Skip to main content

ఐఐఎంలు, ఐఐటీల్లో సమ్మర్ ప్లేస్‌మెంట్స్...కళ్లు చెదిరే ఆఫర్స్

సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్.. ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్... ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్... ప్రముఖ బీస్కూల్స్ ఐఐఎంలు; ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఐఐటీల్లో చదివే విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే ప్రక్రియ!! ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కార్పొరేట్ కంపెనీలు.. టాలెంట్ కోసం ఐఐటీలు, ఐఐఎంలకు వచ్చి ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపడతాయి.
ప్రతిభావంతులకు లక్షల ప్యాకేజీలతో కళ్లు చెదిరే ఆఫర్స్ అందిస్తాయి. అందుకే ఈ టాప్ విద్యాసంస్థల్లో ప్లేస్‌మెంట్స్‌పై సర్వత్రా ఆసక్తి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్, టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ప్లేస్‌మెంట్ సీజన్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో..సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎస్‌పీఓ), ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్స్ (పీపీఓ), ఫైనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎఫ్‌పీఓ) తీరుతెన్నులు.. ఆ ఆఫర్లు ఇచ్చేందుకు కంపెనీలు చేపట్టే ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం...

ఐఐటీలు, ఐఐఎంలలో రిక్రూట్‌మెంట్స్ అనగానే గుర్తొచ్చే పదం ప్లేస్‌మెంట్ డ్రైవ్స్. కానీ, దీనికంటే ముందుగానే విద్యార్థులకు ఆఫర్స్ ఖరారు చేసే క్రమంలో... సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్.. ఆ తర్వాత చివర్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ నిర్వహిస్తాయి.

సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్...
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(ఎస్‌పీవో).. వీటినే ఇంటర్న్‌షిప్స్ అని కూడా అంటారు. ఏదైనా ఒక సంస్థలో ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో ఇంటర్న్ ట్రైనీలుగా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించేవే.. సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్. సంస్థలు ఈ ఎస్‌పీవోల ద్వారా ఇంటర్న్ ట్రైనీలను నియమించుకునే ప్రక్రియను ఏటా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహిస్తాయి. తమ నియామక విధానాలకు సరితూగే విద్యార్థులకు ఎప్‌పీఓలను ఖరారు చేసి.. ఇంటర్న్ ట్రైనీలుగా అవకాశం కల్పిస్తాయి. సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలు.. ముందుగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదిస్తాయి. ఆ తర్వాత ఔత్సాహిక విద్యార్థుల నుంచి రెజ్యూమెలు స్వీకరిస్తాయి. ఆ రెజ్యుమెలో పేర్కొన్న వివరాలను పరిశీలించి.. తమకు సరితూగే నైపుణ్యాలున్న విద్యార్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తాయి. ఈ దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలో విజయం సాధిస్తే.. ఎస్‌పీవో ఆఫర్ ఖరారై ఇంటర్న్ ట్రైనీగా పనిచేసే అవకాశం లభిస్తుంది.

ఇంటర్న్ ట్రైనీ.. ఎప్పుడు ?
మేనేజ్‌మెంట్ విద్యార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత లభించే సెలవుల్లో.. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగేళ్ల బీటెక్ కోర్సు తృతీయ సంవత్సరం పూర్తయిన తర్వాత లభించే సెలవుల్లో ఇంటర్న్ ట్రైనీగా చేరొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేనేజ్‌మెంట్ మొదటి సంవత్సరం విద్యార్థులు, ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఎస్‌పీఓ నియామక ప్రక్రియ నిర్వహిస్తాయి. అంటే.. మేనేజ్‌మెంట్ విద్యార్థులు కోర్సులో చేరిన కొద్ది నెలలకే కార్పొరేట్ సంస్థల నియామక ప్రక్రియకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది.

ఆర్థిక ప్రోత్సాహకం :
ఎస్‌పీఓ ద్వారా ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు సదరు వ్యవధి.. ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. సంస్థలు స్టైపెండ్ రూపంలో ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు ఆయా సంస్థను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్ లభిస్తోంది. ఇంటర్న్‌ట్రైనీగా పనిచేసే సమయంలో సదరు సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగానే భావించి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమకు కేటాయించిన విభాగం చేపడుతున్న ప్రాజెక్ట్‌లో పాల్పంచుకోవాలి. ఆ సమయంలో తాము అప్పటివరకు అకడమిక్‌గా పొందిన నైపుణ్యాలను పనిలో అన్వయించాలి. ఇంటర్న్‌ట్రైనీగా చొరవ, కొత్త ఆలోచనలు, బృంద నైపుణ్యం ప్రదర్శిస్తే ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ సొంతమైనట్లే!

ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్..
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్ ద్వారా ఇంటర్న్ ట్రైనీగా పనిచేసిన విద్యార్థులకు.. కోర్సు పూర్తయ్యాక పూర్తిస్థాయి ఉద్యోగ ఆఫర్లు ఖరారు చేసే విధానమే.. ప్రీ ప్లేస్‌మెంట్స్. ఇంటర్న్‌షిప్ ముగుస్తున్న తరుణంలో సదరు విద్యార్థుల(ఇంటర్న్ ట్రైనీ)లకు తమ సంస్థలో శాశ్వతంగా పనిచేసేందుకు ఆసక్తి ఉందో లేదో తెలుసుకుంటున్నాయి. ఈ సందర్భంలోనే సంస్థలో వారు ట్రైనీగా గమనించిన పరిస్థితులు, కొత్తగా చేపట్టాల్సిన విధానాలు, వ్యూహాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చని ఫీడ్‌బ్యాక్ కూడా అడుగుతున్నాయి. ఇలా ప్రీ ప్లేస్‌మెంట్ చర్చలకు ఎంపికైన విద్యార్థులు.. కంపెనీల ఆఫర్స్‌ను కచ్చితంగా అంగీకరించాలని ఎలాంటి నిబంధన లేదు. ఇది పూర్తిగా విద్యార్థుల ఆసక్తి మేరకే ఉంటుంది. ఒకవేళ పీపీవోను ఆమోదిస్తే.. ఫైనల్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనడం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది.

అక్టోబర్ టు జనవరి :
ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్(పీపీవో) సీజన్ అక్టోబర్ నుంచి జనవరి మధ్యకాలంలోఉంటుంది. ప్రీ ప్లేస్‌మెంట్ చర్చలు నిర్వహించిన కంపెనీలు.. వాటికి ఆసక్తి చూపిన విద్యార్థులకు ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఖరారు చేసేందుకు.. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో అంటే విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు (ఎంబీఏ రెండో సంవత్సరం, బీటెక్ నాలుగో సంవత్సరం) ప్రీ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌ను నిర్వహిస్తాయి. ఈ డ్రైవ్స్‌లో గ్రూప్ డిస్కషన్(జీడీ) లేదా ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది. వీటిలో విజయం సాధిస్తే కంపెనీలో కొలువు ఖరారైనట్లే!

ఫైనల్ ప్లేస్‌మెంట్స్.. ఇలా
ఫైనల్ ప్లేస్‌మెంట్స్.. ఐఐటీల్లో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు; బీ స్కూల్స్‌లో జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నిర్వహిస్తున్నాయి. ఈ ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనే సంస్థలు.. ముందుగానే ఆయా విద్యాసంస్థల క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్స్‌కు సమాచారాన్ని అందిస్తాయి. పాల్గొనే కంపెనీల వివరాలు అందాక... విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సంస్థల వివరాలను ప్లేస్‌మెంట్ ప్రతినిధులకు తెలియజేయాలి. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్‌లో విద్యార్థుల అకడమిక్ ట్రాక్ రికార్డ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, జాబ్‌రెడీ స్కిల్స్‌ను పరిశీలిస్తున్నాయి. అంతేకాకుండా గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ రౌండ్, హెచ్‌ఆర్ రౌండ్ వంటి వాటిని నిర్వహిస్తున్నాయి. కొన్ని సంస్థలు క్యాంపస్ డ్రైవ్‌లో ఆఫర్ ఖరారు చేసినప్పటికీ.. చివర్లో తమ సంస్థ ప్రధాన కార్యాలయంలో మరో దఫా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థుల్లోని రియల్ టైమ్ నాలెడ్జ్‌ను పరిశీలించే విధంగా సంబంధిత విభాగాధిపతులు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.

