Skip to main content

క్షేత్ర నైపుణ్యాలను పెంచే అప్రెంటీస్‌షిప్..

వృత్తి విద్య కోర్సులు పూర్తి చేశారా?.. ఐటీఐ/డిప్లొమా/ఇంజనీరింగ్ పట్టభద్రులై ఉద్యోగాన్వేషణలో ఉన్నారా?..స్కిల్ గ్యాప్ వల్ల అవకాశాలు చేజారుతున్నాయా?..
ఈ ప్రశ్నలకు సమాధానం ‘అవును’ అయితే క్షేత్ర నైపుణ్యాలనుపెంచుకునే మార్గాన్ని అందిపుచ్చుకోండి. అదే.. అప్రెంటీస్‌షిప్. పలు పీఎస్‌యూలు ప్రకటనలు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఓ వైపు నైపుణ్యాలకు పదును పెడుతూ మరో వైపు స్టైపెండ్ రూపంలో ఆర్థిక ప్రోత్సాహం అందించే అప్రెంటీస్‌షిప్ పై విశ్లేషణ..

టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినా..
ఐటీఐ/పాలిటెక్నిక్/బీటెక్ వంటి ప్రొఫెషనల్/ టెక్నికల్ కోర్సుల సర్టిఫికెట్ చేతిలో ఉన్నా క్షేత్ర స్థాయి నైపుణ్యాల లేమి వల్ల లక్షల మందికి జాబ్ మార్కెట్లో నిరాశ తప్పడంలేదు. ఇలాంటివారికి అప్రెంటీస్‌షిప్ చక్కటి వారధిగా నిలుస్తోంది. సంస్థల్లో నిర్దిష్ట వ్యవధిలో పనిచేసి వాస్తవ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ), డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీఈటీ) వంటి సంస్థలు నిర్వహించే ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. దీంతో జాబ్ మార్కెట్లో అడుగు పెడితే అవకాశాలను అందుకోవడం ఖాయమన్నది నిపుణుల మాట. గత మూడేళ్లలో ట్రేడ్ టెస్ట్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాలు మూడింతలు పెరిగినట్లు డీజీఈటీ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం...
దేశంలో అప్రెంటీస్‌షిప్ విధానం ఎన్నో ఏళ్లుగా అమలవుతోంది. 1961లో అప్రెంటీస్‌షిప్ చట్టాన్ని కూడా రూపొందించారు. కానీ, వీటిపై విద్యార్థుల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రయోజనం పొందేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా 2020 నాటికి 50 లక్షల మంది యువతకు తర్ఫీదు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అన్ని కోర్సుల విద్యార్థులకు సంబంధిత సంస్థల్లో కనీసం ఏడాది, గరిష్టంగా రెండేళ్ల పాటు శిక్షణ కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంస్థలు అప్రెంటీస్‌లను నియమించుకునేందుకు, శిక్షణ వ్యయంలో 25 శాతాన్ని భరించేందుకు ప్రభుత్వం
ముందుకొస్తోంది.

ప్రత్యేక పోర్టల్ :
అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా సంస్థలను, ఔత్సాహికులను అనుసంధానం చేసేలా ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించారు. ఇందులో అభ్యర్థులు తమ అర్హతలు, వివరాలు, ఆసక్తి గల రంగాల గురించి పేర్కొనాలి. సంస్థలు సైతం తమకు అవసరమైన అర్హతల వివరాలను తెలియజేయాలి. ఈ రెండు వర్గాల సమాచారాన్ని క్రోడీకరించి సంస్థలకు అనుగుణంగా అభ్యర్థుల వివరాలను పంపుతారు. ఈ వివరాలను డీజీఈటీ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనూ అప్రెంటీస్‌షిప్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు, సంస్థలు ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిస్తే ఆ రెండు వర్గాలు అనుసంధానమయ్యేలా విధానాలు రూపొందించారు. అభ్యర్థులకు చెల్లించే స్టైపెండ్‌లో 50 శాతాన్ని ప్రభుత్వం సంబంధిత సంస్థలకు తిరిగి చెల్లిస్తుంది.
వెబ్‌సైట్: www.mhrdnats.gov.in

