Skip to main content

స్వీయ సామర్థ్యమే చుక్కాని!!

నేటి పోటీ ప్రపంచంలో కెరీర్ ప్లానింగ్ చాలా అవసరం. నేడు కోర్సులు కోకొల్లలు.. కానీ జాబ్ మార్కెట్టే ఎంతో క్లిష్టం. అన్నింటికంటే ముఖ్యంగా మనకు ఇష్టమైన కోర్సు ఏదో తెలుసుకోవడం! చేరబోయే కోర్సుకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉందా? ఒకవేళ ప్రస్తుతం ఉంటే అది భవిష్యత్‌లోనూ కొనసాగుతుందా..! దేన్ని ఎంచుకుంటే కోర్సు పూర్తికాగానే కొలువులో కుదురుకోవచ్చు? మనం ఎంచుకునే కోర్సుకు మన సామర్థ్యాలు, ఆసక్తికి పొంతన కుదురుతుందా వంటివి కూడా తెలుసుకోవాలి. అప్పుడే విద్యార్థి సరైన గమ్యం దిశగా గమనం సాగిస్తున్నట్లు భావించాలి. ఉజ్వల భవితకు భరోసానిచ్చే కెరీర్ ప్లానింగ్‌పై ప్రత్యేక కథనం...
సరైన కెరీర్ ప్లానింగ్ లేకుంటే భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా తయారవుతుంది. ఎందుకంటే కెరీర్ ప్లానింగ్ లేని చదువు గమ్యం తెలియని ప్రయాణం లాంటిదే! ఆసక్తి లేని, జాబ్ మార్కెట్‌లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండే కోర్సును ఎంచుకుంటే కొలువుల వేటలో వెనకబడటం ఖాయం అంటున్నారు నిపుణులు. దీనికి ఉదాహరణగా ఆసక్తి లేకున్నా, కేవలం క్రేజీ కారణంతో ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చదివి కొలువుల్లో కుదురుకోని ఎంతోమందిని చూపుతున్నారు. ఆసక్తి లేకుండా ఆయా కోర్సుల్లో చేరినవారు రాణించలేకపోతున్నారనేది విస్పష్టం. అలాగే డిమాండ్ లేని కోర్సుల్లో చేరడం కూడా సరికాదు. ఎప్పటికప్పుడు మారుతున్న కంపెనీల అవసరాలు, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకోనున్న కోర్సు గురించి, ఆ కోర్సు ద్వారా ఉజ్వల కెరీర్‌ను అందుకునే వరకూ ప్రతి దశలోనూ ప్లానింగ్ ఉంటేనే ఆశించిన ఫలితం సొంతమవుతుంది. అందుకే పదో తరగతి విద్యార్థి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చేసే వారి వరకు ప్రతి ఒక్కరికీ ప్లానింగ్ ఉండాల్సిందే.

పది నుంచే ప్రారంభించాలి:
కెరీర్ ప్లానింగ్ దిశగా విద్యార్థులు పదో తరగతి నుంచే అడుగులు వేయాలి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపిక చేసుకునే కోర్సులే భవిష్యత్తు గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి విద్యార్థులు పదో తరగతిలోనే ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది? ఎంపీసీతో ఇంజనీరింగ్, సైన్స్ కోర్సులవైపు అడుగులు వేయాలా? లేదా బైపీసీతో మెడికల్ రంగంలో రాణించాలా? లేకుంటే సీఈసీ, హెచ్‌ఈసీలతో కామర్స్, సోషల్ సెన్సైస్‌వైపు దృష్టి సారించాలా? అనే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే సరైన దిశలో పయనించే అవకాశం ఉంటుంది.

