Skip to main content

మెడికల్ కోడింగ్...సరికొత్త కొలువులకు మార్గాలు

ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అవకాశాలు చేజారిన విద్యార్థులు.. యూజీ స్థాయిలో (బీఎస్సీ) బీజెడ్‌సీ వంటి కోర్సుల్లో చేరుతుంటారు. ఆ తర్వాత ఉన్నతవిద్య, ఉపాధి పరంగా సరైన మార్గాలను అన్వేషించే క్రమంలో ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు ‘మెడికల్ కోడింగ్’తో తమ ఆందోళనకు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చంటున్నారు జాబ్ మార్కెట్ నిపుణులు. హెల్త్‌కేర్, అనుబంధ రంగాల కార్యకలాపాలు ఊపందుకోవడంతో మెడికల్ కోడింగ్ నైపుణ్యాలున్నవారికి సుస్థిర కెరీర్ సొంతమవుతోంది. ఈ నేపథ్యంలో బయాలజీ/లైఫ్ సెన్సైస్ విద్యార్థులకు సరికొత్త కొలువులను అందిస్తున్న మెడికల్ కోడింగ్ కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
హెల్త్‌కేర్ రంగంలోని ఓ విభాగమే మెడికల్ కోడింగ్. హెల్త్‌కేర్ డయాగ్నసిస్, మెడికల్ సర్వీసెస్, మెడికల్ ఎక్విప్‌మెంట్ తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక వర్గీకరణ వ్యవస్థ (ఉదా: ఐసీడీ-10) ఆధారంగా ప్రత్యేక కోడ్‌ల రూపంలో పొందుపర్చడాన్ని మెడికల్ కోడింగ్‌గా పేర్కొంటారు. ఇది ప్రస్తుతం ఆరోగ్య బీమా, వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుల ప్రక్రియలో కీలకంగా మారుతోంది. కారణం.. డాక్టర్ల నోట్స్, రోగులకు అందించిన సేవలు తదితరాలకు సంబంధించిన మెడికల్ కోడ్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కు అవసరమవుతాయి. వీటి ఆధారంగానే ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటాయి.

పెరిగిన డిమాండ్ :
ప్రస్తుతం హెల్త్‌కేర్ ఔట్‌సోర్సింగ్ ఇండస్ట్రీ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో మెడికల్ కోడింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. పలు విదేశీ హెల్త్‌కేర్ సంస్థలు భారత సంస్థలతో ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో భారత్‌లో ఇటీవల కాలంలో హెల్త్‌కేర్ ఔట్ సోర్సింగ్, మెడికల్ కోడింగ్ విభాగాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసోచామ్, ఎర్నస్ట్ అండ్ యంగ్ తదితర సంస్థల నివేదికల ప్రకారం హెల్త్‌కేర్ ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

డిమాండ్-సప్లయ్ మధ్య వ్యత్యాసం :
ప్రస్తుతం దేశంలో మెడికల్ కోడింగ్‌లో మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ కోణంలో 40 శాతం వ్యత్యాసం ఉంది. ఇదే ధోరణి రానున్న రోజుల్లోనూ కొనసాగనుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా చాలా దేశాలు భారత్‌ను హెల్త్‌కేర్ ఔట్‌సోర్సింగ్‌కు గమ్యంగా ఎంచుకోవడమే దీనికి కారణమన్నది జాబ్ మార్కెట్ నిపుణుల మాట.

సర్టిఫికేషన్స్ :
మెడికల్ కోడింగ్ ఔత్సాహికులకు ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఐఎంఏ), బోర్డ్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ కోడింగ్ అండ్ కంప్లయన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్(ఏఏపీసీ), అకాడమీ ఆఫ్ మెడికల్ కోడర్స్ ఇండియా(ఏఎంసీఐ) తదితర సంస్థలు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. కోర్సుల వ్యవధి మూడు నుంచి ఆర్నెల్లుగా ఉంటోంది.

హోదాలు :
మెడికల్ కోడర్స్‌కు లభించే హోదాలను పరిగణనలోకి తీసుకుంటే.. సర్టిఫైడ్ మెడికల్ కోడర్ హోదా ప్రధానంగా నిలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో టెక్నికల్ కోడ్స్ రాయడం, డీ-కోడింగ్ తదితరాలు వీరి ప్రధాన విధులుగా ఉంటాయి. సర్టిఫైడ్ మెడికల్ కోడర్లు సునిశిత పరిశీలనతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కోడింగ్ స్పెషలిస్టు: మెడికల్ కోడింగ్ విభాగంలోని మరో ప్రధాన హోదా.. కోడింగ్ స్పెషలిస్టు. అక్షరాలు, న్యూమరికల్స్ తదితరాల కలయికగా ఉండే కోడ్‌లను రూపొందించడం ఈ హోదాలో ప్రధాన విధులుగా ఉంటాయి.

ఇతర హోదాలు..
మెడికల్ కోడింగ్‌కు సంబంధించి కోడర్, బిల్లర్, కోడింగ్ స్పెషలిస్టు వంటిహోదాలతోపాటు ఇతర అనేక జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి..
  • రీయింబర్స్‌మెంట్ స్పెషలిస్టు.
  • క్లెయిమ్ ప్రాసెసర్/క్లెయిమ్ రివ్యూయర్.
  • పేషెంట్ అకౌంట్ రిప్రజెంటేటివ్.
  • మెడికల్ కలెక్టర్.
  • ఎలక్ట్రానిక్ క్లెయిమ్ ప్రాసెసర్..

