Career in ISRO: అంతరిక్ష పరిశోధన సంస్థలో కెరీర్‌కు మార్గాలు
- డిప్లొమా నుంచి డాక్టరేట్ వరకు పలు అవకాశాలు
- సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్‌తో కొలువులు
- ఇస్రో ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్
- అంతరిక్ష పరిశోధన అభ్యర్థులకు అద్భుత వేదిక
ఇస్రో.. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకూ.. ఆయా అర్హతలకు అనుగుణంగా నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్; అలాగే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌తోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఈ అంతరిక్ష సంస్థ నిత్యం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఇందుకోసం ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తే.. అవకాశాలు చేజారకుండా దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
కోర్సులు.. ఇన్‌స్టిట్యూట్‌లు
ఇస్రో కెరీర్‌కు దోహదం చేసే ఆస్ట్రానమీ, ఏవియానిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి స్పెషలైజ్డ్ కోర్సులను ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి తెచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగళూరు), యూనివర్సిటీ ఆఫ్ పుణెలతోపాటు పలు సెంట్రల్ యూనివర్సిటీలు బీటెక్, ఎంటెక్ స్థాయిలో వీటిని అందిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల్లో జేఈఈ–మెయిన్, జేఈఈ–అడ్వాన్స్‌డ్, సీయూఈటీ –యూజీలో ర్యాంకు; పీజీ కోర్సుల్లో గేట్ స్కోర్, సీయూఈటీ–పీజీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
చదవండి: DRDO-ITR Recruitment 2023: డీఆర్‌డీవో–ఐటీఆర్ చాందీపూర్‌లో 54 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
ఐఐఎస్‌టీ
ఇస్రో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)ని నెలకొల్పారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదా కలిగిన ఈ ఇన్‌స్టిట్యూట్‌లో.. బీటెక్ ఈసీఈ(ఏవియానిక్స్), బీటెక్(ఏరోస్పేస్ ఇంజనీరింగ్); ఎంటెక్‌లో ఏరో డైనమిక్స్ అండ్ ఫ్లైట్ మెకానిక్స్, స్ట్రక్చర్స్ అండ్ డిజైన్, క్వాంటమ్ టెక్నాలజీ, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, థర్మల్ అండ్ ప్రొపల్షన్; ఎమ్మెస్సీ(ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లోకి జేఈఈ –అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా ఎంటెక్; సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్, జెస్ట్ స్కోర్‌తో పీహెచ్‌డీలో అడ్మిషన్ లభిస్తుంది. ఐఐఎస్‌టీలో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. ఇస్రోతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రీసెర్చ్ కేంద్రాలు, ఎర్త్ సైన్స్ సెంటర్ వంటి రీసెర్చ్ కేంద్రాల్లో కొలువులు లభిస్తున్నాయి.
ఎంట్రీ లెవల్‌లో సైంటిస్ట్–ఎస్‌సీ
ఇస్రోలో ప్రధానంగా ఎనిమిది సైంటిస్ట్ హోదాలు ఉన్నాయి. అవి.. సైంటిస్ట్–ఎస్‌సీ, ఎస్‌డీ, ఎస్‌ఈ, ఎస్‌ఎఫ్, ఎస్‌జీ, సైంటిస్ట్–జి, ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్, డీఎస్ (డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్).
ఎంట్రీ లెవల్‌లో.. సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్‌సీ హోదాతో కొలువు సొంతం చేసుకోవచ్చు. నిర్దేశిత బ్రాంచ్‌లు, స్పెషలైజేషన్లలో బీటెక్, ఎంటెక్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను వీటికి అర్హతగా పేర్కొంటారు. ఇదే రీతిలో సైంటిస్ట్–ఎస్‌ఎప్ హోదా వరకు రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. సైంటిస్ట్ ఎస్‌జీ నుంచి సైంటిస్ట్–జి హోదాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డీఎస్ స్థాయికి చేరుకునే అవకాశం
బీటెక్‌తో సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్‌సీగా కొలువుదీరిన వారు భవిష్యత్తులో విశిష్ట శాస్త్రవేత్త(డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్) హోదాకు పదోన్నతి పొందే అవకాశముంది. సర్వీస్‌లో చేరిన నాలుగేళ్లకు సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్‌డిగా.. ఆ తర్వాత నాలుగేళ్లకు సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్‌ఈగా.. అనంతరం మరో నాలుగేళ్లకు సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్‌ఎఫ్‌గా పదోన్నతులు లభిస్తాయి. మరో అయిదేళ్లకు సైంటిస్ట్/ఇంజనీర్ ఎస్‌జి, అనంతరం అయిదేళ్ల్లకు.. సైంటిస్ట్ జి హోదా లభిస్తుంది. సైంటిస్ట్ జి హోదాలో ఆరేళ్లు పూర్తి చేసుకుంటే.. ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్‌గా, ఈ హోదాలో రెండేళ్లు పూర్తి చేసుకుంటే.. డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్‌గా పదోన్నతి లభిస్తుంది.
విధులు ఇవే
ఇస్రోలో ఎంట్రీ లెవల్‌లో సైంటిస్ట్–ఎస్‌సీ హోదాలో నియామకం ఖరారు చేసుకున్న వారు ఇస్రో, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సీనియర్ సైంటిస్ట్‌లకు సహకరించడం, సంబంధిత విభాగాల్లో అప్లికేషన్స్ రూపొందించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పదోన్నతులు పొందే కొద్దీ విధులు, బాధ్యతలు పెరుగుతాయి. ఆయా ప్రాజెక్ట్‌లను స్వయంగా పర్యవేక్షిస్తూ.. సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.
