Skip to main content

బిజినెస్ అనలిటిక్స్ విశ్లేషించి.. వ్యాపారాన్ని ఉరకలెత్తించి..

వైఫల్యాల నుంచి నేర్చుకోవడం (Learning from Failure)..
పక్కా ప్రణాళిక (Proper Planning)..
కష్టపడి పనిచేయడం (Hard Work)..
ఓ వ్యాపారం విజయవంతం కావడానికి అనుసరించాల్సిన మార్గాలివి. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా ‘సక్సెస్’ లక్ష్యాన్ని చేరుకోలేం. ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని అమలు చేసినప్పుడే వ్యాపారం లాభాల బాట పడుతుంది. ఇలాంటి ప్రణాళికల వ్యూహరచనకు ఉపయోగపడేదే ‘బిజినెస్ అనలిటిక్స్’. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో వ్యాపార సంస్థల మధ్య పోటీ తీవ్రం కావడంతో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘బిజినెస్ అనలిటిక్స్’ లో కెరీర్‌పై స్పెషల్ ఫోకస్..

వివిధ వనరుల ద్వారా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని (Raw Data)రకరకాల పద్ధతుల ద్వారా విశ్లేషించి ఓ కంపెనీ పనితీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. కంపెనీ కొత్త ప్రణాళికలను రూపొందించేందుకు ‘బిజినెస్ అనలిటిక్స్’ ఉపయోగపడుతుంది. బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు సాంఖ్యక(స్టాటిస్టికల్), పరిమాణాత్మక (క్వాంటిటేటివ్), సాంకేతిక(టెక్నికల్) పద్ధతులను ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు ఓ సంస్థ వివిధ నగరాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసిందనుకుంటే ఓ నగరంలో కొన్ని వస్తువుల అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి కారణమేంటన్న దాన్ని బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు సంబంధిత సంస్థకు అందించగలుగుతారు.

ఓ రిటైల్ సంస్థ వివిధ ప్రాంతాల్లో కొత్తగా స్టోర్‌లను ప్రారంభించాలనుకునే సందర్భంలో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు ఆయా ప్రాంతాల జనాభా, వారి అభిరుచులు, ఆర్థిక పరిస్థితులు, పోటీదారుల వ్యాపారం తదితరాలకు సంబంధించిన విస్తృత డేటాను విశ్లేషించి వ్యూహాన్ని రూపొందిస్తారు. దీని ఆధారంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా కంపెనీకి సంబంధించిన చాలా విషయాల్లో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు.

నిపుణులకు పెరుగుతున్న డిమాండ్:
పస్తుతం వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొని ఉంది. కస్టమర్ కింగ్‌ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించుకొని, కొత్త ప్రణాళికలను అమలు చేయడంపైనే ఓ సంస్థ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ‘మెక్‌కిన్సే’ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా ప్రకారం 2018 నాటికి ఒక్క అమెరికాలోనే అనలిటికల్ స్కిల్స్ ఉన్నవారి కొరత 1.40 లక్షల నుంచి 1.90 లక్షల వరకు ఉండనుంది. విస్తృత డేటాకు సంబంధించిన విశ్లేషణను సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసే మేనేజర్లు, అనలిస్టుల కొరత 1.50 లక్షల వరకు ఉండనుంది. భారత్ మార్కెట్లోనూ నిపుణులైన అనలిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బిజినెస్ అనలిటిక్స్ కోర్సులు చేసిన ప్రతిభావంతులకు ఉన్నత కెరీర్ అవకాశాలకు ఢోకా లేదని చెప్పొచ్చు.

