Skip to main content

జ్యాబ్‌ క్యాలెండర్‌లో ప్రతి ఒక్కరికీ అవకాశం.. కొలువు సాధించండిలా..!

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్‌ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!!

అలాంటి పరిస్థితులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్‌ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్‌ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు.

గ్రూప్స్, పోలీస్, మెడికల్‌.. ఇంకా ఎన్నో..
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం–గ్రూప్‌–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్‌ తర్వాత ఎంతో క్రేజ్‌ ఉండే పోలీస్‌ రిక్రూట్‌మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్‌ ఉద్యోగాల భర్తీ జరుగనుంది.
ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్‌టీ బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్‌లకు ఇటీవల జాబ్‌ క్యాలెండర్‌ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు.

ప్రతి ఒక్కరికీ అవకాశం..
జ్యాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్‌–1,2 సర్వీసులకు బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్‌ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్‌ అర్హతతో కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • పారా మెడికల్‌ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్‌ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది.
  • వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్‌ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్‌ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.
  • విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్‌ లేదా సెట్‌ స్కోర్‌ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది.

ఇంకా చదవండి: part 2: సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి.. ఒకే పరీక్షతో..

Published date : 02 Aug 2021 04:14PM

Photo Stories