Skip to main content

ఉపాధ్యాయ విద్యకు సరికొత్త దారి...ఇంటిగ్రేటెడ్ బీఈడీ

ఇంటిగ్రేటెడ్ బీఈడీ.. దేశవ్యాప్తంగా విద్యావర్గాల్లో చర్చనీయాంశం! కారణం.. పాఠశాలల్లో సుశిక్షుతులైన ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ఈ కోర్సును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడమే! ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఉపాధ్యాయ వృత్తి దిశగా అడుగులు వేసి, ఆపై భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు.. అవకాశం కల్పించేలా రూపొందిస్తున్నట్లు ప్రకటించిన ఈ కోర్సు స్వరూపం ఎలాఉంటుంది? దీని ప్రయోజనాలు? తదితరాలపై ప్రత్యేక కథనం..
డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (డీఐఎస్‌ఈ) నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సుమారు 11 లక్షల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. అలాగే గుర్తింపు పొందిన ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 20 శాతం.. అంటే సుమారు 13 లక్షల మంది ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ అర్హతా లేకుండానే బోధిస్తున్నారు. యునెస్కో.. భారత్‌లో పాఠశాల స్థాయిలో అర్హులైన ఉపాధ్యాయుల సంఖ్య 60 శాతం కూడా లేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ ద్వారా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆరేళ్ల ముందు నుంచే అడుగులు...
వాస్తవానికి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ దిశగా ఆరేళ్ల కిందటే అడుగులు పడ్డాయి. 2012లో ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ పాఠశాలల్లో టీచర్ల కొరత తీర్చడం, ఉపాధ్యాయ విద్య కోర్సుల్లో మార్పుల అవసరాన్ని పేర్కొంటూ కొన్ని ిసిఫారసులు చేసింది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) 2014లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఎన్‌సీటీఈ పరిధిలోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ) క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు అమలవుతోంది. దీన్ని 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లుగా ఉండే ఈ కోర్సులో తొలి సెమిస్టర్ నుంచే ఉపాధ్యాయ విద్య అంశాలతోపాటు విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న బ్యాచిలర్ డిగీ కోర్సు (బీఏ/బీఎస్సీ) అంశాలూ బోధిస్తున్నారు. కేంద్రం తాజాగా ప్రతిపాదించిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు స్వరూపమూ ఇలాగే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నాలుగేళ్లు.. రెండు సర్టిఫికేట్లు
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ)లో ప్రవేశించే అవకాశం లభిస్తోంది. తర్వాత బీఈడీ చదవాలంటే.. డిగ్రీ తర్వాత మరో రెండేళ్లు వెచ్చించాలి. కానీ, కొత్త విధానంలో వారు నేరుగా బీఈడీ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ బీఈడీని బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీగా అందించే అవకాశముంది. మొత్తం నాలుగేళ్ల వ్యవధిలో అభ్యర్థులు తాము ఎంచుకున్న కోర్సు (బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ) పూర్తిచేశాక రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ సర్టిఫికెట్ కూడా చేతికి అందుతుంది. ఇలా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ద్వారా రెండు సర్టిఫికెట్లు పొందొచ్చు.

2019-20 నుంచి అమల్లోకి!
ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ బీఈడీని 2019 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే అవకాశముంది. 2018-19 బడ్జెట్‌లో దీని గురించి ప్రస్తావించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు సాధ్యాసాధ్యాలు, కార్యాచరణ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే పూర్తిస్థాయి స్పష్టత రావడానికి కనీసం ఆర్నెల్లు పడుతుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రావొచ్చు. 2019 నాటికి అన్-ట్రైన్డ్ టీచర్లందరూ ఉపాధ్యాయ విద్య అర్హత పొందాలనే నిబంధనను సడలిస్తూ ఆర్‌టీఈలో మార్పు తెస్తామని ప్రకటించడాన్ని దీనికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.

