కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. పలు యూనివర్సిటీల రాయితీలు, మినహాయింపులు..
కెనడా, యూకే, ఆస్ట్రేలియాలకు చెందిన యూనివర్సిటీలు.. స్టాండర్డ్ లాంగ్వేజ్ టెస్ట్‌లుగా పేర్కొనే ఐఈఎల్‌టీఎస్, టోఫెల్ స్కోర్ల నుంచి మినహాయింపునిస్తున్నాయి. లాక్‌డౌన్‌ల కారణంగా టెస్ట్‌లకు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నిర్దిష్టంగా ఆయా స్పెషలైజ్డ్ కోర్సులకు అవసరమైన జీఆర్‌ఈ, జీమ్యాట్, శాట్, ఏసీటీ టెస్ట్ స్కోర్లు, ఉత్తీర్ణత నిబంధనల నుంచి కూడా అనేక యూనివర్సిటీలు మినహాయింపు ఇస్తున్నాయి.
ఫీజు రాయితీలు..
ప్రస్తుత పరిస్థితుల్లో పలు దేశాలకు చెందిన యూనివర్సిటీలు.. అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా ఫీజుల్లో రాయితీలు ఇస్తున్నాయి. దాంతోపాటు సదరు విద్యార్థులు ఆయా యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉండే స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. ఈ విషయంలో కెనడా, ఆస్ట్రేలియా, యూకే దేశాల యూనివర్సిటీలు ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు.
సందిగ్ధతలో విద్యార్థులు..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశీ చదువులకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు కొంత సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదికి వదిలేయాలా.. లేదా ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు ఖరారు చేసుకొని సమయం వృథా కాకుండా చూసుకోవాలా.. అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. యూనివర్సిటీలు భరోసా కల్పిస్తున్నప్పటికీ.. కరోనా పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారతాయోననే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఒకవైపు దేశంలో అకడెమిక్ పరీక్షల వాయిదా.. మరోవైపు మన విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపే స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ మొదలు కావడం వంటివి మరింత సందిగ్ధతకు దారితీస్తోంది.
తప్పదనుకుంటే వాయిదా..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో స్పష్టత లేకుండా నిర్ణయం తీసుకోవడం కంటే.. విదేశీ విద్యను ఒక ఏడాది వాయిదా వేసుకోవడం మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో అదనపు అర్హతలు కల్పించే ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసుకోవడం మంచిది. లేదా ఏదైనా ఉద్యోగంలో చేరినా ప్రయోజనమే. ఇవి రెజ్యూ మ్‌లో కనిపిస్తే భవిష్యత్‌లో ప్రవేశాల పరంగా ప్రాధాన్యం లభిస్తుందని చెబుతున్నారు.
అమెరికా వైపే మొగ్గు..
మన దేశ విద్యార్థులు.. స్టడీ అబ్రాడ్ పరంగా అమెరికానే మొదటి గమ్యంగా ఎంచుకోవడం గమనార్హం. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం–మొత్తం విదేశీ విద్య ఔత్సాహిక విద్యార్థుల్లో 42.6 శాతం మంది యూఎస్ వైపు మొగ్గు చూపారు. 16 శాతం మంది మాత్రం కెనడాలో ప్రవేశాలకు ఆసక్తి చూపారు. ఆ తర్వాత స్థానాల్లో యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నిలిచాయి.
ఇంకా చదవండి : part 2: ఆన్‌లైన్ తరగతుల కన్నా.. క్యాంపస్ లైఫ్‌పై విద్యార్థుల ఆసక్తి..