Skip to main content

అప్రెంటీస్‌షిప్‌కు మార్గాలు.. ప్రయోజనాలు..!

ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. అప్రెంటీస్! అప్రెంటీస్ శిక్షణ పూర్తిచేసుకుంటే... ప్రయోజనం ఏమిటి? ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు వాస్తవ పరిస్థితుల్లో స్వల్పకాల వ్యవధిలో శిక్షణ అందించే విధానమే.. అప్రెంటీస్‌షిప్. దీనిద్వారా పరిశ్రమ వాతావరణం, వాస్తవ సమస్యల పట్ల అవగాహన లభిస్తుంది. తద్వారా అభ్యర్థుల్లో పరిశ్రమలు ఆశించే నైపుణ్యాలు మెరుగవుతాయి. అప్రెంటీస్‌లకు 2019లో పరిస్థితి ఆశాజనకంగా ఉండనుందా! అంటే.. ఓ తాజా సర్వే అవుననే అంటోంది! ఏయే రంగాల్లో అవకాశాలు లభించనున్నాయి.. అప్రెంటీస్‌షిప్‌కు మార్గాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
పెరగనున్న అవకాశాలు..
అప్రెంటీస్‌లకు కొత్త సంవత్సరంలో 25 శాతం మేర అవకాశాలు పెరగనున్నట్లు నేషనల్ ఎంప్లాయబిలిటీ త్రూ అప్రెంటీస్ ప్రోగ్రామ్(ఎన్‌ఈటీఏపీ) ఇటీవల పేర్కొంది. గతేడాది అవకాశాల పరంగా.. అగ్రికల్చర్, ఫార్మా రంగాలు ముందువరుసలో నిలిచాయి. 2019లో ఆటోమొబైల్, ఫార్మా, అగ్రికల్చర్, ఐటీ/ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు లభించనున్నాయని అంచనా. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో.. అగ్రికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్ , ఫార్మా రంగంలో ప్రొడక్ట్ లైన్‌మేనేజర్, రీసెర్చ్ అసెస్‌మెంట్ అప్రెంటీస్‌లకు డిమాండ్ నెలకొంది.

ఎన్‌ఈటీఏపీ :
అప్రెంటీస్‌షిప్ కింద 2018లో దేశవ్యాప్తంగా దాదాపు 550 కంపెనీలు 1,30,000 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాయి. 2019లో రిటైల్, మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో అప్రెంటీస్‌షిప్‌కు ప్రాధాన్యం దక్కనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్‌ఈటీఏపీ(నేషనల్ ఎంప్లాయబిలిటీ త్రూ అప్రెంటీస్ ప్రోగ్రామ్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలసి నైపుణ్యాల పెంపుపై దృష్టిపెట్టింది. అప్రెంటీస్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్‌ఈటీఏపీ తాజాగా హైదరాబాద్‌లో తయారీరంగదారులు, ట్రేడ్ అసోషియేషన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో మానవ వనరుల నిర్వహణ, నైపుణ్యసృష్టి, రెండు రాష్ట్రాల్లో అప్రెంటీస్‌షిప్‌ను పెంపొందించడంపై చర్చించారు.

అప్రెంటీస్ యాక్ట్ 1961 :
పరిశ్రమల్లో అప్రెంటీస్ ప్రోగ్రామ్‌లను చట్టబద్ధం చేస్తూ కేంద్రం అప్రెంటీస్ యాక్ట్ 1961 తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2014లో అప్రెంటీస్ యాక్ట్‌లో కీలక సవరణలు చేసింది. ఇందులో భాగంగా అప్రెంటీస్‌షిప్‌పై ట్రేడ్, యూనిట్‌ల వారీగా ఉన్న నియంత్రణలను తొలగించింది. కంపెనీ లేదా పరిశ్రమలో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5 శాతం నుంచి 10శాతానికి సమాన స్థాయిలో అప్రెంటీస్‌లు ఉండాలని నిర్దేశించింది. దీంతోపాటు అప్షనల్ ట్రేడ్లను ప్రవేశపెట్టింది.

