Skip to main content

పరీక్షలు ఎన్నో...సిలబస్ ఒకటే !

సర్కారీ కొలువులను ఖాయంచేసే చాలా పోటీ పరీక్షలకు సిలబస్ 60-70 శాతం వరకు కామన్‌గానే ఉంటోంది. ఇదే ఇప్పుడు ఉద్యోగార్థులకు కలిసొచ్చే అంశం అంటు న్నారు సబ్జెక్టు నిపుణులు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసు కొని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు.. ఉమ్మడి సిలబస్‌పై పట్టు సాధిస్తే.. ఏదో ఒక పరీక్షకే పరిమితమవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ క్రమంలో సిలబస్‌లో ఉమ్మడి అంశాలు, సన్నద్ధత, ప్రామాణిక పుస్తకాల గురించి తెలుసుకుందాం...
ఉద్యోగ పోటీ పరీక్షల సిలబస్‌లో కనిపించే సబ్జెక్టులు.. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), మెంటల్ ఎబిలిటీ (రీజనింగ్), ఇంగ్లిష్. వీటిపై పట్టుసాధిస్తే ఏ పరీక్షలో అయినా తేలిగ్గా విజయం సాధించొచ్చు. అయితే అభ్యర్థులు.. ఏ పుస్తకాలు చదవాలి? ప్రశ్నల కాఠిన్యత ఏ స్థాయిలో ఉంటుంది? ఇలా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి అభ్యర్థులు ఆయా పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్నపత్రాలు పరిశీలించడం, సిలబస్‌ను ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా అధ్యయనం చేయడం వంటివి చేయాలి. అప్పుడే ఒకే సమయంలో బహుళ పరీక్షలకు సన్నద్ధత సాధ్యమవుతుంది.

జనరల్ స్టడీస్ :
  • యూపీఎస్సీ సివిల్స్ నుంచి రాష్ట్ర స్థాయి గ్రూప్-1, గ్రూప్-2, వీఆర్‌వో, పంచాయతీ సెక్రటరీ వరకూ... ప్రతిపోటీ పరీక్షలో సింహభాగం జనరల్ స్టడీస్‌దే. కరెంట్ అఫైర్స్, నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, పర్యావరణం, విపత్తు నిర్వహణ; భౌగోళిక అంశాలు, ఎకానమీ, రాజకీయ వ్యవస్థ, భారతదేశ చరిత్ర, తెలంగాణ/ఏపీ చరిత్ర, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ తదితర ఎన్నో అంశాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
  • తాజాగా తెలంగాణలో ఇంటర్ అర్హతతో నిర్వహించిన వీఆర్‌వో పరీక్షల్లో జనరల్ స్టడీస్ సెక్షన్ ప్రశ్నలు గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమైంది. బిట్లు ప్రాక్టీస్ చేసి, సింగిల్ లైన్ మెటీరియల్ చదివి పరీక్షల్లో స్కోర్ చేసే పరిస్థితి ఇప్పుడులేదు. సబ్జెక్టుపై సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు గుర్తించగలుగుతారు. తీవ్రపోటీ దృష్ట్యా ప్రశ్నలు చాలా లోతుగా అడుగుతున్నారు. దాంతో ఆ స్థాయి సన్నద్ధతకు ఉపకరించే మెటీరియల్ సేకరణ కూడా సవాలుగా మారింది. అకాడమీ పుస్తకాలు, ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరిం చడం మేలు చేస్తుంది.

అర్థమెటిక్ :
సివిల్స్ సీ-శాట్ నుంచి వీఆర్‌వో పరీక్ష వరకూ.. ప్రతి పరీక్షలో అర్థమెటిక్ ఉంటుంది. కొన్ని పరీక్షల్లో సుమారు 40 శాతం వెయిటేజీ దీనికే ఉంటుంది. ఇందులో పర్సంటేజ్, యావరేజేస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్ ఇంటరెస్ట్- కాంపౌండ్ ఇంటరెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్ తదితర అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించేలా ప్రాక్టీస్ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు బోడ్‌మస్ రూల్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తించుకోవాలి. వీటివల్ల సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. కొన్ని అంశాలను ప్రత్యేకంగా బ్యాంక్ పరీక్షల్లోనే అడుగుతారు. అవి... డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఎస్‌ఎస్‌సీ, రైల్వే, పోలీస్ రిక్రూట్‌మెంట్ తదితర పరీక్షల్లో జామెట్రీ, అల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సు రేషన్ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉంటా యి. బ్యాంకింగ్ పరీక్షల్లో వీటిపై ప్రశ్నలు పెద్దగా కనిపించవు.