ఉన్నత విద్యా సంస్థల్లో:
పస్తుతం దేశ జాబ్ మార్కెట్లో బిజినెస్ అనలిటిక్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చాలా ఉన్నత విద్యా సంస్థలు వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఔత్సాహిక విద్యార్థులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నికల్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మేళవింపుతో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కలకత్తా; ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ-హైదరాబాద్); ఐఐఎం-లక్నో; ఐఐఎం-బెంగళూరు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. సంస్థలు ఆన్ క్యాంపస్, ఆన్‌లైన్ బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాయి. కొన్ని సంస్థలు విదేశీ బీ-స్కూల్స్ సహకారం తీసుకొని నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

ఎవరు అర్హులు:
  • కొన్ని సంస్థలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, సైన్స్, కామర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్ డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్దేశిస్తున్నాయి.
  • పని అనుభవాన్ని (వర్క్ ఎక్స్‌పీరియన్స్) అర్హతగా పేర్కొంటున్నాయి. అయితే విశ్లేషణా సామర్థ్యం, అకడమిక్స్‌లో మంచి ప్రతిభ ఉంటే ఫ్రెషర్స్‌కు కూడా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
కోర్సులో ఏం చెబుతారు?:
  • బిజినెస్ డేటా మైనింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా కలెక్షన్, డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ అనలిటిక్స్, ఫోర్‌కాస్టింగ్ అనలిటిక్స్, మార్కెటింగ్ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్, స్ప్రెడ్ షీట్ మోడలింగ్ తదితర అంశాలను కరిక్యులంలో భాగంగా బోధిస్తారు.
  • స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్లు అయిన ఆర్/ఎస్‌ఏఎస్/ఎస్‌పీఎస్‌ఎస్ వంటి వాటిలో శిక్షణ ఇస్తాయి.
  • నిపుణులతో సెమినార్లు, ఇండస్ట్రీ విజిట్ వంటివి కరిక్యులంలో భాగంగా ఉంటాయి.
  • కొన్ని బిజినెస్ స్కూల్స్ ఎంబీఏ కరిక్యులంలో భాగంగా బిజినెస్ అనలిటిక్స్‌ను బోధిస్తున్నాయి.
కెరీర్ ఎట్ కార్పొరేట్:
చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని కంపెనీల్లోనూ ఏదో ఒక రూపంలో బిజినెస్ అనలిటిక్స్ సంబంధిత కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఐటీ సర్వీసెస్; ఎడ్యుకేషన్; మ్యాన్యుఫ్యాక్చరింగ్; మార్కెటింగ్; హెచ్‌ఆర్; ట్రావెల్ అండ్ టూరిజం; హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్.. ఇలా అదీ ఇదీ అని కాదు.. అన్ని రంగాల్లోనూ బిజినెస్ అనలిటిక్స్ నిపుణుల అవసరం ఉంటుంది. ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సమాచార సేకరణ తేలికైంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఎప్పటికప్పుడు కంపెనీ క్షేత్రస్థాయి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే నిపుణుల అవసరం ఏర్పడింది. ఉదాహరణకు మార్కెటింగ్ రంగాన్ని తీసుకుంటే సేకరణ (ప్రొక్యూర్‌మెంట్), బ్రాండింగ్, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ తదితర అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు అనలిటిక్స్ నిపుణుల సేవలు అవసరమవుతాయి.
  • ఈ రోజుల్లో ప్రతి సంస్థకు సొంత వెబ్‌సైట్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు తమ ఆన్‌లైన్ కార్యకలాపాల ప్రగతి, ఆర్‌వోఐ (రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్)లను తెలుసుకునేందుకు వెబ్ అనలిటిక్స్ అవసరం.
  • కొన్ని కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్‌హౌజ్ అనలిటిక్స్ బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని థర్డ్‌పార్టీ ఐటీ/ఐటీఈఎస్ సర్వీస్ ప్రొవైడర్ల అనలిటిక్స్ సేవలను పొందుతున్నాయి.
  • ఢిల్లీ/గుర్గావ్; ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాలు అనలిటిక్స్ ప్రాక్టీస్‌కు అనువుగా ఉన్నాయి.
  • కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తమ కు కావాల్సిన నిపుణులను నియమించుకుంటున్నాయి.
ఏ స్కిల్స్ అవసరం?
  • అనలిటికల్ స్కిల్స్: అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, దాన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా క్లుప్తీకరించడానికి అనలిటికల్ టూల్స్ అవసరం. వీటికి సంబంధించిన స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. అంక గణిత సగటు(ఏఎం), మధ్యగతం (మీడియన్), బాహుళకం (మోడ్), విస్తరణ కొలతలు (మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్) వంటి వాటిపై పరిజ్ఞానం ఉండాలి.
  • బిజినెస్ స్కిల్స్: ఓ కంపెనీ కార్యకలాపాలు, లక్ష్యాలు, సమస్యలను అర్థం చేసుకునే నైపుణ్యం అవసరం. అప్పుడే సంబంధిత బిజినెస్ డెరైక్టర్లకు అవసరమైన సమాచారాన్ని (ఈ్ఛఛిజీటజీౌ ట్ఛ్చఛీడ జీజౌటఝ్చ్టజీౌ) అందుబాటులో ఉంచగలరు.
  • క్రియేటివ్ స్కిల్స్: సృజనాత్మకంగా ఆలోచించడం ప్రధానం. డేటాను సమర్థవంతంగా విశ్లేషించడానికి ఉపయోగపడే మోడల్స్ రూపొందించడంలో సృజనాత్మక ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయి.
  • విశ్లేషణ నివేదికలను బార్/లైన్ గ్రాఫ్స్; సర్క్యులర్ గ్రాఫ్స్ తదితర రూపాల్లో అందించాల్సి ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గ్రాఫికల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
ఏయే ఉద్యోగాలుంటాయి?
ఔత్సాహికులు ఫ్రెషర్స్‌గా లేదా రెండు-మూడేళ్ల పని అనుభవంతో బిజినెస్ అనలిటిక్స్‌లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అనలిటిక్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలు.. జూనియర్ బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; సీనియర్ బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; అసిస్టెంట్ మేనేజర్ (బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమర్ అనలిటిక్స్); డేటా మోడలర్(బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (ఫైనాన్సియల్ అనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (బీపీవో/కేపీవో/ఐటీఈఎస్); ప్రాజెక్టు మేనేజర్ (అనలిటిక్స్); టీమ్ లీడర్.