ఎస్‌పీవోలు.. కన్సల్టింగ్, బ్యాంకింగ్
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ (ఇంటర్న్ ట్రైనీ) విషయంలో ఈ ఏడాది ఐఐఎం-కోజికోడ్ ముందంజలో నిలిచిందని చెప్పొచ్చు. కేవలం మూడున్నర రోజుల వ్యవధిలో నిర్వహించిన ఎస్‌పీవో డ్రైవ్స్‌లో 423 మంది విద్యార్థులకు అవకాశం లభించింది. అదే విధంగా స్టైపెండ్ మొత్తాలు కూడా అత్యంత ఆకర్షణీయంగా నమోదయ్యాయి. సగటు స్టైపెండ్ రూ.రెండు లక్షలుగా నమోదు కాగా, 27 మంది విద్యార్థులు అత్యధికంగా రూ.మూడు లక్షల స్టైపెండ్ అందుకున్నారు. మొత్తంగా చూస్తే సగటున రూ.2.56 లక్షల స్టైపెండ్ నమోదైంది. ఐఐటీ ఢిల్లీలో రెండు వందలకు పైగా విద్యార్థులకు ఇంటర్న్ ఆఫర్స్ లభించాయి. సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్, ప్రీ ప్లేస్‌మెంట్‌లో ఆఫర్లు ఇవ్వడంలో ఈ ఏడాది కూడా కన్సల్టింగ్, బ్యాంకింగ్, ఈ-కామర్స్, కోర్ మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలదే పైచేయిగా నిలిచింది. జాబ్ ప్రొఫైల్స్ కోణంలో బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్/ మేనేజ్‌మెంట్ ప్రొఫైల్స్ ముందంజలో ఉన్నాయి.

అధిక శాతం పీపీవోలే...
ఐఐటీలు, ఐఐఎంల్లో గత మూడు, నాలుగేళ్లుగా కంపెనీలు అధిక శాతం ఆఫర్లు ప్రీ ప్లేస్‌మెంట్ ద్వారానే ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఈ-కామర్స్, కన్సల్టింగ్ సంస్థల విషయంలో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు సంవత్సరం తమ వద్ద ట్రైనీలుగా పనిచేసిన వారినే శాశ్వత కొలువు ఇచ్చేందుకు అధిక శాతం సంస్థలు మొగ్గు చూపుతుండటం విశేషం. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరంగా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ల హవా మొదలైంది. ఐఐఎంల్లో సెప్టెంబర్‌లోనే దాదాపు 80 శాతం ఆఫర్లు నమోదయ్యాయి. ఐఐఎం-బెంగళూరులో 100 మంది; ఐఐఎం-కోల్‌కతాలో 90 మంది; ఐఐఎం కోజికోడ్‌లో 61 మందికి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ లభించాయి. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఎండీఐ-గుర్గావ్ వంటి ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లోనూ ప్రీ ప్లేస్‌మెంట్స్ దాదాపు 70 శాతం నమోదవడం విశేషం.
  • ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ పరంగా ఐఐటీల్లోనూ ఈ ఏడాది ఇదే తీరు కనిపించింది. ఐఐటీ-ఢిల్లీ, ముంబై, ఖరగ్‌పూర్‌లలో దాదాపు 120 చొప్పున పీపీవోలు లభించాయి. ఐఐటీ-బీహెచ్‌యూ 113 పీపీఓలతో ఇప్పటివరకు తొలిస్థానంలో నిలిచింది. మిగతా ఐఐటీలను పరిగణనలోకి తీసుకుంటే.. గతేడాదితో పోల్చితే ఇప్పటికే 50 శాతం అధికంగా ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్లు లభించాయి.

ఈ-కామర్స్.. భారీ నియామకాలు
ఈ ఏడాది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా భారీ నియామకాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కొంత తక్కువ స్థాయిలో క్యాంపస్ ఆఫర్లు ఇస్తున్న ఈ సంస్థలు ఈసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐఐటీలు, ఐఐఎంలే కాకుండా.. ఎన్‌ఐటీల్లోనూ ఇవి క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ దాదాపు 800 నుంచి వెయ్యి మంది విద్యార్థులకు క్యాంపస్ ఆఫర్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వాల్‌మార్ట్‌తో ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.
Published date : 20 Nov 2018 04:51PM

Photo Stories