డేటా ఇంటర్‌ప్రెటేషన్ :
ఈ ప్రశ్నల సాధనకు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలపై మంచి అవగాహన అవసరం. వివిధ రకాల గ్రాఫ్‌లను సాధన చేయాలి. క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, స్నాప్, జేఎంఈటీ తదితర ప్రవేశ పరీక్షల్లోనూ ఈ విభాగం కీలకం.

మెంటల్ ఎబిలిటీ/రీజనింగ్ :
అభ్యర్థుల అనలిటికల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం.. రీజనింగ్. ఇది దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ఉంటుంది. బ్యాంకింగ్ పరీక్షల్లో ఏకంగా ఫలితాన్ని నిర్దేశించే విభాగమిది. బ్యాంకింగ్ పరీక్షల్లో హై లెవల్ రీజనింగ్‌పై ప్రశ్నలుంటాయి. అసంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలు ముఖ్యమైనవి. ఈ విభాగానికి సంబంధించి వెర్బల్ రీజనింగ్‌పై దృష్టిపెట్టాలి. కోడింగ్, డీ-కోడింగ్, అనలిటికల్ పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. రాష్ట్రస్థాయి పరీక్షలకు కోడింగ్-డీకోడింగ్, క్యాలెండర్స్, డెరైక్షన్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి. బ్యాంకింగ్‌లో అనలిటికల్ రీజనింగ్, సిలాయిజమ్స్, ఇన్ ఈక్వాలిటీస్, ఇన్‌పుట్ అవుట్‌పుట్ వంటి అంశాల నుంచి ఉన్నత స్థాయి ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇంగ్లిష్ :
  • ప్రతి పోటీ పరీక్షలోనూ కచ్చితంగా ఉండే సబ్జెక్ట్... ఇంగ్లిష్. బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షల్లో దీనికి వెయిటేజీ ఎక్కువ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. ఇంగ్లిష్‌లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రెహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ ముఖ్యమైనవి. వీటితోపాటు స్పెల్లింగ్‌‌స, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్, రీ అరెంజ్ ది సెంటెన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి.
  • ఇంగ్లిష్‌లో పట్టు కోసం మొదట బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. టెనె్‌‌సస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
  • రీడింగ్ కాంప్రెహెన్షన్, వొకా బ్యులరీల్లోనూ పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందాలి. ఎస్‌ఎస్‌సీ లాంటి పరీక్షలకు ఇడియమ్స్, ప్రేజెస్, స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

రిఫరెన్స్ పుస్తకాలు..
కరెంట్ అఫైర్స్:
రోజూ ఏదైనా ఒక ప్రామాణిక ఇంగ్లిష్ పేపర్ (హిందూ), ఒక తెలుగు పత్రిక (సాక్షి) చదువుతూ ముఖ్యాంశాలను నోట్స్‌లో రాసుకోవాలి. ప్రభుత్వ విధానాలను తెలుసుకునేందుకు ప్రభుత్వాల మ్యాగజైన్లు, యోజన వంటివి ఉపయుక్తం.

పర్యావరణం, విపత్తు నిర్వహణ: ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి.

జాగ్రఫీ: తెలుగు అకాడమీ, ఎన్‌సీఈ ఆర్‌టీ పుస్తకాలు.

పాలిటీ: లక్ష్మీకాంత్ పుస్తకాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. పాలిటీకి సంబంధించి సమకాలీన రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది.

భారతదేశ చరిత్ర: తెలుగు అకాడమీ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. ఆధునిక భారతదేశ చరిత్రకు బిపిన్ చంద్ర, ప్రాచీన చరిత్రకు సతీష్ చంద్ర, మధ్యయుగ చరిత్రకు ఆర్‌ఎస్ శర్మ పుస్తకాలు ఉపయోగపడతాయి.

తెలంగాణ ప్రాచీన చరిత్ర: తెలుగు అకాడమీ పుస్తకాలు.

ఏపీ చరిత్ర: బీఎస్ హన్మంతరావు, రఘునాథరావు పుస్తకాలు.

ఎకానమీ: ఆర్థిక సర్వేలు, బడ్జెట్ విశ్లేషణలను తప్పక చదవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు ఏదైనా ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అను సరించొచ్చు.

మెంటల్ ఎబిలిటీ: ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకం.

జనరల్ ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ వంటి పుస్తకాలు.
  • వీటితోపాటు ఎథిక్స్‌కు తెలుగు అకాడమీ పుస్తకం, సోషియాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయుక్తం!!
Published date : 04 Oct 2018 03:14PM

Photo Stories