Skip to main content

భావి కెరీర్‌కు బెస్ట్ ఆప్షన్.. రిటైల్ మేనేజ్‌మెంట్

నేడు రిటైల్ రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. ఓ మాదిరి పట్టణాల్లో సైతం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి. వీటిల్లో విధులు నిర్వహించడానికి నిష్ణాతులైన నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు రిటైల్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రిటైల్ కోర్సులు.. అర్హతలు, ప్రవేశప్రక్రియ, కెరీర్‌పై ఫోకస్..

కావల్సిన స్కిల్స్
  • ఎప్పటికప్పుడు రిటైల్ మార్కెట్ తీరుతెన్నులను తెలుసుకుంటుండాలి.
  • నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి.
  • భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు తప్పనిసరి.
  • దీనిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలగాలి.
  • ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం.
  • విశ్లేషణాత్మక నైపుణ్యాలు.
వీటితోపాటు రిటైల్ రంగం అంటే విభిన్న సంస్కృతులకు చెందిన భిన్న రకాల వ్యక్తులతో సంప్రదింపులు చేయాల్సిన విభాగం. ఈ నేపథ్యంలో సహనం, ఎదుటి వారిని మెప్పించేతత్వం అలవర్చుకోవాలి. అప్పుడే ఈ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంటుంది.

సానుకూలతలు/ప్రతికూలతలు
    Bavitha
  • దేశీయ సంస్థలతోపాటు బహుళ జాతి సంస్థలు అడుగుపెట్టడంతో అపార ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్నాయి.
  • ఉద్యోగ నిర్వహణలో భాగంగా వివిధ రంగాల/భిన్న రకాల వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా కెరీర్ ఉన్నతికి బాటలు వేసుకోవచ్చు.
  • మిగతా ఉద్యోగాల మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే జాబ్ కాదు.
  • సమయ పరిమితి అనేది లేదు. ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది.
  • పండుగ రోజుల్లో, వారాంతాల్లోనూ కూడా పనిచేయాలి.
భారతీయ రిటైల్ పరిశ్రమ దాదాపు 450 బిలియన్ అమెరికన్ డాలర్లతో ప్రపంచంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. రానున్న రెండు దశాబ్దాల్లో ఈ రంగం మరింత వేగంతో పురోగమించనుంది. ఎఫ్‌డీఐలకు కేంద్రం అనుమతించడంతో విదేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఈ రంగంలో ప్రవేశించనున్నాయి. దీంతో రిటైల్ రంగం విస్తృత ఉద్యోగావకాశాలకు వేదిక కానుంది.

రిటైల్ మేనేజ్‌మెంట్ అంటే:
విశ్లేషణాత్మక దృక్పథంతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లను సమర్థంగా నిర్వహించడం; పోటీదారులకంటే ముందుండేలా సంస్థను నిలపడమే రిటైల్ మేనేజ్‌మెంట్.

ఏయే విభాగాలు..
  • సేల్స్
  • స్టోర్ మేనేజర్
  • రిటైల్ మేనేజర్
  • రిటైల్ బయ్యర్స్ అండ్ మర్చండైజర్స్
  • విజువల్ మర్చండైజర్స్
  • సప్లై చైన్ డిస్ట్రిబ్యూటర్స్
  • లాజిస్టిక్స్ అండ్ వేర్‌హౌస్ మేనేజర్స్
  • మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్
ఏయే కోర్సులు:
విస్తరిస్తున్న రిటైల్ రంగం.. అందుకు అవసరమైన మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి పీజీ స్థాయిలో ఉన్నాయి. ఎంబీఏలో రిటైల్ మేనేజ్‌మెంట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్‌మెంట్- రిటైల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఆర్‌ఎం) పేరుతో ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండటంతోపాటు క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి పరీక్షల్లో స్కోర్ సాధించి ఉండాలి. కొన్ని విద్యా సంస్థలు రిటైల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.