ట్రైనీలు తప్పనిసరి..
అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీం, నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్‌ల ప్రకారం దేశంలోని అన్ని సంస్థలు తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ అవకాశాలు కల్పించాలి. సంస్థ మొత్తం ఉద్యోగ సామర్థ్యంలో పది శాతం మేరకు అప్రెంటీస్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. శాశ్వత ఉద్యోగుల సంఖ్య 40కి పైగా ఉన్న సంస్థలు ట్రైనీలను కచ్చితంగా నియమించుకోవాలనే నిబంధన ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీఎస్‌యూలు కూడా తప్పనిసరిగా మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమాన సంఖ్యలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసుకోవాలి. అర్హత, ఎంపిక విభాగం ఆధారంగా శిక్షణ వ్యవధి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.

అప్‌డేటెడ్‌గా ఉండాలి...
అప్రెంటీస్‌ల నియామకాలకు ‘మధ్య, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు’ ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయి. అప్రెంటీస్‌ల సమాచారం కోసం అభ్యర్థులు ఆయా సంస్థల వెబ్‌సైట్లను, దినపత్రికలు, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లను చూస్తుండాలి. పలు పీఎస్‌యూలు అప్రెంటీస్‌ల నియామకం కోసం ఇటీవల ప్రకటనలు విడుదల చేశాయి. అవి..
1. ఇండియన్ రైల్వేస్ ఐటీఐ అర్హతతో పలు ట్రేడ్‌లలో ట్రైనీల నియామకానికి
ప్రకటన ఇచ్చింది.

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2017
వెబ్‌సైట్: www.rrccr.com

2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 1495 మంది ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వెబ్‌సైట్: www.iocl.com

3. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 129 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ప్రకటనను జారీ చేసింది.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2017
వెబ్‌సైట్: www.hindustancopper.com

అర్హతలకు తగిన స్టైపెండ్ :
అప్రెంటీస్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు అర్హతలు, ఎంపికైన విభాగాలకు అనుగుణంగా సంస్థలు స్టైపెండ్ చెల్లించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీటెక్ గ్రాడ్యుయేట్లకు రూ.4984; డిప్లొమా/ ఐటీఐ అభ్యర్థులకు రూ.3542; ఒకేషనల్ అప్రెంటీస్‌లకు రూ.2758 ఇవ్వాలి. శిక్షణ సదుపాయం సాంకేతిక విద్యకే పరిమితం కావట్లేదు. అన్ని రంగాలకూ వ్యాప్తి చెందుతోంది. సేవా రంగం, హోటల్ పరిశ్రమ, టూరిజం, హాస్పిటాలిటీ ఇలా దాదాపు మూడు వందల విభాగాల్లో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

డీజీఈటీ, హెచ్‌ఆర్‌డీనాట్స్ :
అప్రెంటీస్ ఔత్సాహికులు తమ అర్హతలకు సరితూగే సంస్థలకు దరఖాస్తు చేసుకునే క్రమంలో డీజీఈటీ, mhrdnats.gov.in వెబ్‌సైట్లను చూడటం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అదే విధంగా ఆయా సంస్థల వెబ్‌సైట్స్, జాబ్ పోర్టల్స్‌ను వీక్షించడం ద్వారా అవకాశాల వేదికలను విస్తృతం చేసుకోవచ్చు.

ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్..
1. 2016-17లో దేశ వ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మందికి అప్రెంటీస్ శిక్షణ.
2. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు 20 శాతం పెరిగిన అప్రెంటీస్‌ల నియామకాలు.
3. 2020 నాటికి అప్రెంటీస్‌ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలనే లక్ష్యం.
Published date : 15 Nov 2017 05:54PM

Photo Stories