Skip to main content

పక్కా ప్రణాళికతోనే ‘క్యాట్’లో విజయం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి మార్గం కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). ఏటా రెండు లక్షల మందికి పైగా దీనికి పోటీ పడతారు. క్యాట్-2016 నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు క్యాట్-2016 నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు విజయానికి అనుసరించాల్సిన ప్రణాళిక..
ఒకే రోజు...
గతేడాది (క్యాట్-2015) మాదిరిగానే క్యాట్-2016 ఒకే రోజు రెండు స్లాట్లలో జరగొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే ఈసారి టెస్ట్ సెంటర్ల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. గతేడాది మొత్తం 136 ప్రాంతాల్లో 650 టెస్ట్ సెంటర్లలో పరీక్ష నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 150, 700కు పెరిగే అవకాశముంది.

మార్పులకు అవకాశం?
క్యాట్-2016ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- బెంగళూరు (ఐఐఎం-బీ) నిర్వహించనుంది. ఆన్‌లైన్లో నిర్వహించే ఈ పరీక్షను టీసీఎస్ సంస్థ పర్యవేక్షించనుంది. జూలై మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. క్యాట్ నిర్వహణను చాలా ఏళ్ల తర్వాత ఐఐఎం-బీ చేపట్టడంతో పరీక్ష విధానంలో మార్పులుండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ గతేడాదే ఐఐఎం-అహ్మదాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాట్-2015లో మార్పులు జరిగినందున.. ఈసారి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మార్పులు జరిగినా అవి ప్రశ్నల సంఖ్య, లేదా సమయం, విభాగాల వారీగా ఇచ్చే వెయిటేజీకి సంబంధించే ఉంటాయి తప్ప.. పరీక్షకు నిర్దేశించిన విభాగాల్లో మార్పులు ఉండవని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో క్యాట్‌లో ఆయా విభాగాలపై పట్టు కోసం అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు..

క్వాంటిటేటివ్ ఎబిలిటీ
ఇది పూర్తిగా గణితం ఆధారితంగా ఉంటుంది. అభ్యర్థులు ప్యూర్ మ్యాథ్స్‌గా పేర్కొనే జామెట్రీ, ఆల్జీబ్రా, నంబర్స్, ప్రాబబిలిటీ తదితర అంశాలపై కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. అన్ని అంశాలకు సంబంధించి సూత్రాలను నేర్చుకోవాలి. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చెయ్యాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్
అభ్యర్థుల విశ్లేషణ, కంప్యూటేషన్ నైపుణ్యాలను ఇది పరీక్షిస్తుంది. ఇందులో రాణించాలంటే ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ఏదైనా ఒక డేటాను ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలను పరిష్కరించమంటారు. ఉదాహరణకు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సర్వే గణాంకాలు పేర్కొని.. వాటి ఆధారంగా ఏ ఏడాది ఎంతమందికి సగటున ఉపాధి హామీ లభించింది? వంటి ప్రశ్నలు అడుగుతారు. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యమిస్తే ఇలాంటి సమస్యలను సులువుగా పరిష్కరించొచ్చు.

లాజికల్ రీజనింగ్
ఒక విధంగా అకడమిక్ నేపథ్యానికి సంబంధం లేని విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఇది పూర్తిగా విద్యార్థుల తార్కిక విశ్లేషణ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా డేటాను అవగాహన చేసుకుని, విశ్లేషించే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన విభాగం. వెన్‌డయాగ్రమ్స్, డిడక్షన్, పజిల్స్, లాజికల్ కనెక్టివిటీ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అలాగే స్టేట్‌మెంట్స్‌ను అనుసంధానం చేయగలిగే నైపుణ్యం, ఇతర అంశాలతో పోల్చగలిగే సామర్థ్యం అవసరం.

