Skip to main content

క్లాట్‌కు సిద్ధమవ్వండి ‘లా’...

భవిష్యత్‌ న్యాయ నిపుణులకు సమాజ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అందించడంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలకు మంచి పేరుంది.

వీటిలోని ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లోనిర్వహించే పరీక్షే క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌). లా కోర్సులకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా క్లాట్‌ రాసేవారిసంఖ్యా ఎక్కువే ఉంటోంది. కార్పొరేట్‌ రూపు సంతరించుకుంటున్న లా కెరీర్‌లో ప్రవేశానికి మార్గం వేసేక్లాట్‌–2018 ప్రకటన డిసెంబర్‌ మూడో వారంలో రానుంది. ఈ నేపథ్యంలో పరీక్ష పూర్తి వివరాలు..

క్లాట్‌(యూజీ) :
ఈ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఐదు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్, జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్, మ్యాథమెటిక్స్, లీగల్‌ ఆప్టిట్యూడ్, లాజికల్‌ రీజనింగ్‌ సబ్జెక్టుల్లో అభ్యర్థి ప్రాథమిక అవగాహనను పరీక్షించేలా ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ ఐదు విభాగాల్లో మంచి స్కోర్‌ చేయాలంటే పైన పేర్కొన్న సబ్జెక్టుల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ఈ మేరకు పదో తరగతి ఇంగ్లిష్, మ్యాథ్స్‌కు సంబంధించిన అంశాలను ఔపోసన పట్టాలి. జీకే, కరెంట్‌ అఫైర్స్‌ లోనూ సమగ్ర ప్రిపరేషన్‌ ద్వారా 50 ప్రశ్నల్లో కనీసం 35–40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

విభాగం

ప్రశ్నలు

మార్కులు

ఇంగ్లిష్‌ 40 40
జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 50 50
మ్యాథమెటిక్స్‌ 20 20
లీగల్‌ ఆప్టిట్యూడ్‌ 50 50
లాజికల్‌ రీజనింగ్‌ 40 40
మొత్తం 200 200
పరీక్ష వ్యవధి: 2 గంటలు

ఇంగ్లిష్‌ :
గ్రామర్‌పై అవగాహన, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో బేసిక్‌ నాలెడ్జ్‌తో ఈ విభాగంలో మంచి మార్కులు పొందొచ్చు. వొకాబులరీపై పట్టు సాధించడం ద్వారా కాంప్రహెన్షన్‌ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రశ్నలకు సులువుగా జవాబులను గుర్తించే సామర్థ్యం లభిస్తుంది. ఇంగ్లిష్‌లో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. టెన్సెస్, సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కరెక్షన్, యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌.

జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ :
ఇది అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన విభాగం. ఇందులో భారతదేశ చరిత్ర, రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలూ ఎదురవుతాయి. అందువల్ల జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టిపెట్టాలి. రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అవగాహన పెంచుకోవాలి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్య సంఘటనలు, సదస్సుల గురించి తెలుసుకోవాలి. ప్రామాణిక జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలతో పాటు దిన పత్రికలు రోజూ చదవడం అలవాటు చేసుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథ్స్‌ :
ఈ విభాగం నుంచి అడిగే 20 ప్రశ్నలు బేసిక్‌ మ్యాథమెటిక్‌ నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులకు పదో తరగతి గణితంపై పట్టు ఉంటే దాదాపు అన్ని ప్రశ్నలకూ సమాధానాలను గుర్తించవచ్చు. గత పరీక్షల్లో అర్థమెటిక్‌ ఆధారిత విభాగాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శాతాలు, నిష్పత్తులు, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్, లాభ–నష్టాలు, వర్గ మూలాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

లీగల్‌ ఆప్టిట్యూడ్‌ :
ఇందులో న్యాయశాస్త్ర సంబంధ ప్రశ్నలు ఇస్తారనుకుంటే పొరపాటు. అభ్యర్థుల్లో న్యాయపరమైన దృక్పథాన్ని; ఒక అంశం, వివాదం పట్ల సహేతుక ఆలోచన, నిర్ణయం వెలిబుచ్చే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఒక వివాదాన్ని పరిష్కరించే క్రమంలో అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. చట్టాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇటీవలి పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

లాజికల్‌ రీజనింగ్‌ :
ఇది అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం. ఇందులో ప్యాసేజ్‌ ఆధారితంగా, అసెర్షన్‌ అండ్‌ రీజనింగ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఈ మేరకు సిలాజిజమ్, కోడింగ్, డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల కోసం కంపేరిటివ్‌ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి.

