ఎంబీఏకు మరోదారి మ్యాట్.. వివరాలు తెలుసుకోండిలా..
మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్టు(మ్యాట్).. దేశంలోని బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ప్రామాణిక పరీక్ష. మ్యాట్ స్కోరుతో దేశంలోని 600కుపైగా బీస్కూల్స్ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం మ్యాట్–2021 మే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా మ్యాట్ గురించి సమగ్ర సమాచారం..
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేన్(ఏఐఎంఏ).. మ్యాట్ పరీక్షను ఏటా నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో నిర్వహిస్తుంది. ఈ స్కోర్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. తాజాగా మ్యాట్ 2021 మేకు నోటిఫికేషన్ విడుదలైంది.
మూడు విధానాలు..
మ్యాట్‌ను ఇంటర్నెట్, కంప్యూటర్, పేపర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్ బేస్డ్ టెస్టులో అభ్యర్థి ఎక్కడి నుంచైనా పరీక్షకు హాజరవ్వొచ్చు. ఇంటర్నెట్ తప్పనిసరి. ఈ విధానంలో అభ్యర్థిని వీడియో, ఆడియోల ద్వారా ఇన్విజిలేట్ చేస్తారు. పేపర్ బేస్డ్ టెస్టులో అభ్యర్థి సమాధానాలను ఓఎంఆర్ షీట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టులో స్క్రీన్‌పై ప్రశ్నలు కనిపిస్తాయి. కీబోర్డ్ లేదా మౌస్ ద్వారా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
అర్హత..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.ఫైనలియర్ విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయో పరిమితి నిబంధనలేదు.
పరీక్ష విధానం..
మ్యాట్ ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్‌పై 40 ప్రశ్నలు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్‌పై 40 ప్రశ్నలు,మ్యాథమెటికల్ స్కిల్స్‌పై 40 ప్రశ్నలు, డేటాఅనాలసిస్ అండ్ సఫిషియెన్సీపై 40 ప్రశ్నలు, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌పై 40 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
విభాగాలు– సిలబస్ ముఖ్యాంశాలు..
ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో.. మంచి మార్కులు పొందాలంటే.. సమకాలీన అంశాలపై అవగాహన తప్పనిసరి. ఇందులో బిజినెస్ అండ్ బ్యాంకింగ్, కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్, రాజకీయ సమాచారం, క్రీడలు తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, జీకేపై దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి.
* మ్యాథమెటికల్ స్కిల్స్ విభాగంలో.. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్చర్స్,నంబర్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, యావరేజెస్, రేషియోస్, ఇంటరెస్ట్,ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, రిలేషన్‌షిప్స్, ఐడెంటిఫయింగ్ ప్యాట్రన్స్ ఇన్ నంబర్ సెట్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్ సెన్స్, వెర్బల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
* లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగంలో..వొకాబ్యులరీ, వర్డ్ అనాలజీస్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, సెంటెన్స్ కంప్లీషన్, రీ అరేంజింగ్ సెంటెన్సెస్ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
మ్యాట్ 2021–ముఖ్యసమాచారం..
పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ ) షెడ్యూల్..
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 24,2021
* హాల్ టిక్కెట్ల జారీ ప్రారంభం: మే 26,2021
* పరీక్ష తేదీ: మే 30,2021
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) షెడ్యూల్..
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 7,2021
* అడ్మిట్ కార్డుల జారీ ప్రారంభం:జూన్ 10,2021
* పరీక్ష తేదీ: జూన్ 13,2021
* వెబ్‌సైట్: https://mat.aima.in/may21/about-us