Skip to main content

అంతరిక్షంలో అవకాశాల అన్వేషణకు.. స్పేస్ సైన్స్‌తో అవ‌కాశాలు ఇవే..!

అంతరిక్ష శాస్త్రం(స్పేస్‌ సైన్స్‌).. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినిపిస్తున్న మాట! తాజాగా రీ యూజబుల్‌ రాకెట్స్, అంతరిక్షంలో ఆవాసాలపై శాస్త్రవేత్తల దృష్టిపడింది.

మన దేశంలోనూ ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలో.. అంతరిక్ష పరిశోధనలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి! ఫలితంగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ఘన విజయాలు సాధిస్తోంది! మరోవైపు అంతరిక్ష రంగంలో.. ఆస్ట్రోనాట్‌ (వ్యోమగామి) మొదలు పరిశోధనలు చేసే సైంటిస్ట్‌లు, టెక్నీషియన్‌ల వరకూ.. యువతకు ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. అంతరిక్ష రంగంలో కొలువులు, అవసరమైన అకడమిక్‌ అందిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలతో సమగ్ర కథనం..

అర్హతలు, కోర్సులు..
అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష రంగంలో భారత్‌ అద్భుత విజయాలు.. గత కొంతకాలంగా మనం వింటున్నవే! ఈ ప్రయోగాలు, ఉపగ్రహాల తయారీ, వాహక నౌకలను రూపొందించడం, వ్యోమగాములను అంతరిక్షానికి పంపడం.. వీటన్నింటి వెనుక ఎంతో మంది ప్రతిభావంతుల అంకితభావం, నైపుణ్యం,పరిశ్రమ దాగి ఉంటుంది. అలాంటి నైపుణ్యాలు, ప్రతిభ సొంతం చేసుకోవాలంటే.. అందుకు తగ్గ శిక్షణ ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకోసం పలు ఇన్‌స్టిట్యూట్‌లు సంబంధిత కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. అంతరిక్ష రంగంలో ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

బీటెక్‌ టు పీహెచ్‌డీ..

  • అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి బ్యాచిలర్‌ స్థాయి నుంచి పీహెచ్‌డీ(రీసెర్చ్‌) వరకూ.. పలు ఇన్‌స్టిట్యూట్స్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌) ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ) అందించే కోర్సులకు మంచి పేరుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ బ్యాచిలర్‌ స్థాయిలోlబీటెక్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఏవియానిక్స్‌) కోర్సులు అందిస్తోంది. దీంతోపాటు ఐదేళ్ల డ్యుయల్‌ డిగ్రీ(బీటెక్‌+మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌/మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ) కోర్సులోనూ ప్రవేశం కల్పిస్తోంది. వీటిద్వారా అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న ప్రతిభావంతులకు ఇస్రోలోనే సైంటిస్ట్‌/ఇంజనీర్‌–ఎస్‌సీ(స్పేస్‌ సెంటర్‌)గా కొలువులు కూడా అందిస్తోంది.
  • ఐఐఎస్‌టీతోపాటు ఢిల్లీ యూనివర్సిటీ(ఆస్ట్రో ఫిజిక్స్‌ కోర్సు), ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–బీహెచ్‌యూలు, ఐఐఎస్‌సీ–బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌–డెహ్రాడూన్‌లు సైతం బ్యాచిలర్‌ స్థాయిలో స్పేస్‌ సైన్స్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.

బీటెక్‌ కోర్సులకు అర్హత..
ఐఐఎస్‌టీ, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–బీహెచ్‌యూ వంటి సంస్థల్లో బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు.. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతోపాటు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి.

