Skip to main content

కాలేజ్‌కు వెళ్లకుండానే ప్రొఫెషనల్‌ కోర్సులు.. ఓడీఎల్, ఆన్‌లైన్‌ విధానంలో అందించేందుకు ఏఐసీటీఈ నిర్ణయం..

మీకు.. ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులు చదవాలనే ఆసక్తి ఉందా.. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివితేనే ఉజ్వల కెరీర్‌ అనే ఆలోచనలో ఉన్నారా.. కానీ.. కాలేజ్‌లకు వెళ్లి రెగ్యులర్‌గా చదివే సమయం లేదా..?! ఇప్పుడు మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లే! ఇక డిప్లొమా మొదలు పీజీ స్థాయి వరకు.. పలు ప్రొఫెషనల్‌ కోర్సులను.. ఉన్న చోట నుంచే.. కాలేజ్‌కు వెళ్లకుండానే.. పూర్తిచేసుకోవచ్చు! అది కూడా.. పేరున్న, ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ప్రొఫెషనల్‌ కోర్సుల పట్టా అందుకునే అవకాశం లభించనుంది!! ప్రొఫెషనల్‌ కోర్సులను.. ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) లేదా ఆన్‌లైన్‌ విధానంలో అందించొచ్చని ఏఐసీటీఈ ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సులను ఓడీఎల్, ఆన్‌లైన్‌లో పూర్తిచేసుకునేందుకు వీలుగా ఏఐసీటీఈ జారీ చేసిన మార్గదర్శకాలపై విశ్లేషణ...
ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సుల పర్యవేక్షణ సంస్థ ఏఐసీటీఈ.. ప్రొఫెషనల్‌ కోర్సులను, జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ నెలకొన్న ఆధునిక సాంకేతిక కోర్సులను.. ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ లేదా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించొచ్చని పేర్కొంది. తాజాగా ‘ఏఐసీటీఈ (ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌) గైడ్‌లైన్స్‌–2021’ పేరిట.. మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది.

డిమాండ్‌ ఉన్న కోర్సులు..
ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్, ఆన్‌లైన్‌ విధానంలో ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే దిశగా ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను సైతం అందించొచ్చని ఇన్‌స్టిట్యూట్‌లకు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోర్సులు– అనుబంధ కోర్సులు; అలాగే కంప్యూటర్‌ అప్లికేషన్స్‌; అదేవిధంగా లేటెస్ట్‌ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటాసైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్, డిస్టెన్స్‌∙విధానంలో అందించేందుకు అనుమతి ఇచ్చింది. వీటితోపాటు లాజిస్టిక్స్‌ కోర్సులను; ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులను కూడా ఓడీఎల్‌/ఆన్‌లైన్‌ విధానంలో అందించొచ్చని స్పష్టం చేసింది.

‘ఆ’ ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే..
  • ఓడీఎల్, ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌లకు పలు అర్హత ప్రమాణాలను ఏఐసీటీఈ నిర్దేశించింది. స్టాండ్‌ అలోన్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలు, యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆన్‌లైన్‌ విధానంలో బోధించొచ్చని పేర్కొంది. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు తప్పనిసరిగా న్యాక్, ఎన్‌బీఏ, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు పొంది ఉండాలనే నిబంధన విధించింది.
  • ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం–న్యాక్‌ స్కోర్‌ 3.26 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు » ఎన్‌బీఏ స్కోర్‌ 700 ఉన్న విద్యాసంస్థలు » ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ర్యాంకుల విభాగంలో టాప్‌–100 జాబితాలో నిలిచిన విద్యాసంస్థలు మాత్రమే ఈ విధానంలో కోర్సులను అందించేందుకు అనుమతి ఉంటుంది.


మూడు అర్హతల్లో ఏదైనా ఒకటి..
స్థాపించి అయిదేళ్లు పూర్తి చేసుకొని..న్యాక్‌ స్కోర్‌ 3.01 పొందిన ఇన్‌స్టిట్యూల్‌లు లేదా ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌లో 650 పాయింట్లు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు, లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ యూనివర్సిటీ విభాగం ర్యాంకుల్లో టాప్‌–100లో నిలిచిన ఇన్‌స్టిట్యూట్‌లు..ఇలా ఈ మూడు అర్హతల్లో ఏదైనా ఒక అర్హత ఉన్న విద్యాసంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇతర అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లు... అనుమతి లభించిన తేదీ నుంచి రెండేళ్లలోపు 650 పాయింట్ల స్కోర్‌తో ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌ పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కోర్సులు.. వ్యవధి
ఓడీఎల్, ఆన్‌లైన్‌ విధానంలో డిప్లొమా నుంచి పీజీ వరకు అందించనున్న కోర్సుల విషయంలో ఏఐసీటీఈ అర్హతలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా కోర్సులకు సంబంధించి అవసరమైన అర్హతలు, వ్యవధి వివరాలు..

