Skip to main content

కామన్ అడ్మిషన్ టెస్ట్- సన్నద్ధత

కొత్తగా ఎలాంటి మార్పులు లేకుండా క్యాట్-2016 నోటిఫికేషన్ విడుదలైంది. రెండు మూడేళ్ల నుంచి పరీక్షలో ప్రశ్నల క్లిష్టత స్థాయి పెరుగుతోంది. అదేవిధంగా క్యాట్‌కు దరఖాస్తు చేసుకుంటున్న ఔత్సాహికుల సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాట్-2016 తీరుతెన్నులు, విజయానికి ఉపయోగపడే విధంగా గత పరీక్షల శైలిపై విశ్లేషణ...
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).. ఎంబీఏ ఔత్సాహికులకు సుపరిచితమైన పరీక్ష! ప్రతిష్టాత్మక ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో మేనేజ్‌మెంట్ పీజీలో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా తొలి దశలో నిర్వహించే పరీక్ష క్యాట్. గత ఐదేళ్లుగా క్యాట్ ఔత్సాహికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్యాట్-2016 నిర్వహణ బాధ్యతను ఐఐఎం-బెంగళూరుకు ఇచ్చినప్పటి నుంచి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇన్‌స్టిట్యూట్ క్యాట్ బాధ్యతలు చేపట్టడంతో పరీక్ష విధానంలో మార్పులు ఉండే అవకాశముందనే విశ్లేషణల కారణంగా అభ్యర్థులు ఆందోళన చెందారు. అయితే అభ్యర్థులకు ఉపశమనం కలిగించే రీతిలో.. ఎలాంటి కొత్త మార్పులు లేకుండానే క్యాట్ ప్రకటన విడుదలైంది. పరీక్ష విధానం గతేడాది తరహాలోనే ఉంటుందని పేర్కొనడం ఊరట కలిగించింది.

మూడు సెక్షన్లు.. మూడు గంటలు
క్యాట్-2016 మొత్తం మూడు గంటల వ్యవధిలో మూడు సెక్షన్లలో జరగనుంది. ప్రతి సెక్షన్‌కు గంట వ్యవధిని నిర్దేశించిన నేపథ్యంలో అభ్యర్థులు ఒక సెక్షన్ పూర్తయిన తర్వాతే మరో సెక్షన్ ప్రశ్నల సాధనకు ప్రయత్నించాల్సి ఉంటుంది.
సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్
సెక్షన్-2: డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్
సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ

నాన్-ఎంసీక్యూ విధానం
గత సంవత్సరం తొలిసారిగా ప్రవేశపెట్టిన నాన్-ఎంసీక్యూ ప్రశ్నల విధానం ఈసారి కూడా కొనసాగనుంది. మొత్తం ప్రశ్నల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు సింగిల్ వర్డ్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వంటివి ఉంటాయి. గతేడాది వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 10; డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 8; క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 15 నాన్-ఎంసీక్యూ ప్రశ్నలు అడిగారు.

పెరుగుతున్న క్లిష్టత స్థాయి
క్యాట్ గత రెండేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే క్లిష్టత స్థాయి పెరుగుతోంది. ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఎబిలిటీల్లో సాధారణ క్లిష్టత, పూర్తిగా సంక్లిష్టంగా ఉన్న ప్రశ్నల సంఖ్య 40 శాతం మేర ఉంది. గతేడాది నాన్-ఎంసీక్యూ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం 100 ప్రశ్నల్లో.. 33 ప్రశ్నలు నాన్-ఎంసీక్యూ ప్రశ్నలు ఉండటం అభ్యర్థులను ఇబ్బందికి గురి చేసింది. 2014లో సైతం వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల్లో 50 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడిగారు. అంటే క్రమేణా క్యాట్ క్లిష్టత స్థాయి పెరుగుతోంది. క్యాట్-2013ను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ రెండు విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మాత్రమే అడిగారు.

క్యాట్-2015.. కనీస కటాఫ్‌లో తగ్గుదల
క్యాట్ క్లిష్టత స్థాయి పెరుగుతుందని చెప్పడానికి నిదర్శనం క్యాట్-2015లో పలు ఐఐఎంలు.. ప్రవేశ ప్రక్రియలోని తదుపరి దశలు (జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ)కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే క్రమంలో క్యాట్ కనీస కటాఫ్‌లను తగ్గించాయి. దీనికి కారణం.. 99 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు కూడా సెక్షనల్ కటాఫ్‌లలో సరైన మార్కులు పొందకపోవడమే. ఉదాహరణకు.. ఐఐఎం-అహ్మదాబాద్‌ను తీసుకుంటే.. తొలుత క్యాట్ కనీస కటాఫ్ స్కోర్‌ను 90గా పేర్కొన్న ఈ ఇన్‌స్టిట్యూట్.. ఆ తర్వాత 80కి తగ్గించింది. అదే విధంగా సెక్షనల్ కటాఫ్‌లో కనీస మార్కులను 80 నుంచి 70కి తగ్గించింది. కారణం.. 99 పర్సంటైల్, 100 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు సైతం సెక్షనల్ కటాఫ్ మార్కుల నిబంధన కోణంలో ఏదో ఒక సెక్షన్‌లో అర్హత ప్రమాణాలను అందుకోలేక పోవడమే.

