Skip to main content

వైద్యరంగ కెరీర్‌కు మరో మార్గం...పారామెడికల్ !

రోగులకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లకు సహకరించే వారే..పారామెడికల్ సిబ్బంది. వ్యాధులకు చికిత్సలో ఇటీవల కాలంలో పారామెడికల్ విభాగం కీలకంగా మారుతోంది. ఏ రోగానికై నా సకాలంలో సరైన చికిత్సఅందించాలంటే.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, రేడియోథెరపీ, ఎక్స్‌రే, ఈసీజీ తదితర టెక్నీషియన్ల సేవలు తప్పనిసరి.
వైద్య రంగంలో సేవలందించాలనే ఆలోచన ఉంటే... పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులకు వైద్య రంగంలోచక్కటి కెరీర్‌కు మార్గం వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ పారామెడికల్ బోర్డ్.. పలు పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మరి కొద్దిరోజు ల్లోనే... ఏపీ పారామెడికల్ కోర్సుల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో
పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. వాటిద్వారా లభించే కెరీర్ అవకాశాలు... ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ :
వైద్యులు వ్యాధి నివారణకు ఔషధాలు సూచించాలంటే.. ఎంఎల్‌టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు) ఇచ్చే రిపోర్ట్‌లే ముఖ్య ఆధారం. దీన్నిబట్టే ఎంఎల్‌టీల ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. డీఎంఎల్‌టీ కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. ఈ కోర్సు పూర్తయ్యాక ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ లేబొరేటరీల్లో, ప్రైవేటు మెడికల్ లేబొరేటరీల్లో అవకాశాలు అందుకోవచ్చు.

డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ :
వ్యక్తుల్లో కంటి సమస్యలను గుర్తించడం, వాటి నివారణకు పరిష్కారాలు సూచించే నైపుణ్యాలను అందించే కోర్సు.. ఆప్టోమెట్రీ. స్థూలంగా నేత్ర సమస్యలకు సంబంధించిన జాగ్రత్తలు, వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులను ఈ కోర్సు ద్వారా అభ్యసించొచ్చు. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర కీలకం. ఉపాధి అవకాశాల పరంగా మెరుగైన విభాగమిది.

ఆప్తాల్మిక్ అసిస్టెంట్ :
ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు కూడా నేత్ర సంబంధ సమస్యలకు సంబంధించి సర్టిఫైడ్ ఆప్తాల్మాలజిస్ట్‌లకు సహాయకులుగా విధులు నిర్వహిస్తారు. పలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి.. వాటి నివేదికలను వైద్యులకు (ఆప్తాల్మాలజిస్ట్)అందిస్తారు. తద్వారా కంటి సమస్యల చికిత్సలో సహకరిస్తారు. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్.

డిప్లొమా ఇన్ రేడియోథెరపీ :
ఇటీవల కాలంలో ఆందోళనకు గురిచేస్తున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి చికిత్సలో రేడియేషన్ థెరపీ అనే విధానాన్ని వైద్యులు అనుసరిస్తున్నారు. ఈ రేడియేషన్‌ను ఏ స్థాయిలో ఇవ్వాలి? రేడియేషన్‌థెరపీ ఆవశ్యకతను సూచించడం తదితర విధులు నిర్వహించే వారే రేడియోథెరపీ టెక్నీషియన్లు. వీరిచ్చే నివేదిక ఆధారంగానే వైద్యులు చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.
పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ :
గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే క్రమంలో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ సర్జరీల సమయంలో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకు సహకరించేది వీరే. హార్ట్ యాక్టివేషన్‌కు సంబంధించి ఇటీవల కాలంలో వస్తున్న కృత్రిమ పరికరాలు (ఉదాహరణకు హార్ట్ -లంగ్ మెషీన్, డిఫిబ్రిలేటర్, వైబ్రేటర్ తదితర) ఎంపిక, అమరికలో... పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్ల పాత్ర కీలకం. ఈ నైపుణ్యాలను అందించే కోర్సే.. డిప్లొమా ఇన్ పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్. హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దాంతో పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్లకు డిమాండ్ ఏర్పడుతోంది. వీరి ప్రారంభం వేతనం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.

డిప్లొమా ఇన్ డయాలసిస్ :
కిడ్నీ సమస్యలకు సంబంధించిన చికిత్సలో డయాలసిస్ విభాగాల్లో డయాలసిస్ టెక్నీషియన్ కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్ చేసే సమయంలో ఉపయోగించే పరికరాల నాణ్యత, నిర్వహణ వంటి నైపుణ్యాలను డయాలసిస్ డిప్లొమా కోర్సు ద్వారా పొందొచ్చు. డిప్లొమా ఇన్ డియాలసిస్ కోర్సు పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు విస్తృతం.

డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ :
ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర పరీక్షల సమయంలో రేడియాలజిస్టుల సూచనలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలను వినియోగించడం వంటి నైపుణ్యాలను ఈ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ :
ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్థారణకు సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు రెస్పిరేటరీ థెరపీ. ఈ కోర్సు పూర్తిచేసిన వారు విధుల పరంగా వైద్యులకు సహాయకులుగా ఉంటారు.

డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ :
శస్త్ర చికిత్స సమయంలో వినియోగించే పరికరాల నాణ్యత.. అత్యంత కీలకాంశం. సంబంధిత పరికరాల శుభ్రత, నిర్దిష్టంగా ఒక వ్యాధికి సంబంధించి శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను ఎంపిక చేసి.. డాక్టర్లకు అందుబాటులో ఉంచడం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స సమయంలో వైద్యులకు అవసరమైన పరికరాలను గుర్తించి క్షణాల్లో అందించే నైపుణ్యం కూడా ఈ కోర్సు ద్వారా లభిస్తుంది.

డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ :
రోగులకు శస్త్రచికిత్స నిర్వహించే సమయంలో సదరు రోగికి ఆ బాధ తెలియకుండా ఉండేందుకు వైద్యులు అనుసరిస్తున్న విధానం అనస్థీషియా. అనస్థీషియా టెక్నీషియన్లు.. మత్తు మందు ఇవ్వడం.. ఏ స్థాయిలో ఇవ్వాలి, శరీరంలో ఏ భాగంలో ఇవ్వాలి వంటి నైపుణ్యాలు పొందే కోర్సు.. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్.

డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ :
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్.. పేరుకు తగినట్లుగానే వీరు రోగులకు పలు రకాలుగా సహాయకులుగా ఉంటారు. ప్రభుత్వ విభాగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆయా వ్యాధుల నివారణకు సంబంధించిన కార్యక్రమాల అమల్లోనూ వీరు పాల్పంచుకుంటారు. ఈ నైపుణ్యాలను అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్.

డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్ :
ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులకు అందించే ఆహారం ఎంతో సుచిగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఔట్ పేషెంట్ల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటవుతున్న కేటరింగ్ విభాగాల్లోనూ.. ఆరోగ్యకరమైన ఆహారం అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సే.. డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్.

డిప్లొమా ఇన్ క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్ :
కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు సంబంధించి చికిత్స సమయంలో వైద్యులకు సహాయకులుగా పనిచేసే వారే.. క్యాథ్‌ల్యాబ్ లెక్నీషియన్స్. యాంజియోప్లాస్టీ, కార్డియాక్ క్యాథరైజేషన్, ఎలక్ట్రో ఫిజియాలజీ వంటి ప్రక్రియల్లో వైద్యులకు సహాయకులుగా విధులు నిర్వహిస్తారు.

డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ :
గుండె పనితీరుకు సంబంధించి నైపుణ్యాలను అందించే కోర్సు.. కార్డియాలజీ టెక్నీషియన్. గుండె ఆపరేషన్లకు అవసరమైన బెలూన్ యాంజియోప్లాస్టీ, అనస్థీషియా, ప్రెప్పింగ్ వంటి విధానాల్లోనూ వీరు నైపుణ్యం పొందుతారు.

డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ టెక్నీషియన్ :
వస్తువులు, అక్షరాలను గుర్తించడంలో సమస్యలు ఎదుర్కొనే వారిని.. పుట్టుకతో మాటలు రాకుండా కమ్యూనికేషన్ డిజార్డర్స్‌తో బాధపడే వారికి చికిత్సకు సంబంధించిన నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఈ కోర్సులో చేరిన వారికి కమ్యూనికేషన్ డిజార్డర్స్‌ను గుర్తించడం, దాని ఆధారంగా చికిత్సకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి నైపుణ్యాలు లభిస్తాయి.

డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్ కోర్సు :
దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులకు.. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సహకరించే నైపుణ్యాలను అందించే కోర్సు.. డెంటల్ టెక్నీషియన్. వీరు డెంటల్ లేబొరేటరీల్లో అవసరమైన సిరామిక్ డెంటల్ ఇంప్లాంట్స్, పాలిష్, షేపింగ్ వంటి అంశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్ :
ఇది కూడా దాదాపు డెంటల్ టెక్నీషియన్ కోర్సు మాదిరిగానే ఉంటుంది. దంత వైద్యానికి సంబంధించి ఓరల్ హెల్త్‌కేర్ అంశాలుగా భావించే పాలిషింగ్, స్కేలింగ్, రేడియోగ్రాఫ్స్ సేకరణ, లోకల్ అనస్థీషియా తదితర విధులు నిర్వర్తించే నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా పొందొచ్చు.

డార్క్ రూమ్ అసిస్టెంట్ :
పారామెడికల్ కోర్సుల్లో అత్యంత కీలకం విభాగం.. డార్క్ రూమ్ అసిస్టెంట్. ఇటీవల కాలంలో ప్రతి వ్యాధికి సంబంధించి ఎక్స్‌రేలు తప్పనిసరిగా మారుతున్నాయి. ఈ ఎక్స్‌రే ఫిల్మ్‌ల నాణ్యత ఆధారంగా నిర్దిష్టంగా శరీరంలో ఒక భాగానికి వచ్చిన వ్యాధిని గుర్తించే వీలవుతోంది. ఎక్స్‌రే తీయడంతోపాటు ఎక్స్‌రే ఫిల్మ్‌లను నాణ్యంగా రూపొందించే నైపుణ్యాలు అందించే కోర్సు.. డార్క్ రూమ్ అసిస్టెంట్.

డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ :
రేడియేషన్ ఆధారంగా వైద్య చికిత్సలు అందించాల్సిన వ్యాధులకు సంబంధించి.. పలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు (ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర) నిర్వహించే నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. వాస్తవానికి ఇది కూడా మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు మాదిరిగానే ఉంటుంది.

డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ :
హృద్రోగుల గుండె పనితీరుకు సంబంధించి ప్రాథమికంగా వివరాలు సేకరించే పద్ధతి.. ఎలక్ట్రోకార్డియాక్ డయాగ్రమ్. ఈసీజీగా అందరికీ సుపరిచితం. హార్ట్ బీట్, హార్ట్ ఇంపల్సెస్‌కు సంబంధించి సాంకేతిక పరికరాలను సమర్థంగా వినియోగించే నైపుణ్యాలను అందించే కోర్సు.. ఈసీజీ టెక్నీషియన్.

డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ :
వీరు ఈసీజీ టెక్నీషియన్లు అందించిన నివేదికలను పరిశీలించే నైపుణ్యం పొందుతారు. రోగులు దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో వారి హృదయ స్పందనల పనితీరును గుర్తించడం వంటి నైపుణ్యాలు సైతం సొంతమవుతాయి.

డిప్లొమా ఇన్ మైక్రో సర్జరీ :
ఇది శస్త్రచికిత్సలకు సంబంధించి పలు రకాల సాంకేతికలను వినియోగించే నైపుణ్యం అందించే కోర్సు.

తెలంగాణా పారామెడికల్ బోర్డ్ నోటిఫికేషన్ సమాచారం...
తెలంగాణ పారా మెడికల్ బోర్డ్... తాజాగా 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనికి సంబంధించిన వివరాలు....

అర్హతలు:
  • ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
  • సీట్ల భర్తీ సమయంలో ముందుగా బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంపీసీ విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండు గ్రూప్‌ల విద్యార్థులు లేకుంటే ఇతర గ్రూప్‌ల విద్యార్థులకు అవకాశం ఇస్తారు.
  • డిప్లొమా ఇన్ రేడియో థెరపీ టెక్నీషియన్ కోర్సుకు మాత్రం ఎంపీసీ, బైపీసీ గ్రూప్ విద్యార్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ వెబ్‌సైట్ https://www.tspmb.telangana.gov.in నుంచి దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దీన్ని పూర్తిచేసి.. తాము చేరదలచుకున్న కళాశాల ప్రిన్సిపల్‌కు పంపాలి.
  • ప్రైవేటు కళాశాలలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాటిని సదరు కాలేజీ ఏర్పాటైన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌కు నిర్ణీత గడువులోగా పంపించాలి.
  • సదరు కళాశాల అధికారులు తమకు అందిన దరఖాస్తులు, సీట్ల సంఖ్య ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లు కేటాయిస్తారు.
  • ఈ కళాశాలల వివరాలు పారామెడికల్ బోర్డ్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య తేదీలు :

ప్రభుత్వ కళాశాలలకు దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 9, 2018.
ప్రైవేటు కళాశాలల్లో దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12, 2018.
కౌన్సెలింగ్, విద్యార్థుల ఎంపిక: జూలై 20, 2018.
 
సీట్ల వివరాలు..
పభుత్వ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో 591 సీట్లు.   
ప్రైవేటు కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో 33,280 సీట్లు.
వెబ్‌సైట్: https://www.tspmb.telangana.gov.in
 
 
ఏపీలో సీట్ల వివరాలు..(2017-18) :
గణాంకాల ఆధారంగా..

పభుత్వ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో మొత్తం 864 సీట్లు. 
పైవేటు కళాశాలల్లో ఆయా కోర్సుల్లో మొత్తం 7755 సీట్లు.
వెబ్‌సైట్: www.appmb.org.in
 
కెరీర్ అవకాశాలు...
పారామెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి అవకాశాలు విస్తృతమవుతున్నాయని చెప్పొచ్చు. వ్యక్తుల జీవనశైలి కారణంగా రకరకాల వ్యాధుల బారినపడుతున్నారు. ఆయా రోగాల చికిత్సలో వైద్యులకు సహకరించేందుకు పారామెడికల్ కోర్సుల్లో సుశిక్షితులైన వారి అవసరం పెరుగుతోంది. వీరికి ప్రధానంగా హాస్పిటల్స్, లేబొరేటరీస్, డయాగ్నస్టిక్ సెంటర్స్ ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. ఆయా కోర్సులు పూర్తిచేసుకున్న వారు ప్రారంభంలో రూ.10వేల వేతనం పొందొచ్చు.  ప్రత్యేక విభాగాలుగా భావించే కార్డియాలజీ టెక్నీషియన్, రేడియో థెరపీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్ వంటి కోర్సుల అభ్యర్థులు   ప్రారంభంలోనే రూ.15 వేల వేతనం సొంతం చేసుకోవచ్చు.
Published date : 03 Jul 2018 06:11PM

Photo Stories