Skip to main content

పారామెడికల్‌ కోర్సులు..అవకాశాలు అపారం!!


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా కార్పొరేట్‌ ఆస్పత్రులు తమ శాఖలను చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ.. రోగికి చికిత్స అందించడంలో సహాయసహకారాలందించే పారామెడికల్‌ నిపుణుల అవసరం ఎంతో. దీంతో పారామెడికల్‌ కోర్సులు చేసినవారికి జాబ్‌ మార్కెట్‌లో మంచి ఉద్యోగావకాశాలు ఎదురుచూస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ ఈ కోర్సుల్లో
ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో పారామెడికల్‌ కోర్సులపై ఫోకస్‌..

పారామెడికల్‌ కోర్సులకు గతేడాది వరకు పదో తరగతి అర్హత కాగా ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్‌ బైపీసీలో ఉత్తీర్ణత సాధించినవారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. వీరిలో ప్రవేశాలకు తగినంతమంది అభ్యర్థులు లేకపోతే ఎంపీసీ ఉత్తీర్ణులకు, ఆ తర్వాత మిగిలిన గ్రూపులవారికి ప్రాధాన్యతనిస్తారు.

కోర్సులు

డిప్లొమా ఇన్‌:
  • మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌
  • ఆప్టోమెట్రీ టెక్నీషియన్‌
  • హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నీషియన్‌
  • మల్టీపర్పస్‌ హెల్త్ అసిస్టెంట్‌ (పురుషులు)
  • ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌
  • ఆడియోమెట్రీ టెక్నీషియన్‌
  • రేడియోథెరపీ టెక్నీషియన్‌
  • పర్‌ప్యూషన్‌ టెక్నీషియన్‌
  • డయాలసిస్‌
  • మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌
  • రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌
  • మెడికల్‌ స్టెరిలై జేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌
  • హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ థెరపీ టెక్నీషియన్‌
  • డెంటల్‌ టెక్నీషియన్‌
  • డెంటల్‌ హైజినిస్ట్
  • మైక్రో సర్జరీ
  • అనస్థీషియా టెక్నీషియన్‌
  • క్యాత్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌
  • రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌
  • డార్‌‌కరూం అసిస్టెంట్‌
  • ఈసీజీ టెక్నీషియన్‌
  • కార్డియాలజీ టెక్నీషియన్‌
అర్హత: ఇంటర్మీడియెట్‌ బైపీసీ ఉత్తీర్ణత.
వ్యవధి: రెండేళ్లు
మొత్తం సీట్లు: మొత్తం 514 ప్రైవేటు సంస్థల్లో 23080 సీట్లు, 14 ప్రభుత్వ సంస్థల్లో 1462 సీట్లు కలిపి మొత్తం 24542 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంపిక:
అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించడానికి సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. దీనికి ఆయన చైర్మన్‌ కం కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇంకా ఈ కమిటీలో టీచింగ్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, సంబంధిత జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి/డిప్యూటీ డెరైక్టర్‌, సంబంధిత పారామెడికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ సభ్యులుగా ఉంటారు.

ఇంటర్‌ బైపీసీలో గ్రూప్‌ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. గవర్నమెంట్‌ కోటాలో మొత్తం సీట్లలో 60 శాతం సీట్లు ఉంటాయి. మిగిలిన 40 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో ఉంటాయి. వీటిని సంబంధిత విద్యా సంస్థలు భర్తీ చేసుకుంటాయి.

కోర్సు ఫీజులు: ప్రభుత్వ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఏడాదికి * 13000 చొప్పున, మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశం పొందినవారు ఏడాదికి * 40,000 చొప్పున ఫీజు చెల్లించాలి.

కెరీర్‌:
పారామెడికల్‌ కోర్సులు చేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అపార అవకాశాలున్నాయి. డాక్టర్లకు వీరు ప్రతి చికిత్సలో వెన్నంటి సహకరించాల్సిందే. నేడు వివిధ ఆస్పత్రులు ఓ మాదిరి పట్టణాల్లో సైతం తమ శాఖలను ఏర్పాటు చేస్తుండటంతో ఈ కోర్సులు చేసినవారికి ఉపాధి ఖాయం. విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్‌ (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌)లోనూ మంచి అవకాశాలున్నాయి. ఆస్పత్రుల్లో పనిచేయడం ఇష్టం లేనివారు సొంతంగా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

వేతనాలు:
ప్రారంభంలో 10,000 నుంచి 15,000 వరకు లభిస్తాయి. ఆ తర్వాత పనిలో అంకితభావం, కష్టించే స్వభావం, అనుభవం ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. లేదంటే సొంత డయాగ్నస్టిక్‌ కేంద్రం ఉంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించొచ్చు.

దర ఖాస్తు విధానం:
దరఖాస్తును www.appmb.org.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
-పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ:
జూలై 16, 2013

కోర్సుల గురించి క్లుప్తంగా

మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్‌ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం.