ఆకర్షణీయ వేతనాలు :
ప్రస్తుత డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మెడికల్ కోడర్లకు ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో కోడర్/బిల్లర్‌కు నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వేతనం లభిస్తోంది. మూడేళ్ల పని అనుభవంతో టీమ్ లీడర్‌గా రూ.45 వేలు-రూ.50 వేలు, ఆ తర్వాత మేనేజర్/సీనియర్ మేనేజర్ స్థాయిలో రూ.60 వేలకు పైగా వేతనం పొందొచ్చు.

ఫ్రీలాన్స్ :
సర్టిఫైడ్ మెడికల్ కోడర్లకు ఫ్రీలాన్స్ అవకాశాలు విస్తృతమయ్యాయి. ప్రధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోని థర్డ్ పార్టీ ఏజెన్సీలు, యూఎస్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థలు ఫ్రీలాన్స్ అవకాశాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆసుపత్రులు ఫ్రీలాన్స్ సేవలపై ఆధారపడుతున్నాయి. ఈ విధానంలో ఆన్‌లైన్ ఆధారంగా పనిచేసే వారు నెలకు కనీసం రూ.30 వేలు సంపాదించే అవకాశం ఉంది.

అనలిస్ట్‌లకూ అవకాశం..
మెడికల్ కోడింగ్ విభాగంలో అనలిస్టులకూ అవకాశాలు లభిస్తున్నాయి. వైద్యులు, రేడియాలజిస్టులు అందించే రిపోర్టులు/సేవలు, రోగుల రికార్డులను సునిశితంగా విశ్లేషించి కోడింగ్ చేసే క్రమంలో అనలిస్టుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మెడికల్ కోడింగ్ విభాగంలో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ సంస్థలు అనలిస్టు హోదాలో టెక్నికల్ నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.

ఇతరులకు సైతం..
మెడికల్ కోడింగ్ కెరీర్ అవకాశాలు కేవలం లైఫ్ సెన్సైస్ విద్యార్థులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇతర కోర్సులు చదివిన విద్యార్థులు సైతం మెడికల్ కోడింగ్ విభాగంలో కొలువులను సొంతం చేసుకోవచ్చు. మెడికల్ టెర్మినాలజీ, హెల్త్‌కేర్ రంగంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండి.. వివిధ సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్స్ పూర్తిచేయడం ద్వారా ఔత్సాహికులు మెడికల్ కోడింగ్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఉపాధి వేదికలు :
మెడికల్ కోడర్ల (ఎంసీ)కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన ఉపాధి వేదికలు:
  1. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు.
  2. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీలు.
  3. కార్పొరేట్ ఆసుపత్రులు.
  4. హెల్త్‌కేర్ ఔట్‌సోర్సింగ్ సంస్థలు.
  5. బీపీఓ/కేపీఓలు..

మెడికల్ కోడింగ్..
ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్-ముఖ్య వెబ్‌సైట్లు
  1. https://www.ahima.org
  2. www.medicalspecialtycoding.com
  3. www.aapc.com
  4. www.igmpiindia.org/amci.html

టెక్నికల్ స్కిల్స్..
మెడికల్ కోడ్ ఉద్యోగార్థులకు సాంకేతిక నైపుణ్యాలు సైతం అవసరమవుతున్నాయి. ముఖ్యంగా మాస్టర్ పేషెంట్ ఇండెక్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నిర్వహణలో కంప్యూటర్ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. సీపీటీ కోడింగ్, ఐసీడీ-10, మెడికల్ టెర్మినాలజీ, డేటాఎంట్రీ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌స్కిల్స్, ఆర్గనైజింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

ముఖ్యాంశాలు :
  • లైఫ్ సెన్సైస్ విద్యార్థులకు మెరుగైన ప్రత్యామ్నాయ కెరీర్‌గా మెడికల్ కోడింగ్.
  • వచ్చే అయిదేళ్లలో మెడికల్ కోడింగ్ నిపుణులకు బాగా పెరగనున్న డిమాండ్.
  • మెడికల్ కోడింగ్ ఔట్‌సోర్సింగ్ పరంగా రెండో పెద్ద దేశంగా భారత్.
  • ప్రారంభంలోనే నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వేతనం.

నైపుణ్యాలు ప్రధానం :
లైఫ్ సెన్సైస్ అకడమిక్ నేపథ్యమున్న విద్యార్థులకు ప్రస్తుతం మెడికల్ కోడింగ్ విభాగం చక్కటి ఉపాధి వేదికగా నిలుస్తోంది. ఈ రంగంలో రాణించాలంటే రీసెర్చ్ ఓరియెంటేషన్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ప్రస్తుతం రిక్రూటింగ్ సంస్థలు నిపుణులైన మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు సర్టిఫికేషన్లను సొంతం చేసుకోవడం ద్వారా మంచి వేతనాలతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
- కె.సత్య గోపాల్, వైస్ ప్రెసిడెంట్, ఒమేగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్.
Published date : 17 Apr 2019 03:24PM

Photo Stories