Skip to main content

విదేశీ ఎంబీబీఎస్...స్వదేశీ ప్రాక్టీస్‌కు ఎఫ్‌ఎంజీఈ!

విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించిన భారత విద్యార్థులు.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) లేదా ఇతర రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలన్నా, భారతదేశంలో ఉన్నత విద్య, ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరిగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఏ) ఎఫ్‌ఎంజీఈను ఏటా రెండుసార్లు(జూన్/డిసెంబర్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 2018కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు...
2018, నవంబర్ 30లోపు విదేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన ప్రైమరీ మెడికల్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు నమోదు చేసుకోవచ్చు. 3 వందల మార్కులకు రెండు సెక్షన్లుగా ఉండే ఈ పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఎంసీఐ లేదా ఇతర స్టేట్ మెడికల్ కౌన్సిల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. అంటే.. కనీసం 150 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. పరీక్షలో రుణాత్మక మార్కులు ఉండవు. ప్రతి సెక్షన్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు.

మెరుగవుతున్న ఉత్తీర్ణత :
వైద్య విద్యపై అమితమైన ప్రేమతో విదేశీబాట పడుతున్న విద్యార్థులు.. కాలేజీలో చేరిన మొదటి నుంచే ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్టును దృష్టిలో పెట్టుకొని సన్నద్ధత సాగిస్తే ఈ పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. 2017 ముందు వరకు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్టులో నెగ్గుకొస్తున్న విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది నుంచి మాత్రం కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

ఎంసీక్యూస్ ప్రాక్టీస్ :
ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూస్) విధానంలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాలను సేకరించుకొని అధ్యయనం చేయాలి. పునరావృతం అయ్యే ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. స్నేహితులతో చర్చించడం వల్ల క్లిష్టమైన అంశాలు బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అలానే సరైన పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కనీసం 7 గంటల సమయం నిద్రకు కేటాయించాలి.

నీట్ పీజీకి కలిసొస్తుంది :
ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్టుకు సన్నద్ధమయ్యే విద్యార్థులు.. నీట్ పీజీని సులువుగానే రాయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పరీక్షల సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది.

ప్రణాళికాబద్ధంగా చదవాలి...
ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు విద్యార్థులు సుదీర్ఘకాలం ప్రిపరేషన్ సాగిస్తుండటం వల్ల ఒత్తిడి అనిపించడం సహజం. అయితే ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికబద్ధంగా చదవాలి. ఎఫ్‌ఎంజీఈలో 19 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టుల ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే మిగతా సబ్జెక్టుల సన్నద్ధత సులువు అవుతుంది. అలానే, ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ తదితర సబ్జెక్టులు స్కోరింగ్‌కు ప్రధానం. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 వరకు ప్రశ్నలు అడుగుతారు. ప్రిపరేషన్ సమయంలో సబ్జెక్టులను ఇంటర్‌లింకింగ్ చేసుకుంటూ చదవాలి. రుణాత్మక మార్కులు ఉండవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెషన్లలో ఉండే పరీక్షలో మొదటి సెషన్‌లో నాన్ క్లినిక్ సబ్జెక్టుల నుంచి, రెండో సెషన్‌లో సబ్జెక్ట్, క్లినికల్ సబ్జెక్టుల మేళవింపుగా ప్రాక్టికల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ఇమేజ్, ఎక్స్‌రే పటాలు ఇచ్చి సమాధానాలు గుర్తించమని అడుగుతారు.
- డాక్టర్ షేక్ ఆలం, హౌజ్ సర్జన్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఎఫ్‌ఎంజీఈ 2017 విజేత).

ముఖ్య తేదీలు..
దరఖాస్తు ఫీజు:
రూ.5,500
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2018, అక్టోబర్ 16-నవంబర్ 6.
పరీక్ష తేదీ: 2018, డిసెంబర్ 14.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://natboard.edu.in
Published date : 30 Oct 2018 05:41PM

Photo Stories