Skip to main content

కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలంటే..!

పవన్‌ది సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నతస్థాయికొలువు... ఇక ఇతని వేతనం గురించి వింటే మతిపోవాల్సిందే! అయినా ఉద్యోగం వదిలి హడావుడిగా సొంతంగా కంపెనీ పెట్టాడు.
 తెల్లారేసరికల్లా మార్కెట్ మొత్తం చుట్టేయాలనుకున్నాడు.. కొంతకాలానికే ఆర్థికంగా కష్టనష్టాలను మూటకట్టుకున్నాడు..

సంజయ్ ఎంబీఏ పూర్తిచేశాడు.. ఆర్థికంగానూ పెద్ద స్థితిమంతుడేం కాదు!
కానీ, వినూత్న ఆలోచనతో చిన్నస్థాయిలో స్టార్టప్ ప్రారంభించాడు. క్రమేణా వ్యాపార మెలకువలు తెలుసుకుంటూ.. ఆచితూచి అడుగేస్తూ.. విజయవంతంగా ముందుకెళ్తున్నాడు!

పై రెండు ఉదంతాలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోని భిన్న పార్శ్వాలకు నిదర్శనం. వాస్తవానికి వ్యాపారమంటే పూలపాన్పు కాదు.. పులిమీద స్వారీ అని అందరూ చెప్పేమాట!! ఈ నేపథ్యంలో కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకునేఔత్సాహికులకు ఉపయోగపడేలా ప్రత్యేక కథనం...

కంపెనీ పెడుతున్నారా?
సాదాసీదా కార్యకలాపాలతో వ్యాపారంలో విజయం సొంతం చేసుకుందామంటే..కుదిరే కాలం కాదిది! కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకొనే వారు ముందు ఏం చేయబోతున్నాం.. ఎక్కడ కంపెనీ పెట్టబోతున్నాం.. మార్కెట్‌లోకి ఎందుకు ప్రవేశించాలనుకొంటున్నాం.. మన ప్రొడక్ట్‌కు ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది.. భవిష్యత్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశముంది.. పోటీదారులు ఎవరు తదితర అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే వ్యాపారంలో వ్యూహాత్మక అనుకూలత దక్కుతుంది.

పరిశోధనతో పసిగట్టాలి..?
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి అడుగుపెట్టాలనుకొనే యువత ముందుగా తగిన పరిశోధన చేయాలి. ఇందులో భాగంగా మార్కెట్ పరిస్థితి, పోటీ గురించి వివరాలు సేకరించాలి.ఈ ప్రక్రియను ఎంత బాగా చేయగలిగితే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉంటాయి. చాలామంది మార్కెట్ సర్వేను పకడ్బందీగా చేయరు. ఫలితంగా నష్టపోతుంటారు. కాబట్టి సంబంధిత రంగంలోనే నిపుణులు, అనుభవం ఉన్నవారితో సర్వే లేదా రీసెర్చ్ చేయించడం లాభిస్తుంది.

పరిశీలించాల్సిన అంశాలు..
  • ఇండస్ట్రీ ప్రస్తుత స్థితి, దాని గమనం.
  • పోటీదారుల వల్ల బిజినెస్‌పై పడే ప్రభావం.
  • మార్కెట్ ఒడిదొడుకులు .
  • పరిష్కారాలు చూపాల్సిన సమస్యలు.
  • అవకాశాలు, అవరోధాలు.
  • తాజా ట్రెండ్స్ ఏమిటి?
ద్రవ్యనిర్వహణ :
బిజినెస్ ఏదైనా.. మనీ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనీ మేనేజ్‌మెంట్ కంపెనీకి వెన్నెముకగా నిలుస్తుంది. సమర్థమంతమైన మనీ మేనేజ్‌మెంట్ ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా విజయవంతంగా నడుస్తుంది. కాబట్టి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకొనే వారు ముందు చక్కటి అకౌంటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబడి, వ్యయాలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నిర్వహించాలి. అప్పుడే సదరు కంపెనీ విజయపథంలో కొనసాగుతుంది. కంపెనీ నిర్వహణలో మనీ ప్రవాహం కీలకం. చెల్లించాల్సిన మొత్తాలు, రావాల్సిన రాబడిపై స్పష్టతతో ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఖర్చులపై అదుపు :
‘కంపెనీ ప్రారంభించాం.. విజయవంతంగా ముందుకు సాగుతోంది’.. కదా అని సంస్థాగత, వ్యక్తిగత ఖర్చులపై నియంత్రణ కోల్పోతే.. స్వల్ప సమయంలోనే పతనావస్థకు చేరడం ఖాయం. ఫలితంగా మీతోపాటు కంపెనీపై ఆధారపడిన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడతాయి.