చదవండి: Chandrayaan-3 Success: అంతరిక్షంలో మహోన్నతమైన ఘట్టం
ఇస్రోలో కెరీర్స్.. ముఖ్యాంశాలు
- సైంటిస్ట్–ఎస్‌సీ హోదాలో బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులకు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు.
- ఐఐఎస్‌టీ ఆధ్వర్యంలో ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్‌లు.
- పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్, ఏవియానిక్స్ తదితర అంతరిక్ష శాస్త్ర అనుంబంధ కోర్సులు.
- ఇస్రో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.
- ఆయా హోదాలను బట్టి పే లెవల్–7 నుంచి పే లెవల్ –14 వరకు వేతన శ్రేణి.
- ఇస్రో కెరీర్స్, నియామక నిబంధనలకు వెబ్‌సైట్: https://www.isro.gov.in/CareerOpportunities.html
బీఎస్సీతో సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్
బీఎస్‌సీ అర్హతతో ఇస్రోలో సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్ నియామకాలు చేపడతారు. ఇందుకోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ హోదాలో కెరీర్ ప్రారంభించిన వారు సీనియర్ సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్–ఎ, సైంటిఫిక్/టెక్నికల్ ఆఫీసర్–సి, డి, ఈ, ఎఫ్, ఎస్‌జీ హోదాలకు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.
డిప్లొమాతో టెక్నిషియన్
ఇస్రోలో డిప్లొమా అర్హతతోనూ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిషియన్ ఉత్తీర్ణతతో ల్యాబ్ టెక్నిషియన్–ఎ హోదాలో అడుగు పెట్టొచ్చు. ఇందుకోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ హోదాలో కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో ల్యాబ్ టెక్నిషియన్–బి, సి, ఎ, సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్–బి హోదాలకు చేరుకోవచ్చు. అదే విధంగా డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతతో రేడియోగ్రాఫర్–ఎగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత రేడియో గ్రాఫర్–బి, సి; సీనియర్ రేడియోగ్రాఫర్–ఎ, సీనియర్ రేడియోగ్రాఫర్–బి వరకు పదోన్నతులు పొందొచ్చు.
ఐటీఐతోనూ
ఇస్రోలో ఐటీఐతో టెక్నిషియన్/డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు నియామకాలు చేపడతారు. ప్రారంభంలో టెక్నిషియన్–ఎ హోదా కల్పిస్తారు. ఆ తర్వాత టెక్నిషియన్–బి /డ్రాఫ్ట్‌మెన్–బి, టెక్నిషియన్–డి/డ్రాఫ్ట్స్‌మెన్–సి 2, టెక్నిషియన్–ఎఫ్/ డ్రాఫ్ట్స్‌మెన్–డి, జి, ఈ హోదాలకు; ఆ తర్వాత సీనియర్ టెక్నిషియన్, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ ఎ, బి కేటగిరీలకు చేరుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయికి చేరుకునే అవకాశముంది. వీటికి కూడా రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రత్యేక నియామక విభాగం
భారత అంతరిక్ష శాఖ పరిధిలోని ఇస్రోతోపాటు, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో సైంటిస్ట్, ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పేరిట ప్రత్యేక నియామక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజేతలనే సైంటిస్ట్, ఇంజనీర్స్‌గా ఖరారు చేస్తారు. గత ఏడాది వరకు ఈ పోస్ట్‌లకు గేట్ స్కోర్ ఆధారంగానే నియామక ప్రక్రియ ఉండేది. ఈ ఏడాది తొలిసారి సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఇస్రో సొంత నియామక ప్రక్రియ చేపడుతోంది.
రాత పరీక్షల్లో.. సబ్జెక్ట్ నాలెడ్జ్
ఇస్రో సైంటిస్ట్–ఎస్‌సీ పోస్టులకు నిర్వహించే రాతపరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 మార్కులకు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరో 20 మార్కులుకు న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రమెటిక్ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
వెయిటేజీ విధానం
రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా విజేతలను ఖరారు చేసే క్రమంలో.. వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తున్నారు. రాత పరీక్షలో ప్రతిభకు 50 శాతం; ఇంటర్వ్యూ మార్కులకు 50 శాతం వెయిటేజీని గణించి.. దాని ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
వేతనాలు ఆకర్షణీయంగానే
ఏడో వేతన సంఘ సిఫార్సుల ప్రకారం–సైంటిస్ట్స్ కేటగిరీలో వేతనాలు ఆకర్షణీయంగానే ఉన్నాయని చెప్పొచ్చు.సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్‌సీలకు పే లెవల్–10లో రూ.56,100–రూ.1,77,500 వేతన శ్రేణి ఉంటుంది. సైంటిస్ట్–ఎస్‌డీ హోదాలో పే లెవల్–11లో రూ. 67,700 – రూ.2,08,700; సైంటిస్ట్–ఎస్‌ఈ హోదాలో పే లెవల్ 12తో రూ.78,800–రూ.2,09,200;సైంటిస్ట్–ఎస్‌ఎఫ్ హోదా లో పే లెవల్13తో రూ.1,23,100–రూ.2,15,900; సైంటిస్ట్ –ఎస్‌జీ హోదాలో పే లెవల్ 13తో రూ.1,31,100–రూ.2,16,600, సైంటిస్ట్–జి హోదాలో పే లెవల్ 14తో రూ. 1,44,200–రూ.2,18,200 వేతన శ్రేణి ఉంటుంది. ఇక.. ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్‌లకు రూ.1,82,200– రూ.2,24,100. రూ. 2,05,400 – రూ. 2,24,400 వేతన శ్రేణిలో వేతనాలు లభిస్తాయి.
చదవండి: Inspiring ISRO Scientist: ప్రభుత్వ పాఠశాల నుంచి... చంద్రయాన్–3లో సీనియర్ సైంటిస్ట్ వరకు!