కెరీర్ గ్రాఫ్:
జూనియర్ బిజినెస్ అనలిస్టులుగా కెరీర్‌ను ప్రారంభించిన వారు ప్రతిభ, శ్రమించే తత్వం ఉంటే రెండుమూడేళ్లలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. సీనియర్, టీమ్ లీడర్ హోదాలు పొందొచ్చు. బిజినెస్ అనలిటిక్స్‌కు సంబంధించి ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు సొంతంగా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.

వేతనాలు:
మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్‌ప్యాక్ట్, టీసీఎస్, ఐబీఎం, విప్రో, డెల్ వంటి సంస్థలు ప్రతిభ కలిగిన అనలిటిక్స్ నిపుణులకు అత్యుత్తమ ప్యాకేజీలు అందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నాయి.
---------------------------------------------------

ఏటా 25 శాతం పెరుగుదల
అనలిటిక్స్ నిపుణులకు భారత్‌తో పాటు విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. ఏటా అనలిటిక్స్ నిపుణులకు దాదాపు 25 శాతం మేర డిమాండ్ పెరుగుతోంది. అనలిటిక్స్‌లో రాణించాలంటే స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్, డేటా వేర్‌హౌజ్ స్కిల్స్ తప్పనిసరి. ప్రతిభావంతులైన మానవ వనరులకు దేశ, విదేశాల్లోని ఎంఎన్‌సీలు స్వాగతం పలుకుతున్నాయి.
- భాస్కర్ గుప్త,
అనలిటిక్స్ ఇండియా మేగజైన్ వ్యవస్థాపకులు.
---------------------------------------------------

