Skip to main content

పరిశ్రమలు- అకడమిక్ ...వీటి మధ్య అంతరాన్ని పూడ్చితేనే అవకాశాలు!

దేశంలో ఏటా 3,50,00కు పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడు తున్నారు. మరో 25 లక్షల మంది గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తిచేసి వివిధ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఏటా 30 లక్షలకు పైగా గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉద్యోగాల్లో చేరుతున్నారని నాస్కామ్ అంచనా. ఇదిలా ఉంటే ఏ సమయంలోనైనా మరో 50 లక్షల మంది నిరుద్యోగులుగానే మిగిలి ఉంటున్నారు. నైపుణ్యాల లేమితో సతమతమవుతున్నారు. మెక్‌కిన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో కేవలం 25శాతం మంది మాత్రమే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారని తేలింది!

ప్రతి కంపెనీ పూర్తి స్థాయి నైపుణ్యాలున్న అభ్యర్థులనే ఎంపిక చేసుకోవడానికి మొగ్గు చూపుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి నుంచి సంస్థలు ఉత్తమ పనితీరును ఆశిస్తాయి. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. నియామక ప్రక్రియలో కంపెనీలు కఠిన స్థాయిని తగ్గిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. అంతేకాకుండా ఎంపికైన ఉద్యోగులకు శిక్షణను కూడా అందించి తమకు కావాల్సిన రీతిలో మలచుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఈ విధానం సమర్థనీయంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావం కంపెనీల ఉత్పాదకతపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. అకడమిక్ స్థాయిలోనే పరిశ్రమల భాగస్వామ్యంతో విద్యార్థిలో పూర్తి స్థాయి నైపుణ్యాలు అలవడేలా బోధన సాగాలని వారు సూచిస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన కరిక్యులం ఏర్పాటుతోనే ఇది సాధ్యమని పేర్కొంటున్నారు. అప్పుడే ఉద్యోగ జీవితంలో మొదటిరోజు నుంచే మంచి పనితీరును కనబర్చేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

నైపుణ్యాల లేమి
యూనివర్సిటీల నుంచి కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారితోపాటు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారిలో చాలా మంది నైపుణ్యాల లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో పూర్తి స్థాయి శిక్షణ పొందిన, నైపుణ్యాలున్న, ప్రజ్ఞావంతులైన సిబ్బంది కొరత కంపెనీలను వెంటాడుతోంది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నాణ్యమైన అభ్యర్థుల సమస్య మాత్రం మిగిలే ఉంటోంది. దేశంలో వివిధ బహుళజాతి కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో సుమారు 53 శాతం మంది నైపుణ్యాల లేమిని ఎదుర్కొంటు న్నారని ఓ అంచనా. నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత భారత్‌ను తీవ్రంగా వేదిస్తోందని, ఇంజనీరింగ్, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇండస్ట్రీ-అకడమిక్ సంయుక్తంగా
‘ప్రపంచీకరణ నేపథ్యంలో పరిశ్రమలకు తగిన మానవ వనరులను సిద్ధం చేయాలంటే ఇండస్ట్రీ-అకడమిక్ అనుసంధానం తప్పనిసరి. నైపుణ్యాలు సమృద్ధిగా ఉన్న మానవ వనరుల కోసం పరిశ్రమలు- అకడమిక్ సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. తద్వారా అకడమిక్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెంచడానికి అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు వివిధ ఇన్‌స్టిట్యూ ట్స్‌తో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి’అని అంటున్నారు జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్ మెకానికల్ ఇంజనీరింగ్ హెచ్‌ఓడీ డా. బి. సుధీర్‌ప్రేమ్ కుమార్.

ఉద్యోగానికి సిద్ధంగా: యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకోగానే విద్యార్థి.. ఉద్యోగానికి సిద్ధంగా ఉంటే సమస్య పరిష్కారమైనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయో అంచనా వేయడం కూడా అంత సులువేమీ కాదు. దాంతో పరిశ్రమలకు తగిన ఉద్యోగులను సిద్ధం చేయడం అపరిష్కృత సమస్యగానే మిగిలిపోతోంది. కాబట్టి విద్యాసంస్థలతో కంపెనీలు సన్నిహితత్వాన్ని కొనసాగిస్తూ అవసరాల మేరకు మానవవనరులను తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తేనే ప్రయోజనం ఉంటుంది.

ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరగాలి
దేశంలో ఉన్నత విద్యావంతుల సంఖ్యలో తగ్గుదల కూడా నైపుణ్యాల లేమికి కారణమవుతోంది. ప్రత్యేక అంశంలో మాస్టర్‌గా తీర్చిదిద్దే ఉన్నత విద్యనభ్యసించని కారణంగా భారత యువత స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటోంది. 18 నుంచి 25 సంవత్సరాలున్న భారతీయ యువతలో కేవలం 7 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అంతకు ముందే చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి జీవనం సాగిస్తున్నారు. మంచి ఉద్యోగంలో చేరాలనుకునేవారి పైనే ఉన్నత విద్యనభ్యసించాల్సిన బాధ్యత ఉందని గుర్తించాలి. అప్పుడే పూర్తి స్థాయి విద్యావంతులుగా మారొచ్చని తెలుసుకోవాలి.

