Skip to main content

పసిమొగ్గలకు వైద్యం అందించే.. పీడియాట్రిక్స్

చిన్నారులు.. పసిమొగ్గల్లాంటి సుకుమారులు. తమకు ఏదైనా బాధ కలిగితే చెప్పుకోవడానికి మాటలు రావు. తమ ఇబ్బందిని ఏడుపు ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తారు. వారి జబ్బును గుర్తించి, తగిన చికిత్స చేయడానికి సాధారణ వైద్యులు సరిపోరు. ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు కావాలి. అలాంటివారే.. పీడియాట్రీషియన్లు. మనదేశంలో చిన్న పిల్లల వైద్యులకు భారీ డిమాండ్ ఉంది. ప్రతిఏటా కొత్తగా కేవలం 1400 మంది చిల్డ్రన్ స్పెషలిస్ట్‌లు వస్తున్నారు. నిజానికి అంతకు మూడు రెట్ల మంది అవసరం. అందుకే పీడియాట్రిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి.

కొలువులకు కొరత లేదు
విదేశాల్లో 18 ఏళ్లలోపు వారికి పీడియాట్రీషియన్లు వైద్యం అందిస్తారు. మనదేశంలో 14 ఏళ్లలోపు బాలలకు చికిత్స అందిస్తున్నారు. దేశంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్‌లకు వీటిలో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే కనీసం ఆరు, ఏడేళ్లపాటు ఏదైనా ఆసుపత్రిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో ప్రారంభం నుంచే భారీ వేతనాలు అందుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు కోకొల్లలుగా ఉన్నాయి. వృత్తిలో అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవచ్చు. పీడియాట్రీషియన్లకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. చిన్న పిల్లలకు వైద్యం అందించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. ఇందులో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ప్రతిక్షణం అప్రమత్తంగా పనిచేయాలి.

కావాల్సిన నైపుణ్యాలు: చిల్డ్రన్ స్పెషలిస్ట్‌కు చిన్నారులను ప్రేమించే లక్షణం, వారి ప్రవర్తనను, మానసిక స్థితిని అర్థం చేసుకొనే సామర్థ్యం ఉండాలి. పరిశీలనాత్మక దృక్పథం అవసరం. ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినగలగాలి. చికిత్స ఫలించాలంటే ఎంతసేపైనా ఓపిక, సహనంతో పనిచేయాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిళ్లను తట్టుకొనే నేర్పు చాలా ముఖ్యం. పీడియాట్రీషియన్‌గా వృత్తికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకుంటూ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి.

అర్హతలు: పీడియాట్రీషియన్‌గా వృత్తిలో స్థిరపడాలనుకుంటే బయాలజీ సబ్జెక్ట్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరొచ్చు. ఎంబీబీఎస్ (జనరల్ సర్జన్) కోర్సులో ఉత్తీర్ణులై తర్వాత పీడియాట్రిక్ సర్జన్‌గా మూడేళ్లపాటు అదనంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది.

వేతనాలు: పిల్లల వైద్యులు ప్రభుత్వ రంగంలో ప్రారంభంలోనే నెలకు రూ.50 వేల వేతనం అందుకోవచ్చు. కొంత అనుభవం గడిస్తే నెలకు రూ.60 వేలు, సీనియర్లకు రూ.లక్ష వేతనం దక్కుతుంది. ప్రైవేట్ రంగంలో ప్రారంభంలో నెలకు రూ.35 వేల వేతనం పొందొచ్చు. సీనియర్లకు భారీ వేతన ప్యాకేజీలుంటాయి. ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే పనితీరు, డిమాండ్‌ను బట్టి ఆదాయం ఆర్జించొచ్చు.

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
  • పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
    వెబ్‌సైట్:
    pgimer.edu.in/
  • ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)
    వెబ్‌సైట్:
    www.aiims.edu
  • మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ-ఢిల్లీ
    వెబ్‌సైట్:
    www.mamc.ac.in
  • క్రిస్టియన్ మెడికల్ కాలేజీ-వెల్లూర్
    వెబ్‌సైట్:
    www.cmch-vellore.edu
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్-చెన్నై
    వెబ్‌సైట్:
    www.mmc.tn.gov.in
  • జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
    పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
    వెబ్‌సైట్:
    jipmer.edu.in/
పిల్లలపై ప్రేమానురాగాలు ఉండాలి!
పీడియాట్రిక్స్‌లో నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సులు అభ్యసించిన వారికి విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ధనార్జన కోణంలో కాకుండా సేవాదృక్పథం, చిన్న పిల్లల పట్ల ప్రేమానురాగాలు ఉన్నవారు ఈ కెరీర్‌ను ఎంచుకోవాలి. చిన్నారుల ప్రవర్తనను అర్థం చేసుకుని, వ్యాధుల లక్షణాల ఆధారంగా వారి సమస్యను గుర్తించి చికిత్స చేయాల్సి ఉం టుంది. కాబట్టి పీడియాట్రీషియన్స్‌కు ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలకు సేవచేయడం ద్వారా వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది’
షర్మిళా అస్తానా, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, అపోలో హాస్పిటల్స్.
Published date : 25 Sep 2014 04:03PM

Photo Stories