ప్రవేశం ఎలా?
వాస్తవానికి తాజా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు లక్షల మందిని లక్ష్యంగా చేసుకొని ప్రతిపాదించింది. ప్రధానంగా అన్-ట్రైన్డ్ టీచర్ల సంఖ్యను ప్రస్తావిస్తూ ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి.. నిర్దేశిత ఉత్తీర్ణత శాతం పొందిన వారికే ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాష్ట్రాల స్థాయిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశమూ ఉందంటున్నారు. అలాగే ఇప్పటికే పాఠశాలల్లో పనిచేస్తున్న అన్-ట్రైన్డ్ టీచర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్‌ను ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోనూ అందించే వీలుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రాథమిక స్థాయిలోని అన్-ట్రైన్డ్ టీచర్ల కోసం నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ నేతృత్వంలో గతేడాది ప్రవేశపెట్టిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

25 శాతం క్షేత్రస్థాయి శిక్షణ :
ఏ విధానంలో (రెగ్యులర్/ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్) ఈ కోర్సును ప్రవేశపెట్టినా.. మొత్తం గ్రేడ్స్, కోర్సుల పరంగా 25 శాతం క్షేత్రస్థాయి నైపుణ్యాలు పొందేలా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా నోడల్ సెంటర్లు ఏర్పాటు చేసి, కోర్సు పర్యవేక్షణను వాటికి అప్పగించే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రోగ్రామ్‌ను ఎన్‌సీటీఈ పర్యవేక్షణలోనే కొనసాగించనున్నారు. ఇప్పటికే ఆర్‌ఐఈలలో ఈ కోర్సు విజయవంతంగా కొనసాగుతుండడం.. ఉపాధ్యాయ విద్య పరంగా జాతీయ స్థాయిలో నియంత్రణ సంస్థగా ఎన్‌సీటీఈ వ్యవహరిస్తుండటం దీనికి కారణం కావొచ్చు. ఒకవేళ ఎన్‌ఐఓఎస్ ఆధ్వర్యంలో ఓడీఎల్ విధానంలో అందించినా.. ఎన్‌సీటీఈపర్యవేక్షణే ఉండటం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ముఖ్యాంశాలు..
  • 13 లక్షల మందికి పైగా అన్-ట్రైన్డ్ టీచర్లకు ప్రయోజనం.
  • ఇంటర్మీడియెట్‌తోనే బీఈడీలో ప్రవేశించే అవకాశం.
  • సంప్రదాయ విధానంతో పోల్చితే ఏడాది సమయం ఆదా.
  • కోర్సు పూర్తిచేశాక రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ రెండు సర్టిఫికెట్లూ అందడం.
  • జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో ప్రవేశపరీక్షల నిర్వహణ ద్వారా అర్హుల ఎంపిక.
  • 2019-20 నుంచి ప్రోగ్రామ్ ప్రారంభమయ్యే అవకాశం.

విద్యార్థులకు కలిసొచ్చే అంశం
ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకునే యువ ఔత్సాహికులకు ఈ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ఎంతో కలిసొచ్చే అంశంగా పేర్కొనొచ్చు. అలాగే అన్-ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉపాధ్యాయ విద్య అర్హత సొంతం చేసుకునే వీలుంది. పర్యవేక్షణ పరంగా పకడ్బందీగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.
- ప్రొఫెసర్ సందీప్ పొన్నాల, మెంబర్, ఎన్‌సీక్యూఎఫ్‌డబ్ల్యూ.

సద్వినియోగం చేసుకుంటే చక్కటి భవిష్యత్తు
ప్రస్తుతం ప్రతిపాదించిన కోర్సును సద్వినియోగం చేసుకుంటే చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత రెండేళ్ల వ్యవధి గల బీఈడీని పరిగణనలోకి తీసుకుంటే.. నాలుగేళ్లలోనే ఈ కోర్సును పూర్తి చేసుకుని పట్టా అందుకుంటే ఉద్యోగాన్వేషణలో ఏడాది సమయం కలిసొచ్చే వీలుంది.
- ప్రొఫెసర్ టి.కుమారస్వామి, ఐఏఎస్‌ఈ ప్రిన్సిపల్, ఎస్‌వీయూ.
Published date : 10 Feb 2018 03:14PM

Photo Stories