Skip to main content

కార్పొరేట్ రంగంలో సరికొత్త కొలువు... చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్

చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్.. కార్పొరేట్ ప్రపంచంలో ప్రాధాన్యం పెరుగుతున్న సరికొత్త జాబ్ ప్రొఫైల్! దశాబ్దం క్రితమే అమెరికా వంటి దేశాల్లో చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ పోస్టు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ప్రతి అయిదు ప్రముఖ కంపెనీల్లో కనీసం ఒక సంస్థలో ఈ పోస్టు ఉంది.
మన దేశంలోనూ గత రెండు మూడేళ్లుగా చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్‌తో ప్రయోజనాలు, విధులు, బాధ్యతలు, అర్హతల గురించి తెలుసుకుందాం...
నేటి టెక్నాలజీ యుగంలో టీమ్‌వర్క్ తారకమంత్రం. టీమ్ వర్క్‌లో భాగంగా భిన్న నేపథ్యాలు, దృక్పథాలు, వ్యక్తిత్వాలున్న ఉద్యోగులు ఒకేచోట కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వీరందరూ సమ్మిళితంగా కృషిచేస్తేనే సంస్థ ఆశించిన లక్ష్యాలు సాధించగలుగుతుంది. అయితే టీమ్ వర్కింగ్ ఎక్కువగా ఉండే సంస్థల్లో సిబ్బంది మధ్య సత్సంబంధాలు కొనసాగేలా చూడటం ఇప్పుడు హెచ్‌ఆర్ విభాగాలకు కత్తిమీద సాములా మారుతోంది. టాప్ మేనేజ్‌మెంట్ కనీసం 20 శాతం సమయాన్ని ఉద్యోగుల మధ్య విభేదాలు పరిష్కరించేందుకే కేటాయించాల్సి వస్తోందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది.

విధులు- బాధ్యతలు :
ఉద్యోగుల నియామకం నుంచి సంస్థల్లో తాజా వ్యాపారాభివృద్ధికి రూపొందిస్తున్న వ్యూహాల వరకు సిబ్బందిలో అన్ని నేపథ్యాల వారికి భాగస్వామ్యం కల్పిస్తూ, ప్రోత్సహిస్తూ, బేధాభిప్రాయాలు తొలగేలా చేయడమూ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ బాధ్యతే. తాజా సర్వేలో సిబ్బందిలో సమ్మిళిత దృక్పథాన్ని పెంపొందించేందుకు చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల పాత్ర అవసరమవుతోందని 60 శాతం సంస్థలు స్పష్టంచేశాయి. మరో 25 శాతం సంస్థలు, అంతర్గతంగా వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు సీడీవోల అవసరం ఉంటోందని తెలిపాయి. 15 శాతం సంస్థలు మాత్రం ప్రతిభను గుర్తించే విషయంలో పక్షపాత ధోరణి లేకుండా చూసేందుకు చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్లు అవసరమని స్పష్టం చేశాయి.

జండర్ డైవర్సిటీకి ప్రాధాన్యం...
ప్రస్తుతం సంస్థలు పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యమిచ్చేలా పలు చర్యలు చేపడుతున్నాయి. ఉదాహరణకు ఇప్పటివరకు ఇంజనీరింగ్, రీసెర్చ్ వంటి విభాగాల్లో మహిళలు రాణించలేరనే అభిప్రాయం ఉంది. వీటికి భిన్నంగా ఈ విభాగాల్లో సైతం.. తాజా నియామకాల నుంచి నుంచి ఇన్-హౌస్ ఉద్యోగుల వరకూ.. మహిళలు అన్ని స్థాయిల్లో అవకాశాలు అందుకునేలా చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందరికీ అవకాశాలు కల్పిస్తూ.. ఇన్నోవేషన్, క్రియేటివిటీలను పెంపొందిస్తూ.. సంస్థ ప్రగతికి అన్ని వర్గాలు తోడ్పడేలా చేయడమే చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ ముఖ్య బాధ్యతని చెప్పొచ్చు.

ఈ రంగాల్లోనే ఎందుకు?
సర్వే ప్రకారం ఎఫ్‌ఎంసీజీ, ఎఫ్‌ఎంసీడీ, రిటైల్, లైఫ్ సెన్సైస్, ఐటీ, ఇంజనీరింగ్/మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల ప్రాధాన్యం పెరుగుతోంది. ఉదాహరణకు.. ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ రంగాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఫ్రంట్ డెస్క్ నుంచి బ్యాక్ ఎండ్‌లో లాజిస్టిక్స్, ఆపరేషన్స్ వరకు.. వందలాది సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బేధాభిప్రాయాలు ఏర్పడటం, లేదా నలుగురితో కలిసి పనిచేయలేని మనస్తత్వం గల సిబ్బంది కూడా ఉంటారు. ఇలాంటి వారిని పర్యవేక్షిస్తూ వారిలో నెలకొన్న అభిప్రాయాలు, అపోహలు తొలగిపోయేలా చేసి.. సంస్థ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్పంచుకునేలా చేయాల్సిన బాధ్యత చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్లదే!

మహిళలకు ప్రాధాన్యం :
సంస్థలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) తర్వాత శ్రేణిలో చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల నియామకం చేపడుతున్నాయి. వీటిలో మహిళలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇన్ఫోసిస్, ఇంటెల్ కార్పొరేషన్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సైతం మహిళలనే చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్లుగా నియమి స్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఫార్చూన్-500 సంస్థల్లో 60 శాతం సంస్థలు చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల నియామకం చేపట్టాయి. ఈ సంస్థల్లో 80 శాతం సంస్థలు మహిళలనే సీడీవోలుగా నియమించడం విశేషం.
  • హెచ్‌ఆర్, లైజనింగ్, టాలెంట్ అక్విజషన్ వంటి విభాగాల్లో విధులు నిర్వహించిన, అనుభవమున్న వారినే సీడీవో స్థాయిలో నియమించేందుకు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. అకడమిక్‌గా హెచ్‌ఆర్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ వంటి స్పెషలైజేషన్లలో మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉంటే మరింత ప్రాధాన్యం లభిస్తోంది.
ఇవి అవసరం..
  • ఉద్వేగ ప్రజ్ఞ (ఎమోషనల్ కోషియంట్).
  • కమ్యూనికేషన్ స్కిల్స్.
  • లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్కిల్స్.
  • నెట్ వర్కింగ్, టాలెంట్ అక్విజిషన్ స్కిల్స్.
  • ట్రైనింగ్, కౌన్సెలింగ్, అడ్వైజింగ్ స్కిల్స్.
  • మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలపై అవగాహన
వచ్చే రోజుల్లో మరిన్ని నియామకాలు...
 చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల నియామకం రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. అన్ని రంగాల్లోని సంస్థలు ఈ జాబ్ ప్రొఫైల్ ప్రాధాన్యాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ పెంపొందించేలా చేయడం చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ల బాధ్యతగా భావించే సంస్థలు.. వారికి అలాంటి స్వేచ్ఛను కల్పించాలి. అప్పుడే ఈ కొత్త హోదా లక్ష్యాలు నెరవేరుతాయి.
    - రోనేష్ పూరి,ఎండీ, ఎగ్జిక్యూటివ్ యాక్సెస్ ఇండియా.
Published date : 25 Sep 2018 06:18PM

Photo Stories