పరిశ్రమలకు తగిన కరిక్యులం
ఒక్కోసారి పరిశ్రమల అవసరాలు, విధానాలు వేగంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ఔట్‌డేటెడ్ కరిక్యులంలో విద్యాభ్యాసం కొనసాగించిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తమ కరిక్యులంలో మార్పులు చేయాలి. పని వాతావరణంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలే ప్రధానంగా అకడమిక్ కరిక్యులాన్ని రూపొందించాలి. ఇండస్ట్రీ-అకాడెమీ సంయుక్తంగా జాబ్‌మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. అందుకు కావాల్సిన నైపుణ్యాలే ప్రధానంగా కరిక్యులంలో ఉండాలి. తద్వారా పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలుండే విద్యార్థులు తయారవుతారు. వారిలో నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా కంపెనీలు-కాలేజీలు పరస్పర సహకారం అందించుకోవాలి. అలాగే విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్, టీం బిల్డింగ్ నైపుణ్యాలు, విలువలు, మంచి వ్యక్తిత్వం పెంచేలా కరిక్యులం ఉండాలి. నియామక సందర్భాల్లో కంపెనీలు సైతం పై అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఉమ్మడి సర్టిఫికేషన్‌లు/డిగ్రీలు
పరిశ్రమలు.. విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలి. వీలైతే ఉమ్మడి సర్టిఫికేషన్లు, డిగ్రీలను అందించాలి. తద్వారా ప్రత్యేక రంగానికి సంబంధించిన విధంగా నైపుణ్యాలు పెంచితే జాబ్‌రెడీ విద్యార్థులుగా జాబ్‌మార్కెట్‌లో అడుగుపెడతారు. ఇప్పటికే చాలా కంపెనీలు అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కలిసి సంయుక్తంగా కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇండస్ట్రీ-అకాడెమీ సహకారానికి ఐసీఐసీఐ బ్యాంక్- మణిపాల్ ఎడ్యుకేషన్ కలిసి ఐసీఐసీఐ మణిపాల్ అకాడెమీ ఏర్పాటు చేశాయి. అక్కడ శిక్షణ పొందిన వారు ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్లుగా పనిచేయడానికి సిద్ధమవుతారు. ఇతర ప్రముఖ కార్పొరేట్ సంస్థలు సైతం పలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. సంస్థలో పనిచేయడానికి సరిపోయేలా విద్యార్థులను అన్ని విధాలా సన్నద్ధం చేస్తున్నాయి

ఇంటర్న్‌షిప్స్: విద్యార్థి దశలోనే కంపెనీల్లో పనివాతావరణం గురించి తెలుసుకునే అవకాశం కల్పించేవే.. ఇంటర్న్‌షిప్స్. పలు సంస్థలు ఆఫర్‌చేసే ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులు కొంత సమయాన్ని వర్క్‌ప్లేస్‌లో గడపాలి. స్వల్పకాలిక అసైన్‌మెంట్స్ ను ఉద్యోగులతో కలిసి చేయాలి. భవిష్యత్తులో ఇంటర్న్‌షిప్ చేసిన కంపెనీలోనే ఉద్యోగంలో చేరడానికి అవకాశం వస్తే వృత్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదు. అయితే దేశంలో ఇంటర్న్‌షిప్‌ల సంఖ్య పెరగాల్సి ఉంది. విద్యతోపాటే ఉద్యోగ శిక్షణ పొందడానికి మంచి అవకాశం. అంతేకాకుండా కంపెనీలకు కూడా విద్యార్థులను టెస్ట్ డ్రైవ్ నిర్వహించడానికి ప్రయోజనకరమే.

నైపుణ్యాలు పెంచుకోవాలి!
మార్కెట్ ట్రెండ్‌కు తగిన నైపుణ్యాలున్నవారికి అద్భుతమైన కెరీర్ అందించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే నైపుణ్యాల్లో అంతరాలు తక్కువ ఉద్యోగితకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉద్యోగంతోపాటు కెరీర్‌లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలపైనా దృష్టి సారించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిన నైపుణ్యాలకంటే అధికంగా స్కిల్స్ సాధించాలి. ఇండస్ట్రీ- విద్యాసంస్థల క్రియాశీల పాత్ర ద్వారానే ఇది సాధ్యమవుతుంది. విద్యార్థులు కరిక్యులాన్ని పక్కాగా చదవాలి. విద్యార్థుల కోసం కంపెనీలు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్‌లలో చురుగ్గా పాల్గొనాలి. పరిశ్రమలు విద్యార్థుల నుంచి ఏం కోరుకుంటున్నాయో తెలుసుకుని తదనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి.
-వి. రాజన్న
వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టీసీఎస్
Published date : 20 Aug 2014 11:41AM

Photo Stories