కొలువు సులువు చేసే ఈ స్కిల్స్ నేర్చుకోండి.. అన్వేషణలో దూసుకుపోండి..
ఉద్యోగాల్లో కోతలు పెరిగాయి. కొత్త నియామకాలపై కంపెనీల పరిమితులు కొనసాగుతున్నాయి. ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు అవకాశాలు లభించని పరిస్థితి ఏర్పడింది.’ –ఇది కరోనా రెండో దశ కారణంగా జాబ్ మార్కెట్, రిక్రూట్‌మెంట్స్ విషయంలో నిపుణుల అభిప్రాయం!! ఇలాంటి పరిస్థితుల్లో కొలువులు కోల్పోయిన వారితోపాటు ఉద్యోగాల కోసం అన్వేషణ సాగిస్తున్న అభ్యర్థులు అనుసరించాల్సిన విధానాలు తెలుసుకుందాం...
పలు సంస్థల సర్వేల ప్రకారం–కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉద్యోగాల్లో కోతలు భారీగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం–మే నెల నాటికి దేశంలో దాదాపు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం రేటు 12 శాతంగా నమోదైంది. ఇదే పరిస్థితి మిడ్ లెవల్, సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలోనూ కనిపించింది. పరిస్థితులు చక్కబడి మళ్లీ జాబ్ మార్కెట్‌కు పూర్వ వైభవం రావాలంటే.. కనీసం ఏడాది సమయం పడుతుందని పలు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పుడేం చేయాలి..
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు.. మళ్లీ కొలువు దక్కించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా అన్వేషణ సాగించాలి. అదే సమయంలో తమ విభాగానికి సంబంధించి తాజా నైపుణ్యాలు పొందేందుకు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన వస్తుంది. జాబ్ మార్కెట్ స్కిల్స్ మెరుగవుతాయి. ఫలితంగా రానున్న రోజుల్లో నియామకాలు జరిగినప్పుడు అవకాశాలు అందుకోవచ్చు.
సోషల్ మీడియా మార్గం..
ఉద్యోగాన్వేషణలో సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లింక్డ్‌ఇన్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసుకొని జాబ్ అలర్ట్స్ సెట్ చేసుకోవాలి. ఆయా మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ..సంబంధిత రంగాల నిపుణులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం సదరు సంస్థల్లో పని చేస్తున్న తమ సహచరులు, పరిచయస్తులతో టచ్‌లో ఉండాలి. ఇటీవల కాలం లో పలు సంస్థలు రిఫరల్ ఎంట్రీ పేరుతో నియామకాలు చేపడుతున్నాయి. అంటే..సంస్థల్లోని ఖాళీలు, నియామకాలకు సంబంధించి తమ ఉద్యోగులకు తెలియజేసి.. సరైన వ్యక్తులను సిఫార్సు చేయమని కోరుతున్నాయి. కాబట్టి ఆయా సంస్థల్లో పనిచేసే వారితో సత్సంబంధాలు కొనసాగిస్తే..రిఫరల్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాన్వేషణలో ముందంజలో ఉండొచ్చనేది నిపుణుల అభిప్రాయం.
ఫ్రెషర్స్‌కు పరిష్కారం..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ మినహాయిస్తే.. మిగతా కాలేజీల విద్యార్థులకు క్యాంపస్ ఆఫర్లు తగ్గడం తెలిసిందే. దాంతో వారంతా జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు సాధించడం గురించి ఆందోళన చెందుతున్నారు. వీరు జాబ్ పోర్టల్స్, కంపెనీల రిక్రూట్‌మెంట్ విభాగాల్లో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసుకోవాలి. ఫలితంగా వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంటర్వూ్య కాల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెషర్స్ ఉద్యోగం లభించే వరకూ ఖాళీగా ఉండకుండా.. స్వల్పకాలిక కోర్సులు, జాబ్ సర్టిఫికేషన్స్ వంటివి పూర్తిచేస్తూ ప్రాక్టికల్ నైపుణ్యాల కోసం కృషి చేయాలి.
ఆన్‌లైన్ లెర్నింగ్..
కరోనా పరిస్థితులు ఏర్పడిన గతేడాది నుంచి.. కేజీ టు పీజీ.. ఆన్‌లైన్ లెర్నింగ్ కొనసాగుతోంది. మరికొంత కాలం ఆన్‌లైన్ లెర్నింగ్ విధానమే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా నైపుణ్యార్జన పరిమితమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష బోధన, రియల్ టైమ్ ప్రాక్టికల్స్, కేస్ స్టడీలు వంటి వాటి ద్వారా నైపుణ్యాలు పొందగలిగే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. సాధ్యమైనంత మేరకు విద్యార్థులు ఆన్‌లైన్ లెర్నింగ్‌ను సమర్థంగా వినియోగించుకుని.. నైపుణ్యాలు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా వర్చువల్ ల్యాబ్స్, టీచర్స్‌తో వర్చువల్ ఇంటరాక్షన్ వంటివి వినియోగించుకోవాలని పేర్కొంటున్నారు.
‘కీలక’ స్కిల్స్ పెంచుకునేలా..
ఇప్పుడు ఉద్యోగాన్వేషణ సాగిస్తున్న అభ్యర్థులతోపాటు త్వరలో సర్టిఫికెట్లతో జాబ్ మార్కెట్లో అడుగుపెట్టే విద్యార్థులు.. కంపెనీలకు అవసరమైన కీలకమైన స్కిల్స్ పెంచుకునేలా కృషి చేయాలి. ముఖ్యంగా టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటివి మెరుగుపరచుకోవాలి. అందుకోసం మూక్స్ వంటి ఆన్‌లైన్ వేదికలను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు వర్చువల్ విధానంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర లైఫ్ స్కిల్స్‌కు సంబంధించి శిక్షణ అందిస్తున్నాయి.
ఇంకా చదవండి : part 2: మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఇలా.. ఉద్యోగాన్వేషణ నైపుణ్యాలు అందిపుచ్చుకోండి..