సెక్షన్ వారీ నిబంధనతో ఇబ్బందులు
ఐఐఎంలు.. ఎంపిక ప్రక్రియలో భాగంగా క్యాట్‌లో సెక్షన్ వారీగా కనీస అర్హత మార్కులను నిర్దేశించడం అధిక శాతం విద్యార్థులకు ఇబ్బందికర అంశంగా పరిణమించింది. ముఖ్యంగా ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక ప్రక్రియలో క్యాట్ స్కోర్‌కు వెయిటేజీ తగ్గించి, ఇతర అంశాలకు వెయిటేజీ ఇవ్వడం క్రమేణా పెరుగుతోంది.

సన్నద్ధత
  • నాన్-మ్యాథ్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ముందుగా మ్యాథమెటిక్స్ అంశాలు ఉండే క్వాంటిటేటివ్ ఎబిలిటీపై అవగాహన పెంపొందించుకునేందుకు కృషి చేయాలి. ప్రాబబిలిటీ అండ్ పెర్ముటేషన్స్/కాంబినేషన్స్, నెంబర్స్, అల్‌జీబ్రా, జామెట్రీ విభాగాలపై దృష్టిసారించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ విభాగానికి సంబంధించి పర్సంటేజీ, యావరేజెస్‌పై పట్టు సాధించాలి.
  • వెర్బల్ ఎబిలిటీ సంబంధిత ప్రశ్నలకు అర్థాలు, సమానార్థాలు, ప్రేజెస్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి. వీటితోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ముఖ్యంగా ఈ విభాగంలో ప్రశ్నలన్నీ ప్యాసేజ్ ఆధారితంగానే ఉంటాయి. కాబట్టి ఒక ప్యాసేజ్‌లోని కీలక అంశాన్ని గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
  • అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా అభ్యర్థులందరూ మంచి స్కోర్ సాధించడానికి వీలు కల్పించే విభాగం రీడింగ్ కాంప్రెహెన్షన్. వొకాబ్యులరీ డెవలప్‌పెంట్, సెంటెన్స్ ఫార్మేషన్‌పై ప్రాక్టీస్ వంటి సాధనాలతో ఈ విభాగాన్ని సులువుగా అధిగమించొచ్చు.
  • అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో టైం మేనేజ్‌మెంట్‌కు, ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలి.
  • ఇప్పటి నుంచి పరీక్ష తేదీ (డిసెంబర్ 4)వరకు ఉన్న సమయంలో మూడు నెలలు పూర్తిగా సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
  • మ్యాథమెటిక్స్, వెర్బల్ ఎబిలిటీలకు సంబంధించి బేసిక్ అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి.అదే సమయంలో ప్రతి రోజూ ఒక అంశం చదవడం పూర్తవగానే దాని ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పరీక్ష తేదీకి ముందు నెల రోజులు పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. కనీసం మూడు, నాలుగు మాక్‌టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది.
క్యాట్‌లో విజయానికి ప్రాక్టీస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అభ్యర్థులు కేవలం ఒక అంశాన్ని చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఎబిలిటీలో మ్యాథమెటిక్స్ అంశాలే ఎక్కువ. వీటిని ప్రాక్టీస్ ఓరియెంటేషన్‌తో సాధన చేయడం వల్ల ఈ సెక్షన్‌లో కనీస కటాఫ్ మార్కులు పొందొచ్చు. కనీస కటాఫ్ మార్కులు తదుపరి దశ ఎంపిక ప్రక్రియకు ఒక ప్రామాణికం మాత్రమే. అయితే 95, ఆపైన పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ, జీడీ/పీఐ కాల్స్ వస్తాయి. ఆన్‌లైన్ టెస్ట్ కాబట్టి ముందు నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇది కూడా పరీక్ష సమయంలో ఎంతో కీలకం.
- రామ్‌నాథ్ ఎస్ కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్.
Published date : 16 Aug 2016 04:39PM

Photo Stories