అంతా నా ఇష్టం వద్దు..
పెట్టుబడులు పెట్టింది లేదా సమీకరించింది నేనే కదా..! అని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. నిర్ణయాలు తీసుకొనే ముందు కంపెనీలోని కీలక వ్యక్తులు, బిజినెస్ పార్టనర్లు, సంబంధిత అంశాల్లో అనుభవం కలిగిన వారితో చర్చించాలి. ఇది ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు. బిజినెస్ నిర్వహణలో తొందరపాటుతో చేసిన తప్పిదాల కారణంగా మహా మహా కంపెనీలే కాలగర్భంలో కలిసిపోయాయి. కాబట్టి బిజినెస్‌లోకి ప్రవేశించిన వారు అశ్రద్ధ, అలక్ష్యాలను అస్సలు దగ్గరకు రానీయకూడదు.

గుణ‘పాఠాలు’ ఇవిగో..
సొంతంగా స్టార్టప్ కంపెనీ లేదా బిజినెస్‌ను ప్రారంభిద్దామనుకుంటున్న వారందరికీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్‌ఎయిర్‌వేస్‌లు కేస్ స్టడీస్‌గా ఉపయోగపడతాయి. వీటి పతనాలకు గల కారణాలను పరిశీలించడం ద్వారా కంపెనీ నిర్వహణకు సంబంధించిన తప్పులపై అవగాహన ఏర్పడుతుంది. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా యుక్త వయసులోనే(1983) తండ్రి నుంచి వ్యాపార పగ్గాలు చేపట్టాడు. తనదైన శైలిలో దూసుకెళ్లి బిజినెస్ టైకూన్‌గా ఎదిగాడు. కానీ, వ్యక్తిగత విలాసాలు, పేలవమైన బిజినెస్ వ్యూహాలు, పొరపాటు నిర్ణయాలు, దుబారా ఖర్చులు..అన్నీ కలిపి అతడిని జీరోగా నిలబెట్టాయి. అలాగే నరేశ్ గోయల్ నేతృత్వంలోని జెట్ ఎయిర్‌వేస్ తన దగ్గర తగినంత క్యాపిటల్ లేకపోయినా మనీ మేనేజ్‌మెంట్‌కు ఏమాత్రం విలువివ్వలేదు. ఓ వైపు అప్పులు తీసుకోవడాన్ని కొనసాగిస్తూనే.. ఆదాయానికి మించి విలాసాల కోసం ఖర్చు చేసింది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం ఎప్పుడూ సరైన నిర్ణయం కాదు. దుబారా, పొరపాటు నిర్ణయాలు జెట్‌ఎయిర్‌వేస్‌ను నష్టాల్లోకి నెట్టాయి.