కోర్సులో బోధించే అంశాలు:
  • రిటైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాథమిక వ్యాపార వ్యవహారాలు
  • వ్యాపార అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలు
  • వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు
  • రిటైల్ పరిశ్రమకు సంబంధించిన సమగ్ర విధానాలు
  • మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
  • స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్
  • రిటైల్ సెల్లింగ్
  • రిటైల్ లా
  • లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్
  • కేటగిరీ మేనేజ్‌మెంట్
  • రిటైల్ రంగ పరిశ్రమల్లో ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్స్
కోర్సు పూర్తి చేశాక:
కోర్సు పూర్తి చేసినవారికి అవకాశాలకు కొదవే లేదు. కస్టమర్ సేల్స్ అసోసియేట్, డిపార్‌‌టమెంట్ మేనేజర్/ఫ్లోర్ మేనేజర్/ కేటగిరీ మేనేజర్, స్టోర్ మేనేజర్, రిటైల్ ఆపరేషన్‌‌స మేనేజర్, రిటైల్ బయ్యర్‌‌స అండ్ మర్చండైజర్‌‌స, విజువల్ మర్కండైజర్‌‌స, మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ జాబ్స్ లభిస్తాయి.

ఇతర రంగాల్లో కూడా:
రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సుతో సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లలోనే ఉద్యోగాలు లభిస్తాయనుకోవడం పొరపాటు. ఇతర పరిశ్రమల్లోనూ రిటైల్ మేనేజ్‌మెంట్ అర్హులకు అవకాశాలుంటున్నాయి. ముఖ్యంగా టెలికం, బ్యాంకింగ్, బెవరేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి.

కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ (కార్ట్)
రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ).. దేశంలోని రిటైల్ రంగ ప్రముఖులతో ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ రిటైల్ రంగ వ్యాపార విస్తరణ అంశాలతోపాటు, సుశిక్షితులైన మానవ వనరులను కూడా అందిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా కామన్ అడ్మిషన్ రిటైల్ టెస్ట్ పేరుతో జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా దేశంలోని 17 బి-స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అయితే ఈ స్కూల్స్ అన్నీ కూడా అంతగా పేరులేనివే. దేశంలో ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా క్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్/ఏటీఎంఏ వంటి పరీక్షల ద్వారానే ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

కెరీర్
Bavitha
దేశవ్యాప్తంగా 4.3 మిలియన్ చిల్లర దుకాణాలు ఉన్నాయి. ఓ మాదిరి పట్టణాల్లో సైతం సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు వెలుస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, జ్యూయెలరీ, పుస్తకాలు, ఆటబొమ్మలు, దుస్తులు, సెల్‌ఫోన్స్ ఇలా దేనికదే ప్రత్యేకంగా అవుట్‌లెట్స్ ఏర్పాటవుతున్నాయి. దేశీయ సంస్థలకు తోడు బహుళ జాతి సంస్థల రాకతో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

వీటిల్లో ఉద్యోగాలు: ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్,స్పెషాలిటీ స్టోర్స్, లైఫ్ స్టైల్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్, ఫర్నీచర్ షాపుల్లో, గృహోపకరణాల తయారీ పరిశ్రమల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

టాప్ రిక్రూటర్స్
Bavitha
షాపర్స్‌స్టాప్, వెస్ట్‌సైడ్, పాంటాలూన్స్, లైఫ్‌స్టైల్, ఆర్‌పీ రిటైల్, క్రాస్‌వర్డ్, విల్స్ లైఫ్‌స్టైల్, వాల్‌మార్ట్, బిగ్‌బిజార్, ఫ్యూచర్.

వేతనాలు:
ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి వేతనాలు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవం ఆధారంగా నెలకు రూ.25,000కు పైగా సంపాదించొచ్చు. పేరున్న సంస్థల్లో ఎక్కువ స్థాయిలో వేతనాలు అందుకోవచ్చు.