కోర్సు

అర్హత

వ్యవధి

డిప్లొమా కోర్సు

పదోతరగతి

మూడేళ్లు

ఎంసీఏ

బ్యాచిలర్‌ డిగ్రీ

రెండేళ్లు

మేనేజ్‌మెంట్‌ పీజీ

బ్యాచిలర్‌ డిగ్రీ

రెండేళ్లు

పీజీ డిప్లొమా

బ్యాచిలర్‌ డిగ్రీ

రెండేళ్లు

పీజీ సర్టిఫికెట్‌

బ్యాచిలర్‌ డిగ్రీ

ఏడాది నుంచి రెండేళ్లు

పోస్ట్‌ డిప్లొమా సర్టిఫికెట్‌

బ్యాచిలర్‌ డిగ్రీ

ఏడాది నుంచి రెండేళ్లు


ఇప్పటికే పీజీడీఎం, పీజీసీఎం, ట్రావెల్‌ అండ్‌ టూరిజం కోర్సులను ఆన్‌లైన్‌ డిస్టెన్స్‌ విధానంలో నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను ఏఐసీటీఈ నిపుణుల కమిటీ మరోసారి తనిఖీ చేసి.. వాటి కొనసాగింపు, అనుమతుల మంజూరు విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది.

ఫుల్‌టైమ్‌ కోర్సుల మాదిరిగానే..
ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నత విద్య పరంగా, పలు పీఎస్‌యూలు ఉద్యోగావకాశాల పరంగా ఫుల్‌టైమ్‌ కోర్సులు చదివుండాలనే నిబంధన విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ... ఓడీఎల్‌/ఆన్‌లైన్‌ విధానంలో అందించే ప్రోగ్రామ్స్‌కు ఫుల్‌టైమ్‌ కోర్సులకు మాదిరిగానే గుర్తింపునే ఇవ్వాలని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మేలు జరుగనుంది.

మూక్స్, స్వయం ద్వారా బోధన..
  • ఈ కోర్సులకు మూక్స్, స్వయం పోర్టల్స్‌ను ఆధారంగా చేసుకొని బోధించాలని ఏఐసీటీఈ సూచించింది. అందుకోసం అనుమతి లభించిన ఇన్‌స్టిట్యూట్‌లు అవసరమైన సాంకేతిక వనరులు, వసతులు సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌.. ఐసీటీ సదుపాయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.
  • ఆన్‌లైన్‌ విధానంలో టెక్నికల్‌ కోర్సులను అందించాలని పేర్కొన్న ఏఐసీటీఈ.. విద్యార్థులకు ప్రత్యక్ష బోధన సైతం కొద్ది కాలం పాటు అందించాలని సూచించింది. దీని ద్వారా ప్రాక్టికల్‌ నైపుణ్యాల విషయంలో విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొంది.


డిజిటల్‌ సదుపాయాలు..
విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్‌ లెర్నింగ్‌ సదుపాయాలు కల్పించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌ తప్పనిసరిగా.. » ఈ–టెక్స్‌›్ట మెటీరియల్స్‌ » వీడియో లెక్చర్స్‌ » ఆడియో–విజువల్‌ ఇంటరాక్టివ్‌ మెటీరియల్‌ » వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ సెషన్స్‌ » ఆడియో పోడ్‌కాస్ట్స్‌ » వర్చువల్‌ సిమ్యులేషన్‌ » సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ క్విజ్‌ లేదా టెస్ట్స్‌ వంటి డిజిటల్‌ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

సెమిస్టర్‌ లేదా వార్షిక విధానంలో పరీక్షలు..
ఆయా కోర్సులను అందించేందుకు అనుమతి పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. విద్యార్థులకు సెమిస్టర్‌ లేదా వార్షిక విధానంలో పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈ సూచించింది. కనీస అర్హత క్రెడిట్స్‌ సాధించిన వారినే ఉత్తీర్ణులుగా పేర్కొనాలని స్పష్టం చేసింది. యూజీసీ ఓడీఎల్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారమే ఈ క్రెడిట్స్‌ ఉంటాయని పేర్కొంది. పీజీ స్థాయి కోర్సులకు కనీసం 48 క్రెడిట్స్‌ పొందడం తప్పనిసరి. ఆయా ప్రోగ్రామ్‌లు, కోర్సులను క్రెడిట్స్‌ విధానంలో నిర్వహించనున్నారు. దాంతో విద్యార్థులు సెమిస్టర్‌ లేదా వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే.. నిర్దిష్ట క్రెడిట్స్‌ పొందడం తప్పనిసరి.

ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో నిపుణుల కమిటీ..
ఓడీఎల్, ఆన్‌లైన్‌ విధానంలో కోర్సులు అందించేందుకు అనుమతి పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. అంతర్గతంగా తప్పనిసరిగా సెంటర్‌ ఫర్‌ ఇంటర్నల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌లను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. సదరు సెంటర్స్‌... ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆయా కోర్సులకు సంబంధించి తాము అందిస్తున్న ప్రమాణాలతో ఏఐసీటీఈకి నిర్దేశిత నమూనాలో నివేదిక అందించాలని స్పష్టం చేసింది. ఆ నివేదిక ఆధారంగా సదరు ప్రోగ్రామ్‌ల కొనసాగింపు, నిషేధంపై ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంటుంది. అదే విధంగా ప్రతి అయిదేళ్లకోసారి థర్డ్‌ పార్టీ నేతృత్వంలో అకడమిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని పేర్కొంది.

లెర్నింగ్‌ సపోర్ట్‌ సెంటర్స్‌..
ఓడీఎల్‌ విధానంలో టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ కోర్సులను అందించే ఇన్‌స్టిట్యూట్‌లు.. లెర్నింగ్‌ సపోర్ట్‌ సెంటర్స్‌ను అందుబాటులో ఉంచాలని ఏఐసీటీఈ పేర్కొంది. వాటిలో తగిన సదుపాయాలు కల్పించి.. విద్యార్థులు నైపుణ్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లెర్నింగ్‌ సపోర్ట్‌ సెంటర్స్‌లో ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉండేలా చూడాలంది. వారితో ఇంటరాక్షన్‌కు విద్యార్థులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ ఫ్యాకల్టీకి కూడా రెగ్యులర్‌ ఫ్యాకల్టీకి అవసరమైన అర్హతలు ఉండాలని పేర్కొంది. ప్రతి లెర్నర్‌ సపోర్ట్‌ సెంటర్‌లో గరిష్టంగా వేయి మందికి మాత్రమే ప్రవేశానికి అర్హత కల్పించాలని సూచించింది.

శాశ్వత ప్రాతిపదికగా సిబ్బంది..
అనుమతులు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు.. కోర్సుల నిర్వహణ, పర్యవేక్షణకు శాశ్వత ప్రాతిపదికగా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ సిబ్బందిని నియమించాలని ఏఐసీటీఈ సూచించింది. యూనివర్సిటీ ప్రధాన కేంద్రంలో ప్రతి ప్రోగ్రామ్‌కు ప్రొఫెసర్‌ హోదా కలిగిన వ్యక్తిని సదరు విభాగం హెడ్‌గా నియమించాలని సూచించింది. అదే విధంగా ఒక స్పెషలైజేషన్‌కు సంబంధించి ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలని పేర్కొంది. నిర్వహణ, పరిపాలన కోణంలో ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఒక సెక్షన్‌ ఆఫీసర్, ముగ్గురు అసిస్టెంట్‌లు, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇద్దరు మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ను నియమించాలంది. ప్రతి లెర్నింగ్‌ సపోర్ట్‌ సెంటర్‌లో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కో–ఆర్డినేటర్‌గా ఉండాలని, నాలుగు క్రెడిట్ల కోసం ఉండే థియరీ కోర్సుకు ఇద్దరు కౌన్సెలర్లను, రెండు క్రెడిట్ల ప్రాక్టికల్‌ కోసం ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలని స్పష్టం చేసింది.

రెండుసార్లు ప్రవేశాలు..
ఓపెన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌లు.. ప్రతి ఏటా రెండుసార్లు ప్రవేశ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. జనవరి/ఫిబ్రవరి నెలల్లో, జూలై/ఆగస్ట్‌ నెలల్లో కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో వేల మందికి మేలు జరుగుతుందని.. నచ్చిన కోర్సులు చదివే అవకాశం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏఐసీటీఈ–ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌.. ముఖ్యాంశాలు
  • మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహణకు అనుమతి.
  • తొలుత స్టాండ్‌ అలోన్‌ ఇన్‌స్టిట్యూట్స్, ఎన్‌బీఏ, న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నిర్దిష్ట స్కోర్, ర్యాంకుల జాబితాలో నిలిచిన ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీలకు అనుమతి.
  • పదో తరగతి మొదలు బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఆధారంగా డిప్లొమా నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ వరకు పలు కోర్సులు.
  • నిరంతర పర్యవేక్షణ కోణంలో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణుల కమిటీ నియామకం.
Published date : 29 Mar 2021 03:00PM

Photo Stories