స్ఫూర్తిప్రదాతలు..
  • కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్‌ఎయిర్‌వేస్‌లు ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు గుణపాఠాలుగా మిగిలితే... విప్రో, హెచ్‌సీఎల్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
  • విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ప్రస్తుతం దేశంలో రెండో అతిపెద్ద ధనవంతుడు. ప్రేమ్‌జీ తండ్రి సన్‌ఫ్లవర్ వనస్పతి పేరుతో వంటనూనె వ్యాపారాన్ని ప్రారంభించారు. తండ్రి ఆకస్మిక మరణంతో ప్రేమ్‌జీ 21 ఏళ్ల వయసులోనే కంపెనీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన వ్యాపారాన్ని విస్తరించారు. 1980ల్లో భారత ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి.. కంపెనీ పేరును విప్రోగా మార్చి హైటెక్నాలజీ విభాగంలోకి అడుగుపెట్టారు. అమెరికాకు చెందిన సెంటినల్ కంప్యూటర్ కార్పొరేషన్ సహకారంతో మినీ కంప్యూటర్ల తయారీని ప్రారంభించారు. తన వ్యాపార నైపుణ్యంతో రెండు మిలియన్ డాలర్లు ఉన్న కంపెనీని ఐటీ, బీపీవో, ఆర్‌అండ్‌డీ రంగాలకు విస్తరించి రాబడులను 8.5 బిలియన్ డాలర్లకు చేర్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లో విప్రో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రేటెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కీర్తి గడించిన ప్రేమ్‌జీ వ్యాపారంలో విలువలను ప్రాథమిక సూత్రంగా పెట్టుకున్నారు. విలువల విషయంలో రాజీలేని ధోరణి విప్రోను ప్రత్యేకంగా నిలుపుతోంది.
  • అది 1976... ఢిల్లీ క్లాత్ మిల్స్(డీసీఎం)లో పనిచేస్తున్న ఆరుగురు యువ ఇంజనీర్లు ముచ్చటించుకున్నారు. మంచి జీతం లభిస్తున్నా.. వారిలో ఏదో తెలియని అసంతృప్తి. ఆ బృందంలోని 30 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలసి హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(హెచ్‌సీఎల్)ను స్థాపించాడు. ఆయనే నేటి హెచ్‌సీఎల్ చైర్మన్ అండ్ సీఈవో శివ్‌నాడార్. ప్రారంభంలో అన్ని స్టార్టప్స్‌లానే హెచ్‌సీఎల్ నిధుల సమస్యను ఎదుర్కొంది. అయితే శివ్‌నాడార్ చాకచక్యంగా వాటిని అధిగమించారు. వర్క్‌ఫోర్స్‌లో వైవిధ్యాన్ని తన విజయ రహస్యమని చెప్పే ఆయన్నుంచి ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్లు ఎంతో నేర్చుకోవచ్చు.
స్టార్టప్స్‌కో సలహా..
స్టార్టప్ పెట్టాలనుకొంటున్న వారు ముందుగా మంచి టీమ్‌ను ఏర్పరచుకోవాలి. మంచి టీమ్‌తోపాటు బిజినెస్‌కు మార్కెట్ ఉన్నప్పుడు ఫండింగ్ త్వరగా లభిస్తుంది. పెద్ద కంపెనీలకు నిర్వహణ పరంగా వెసులుబాటు ఉంటుంది. కానీ, స్టార్టప్స్‌కు ఆ అవకాశం ఉండదు. కాబట్టి స్టార్టప్ కంపెనీ పెట్టిన వారు ప్రారంభంలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. కంపెనీ ఏర్పాటుకు సంబంధించి బిల్డింగులు, ఇతర సౌకర్యాలపై అతిగా వెచ్చించరాదు. అలాగే పెద్ద మొత్తంలో జీతాలు కోరుకొనే వారికంటే.. తక్కువ వేతనంతోనే అంకితభావం చూపే ఉద్యోగులను ఎంపికచేసుకోవాలి. కంపెనీతో దీర్ఘకాలం ప్రయాణించేవారిని ఉద్యోగులుగా నియమించుకోవడం లాభిస్తుంది. ఖర్చులు, పెట్టుబడి విషయంలో మెలకువగా వ్యవహరించాలి. స్టార్టప్‌లు సాధ్యమైనంత పొదుపు పాటించి.. రెండేళ్లలో నిలదొక్కుకొనేలా ప్రయత్నించాలి. కింగ్‌ఫిషర్, జెట్‌ఎయిర్‌వేస్‌ల నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకుంటే... ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ల నుంచి ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు.
- రామ్ గొల్లమూడి, నిపుణులు
Published date : 25 May 2019 05:41PM

Photo Stories