వెర్బల్ ఎబిలిటీ
ఈ విభాగంలోనూ రీడింగ్ కాంప్రెహెన్షన్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదివి, అందులోని ముఖ్య సమాచారం, సారాంశాన్ని సంగ్రహించగల నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు, ఎడిటోరియల్స్ చదవడం ఉపకరిస్తుంది. వొకాబ్యులరీని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఇంగ్లిష్ బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించడంతోపాటు, కొత్త పదాలను నేర్చుకొని వాటి వినియోగాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి.

క్యాట్-2015
 • క్యాట్- 2015 మొత్తం మూడు విభాగాల్లో జరిగింది. వీటి నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడిగారు. అవి.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ (34 ప్రశ్నలు); డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ (32 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (34 ప్రశ్నలు).
 • వీటిలో 33 నాన్ మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్ (సింగిల్ వర్డ్ ఆన్సర్స్ / ఫిల్ ఇన్ ద బ్లాంక్స్) రూపంలో అడిగారు.
 • క్యాట్-2014తో పోల్చితే పరీక్ష వ్యవధి కూడా పది నిమిషాలు పెరిగి మూడు గంటలకు చేరింది.
 • క్యాట్-2015లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ విభాగం అత్యంత క్లిష్టంగా ఉంది. మిగిలిన రెండు విభాగాలు కూడా కొంచెం క్లిష్టంగానే ఉన్నాయి.
 • క్యాట్ - 2015 మొత్తం దరఖాస్తులు 2,28,644. పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,79,602 మంది. వీరిలో ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నవారు 1,12,012 మంది.

క్యాట్ - 2016 సమాచారం..
అర్హత:
50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
నోటిఫికేషన్: జూలై మూడో వారం
ఆన్‌లైన్ టెస్ట్: అక్టోబర్/నవంబర్
ఫలితాలు: జనవరి

క్యాట్ ఆధారంగా ప్రవేశాలు..
 • మొత్తం ఐఐఎంలు 19. (3,700 సీట్లు)
 • 2017 నుంచి జమ్మూలోనూ కొత్తగా మరో ఐఐఎం ప్రారంభం కానుంది.
 • ఐఐఎంలతోపాటు ఎన్‌ఐటీలు, ఐఐటీలు అందిస్తున్న మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్‌లకు క్యాట్ స్కోరే ప్రామాణికం.
 • వీటితోపాటు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వంటి టాప్ బిజినెస్ స్కూల్స్ కూడా క్యాట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
 • జాతీయ స్థాయిలో 120కుపైగా ప్రముఖ బి-స్కూల్స్‌లో ప్రవేశానికి క్యాట్ స్కోర్ ప్రామాణికం.

క్యాట్ నిర్వహణ ఇన్‌స్టిట్యూట్ మారింది కాబట్టి పరీక్ష విధానం మారినా విభాగాలు మాత్రం అవే ఉంటాయి. అందువల్ల విద్యార్థులు ఇప్పటి నుంచే ఆయా విభాగాలపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగానికి సంబంధించి బేసిక్స్ నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాలి. రోజూ అన్ని విభాగాలు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- రామ్‌నాథ్ ఎస్.కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

క్యాట్ విజయంలో కీలక పాత్ర పోషించేది సబ్జెక్టు నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టీస్. వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ వల్ల పరీక్షలో నిర్దిష్ట సమయంలోగా సులువుగా సమాధానాలు ఇవ్వొచ్చు. మాక్ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లకు హాజరై సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ప్రిపరేషన్‌ను మెరుగుపర్చుకోవాలి.
- టి.సంహిత్ రెడ్డి, 100 పర్సంటైల్, క్యాట్ - 2015

రిఫరెన్స్ బుక్స్
 • హౌ టు ప్రిపేర్ ఫర్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ - అరుణ్ శర్మ
 • పియర్సన్ గైడ్ టు వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ - నిషిత్ సిన్హా
 • వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్- తృష్ణ పబ్లికేషన్స్, అరుణ్ శర్మ
 • హౌ టు ప్రిపేర్ ఫర్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్- అరుణ్ శర్మ
Published date : 02 Jul 2016 02:37PM

Photo Stories