ఉన్నతవిద్యకు ముందస్తు ప్రణాళిక:
ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకునే గ్రూప్‌పై స్పష్టత వచ్చాక.. ఆ గ్రూప్ సబ్జెక్ట్‌ల ఆధారంగా లభించే ఉన్నత విద్యావకాశాలపై అవగాహన పెంచుకోవాలి. కొన్ని రంగాల్లో కెరీర్‌లో స్థిరపడటానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు విద్యార్థిలోకమంతా క్రేజీగా భావించే బైపీసీ ఆధారంగా అడుగుపెట్టే మెడికల్ రంగంలో పూర్తిస్థాయిలో నిలదొక్కుకోవాలంటే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ.. ఇలా అన్ని స్థాయిలు కలిపి దాదాపు పదేళ్లు పడుతుంది. సైన్స్ రంగంలో సుస్థిర భవితకు కూడా పీజీ చేస్తేనే మెరుగైన అవకాశాలు. ఇంజనీరింగ్‌లోనూ ఏటా లక్షల మంది బీటెక్ పట్టాతో బయటకు వస్తున్నందున అవసరమైతే ఎంటెక్, పీహెచ్‌డీ వరకు ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ కోర్సు ఎంపిక చేసుకున్నా మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలో ఉండే బ్యాచిలర్ డిగ్రీతోనే కెరీర్ సొంతం చేసుకోవాలనుకోవడం సరికాదు. పీజీ, ఆపై స్థాయి కోర్సులు అభ్యసించే మానసిక సంసిద్ధత, సహనం ఎంతో అవసరం.

అవకాశాలపై అంచనా ఉండాలి:
ఎంపిక చేసుకునే కోర్సు, ఉన్నత విద్యపై స్పష్టత వచ్చాక ఆయా కోర్సులు పూర్తయ్యేనాటికి సదరు రంగంలోని అవకాశాలపైనా ముందస్తు అంచనా ఉండాలి. నిపుణులు పేర్కొంటున్నట్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మెండు. అదే సమయంలో మార్కెట్ పరిస్థితుల కారణంగా ఒడిదుడుకులకు కొదవలేదు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగాన్నే తీసుకుంటే ఈ రంగంలో ఆటుపోట్లు కొంత ఎక్కువే. ఐటీ రంగంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారముంది. 2008లో ఐటీ రంగంలో సంభవించిన సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ ఏ కోర్సు విద్యార్థులైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే విద్యార్థులు అకడమిక్‌తోపాటు ఆయా రంగాలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం చాలా అవసరం.

ప్లానింగ్ పక్కాగా ఉండాలంటే:
విద్యార్థికి సుస్థిర భవిష్యత్‌ను అందించే కెరీర్ ప్లానింగ్ పక్కాగా ఉండాలంటే స్వీయ సామర్థ్యాలు, వ్యక్తిగత దృక్పథం, ఆసక్తి, అవకాశాల గురించిన పరిశోధన, ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. వీటి ద్వారా తాము ఎంచుకునే రంగం గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోగలుగుతారు. వీటికి తోడుగా ఆ రంగంలో నిరంతరం జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించడం నేర్చుకోవాలి.

స్వీయ సామర్థ్యాలు తెలుసుకోవాలి:
కెరీర్ ప్లానింగ్‌లో మొదటి దశగా స్వీయ సామర్థ్యాలపై విశ్లేషణ చేసుకోవాలి. ఈ క్రమంలో సబ్జెక్ట్ పరిజ్ఞానం, వ్యక్తిగత దృక్పథం, ఆసక్తులు ముఖ్యమైనవి. తమకు నచ్చిన సబ్జెక్ట్ ఆధారంగా కెరీర్ మార్గాలను అన్వేషించాలి. ప్రయోగాలపై ఆసక్తి, నిత్య జీవితంలో ఎదురయ్యే సైన్స్ సంబంధ అంశాలను ఆసక్తిగా లోతుగా చదివే విద్యార్థులకు ఫిజిక్స్ రంగం సరితూగుతుంది. గణిత సంబంధిత సూత్రాలు, సుడోకు వంటి పజిల్స్ ఇట్టే పూర్తి చేస్తుంటే గణితాన్ని ఎంచుకోవచ్చు. కార్లు, మోటర్ సైకిల్స్ వంటి వాటివైపు మొగ్గు చూపే విద్యార్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో సరిగ్గా ఇమిడిపోతారు. ఇలా విద్యార్థులు తమ సహజ నైపుణ్యాలను గుర్తించి కెరీర్ లక్ష్యం ఎంచుకోవాలి.

