ఉద్యోగాల వేటలో ముందుకు సాగేందుకు.. ఈ నైపుణ్యాల సర్టిఫికేషన్స్‌తో ఉపయోగం..!
ఐదంకెల జీతం అందుకోవాలి! కానీ.. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టాతోనే ఉద్యోగం దక్కే పరిస్థితి కనిపించడంలేదు! లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి! దాంతో విద్యార్థులు.. తమ బ్రాంచ్‌కు తగ్గ ఆధునిక నైపుణ్యాలు అందిపుచ్చకోవాల్సిన అవసరం ఏర్పడింది! ఈ నేపథ్యంలో.. బీటెక్ విద్యార్థులకు.. జాబ్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు అందించే సర్టిఫికేషన్స్‌పై ప్రత్యేక కథనం..
ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. ఆధునిక నైపుణ్యాలను సొంతం చేసుకుంటేనే ఉద్యోగం లభిస్తోంది. ప్రతి బీటెక్ విద్యార్థి కలల కొలువుగా భావించే సాఫ్ట్‌వేర్ మొదలు ఉత్పత్తి రంగం వరకూ.. ప్రస్తుతం అన్ని విభాగాల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగానే కార్యకలాపాలు సాగుతున్నాయి. దాంతో బీటెక్ విద్యార్థులు తమ బ్రాంచ్‌కు తగిన లేటెస్ట్ స్కిల్స్ అందించే స్వల్పకాలిక కోర్సులను అభ్యసించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
సీఎస్‌ఈ.. సరికొత్త నైపుణ్యాలెన్నో!
సీఎస్‌ఈ విద్యార్థులు.. ఇటీవల కాలంలో డిమాండింగ్ టెక్నాలజీగా మారిన బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవడం మేలు.
బిగ్ డేటా..
సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువుల సాధనలో ఉపయోగపడుతున్న నైపుణ్యం.. బిగ్‌డేటా. వినియోగదారుల సమాచారాన్ని, వారి కొనుగోళ్ల తీరును, ఆసక్తిని విశ్లేషించి.. నివేదిక ఇచ్చే బిగ్‌డేటా నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోంది. డేటా అనలిటిక్స్‌కు సంబంధించి 3 నుంచి 6 నెలల వ్యవధిలో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా డేటాసైంటిస్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, డేటా ఇంజనీర్, గ్రిడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ తదితర కొలువులు దక్కించుకోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ..
సీఎస్‌ఈ విద్యార్థులకు కొలువుల పరంగా కీలకంగా నిలుస్తున్న మరో నైపుణ్యం.. సైబర్ సెక్యూరిటీ. ఆన్‌లైన్ కార్యకలాపాల భద్రతను పర్యవేక్షించడాన్ని సైబర్ సెక్యూరిటీగా పేర్కొనొచ్చు. కంప్యూటర్లు, నెట్‌వర్క్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్, డేటా చోరీ(హ్యాకింగ్) జరగకుండా.. సైబర్ సెక్యూరిటీ రక్షణగా నిలుస్తుంది. ఆన్‌లైన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించే చిన్నపాటి సంస్థల నుంచి బహుళ జాతి కంపెనీల వరకూ.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం ఏర్పడింది. సైబర్ సెక్యురిటీకి సంబంధించి పలు సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. సిస్కో సీసీన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ; ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సులు, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ అందించే సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..
ఇప్పుడు ఏ రంగంలో చూసినా.. అత్యంత కీలకంగా మారుతున్న టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్). కృత్రిమ మేథ ఆధారంగా వేగవంతంగా, సమర్థంగా కార్యకలాపాలు నిర్వహించే ఏఐ, ఎంఎల్‌ను అధికశాతం సంస్థలు అనుసరిస్తున్నాయి. ఈ నైపుణ్యాలున్న వారికి సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ, ఎంఎల్‌కు సంబంధించి పలు షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తి చేసుకొని.. సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. జాబ్ మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తోంది. మన దేశంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సీఎస్‌ఈ విద్యార్థులు అవకాశాలు అందుకునేందుకు వీలుకల్పించే మరో నైపుణ్యం.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇంటర్నెట్ ఆధారంగా సేవలు అందించేందుకు వీలుకల్పిస్తున్న ఈ టెక్నాలజీ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో కీలకంగా మారింది. విద్యార్థులు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు పొం దేందుకు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, క్లౌడ్ విజువలైజేషన్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. వీటిని ఒరాకిల్, వీఎం వేర్, సీసీఎన్‌ఏ వంటి సంస్థలు అందిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, రెడ్‌హ్యాట్ సర్టిఫైడ్ ఇంజనీర్, వెబ్ డిజైనింగ్,బోర్లాండ్ డేటాబేస్ ఇంజన్ తదితర కోర్సులు కూడా సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్ విద్యార్థులకు ఉపయోగపడే సర్టిఫికేషన్స్‌గా చెప్పొచ్చు.