రిఫరెన్స్‌ బుక్స్‌
వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ–నార్మన్‌ లూయిస్‌; ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌–ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌; లూసెంట్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌; క్లాట్‌ ఎసెన్షియల్స్‌–అభినవ్‌ శ్రీవాత్సవ్‌; అనలిటికల్‌ రీజనింగ్‌– ఎం.కె. పాండే; లీగల్‌ ఆప్టిట్యూడ్‌–ఎ.పి.భరద్వాజ్‌.


క్లాట్‌–2018 సమాచారం...
విద్యార్హత: 45 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. రిజర్వేషన్‌ అభ్యర్థులకు ఐదు శాతం సడలింపు ఉంటుంది.
వయో పరిమితి: 20 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు 22 ఏళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్‌ విడుదల: 2017 డిసెంబర్‌ 20.
దరఖాస్తు తేదీలు: 2018 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు.
అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: ఏప్రిల్‌ 20 నుంచి మే 13 వరకు.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: మే 13, 2018
ఫలితాల వెల్లడి: మే 31, 2018

క్లాట్‌తో ప్రవేశాలు కల్పించే నేషనల్‌ లా యూనివర్సిటీలు...
1. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ–బెంగళూరు
2. నల్సార్‌–హైదరాబాద్‌
3. నేషనల్‌ లా యూనివర్సిటీ–భోపాల్‌
4. వెస్ట్‌ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యురిడికల్‌ సైన్సెస్, కోల్‌కతా
5. నేషనల్‌ లా యూనివర్సిటీ–జోధ్‌పూర్‌
6. హిదయతుల్లా నేషనల్‌ లా యూనివర్సిటీ –రాయ్‌పూర్‌
7. గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ –గాంధీనగర్‌
8. డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా నేషనల్‌ లా యూనివర్సిటీ–లక్నో
9. రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా–పాటియాలా
10. చాణక్య నేషనల్‌ లా యూనివర్సిటీ– పాట్నా
11. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్‌–కొచ్చి
12. నేషనల్‌ లా యూనివర్సిటీ–ఒడిశా
13. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా–రాంచి
14. నేషనల్‌ లా యూనివర్సిటీ అండ్‌ జ్యుడిషియల్‌ అకాడమీ–గువహతి
15. దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ–విశాఖపట్నం
16. తమిళనాడు నేషనల్‌ లా స్కూల్‌–త్రిచీ
17. మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ –ముంబై
18. మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ –నాగ్‌పూర్‌
19. ఎంఎన్‌ఎల్‌యూ–ఔరంగాబాద్‌ (ఈ ఏడాదినుంచి అందుబాటులోకి రానుంది)

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో గతేడాది మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ ర్యాంకులు...

ఇన్‌స్టిట్యూట్‌

కటాఫ్‌ ర్యాంకు

ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు–బెంగళూరు 55
నల్సార్‌–హైదరాబాద్‌ 125
డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌–కోల్‌కతా 260
ఎన్‌ఎల్‌ఐయూ–భోపాల్‌ 345
ఎన్‌ఎల్‌యూ–జోథ్‌పూర్‌ 360
జీఎన్‌ఎల్‌యూ–గాంధీనగర్‌ 500
హెచ్‌ఎన్‌ఎల్‌యూ–రాయ్‌పూర్‌ 700
ఆర్‌ఎంఎన్‌ఎల్‌యూ–లక్నో 750
ఆర్‌హెచ్‌ఎన్‌ఎల్‌యూ–పాటియాల 925
ఎన్‌యూఏఎల్‌ఎస్‌–కొచ్చి 980
సీఎన్‌ఎల్‌యూ–పాట్నా 1100
ఎన్‌ఎల్‌యూ–ఒడిశా 1125
ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌–రాంచి 1150
ఎన్‌ఎల్‌యూజేఎ–గువహతి 1280
టీఎన్‌ఎన్‌ఎల్‌ఎస్‌–త్రిచి 1280
ఎంఎన్‌ఎల్‌యూ–ముంబై 470
డీఎస్‌ఎన్‌ఎల్‌యూ–వైజాగ్‌ 1132
ఆర్‌జీఎన్‌యూఎల్‌–పాటియాల 780
Published date : 25 Nov 2017 06:08PM

Photo Stories