వ్యక్తిగత దృక్పథం కీలకం:
సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు కెరీర్ ప్లానింగ్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం వ్యక్తిగత దృక్పథం. ఈ వ్యక్తిగత దృక్పథానికి సంబంధించి ప్రతి రంగానికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు సోషల్ వర్క్, సోషల్ సెన్సైస్, మెడిసిన్, నర్సింగ్ వంటి కెరీర్లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సేవా దృక్పథం, సహనం, ఇతరులతో మమేకం కావడం వంటివి అత్యంత ముఖ్యమైన లక్షణాలు. ఇంజనీరింగ్, సైన్స్ రంగాల ఔత్సాహికులకు గంటల కొద్దీ పని చేయగల ఓర్పు, ప్రతికూల ఫలితాలు ఎదురైనా నిరుత్సాహానికి గురికాకుండా ఉండే ఆశావహ దృక్పథం ఉండాలి. అప్పుడే ఎంపిక చేసుకున్న కెరీర్‌లో మెరుగైన ఫలితాలు, మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

ఆసక్తిగా సాగాలంటే..!
అన్నిటికంటే ప్రధానం వ్యక్తిగత ఆసక్తి. కారణం ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సీనియర్లు, ఉపాధ్యాయులు, సహచరుల ప్రభావంతోనే కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. తర్వాత ఆ కోర్సుల్లో ఇమడలేక భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. విద్యార్థులకు తమ ఆసక్తి ఏంటి అనేది స్పష్టంగా తెలియజేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులదీ కీలకపాత్రే. తరగతి గదిలో విద్యార్థి ఆసక్తులను పరిశీలించి దానికి అనుగుణంగా మార్గనిర్దేశం చేయాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లోని సహజసామర్థ్యాలు, ఆసక్తులను గమనించి వారికి అనుగుణమైన రంగాల్లో చేరేలా ప్రోత్సహించాలి.

నిపుణుల సలహాలు పాటించాలి:
కెరీర్ ప్లానింగ్ విషయంలో విద్యార్థులు తమ ఆసక్తులకు సరిపోయే రంగాలు, పరిశ్రమలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విషయంలోనూ స్పష్టత వచ్చిన తర్వాత సదరు రంగం/పరిశ్రమలో తాము పనిచేయగల పరిస్థితి ఉందో లేదో ముందుగానే తెలుసుకుని ప్రవేశించాలి. దీనికోసం ఇప్పటికే ఆ సంస్థలు/రంగాల్లో ఉన్న సీనియర్లు, నిపుణుల సలహాలు ఉపకరిస్తాయి.

ప్రత్యామ్నాయాలపైనా దృష్టి తప్పనిసరి:
కెరీర్ ప్లానింగ్ పరంగా లక్ష్యాలు, గమ్యాలపై స్పష్టత లభించిన విద్యార్థులు సంబంధిత ప్రత్యామ్నాయాలపైనా ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి. అంటే ప్లాన్ ఏ, అదికాకుంటే ప్లాన్ బీ అన్నమాట! ఎందుకంటే ఎంత పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయా లక్ష్యం దిశగా ప్రతికూలతలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆందోళనకు గురి కాకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక దృక్పథం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మెడిసిన్ లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థికి ఎంబీబీఎస్‌లో సీటు రాకుంటే ప్రత్యామ్నాయంగా ఉన్న అగ్రికల్చర్, ఫార్మసీ, సైన్‌‌స వంటి కోర్సులు, కెరీర్ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి సైంటిస్ట్ కెరీర్ లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న విద్యార్థులు ఆ లక్ష్యం చేరుకోకుండానే ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో రీసెర్చ్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు పరిశోధన రంగంలో పీహెచ్‌డీ అభ్యర్థులకే కాకుండా పీజీ చేసిన వారికి సైతం ప్రాజెక్ట్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్ వంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా ముందుగానే అన్ని కోర్సులు/రంగాల్లో ప్రత్యామ్నాయాలపైనా అవగాహన, ప్రణాళిక ఉంటే దీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగొచ్చు. నిరాశానిస్పృహలు దరిచేరవు!

