Skip to main content

క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి పెరుగుతున్న డిమాండ్‌.. రానున్న రోజుల్లో 18లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన..!

క్లౌడ్‌ టెక్నాలజీస్‌.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌! ఇటీవల కాలంలో.. మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ నుంచి స్థానిక ఇంజనీరింగ్‌ విద్యార్థి వరకూ.. ఎవరి నోట విన్నా ఇదే మాట! ఐటీ నుంచి హెల్త్‌కేర్‌ వరకూ.. ఇప్పుడు అన్ని రంగాల్లో క్లౌడ్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి టాప్‌ కంపెనీలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో 18 లక్షల మందికి.. క్లౌడ్‌ టెక్నాలజీస్‌లో కొలువులు లభిస్తాయని తాజా అంచనా! ఈ నేపథ్యంలో.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే ఏమిటి.. లభించే ఉద్యోగాలు.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే.. ఇంటర్నెట్‌ ద్వారా.. సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, ఓఎస్‌(ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌), నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, అనలిటిక్స్‌ వంటి సేవలు అందించడం! ఉదాహరణకు సర్వర్స్, వర్చువల్‌ మెషిన్స్, స్టోరేజ్, నెట్‌వర్క్‌ వంటి మౌలికవసతులు; విండోస్, అండ్రాయిడ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్లాట్‌ఫార్మ్స్‌; సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ తదితర సేవలు ఇంటర్నెట్‌ ద్వారానే పొందే వీలుకల్పిస్తుంది క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానం. గతంలో ఐటీ కంపెనీలు ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాక.. దాన్ని క్షేత్ర స్థాయిలో క్లయింట్‌ సంస్థ సమర్థంగా వినియోగించేలా చూసేందుకు స్వయంగా కొన్ని రోజులు సదరు క్లయింట్‌ కంపెనీలోనే ఉండి.. సేవలు అందించాల్సి వచ్చేది. ఇప్పుడు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానంలో ఇంటర్నెట్‌ ద్వారానే అన్ని రకాల సేవలు అందించే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా కంపెనీలకు సొంతంగా సర్వర్స్, స్టోరేజ్‌ వంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తప్పింది. వినియోగదారుడు(క్లయింట్‌ సంస్థ) తనకు అవసరమైనంత మేరకే సేవలు పొంది.. అంతవరకే చెల్లిస్తాడు. తద్వారా ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారాల వేగం పెరుగుతుంది.

క్లౌడ్‌ విస్తరణ..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దశాబ్దం క్రితమే మార్కెట్లో అడుగుపెట్టింది. గతంలో పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానంలో తమ క్లయింట్లకు సేవలు అందించేవి. ఇప్పుడు కరోనా కారణంగా అన్ని రంగాల్లో ఆన్‌లైన్‌ సేవల వేగం ఊపందుకుంది. దాంతో క్లౌడ్‌ ఆధారిత సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. వీటిలో ఈ–కామర్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలు, సేవల రంగంలోని ఇతర కంపెనీలు సైతం క్లౌడ్‌ ఆధారిత సేవలు కోరుకుంటున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ క్లౌడ్‌ టెక్నాలజీ వినియోగంలోకి వస్తోంది. దీంతో.. రానున్న నాలుగేళ్లలో ఏటా 15 శాతంపైగా వృద్ధి సాధిస్తూ... 2024 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు క్లౌడ్‌ మార్కెట్‌ చేరుకోనుందని అంచనా.

క్లౌడ్‌ సర్వీసెస్‌.. మూడు రకాలు
క్లౌడ్‌లో పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్‌ విధానాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా మూడు రకాల క్లౌడ్‌ టెక్నాలజీస్, సర్వీసెస్‌ ఆదరణ పొందుతున్నాయి. అవి..సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌(ఎస్‌ఏఏఎస్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌(ఐఏఏఎస్‌), ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఎ సర్వీస్‌(పీఏఏఎస్‌).

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌..
క్లౌడ్‌ టెక్నాలజీ పరంగా అత్యంత ఆదరణ పొందుతున్న విధానం.. సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌. క్లౌడ్‌ ప్రొవైడింగ్‌ సంస్థలు అవసరమైన ఆపరేటింగ్‌ సిస్లమ్స్‌ నిర్వహణ,అప్‌గ్రేడింగ్, సెక్యూరిటీ వంటివన్నీ ఆన్‌ డిమాండ్‌ ఇంటర్నెట్‌ ద్వారానే అందిస్తాయి దీనిద్వారా వినియోగదారులు.. ఒక సంస్థ అందించే ఆన్‌లైన్‌ సేవలు పొందొచ్చు. గూగుల్‌ యాప్స్, ఇతర మొబైల్‌ యాప్స్‌నే వీటికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఈ విధానంలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. సదరు సంస్థ అందించే సేవలను పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం యాప్‌ ప్రపంచం రాజ్యమేలుతున్న తరుణంలో అన్ని రంగాల్లోని సంస్థలు..వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానాల్లో మరో కీలకమైన విధానం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు దీనికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విధానంలో అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సదుపాయాలను, సర్వర్స్‌ను, స్టోరేజ్‌ తదితర మౌలిక సదుపాయాలను క్లౌడ్‌ ప్రొవైడింగ్‌ సంస్థ అందిస్తుంది. క్లయింట్‌ సంస్థ కోరిన సందర్భంలో సంబంధిత సేవలను ఇంటర్నెట్‌ ఆధారంగా అందిస్తుంది. నెట్‌వర్కింగ్, స్టోరేజ్‌ వంటి వాటిని ఈ విధానానికి ఉదాహరణగా చెప్పొచ్చు.

ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఎ సర్వీస్‌..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీస్‌లో మరో ముఖ్యమైన విధానం.. ప్లాట్‌ఫామ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌. క్లౌడ్‌ ప్రొవైడర్‌ సంస్థలు.. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌ చేయడం, టెస్టింగ్, నిర్వహణ వంటి సేవలను ఆన్‌ డిమాండ్‌ అందిస్తాయి. సంబంధిత సేవలు క్లయింట్స్‌కు ఇంటర్నెట్‌ ఆధారంగా చేరవేస్తారు. ఫలితంగా వారికి వాటిని వాస్తవ పరిస్థితుల్లో తమ అవసరాలకు వినియోగించడం సులభంగా మారుతుంది.

ఇంకా చదవండి : part 2: క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఈ కోర్సు విద్యార్థులకు అవకాశం.. రూ.5లక్షలకు పైగా ప్రారంభ వేతనంతో కొలువులు!

Published date : 30 Jun 2021 03:43PM

Photo Stories