రిటైల్ కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు..
Bavitha
మన రాష్ట్రంలో..
ఆంధ్రా యూనివర్సిటీ
(www. andhrauniversity.edu.in) ఎంబీఏలో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా ఉంటుంది.
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ - హైదరాబాద్
    కోర్సు:
    పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, వ్యవధి: రెండేళ్లు
    అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    ఎంపిక విధానం: క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్‌లో వచ్చిన స్కోర్, బృంద చర్చలు, మౌఖిక పరీక్ష ఆధారంగా.
    వెబ్‌సైట్: www.ipeindia.org
జాతీయ స్థాయిలో..
  • దూరవిద్య విధానంలో పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీ ఎంబీఏలో రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
    వ్యవధి: రెండేళ్లు
    అర్హత: 10+2+3 విధానంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.pondiuni.edu.in
  • ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా) - అహ్మదాబాద్
    పోస్ట్‌గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది.
    వ్యవధి: ఏడాది
      అర్హులు:
    • 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
    • రిటైల్ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉండటంతోపాటు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేస్తున్నవారు.
      వెబ్‌సైట్: www.mica.ac.in/mode/home
  • ఎల్‌ఎన్ వెలింగకర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై
    కోర్సు:
    పీజీడీఎం రిటైల్ మేనేజ్‌మెంట్, వ్యవధి: రెండేళ్లు
    అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.welingkar.org
  • ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) - నోయిడా
    కోర్సు:
    ఎంబీఏ ఫ్యాషన్ మర్చండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్
    అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
    కోర్సు: ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ బీబీఏ+ ఎంబీఏ
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత, వ్యవధి: ఐదేళ్లు
    వెబ్‌సైట్: www.fddiindia.com
  • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ - గ్రేటర్ నోయిడా
    కోర్సు:
    పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (రిటైల్)
    వెబ్‌సైట్: www.bimtech.ac.in
  • ఇండియన్ రిటైల్ స్కూల్ -ఢిల్లీ
    కోర్సులు:
    పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్: www.indianretailschool.com
  • సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్‌‌స లెర్నింగ్ -పుణే
    కోర్సు:
    పీజీడీఆర్‌ఎం
    వెబ్‌సైట్: www.scdl.net
  • ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - న్యూఢిల్లీ
    కోర్సు:
    బీబీఏ ఇన్ రిటైలింగ్, వ్యవధి: మూడేళ్లు, అర్హత: 10+2 ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.ignou.ac.in
ఫ్యూచర్‌కు బెస్ట్ కెరీర్
Bavitha
దేశంలో రిటైల్ రంగానికి రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ రంగం వైపు ఆసక్తి ఉండి రిటైల్ కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి కార్పొరేట్ కంపెనీలు రావడం పెరిగింది. విదేశీ కంపెనీలు చిల్లర వర్తకంలోకి రావడం వల్ల రిటైల్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. రెండేళ్ల కాలవ్యవధి ఉన్న రిటైల్ మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ముందుగా రిటైల్ రంగంపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే కోర్సును ఎంచుకోవాలనేది నా సూచన. మార్కెట్‌లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కెరీర్‌ను మలచుకునే ఓర్పు, నేర్పు ముఖ్యం. అవకాశాల విషయానికొస్తే రెగ్యులర్‌గా ఉండే ఉద్యోగ అవకాశాలతోపాటు ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్, యాడ్ ఏజెన్సీల నిర్వహణలోనూ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆర్థిక స్థోమత, ఆత్మవిశ్వాసం ఉంటే వ్యాపార రంగంలో స్వయం ఉపాధినీ పొందొచ్చు. రిటైల్ మార్కెటింగ్‌లో కార్పొరేట్ సంస్థలు మోర్, రిలయన్స్, స్పెన్సర్, వాల్‌మార్ట్ వంటివి ప్రవేశిస్తుండటం వల్ల అవకాశాలకు ఢోకా లేనట్లే. ప్లేస్‌మెంట్స్ ద్వారా వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ పొందే వీలుంది.
Published date : 12 Dec 2013 03:12PM

Photo Stories