కెరీర్ ప్లానింగ్-గుర్తుంచుకోవాల్సినవి
  • పదో తరగతి నుంచే కెరీర్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టాలి.
  • ఆసక్తులు, స్వీయ సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • సైకోమాటిక్ టెస్ట్స్ ఆధారంగా ఆసక్తుల గురించి తెలుసుకోవాలి.
  • వీలైనంతమేరకు ప్లానింగ్ తప్పకుండా కొనసాగాలి.
  • ప్రత్యామ్నాయాలపైనా అవగాహన పెంచుకోవాలి.
  • దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలి.
ట్రిపుల్ ‘ఐ’ అప్రోచ్‌తో రాణించొచ్చు..
ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్ ప్లానింగ్ ఎంతో అవసరం. అందుకోసం ఇంట్రెస్ట్, ఇంపార్టెన్స్, ఇంప్లిమెంటేషన్ అనే ట్రిపుల్ ఐ అప్రోచ్‌ను అనుసరించాలి. అంటే ఆసక్తి గల కోర్సు/రంగం; ఆ రంగం వర్తమాన, భవిష్యత్తు ప్రాధాన్యం తెలుసుకోవాలి. తర్వాత తాము రూపొందించుకున్న ప్రణాళిక అమలు చేయాలి. కొంతమంది ఇంట్రస్ట్, ఇంపార్టెన్స్‌ల విషయంలో పకడ్బందీగానే ఉంటారు. కానీ ఆచరణ విషయంలో ఇబ్బంది పడతారు. ఇందుకు ఇతరుల ప్రభావాన్ని ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇతరుల ప్రభావంతో తమ ప్రాధాన్యాలను, లక్ష్యాలను మార్చుకుంటారు. తర్వాత తమకు ఇష్టంలేని, సరిపోని కెరీర్‌లో చేరి నిరాసక్తంగా మారతారు. అలాకాకుండా ఉండాలంటే తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సు ఎంపిక, కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి రంగంలోనూ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందకుండా, ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు ఖాయం.
- వినయ్ వర్ధన్, డెరైక్టర్, కెరీర్‌పాత్ సొల్యూషన్స్, హైదరాబాద్.

తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
ఆసక్తులు, అవకాశాలు, స్వీయ సామర్థ్యాలు.. ఇలా కెరీర్ ప్లానింగ్ విషయంలో ఒక క్రమపద్ధతితో వ్యవహరించాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థుల కెరీర్ ప్లానింగ్ విషయంలో తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర వహించాలి. తమ పిల్లల ఆసక్తులు గమనించి వాటికి అనుగుణమైన కోర్సులు/రంగాలు, వాటిలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి తెలియజెప్పాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులకు తమ ఆసక్తులు చెప్పే విషయంలో భయపడటం లేదా బిడియపడటం జరుగుతోంది. కొన్నిసార్లు తమ ఆసక్తి గురించి స్పష్టంగా చెప్పలేరు. ఇలాంటి సందర్భాల్లో కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడం ద్వారా సత్ఫలితాలు ఆశించొచ్చు. సైకోమాటిక్ టెస్ట్, కౌన్సెలింగ్ ఫలితంగా విద్యార్థుల నిజమైన ఆసక్తులు ఏంటో తెలుసుకునే అవకాశముంది.
- ఎం.రామకృష్ణ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్.
Published date : 29 Oct 2015 05:03PM

Photo Stories