పీజీలో పలు స్పెషలైజేషన్లు..
స్పేస్‌ సైన్స్‌కు సంబంధించి పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్లలో చేరే అవకాశం ఉంది. ముఖ్య ంగా ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఏవియానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ వంటి స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. పలు ప్రముఖ యూనివర్సిటీలు ఎమ్మెస్సీ ఆస్ట్రానమీ స్పెషలైజేషన్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ పీజీ స్పెషలైజేషన్లలో చేరాలంటే.. బీటెక్‌లో సంబంధిత బ్రాంచ్‌లో ఉత్తీర్ణత సాధించి, గేట్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రీసెర్చ్‌.. అవకాశాలు
అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి రీసెర్చ్‌(పీహెచ్‌డీ).. అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష రంగంలో రీసెర్చ్‌ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఫలితంగా పరిశోధక అభ్యర్థులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం ఐఐఎస్‌సీ–బెంగళూరు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీ, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్‌ వంటి పరిశోధన సంస్థల్లో రీసెర్చ్‌ కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఐటీ–ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆస్ట్రోఫిజిక్స్, ఏవియానిక్స్, కాస్మాలజీ, ఆస్ట్రానమీ విభాగాల్లో పరిశోధనలకు అవకాశం లభిస్తోంది. వీటిలో ప్రవేశానికి సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ లేదా జెస్ట్‌(జాయింట్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌) స్కోర్‌ ఉండాలి. దాంతోపాటు పర్సనల్‌ ఇంటర్వూలో ప్రతిభా ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
అంతరిక్ష శాస్త్రంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులకు అవకాశాలు పుష్కలం. అభ్యర్థులు వారు పూర్తి చేసుకున్న కోర్సు, నైపుణ్యాల ఆధారంగా కొలువులు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రోనాట్, స్పేస్‌ ఇంజనీర్స్, స్పేస్‌ సైంటిస్ట్స్, టెక్నాలజిస్ట్స్,మెటీరియాలజిస్ట్ట్, క్లైమేటాలజిస్ట్,స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైనర్స్‌ వంటి ఉద్యోగాల్లో చేరొచ్చు.

ఆస్ట్రోనాట్‌..
స్పేస్‌ టెక్నాలజీ లేదా స్పేస్‌ సైన్స్‌ అనగానే గుర్తొచ్చేది ఆస్ట్రానాట్‌(వ్యోమగామి) అనడంలో సందేహం లేదు. ఆస్ట్రోనాట్‌గా అవకాశం పొందాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ నైపుణ్యాలు కలిగుండటమే కాకుండా.. శారీరకంగానూ ధ్రుడత్వం అవసరం. ఆస్ట్రోనాట్‌గా ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మనగలిగేలా ఈ శిక్షణ ఉంటుంది.

స్పేస్‌ ఇంజనీర్స్‌..
అంతరిక్ష శాస్త్రంలో మరో ముఖ్యమైన కొలువు.. స్పేస్‌ ఇంజనీర్‌. వీరు స్పేస్‌–క్రాఫ్ట్స్, స్పేస్‌ వెహికిల్స్, స్పేస్‌ స్టేషన్స్‌ను డిజైన్‌ చేయడమే కాకుం డా.. అక్కడి వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ.. స్పేస్‌ క్రాఫ్ట్స్‌కు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూస్తారు. స్పేస్‌ ఇంజనీర్స్‌గా స్థిర పడాలంటే.. ఏరోస్పేస్‌/ఏరో నాటికల్‌ ఇంజనీరింగ్, ఏవియానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎంటెక్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. నెలకు కనీసం రూ.లక్ష వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.

స్పేస్‌ సైంటిస్ట్‌..
అంతరిక్ష శాస్త్రంలో మరో ముఖ్యమైన కొలువు.. స్పేస్‌ సైంటిస్ట్‌. ఇస్రో, షార్‌ వంటి అంతరిక్ష సంస్థల ఆధ్వర్యంలోని లేబొరేటరీల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. వీరు స్పేస్‌ సైన్స్‌కు సంబంధించి పలు విభాగాల్లో పరిశోధనలు చేస్తారు. ఆ క్రమంలో స్పేస్‌ క్రాఫ్ట్‌ రూపకల్పన, ప్రయోగాల సందర్భంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది.

టెక్నాలజిస్ట్‌..
అంతరిక్ష విభాగంలో టెక్నాలజిస్ట్‌లు కీలకంగా పనిచేస్తారు. వీరు స్పేస్‌ ఇంజనీర్స్‌కు, స్పేస్‌ సైంటిస్ట్‌లకు సహాయకారులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి కమ్యూనికేషన్‌ టెక్నీషియన్స్, క్యాడ్‌ ఆపరేటర్స్, డ్రాఫ్టర్స్, ఎలక్ట్రిషియన్స్, లేజర్‌ టెక్నీషియన్స్, క్వాలిటీ అష్యూరెన్స్‌ స్పెషలిస్ట్స్, రాడార్‌ టెక్నీషియన్స్, రోబోటిక్‌ టెక్నీషియన్స్, శాటిలైట్‌ టెక్నీషియన్స్‌ వంటి కొలువులు లభిస్తాయి. బీఎస్సీ, బీటెక్‌ అర్హతతో ఈ కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.40వేల నుంచి రూ.50వేలకు పైగానే వేతనం లభిస్తోంది.

