » ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటర్, » పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్, » మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, » ప్రమోషన్ మేనేజర్, » అకౌంట్స్ మేనేజర్.
అర్హతలు..
ఏదైనా డిగ్రీ అర్హతతో సోషల్ మీడియా ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు. ఇంగ్లిష్ లిటరేచర్, జర్నలిజం నేపథ్యం ఉన్నవారిని నియమించుకునేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. దీంతోపాటు టెక్నికల్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, సోషల్ మీడియా వేదికలపై అవగాహన కలిగిన అభ్యర్థులు సోషల్ మీడియా సంబంధిత ఉద్యోగాల్లో సులువుగానే రాణించవచ్చు.
మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్ :
ప్రైవేటు రంగంలోని చాలా సంస్థలు సోషల్ మీడియా మీద దృష్టిసారించాయి. దాంతో సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణులకు మంచి డిమాండ్ నెలకొంది. ట్వీటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి వాటి ద్వారా తమ బ్రాండ్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు వీరిని నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలి? ఎటువంటి వాటికి లైకులు వస్తున్నాయి, పేమెంట్ యాడ్స్ పుష్ చేసి బ్రాండింగ్ పెంచడం వంటి నైపుణ్యాలున్న అభ్యర్థులు మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. సంస్థల మీడియా నిర్వహణ, మార్కెటింగ్ క్యాంపెయిన్స్, గూగుల్ యాడ్ వర్డ్స్, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవడం వంటివి వీరి ముఖ్య విధులు. వీరికి అన్నిరకాల సోషల్ మీడియా వేదికల గురించి అవగాహన ఉండాలి.
సోషల్ మీడియా మేనేజర్లు :
సంస్థకు, క్లైంట్‌లకు సోషల్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తూ.. వినియోగదారుల ఫిర్యాదులకు, కామెంట్లకు స్పందించడం.. సక్రమ పద్ధతుల ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఎక్కువ మందిని ఆకర్షించడం.. సోషల్ మీడియా మేనేజర్ల ప్రధాన బాధ్యతలు. డిగ్రీతోపాటు ఆకర్షణీయమైన ట్వీట్లు రాయడం, పోస్టులు చేయడం, సోషల్ మీడియా ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడూ అనుసరించడం ఈ ఉద్యోగానికి కావల్సిన ప్రధాన అర్హతలు. వీరు సోషల్ మీడియా పోస్టులు, బ్లాగ్ పోస్టులు రాయడం.. బ్యానర్లు డిజైన్ చేయడం.. ఫొటోలు, వీడియోలు సెలెక్ట్ చేసి ఎడిట్ చేయడం.. కాపీ రైటింగ్, యాడ్ మేనేజ్‌మెంట్, ఆప్టిమైజేషన్ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా స్పెషలిస్ట్‌లు :
సోషల్ మీడియా స్పెషలిస్టులకు మార్కెటింగ్ స్కిల్స్‌తోపాటు కంటెంట్ రైటింగ్, ఫొటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, టెక్ట్స్ ఎడిటింగ్ నైపుణ్యాలు ఉండాలి. వీటితోపాటు వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, ఎస్‌ఈవో స్కిల్స్ అదనపు అర్హత. ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ కంపెనీల సోషల్ మీడియా స్పెషలిస్టు విభాగాల్లో పనిచేసే వారికి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలి. కంటెంట్ రైటింగ్‌తోపాటు టెక్నికల్ రైటింగ్ స్కిల్స్ తప్పనిసరి. కార్పొరేట్ సంస్థలు టెక్నికల్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నాయి. కాంపిటీటివ్ రీసెర్చ్ స్కిల్స్ వీరి కెరీర్ ప్రగతికి దోహదపడతాయి. సదరు సంస్థకు పోటీదారులుగా ఉన్న సంస్థల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ.. వాటి వ్యూహాలకు అనుగుణంగా ప్రతివ్యూహాలు రచించాలి. క్లైయింట్‌లను, సరైన వీక్షకులను గుర్తించడం కూడా వీరి విధుల్లో ముఖ్యమైనవి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా గణాంకాలను విశ్లేషిస్తూ మెరుగైన ప్రతిభ కనబరుస్తూ ఉండాలి.
సోషల్ మీడియా మార్కెటర్లు :
సంస్థలు సోషల్ మీడియా మార్కెటర్లను నియమించుకుంటున్నాయి. సంస్థ బ్రాండింగ్‌ను, వ్యాపారాన్ని పెంచేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది. సంస్థకు సంబంధించిన ప్రొఫైల్స్‌ను సోషల్ మీడియాలో నమోదు చేయడం, వాటి నిర్వహణ బాధ్యత కూడా వీరిదే! సంస్థ అవసరాన్ని బట్టి వినియోగదారులను గుర్తించి వారితో వ్యాపార బంధాలను పటిష్టం చేసుకోవాలి. అందుకోసం లింక్డిన్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రాం, పిన్ ఇంట్రెస్ట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితరాల ఆధారంగా కంపెనీ వెబ్‌సైట్స్‌కు ట్రాఫిక్ వచ్చేలా చూసుకోవాలి. ఫాలోవర్స్, సభ్యుల కోసం వేర్వేరు కమ్యూనిటీలు క్రియేట్ చేయడం, గ్రూపుల నిర్వహణ తోపాటు పేజీలు నిర్వహించాలి. సోషల్ మీడియాలో ప్రమోషనల్ యాక్టివిటీస్ సక్రమంగా ఉండేలా చూడాలి. సోషల్ వేదికల మీద సంస్థ పేజీలు క్రియేట్ చేసి.. వాటిని సమర్థంగా నిర్వహిస్తూ యాక్టివిటీస్‌ను ఎప్పటికప్పుడూ అప్‌డేట్ చేయాలి. కంటెంట్ పబ్లిషింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. కంటెంట్ సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూడాలి. మూస పద్ధతిలో కాకుండా.. కొత్తగా, సృజనాత్మకంగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.
వివిధ రకాల కొలువులు..
సోషల్ మీడియా విభాగంలో వివిధ పేర్లతో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటిల్లో మీడియా మార్కెటింగ్, మీడియా ఎగ్జిక్యూటివ్, మార్కెటర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ స్పెషలిస్టు, డిజిటల్ మార్కెటింగ్, మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ అనలిస్ట్, మార్కెటింగ్ అసోసియేట్, మార్కెటింగ్ మేనేజర్, మీడియా స్ట్రాటజిస్ట్, రైటర్ వంటి విభిన్న పేర్లతో ఉద్యోగాల్లో నియమించుకుంటారు. అనుభవం, పనితీరు ఆధారంగా వివిధ హోదాలు లభిస్తాయి. సోషల్ మీడియాలో ఉద్యోగాలను ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్‌తోపాటు వివిధ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు, నెట్‌వర్కింగ్ ద్వారా అందిపుచ్చుకోవచ్చు.
వేతనాలు :
అర్హతలు, పని అనుభవం ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.15,000 నుంచి జీతాలు మొదలవుతాయి. ఏడాది, రెండేళ్ల అనుభవంతో రూ.30,000 నుంచి రూ. 40,000 వరకు జీతం అందుతుంది. ఈ రంగంలో ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి చక్కటి అవకాశముంది.