ఆప్టోమెట్రీ: ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవల ద్వారా ప్రారంభ స్థాయిలోనే నివారించవచ్చు. దేశంలో ప్రస్తుతం ప్రతి లక్ష మందికి ఒక్క నేత్రవైద్య నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కళ్లకు సంబంధించిన ప్రాథమిక జాగ్రత్తలు, వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులను బోధించేందుకు రూపొందించిన కోర్సే.. ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం.

మల్టీపర్పస్‌ హెల్త్ అసిస్టెంట్‌: గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి రోగ నివారణ సంబంధిత కార్యక్రమాల అమల్లో వీరు ముఖ్యపాత్ర పోషిస్తారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలను వివరించడంతోపాటు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌: కంటికి సంబంధించిన పరీక్షలను నిర్వహించడంలో ఆఫ్తాల్మాజిస్‌‌టకు ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌ సహాయం చేస్తాడు. కంటి సంబంధిత సాధారణ వ్యాధులను గుర్తించే సామర్థ్యం, అవసరమైన కళ్ల జోడును సూచించే పరిజ్ఞానం ఈ కోర్సు ద్వారా అలవడుతుంది.

ఆడియోమెట్రీ టెక్నీషియన్‌: చెవి సంబంధిత పరీక్షలు నిర్వహించడం.. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో నిర్ధారించడం.. పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యలను గుర్తించడంలో ఆడియోమెట్రీ టెక్నీషియన్లు డాక్టర్లకు సహాయపడతారు. అంతేకాకుండా ఆయా సమస్యలకు ఆపరేషన్‌ అవసరమా, లేదా? అనే విషయాన్ని నిర్ధారించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తారు.

రేడియోగ్రఫీ: కచ్చితమైన వ్యాధి నిర్ధారణతోపాటు, సరైన చికిత్సను అందచేయాలంటే.. ప్రతి ఆస్పత్రికి ఒక రేడియాలజీ విభాగం తప్పనిసరి. వ్యాధిని క్షణాల్లో నిర్ధారించి మెరుగైన చికిత్సను అందించేందుకు సహకరించే రేడియాలజిస్టుల అవసరం కూడా ఎంతో ఉంది. శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో విధమైన ప్రక్రియ అవసరముంటుంది. అందుకు అనుగుణంగానే ఆయా పరికరాలను వినియోగించడంలో, ప్రక్రియలను అమలు చేయడంలో ఈ కోర్సులో భాగంగా శిక్షణ ఇస్తారు.

పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్‌: హృద్రోగ చికిత్స నిర్వహించే బృందంలో పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్‌ ది కీలక పాత్ర. ఆపరేషన్‌ థియేటర్లో డాక్టర్లకు సహాయపడటం.. ఓపెన్‌ హార్ట్సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే గుండె-ఊపిరితిత్తుల పరికరాల ఎంపిక, అమరికలో.. పర్‌ఫ్యూషన్‌ టెక్నీషియన్‌లు పాలుపంచుకుంటారు. ఆపరేషన్‌ తర్వాత రోగికి అన్నివిధాలుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు పెరుగుతుండడంతో వీరి అవసరం పెరుగుతోంది.

రేడియోథెరపీ టెక్నీషియన్‌: కేన్సర్‌ సంబంధిత చికిత్సలో రేడియోథెరపీ టెక్నీషియన్లు పాల్పంచుకుంటారు. కేన్సర్‌ ఏ స్థాయిలో ఉంది? దానికి రేడియేషన్‌ ఎంత స్థాయిలో ఇవ్వాలి? రేడియేషన్‌ అవసరం ఉందా, లేదా? అనే అంశాలను వీరే నిర్ణయిస్తారు.

డయాలసిస్‌ టెక్నీషియన్‌: అవుట్‌ పేషంట్‌ డయాలసిస్‌ విభాగాల్లో డయాలసిస్‌ టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తారు. డయాలసిస్‌ చేసేటప్పుడు వినియోగించే పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి? ఆ పరికరాల నిర్వహణ, సంబంధిత అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.

మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌: MRI, XRay, CT scan, Ultrasound లాంటి పరీక్షల్లో రేడియాలజిస్ట్‌లకు వీరు సహాయపడతారు.

రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌: ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, బ్రాంకోస్కోపీ టెస్ట్ చేయడంలో రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్‌లు సంబంధిత వైద్యులకు సహాయపడతారు.

బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌: బ్లడ్‌ బ్యాంక్‌ను నిర్వహించడంలో వీరి పాత్ర ముఖ్యమైంది. రక్తాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం, బ్లడ్‌బ్యాంక్‌కు సంబంధించిన అన్ని రికార్డులు, ఇతర విధులు నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత.