మెటీరియాలజిస్ట్ట్‌..
అంతరిక్ష ప్రయోగశాలలు, పరిశోధన సంస్థ ల్లో లభించే మరో కొలువు.. మెటీరియాలజిస్ట్‌. వీరు భూ వాతావరణాన్ని పరిశీలించి, భవిష్యత్తు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం.. దానికి సంబంధించిన నివేదికలను రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి కూడా ప్రతిభను బట్టి ప్రారంభంలో నెలకు రూ.50వేల వరకు వేతనం లభిస్తుంది.

క్లైమేటాలజిస్ట్‌..
ఆస్ట్రామనీ విభాగంలో మరో ముఖ్యమైన కొలువుగా క్లైమేటాలజిస్ట్‌లను పేర్కొనొచ్చు. వీరి విధులు కూడా దాదాపుగా మెటీరియలాజిస్ట్‌ మాదిరిగానే ఉంటాయి. వీరు కూడా ఒక నిర్దిష్ట ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, అప్పటికే దానికి సంబంధించిన ప్రయోగాల నివేదికలను విశ్లేషించి, క్రోడీకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైనర్స్‌..
స్పేస్‌ టెక్నాలజీ/స్పేస్‌ సైన్స్‌ విభాగంలో మరో అత్యంత కీలకమైన హోదా.. స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైనర్స్‌. ప్రయోగించనున్న ఉపగ్రహాల లక్ష్యాలకు, ఉపగ్రహాల సంఖ్యకు అనుగుణంగా స్పేస్‌ క్రాఫ్ట్‌ను డిజైన్‌ చేయడం వీరి ప్రధాన విధి. ప్రస్తుతం స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైనర్లకు కూడా ఆకర్షణీయ వేతనాలు అందుతున్నాయి.

ఫిజిక్స్, మ్యాథ్స్‌ నైపుణ్యాలుంటేనే..
అంతరిక్ష శాస్త్రంలో విస్తృత కొలువులు లభిస్తున్నప్పటికీ.. ఏ స్థాయి కొలువు దక్కించుకోవాలన్నా.. అభ్యర్థులకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ నైపుణ్యాలు తప్పనిసరి. ఈ విభాగంలో నిర్వర్తించాల్సిన విధులన్నీ ఫిజిక్స్, మ్యాథ్స్‌ బేసిక్స్‌పైనే ఆధారపడి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. దీంతో ఈ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బ్యాచిలర్‌ స్థాయిలో బీఎస్సీ, పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ కోర్సులను అభ్యసించిన వారికే ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎంపీసీ పూర్తి చేసుకొని వినూత్న కెరీర్‌ కోరుకునే విద్యార్థులకు స్పేస్‌ సైన్స్‌ అద్భుత వేదికని నిపుణులు పేర్కొంటున్నారు.

స్పేస్‌ సైన్స్‌.. ముఖ్యాంశాలు

  • బీటెక్‌ స్థాయిలోనే ఆస్ట్రానమీ, ఏవియానిక్స్‌ కోర్సులు.
  • బీటెక్‌ కోర్సును అందిస్తున్న పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు.
  • పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో అనేక స్పెషలైజేషన్లు.
  • ఇస్రో, డీఆర్‌డీఓ, షార్‌æ వంటి సంస్థల్లో అవకాశాలు.

ఆసక్తి ప్రధానం..
అంతరిక్ష రంగంలో కెరీర్‌కు ఆసక్తి ఎంతో ప్రధానం. కొన్ని సందర్భాల్లో సుదీర్ఘ సమయం పనిచేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా సంసిద్ధత కూడా ఎంతో అవసరం. అదే విధంగా సునిశిత పరిశీలన, తులనాత్మకత, భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేయగలిగే లక్షణాలు కూడా ఉండాలి. అప్పుడే ఈ రంగంలో సుదీర్ఘ కాలం కొనసాగగలుగుతారు. అకడమిక్‌ బోధనతో ఆయా సబ్జెక్టులపై అవగాహన లభిస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఈ రంగంలో క్లిష్టతతో కూడుకున్న విధులు నిర్వర్తించేలా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.
– ప్రొ‘‘ కె.జోసఫ్, డీన్, ఐఐఎస్‌టీ

Published date : 12 May 2021 04:08PM

Photo Stories