బిజినెస్ అనలిటిక్స్ కోర్సులు ఆఫర్ చేస్తున్న ఉన్నత సంస్థలు
ఐఎస్‌బీ- హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు.
  • క్లాస్‌రూం, టెక్నాలజీ ఆధారిత విధానాల ద్వారా బోధన ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అనువుగా ఉండేలా తరగతుల షెడ్యూల్‌ను రూపొందించారు.
  • కోర్సులో భాగంగా గెస్ట్ లెక్చర్స్, ప్రాజెక్టులు, గ్రూప్ వర్క్ వంటివి ఉంటాయి. ఔత్సాహికులకు వివిధ అంశాల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా కరిక్యులంను రూపొందించారు.
  • కోర్సులో డేటా మేనేజ్‌మెంట్, డేటా మైనింగ్, స్టాటిస్టికల్ అనాలసిస్, ఫోర్‌కాస్టింగ్ అనలిటిక్స్, కాంటెంపరరీ అనలిటిక్స్, డేటా కలెక్షన్, డేటా విజువలైజేషన్, బిజినెస్ ఫండమెంటల్స్, ప్రాజెక్టులు ఉంటాయి.
  • ప్రోగ్రామ్‌లో MEXL, ARENA/SIMIO, XLMINER, MATLAB, STATA సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉంటాయి.
  • వెబ్‌సైట్: www.isb.edu/cee
ఐఐఎం-కలకత్తా
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (ఉ్కఆఅ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు.
  • ఆన్ క్యాంపస్ శిక్షణ అందుబాటులో లేదు. అయితే అయిదు రోజుల చొప్పున రెండుసార్లు క్యాంపస్ విజిట్స్ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా హాజరు కావాలి.
  • మొత్తం కోర్సును దాదాపు 10 మాడ్యూల్స్‌లో అందిస్తారు. కోర్సులో బిజినెస్ డేటా మైనింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ అనలిటిక్స్, ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ అనలిటిక్స్, మ్యాథమెటిక్స్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్, స్ప్రెడ్‌షీట్ మోడలింగ్, టైమ్ సిరీస్ మోడల్స్ ఇన్ బిజినెస్ ఉంటాయి.
  • వెబ్‌సైట్: www.iimcal.ac.in
ఐఐఎం-బెంగళూరు
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు (ఐఐఎంబీ).. బిజినెస్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ (బీఏఐ) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు.
  • కోర్సును ఆరు మాడ్యూల్స్‌లో అందిస్తుంది. కోర్సులో బిజినెస్ స్టాటిస్టిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, ఆప్టిమైజేషన్ అనలిటిక్స్, స్టాకాస్టిక్ మోడల్స్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ తదితర అంశాలుంటాయి.
  • కోర్సు కరిక్యులంలో ఒక ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆన్ క్యాంపస్ విధానంలో తరగతులు ఉంటాయి. వెబ్‌సైట్: www.bai&iimb.org
ఐఐఎం-లక్నో
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- లక్నో (ఐఐఎంఎల్); కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ, యూఎస్‌ఏ సంయుక్తంగా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (CPBAE)ను ఆఫర్ చేస్తోంది.
  • ఇది ఏడాది కాల వ్యవధి గల పార్ట్‌టైం సర్టిఫికెట్ ప్రో గ్రాం. క్లాస్‌రూం, ఆన్‌లైన్ విధానాల్లో బోధన ఉంటుంది.
  • కోర్సును నాలుగు మాడ్యూల్స్‌గా అందిస్తుంది. కోర్సులో ఇంట్రడక్షన్ టు బిజినెస్ అనలిటిక్స్; డేటా మైనింగ్ అండ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్; సిమ్యులైజేషన్ అండ్, ఆప్టిమైజేషన్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్, అనలిటిక్స్ అప్లికేషన్స్ తదితర అంశాలు ఉంటాయి.
  • వెబ్‌సైట్: www.iiml.ac.in
Published date : 09 Aug 2013 05:10PM

Photo Stories