అనస్థీషియా టెక్నీషియన్‌: శస్త్ర చికిత్స నిర్వహించే రోగికి అనƒ స్థీషియా (మత్తుమందు) ఇవ్వడంలో.. సంబంధిత అంశాల నిర్వహణలో అనస్థీషియా టెక్నీషియన్‌లు డాక్టర్లకు సహాయపడతారు.

మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌: ఆపరేషన్‌ థియేటర్‌లో వినియోగించే వివిధ పరికరాల నిర్వహణ, శుభ్రంగా ఉండేలా చూడడం, వాటిని స్టెరిలైజేషన్‌ చేయడం, వాటిలో లోపాలు ఉంటే సంబంధిత విభాగాలకు రిపోర్ట్ చేయడం వంటి విధులను వీరు నిర్వహిస్తుంటారు.

క్యాథ్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌: క్యాథ్‌ ల్యాబ్‌కు సంబంధించిన ఆపరేషన్‌‌స, వినియోగించే పరికరాలు, నిర్వహించే టెస్టులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌: ల్యాబ్‌ నిర్వహణ, ఫిల్‌‌మ్స (ఎక్‌‌సరే మొదలైన) డెవలప్‌మెంట్‌, ఇమేజింగ్‌ టెక్నాలజిస్‌‌ట/రేడియాలజిస్ట్లకు సంబంధిత వ్యవహారాల్లో తగిన విధంగా సహాయం చేయడం వంటి బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు.

హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ థెరపీ: పుట్టుకతోనే మాట్లాడటంలో వచ్చిన లోపాలు, పదాలు/శబ్దాలను స్పష్టంగా పలకలేకపోవడం, మాటలు సరిగా రాకపోవడం వంటి లోపాలను లాంగ్వేజ్‌ టెక్నిక్స్ ద్వారా సరిచేయడం వీరి ప్రధాన బాధ్యత.

ఆసక్తి ఉంటే పుష్కలమైన అవకాశాలు

వైద్యరంగం విస్తృతమవుతున్న నేటి రోజుల్లో పారామెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి పుష్కలమైన అవకాశాలూ లభిస్తున్నాయి. ఆరోగ్యంపై అవగాహన పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగవడంతో కార్పొరేట్‌ వైద్యశాలలు పల్లెలకూ చేరువవుతున్నాయి. రోగులకు వైద్యం అందించడంలో డాక్టర్లతోపాటు వైద్యసహాయకులూ కీలకంగా మారారు. పారామెడికల్‌ కోర్సు చేయాలనుకునేవారికి సేవచేయాలనే భావన, ఓర్పు ముఖ్యం. రేడియాలజీ, అనస్థీషియా, ఆప్తమాలజీ, ల్యాబ్‌టెక్నీషియన్‌ మొదలైన కోర్సుల్లో డిప్లొమా చేసేందుకు అవకాశం ఉంది. నర్సింగ్‌, ఫిజియోథెరపీ, న్యూరోటెక్నీషియన్‌, రేడియోగ్రఫీ, కార్డియో, బ్లడ్‌ట్రాన్‌‌సప్లెంట్‌ వంటి వాటిలో బ్యాచిలర్‌ డిగ్రీ చేయవచ్చు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక రెగ్యులర్‌, డిస్టెన్స్‌లో పీజీ చేసే అవకాశం ఉంది. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. అయితే పారామెడికల్‌లో అన్ని కోర్సులకు సమానమైన అవకాశాలు లేవు. కేవలం ప్రధానమైన కొన్నింటికే ఉద్యోగాలున్నాయి. ఒకటికి రెండుసార్లు సీనియర్ల కెరీర్‌ను గమనించి కోర్సులో చేరితే కోర్సు పూర్తవగానే ఉద్యోగం పొందవచ్చు.


- డాక్టర్‌ వరప్రసాద్‌, ప్రిన్సిపల్‌, గుంటూరు వైద్యకళాశాల.




కోర్సు పూర్తవగానే స్థిరపడవచ్చు

పారామెడికల్‌ కోర్సు పూర్తిచేయగానే ఉద్యోగ అవకాశం గ్యారంటీ. సీనియర్లు చిన్నవయసులోనే ఆర్థికంగా స్థిరపడటం గమనించి డీఎంఎల్‌టీ కోర్సులో చేరాను. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నా. కోర్సు పూర్తవగానే తప్పకుండా జాబ్‌ దొరుకుతుందనే విశ్వాసం ఉంది. సబ్జెక్టుపై మంచి పట్టు సాధించి, ప్రాక్టికల్‌‌సలోనూ ప్రతిభను మెరుగుపరచుకోవడమే పారామెడికల్‌ కోర్సులో కీలకం. పోటీపడగలిగే సామర్థ్యం ఉంటే వైద్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా తేలిక.

-ఎం.శివన్నారాయణ, డీఎంఎల్‌టీ విద్యారి(ఎస్‌.హెచ్‌.ఒ. ఇన్‌స్టిట్యూట్‌, గుంటూరు)
Published date : 27 Jun 2013 04:21PM

Photo Stories