ఎన్‌ఏపీఎస్ :
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్‌ఏపీఎస్) కింద 2018-19లో 15 లక్షల మందికి... 2019-20లో 20 లక్షల మందికి అప్రెంటీస్ శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • అభ్యర్థులు రీజనల్ డెరైక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్(ఆర్‌డీఏటీ) వెబ్‌సైట్‌కు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆర్‌డీఏటీ అభ్యర్థుల దరఖాస్తులను పరిశ్రమలకు పంపిస్తుంది.
  • పరిశ్రమలు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల అప్రెంటీస్‌షిప్‌ను ఆమోదిస్తూ.. రిసీట్ పంపిస్తాయి.
  • ఆన్‌లైన్‌లోనే.. అంప్రెటీస్‌షిప్ వ్యవధి, స్టైపెండ్, శిక్షణ తీరు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది.
  • ఐటీఐ/ఐటీఐ డ్యూయల్ లెర్నింగ్ మోడ్, పీఎంకేవీవై/ఎంఈఎస్-ఎస్‌డీఐ కోర్సులు, గ్రాడ్యుయేట్లు/డిప్లొమా హోల్డర్లు లేదా 10+2 వొకేషనల్ సర్టిఫికెట్ హోల్డర్లు దరఖాస్తుకు అర్హులు.
కాల వ్యవధి :
అప్రెంటీస్‌షిప్‌లో బేసిక్ ట్రైనింగ్, జాబ్/ప్రాక్టికల్ ట్రైనింగ్ అని రెండు రకాల శిక్షణ ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ ఫ్రెషర్స్‌కు మాత్రమే ఉంటుంది. ఆయా ప్రోగ్రామ్‌లు, కోర్సులను పూర్తిచేసిన వారికి నిర్దిష్ట కాల వ్యవధిలో శిక్షణ ఉంటుంది. 6 నెలల నుంచి ఏడాది వరకూ అప్రెంటీస్ ఉంటుంది.

నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ :
ఈ స్కీమ్ కింద డిజిగ్నేటెడ్, ఆప్షనల్ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన వృత్తి లేదా ట్రేడ్‌ను డిజిగ్నేటెడ్ ట్రేడ్ అంటారు. పరిశ్రమలు లేదా కంపెనీలు అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్ అందించడానికి నిర్ణయించుకున్న ట్రేడ్, వృత్తులను ఆప్షనల్ ట్రేడ్‌లుగా పిలుస్తారు.

కేటగిరీలు :
  • ట్రేడ్ అప్రెంటీస్
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
  • టెక్నీషియన్ అప్రెంటీస్
  • టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్
  • ఆప్షనల్ ట్రేడ్ అప్రెంటీస్
సర్టిఫికేషన్‌లు :
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(ఎన్‌సీవీటీ) ఏటా రెండుసార్లు ఆలిండియా ట్రేడ్ టెస్టు(ఏఐటీటీ) నిర్వహిస్తుంది. ఏఐటీటీ అక్టోబర్/నవంబర్, ఏప్రిల్/మే నెలల్లో జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికేట్స్ (ఎన్‌ఏసీ) ప్రదానం చేస్తారు. ప్రభుత్వ, ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు కంపెనీల్లోని ఉద్యోగాల భర్తీలో ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ను పరిగణలోకి తీసుకుంటాయి.

డిజిగ్నేటెడ్ ట్రేడ్‌లు
ప్రభుత్వం 261 ట్రేడ్‌లను గుర్తించింది. వాటి లో కొన్ని ముఖ్యమైనవి..
  • టెక్నీషియన్(ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్).
  • పెయింటర్ జనరల్, మెరైన్.
  • లెథర్ గూడ్స్ మేకర్.
  • సిరామిక్ డెకరేటర్.
  • ఎలక్ట్రీషియన్ ఎయిర్‌క్ట్రాఫ్ట్.
  • మెకానిక్ రేడియో అండ్ రేడార్ ఎయిర్‌క్రాఫ్ట్.
  • ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్.
  • ఫుడ్ ప్రొడక్షన్ ఊ హార్టీకల్చర్ అసిస్టెంట్.
  • మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్.
  • టూరిస్ట్ గైడ్
  • ఇన్సూరెన్స్ ఏజెంట్.
  • హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.
ఆప్షనల్ ట్రేడ్స్..
 అకౌంటెంట్, బ్యాంకింగ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెలీకాలర్, లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ అప్రెంటీస్, రిటైల్ సేల్స్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్‌రిసోర్స్, మార్కెటింగ్, ఫైనాన్స్), రిటైల్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ (ప్రొడక్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్).  ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద ఉన్న కోర్సులు/మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన ఇతర కోర్సులను ఆప్షనల్ ట్రేడ్స్‌గా గుర్తిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.rdathyderabad.gov.in
Published date : 30 Jan 2019 02:53PM

Photo Stories