Skip to main content

ఇంటర్‌తోనే పరిశోధనలకు సరైన మార్గం.. నెస్ట్

ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసుకుంటున్నారా.. సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి ఉందా.. ఇంజనీరింగ్, మెడిసిన్ వద్దు.. సైన్స్ పరిశోధనలే బెస్ట్ అనుకుంటున్నారా.. ఇందుకోసం... అందుబాటులోని మార్గాలు అన్వేషిస్తున్నారా.. అయితే..మీరు కోరుకున్న అవకాశం మీ ముంగిటకు వచ్చింది. అదే నెస్ట్.. నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్! నెస్ట్‌లో ర్యాంకు ద్వారా ప్రతిష్టాత్మక నైసర్ (భువనేశ్వర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డీఏఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్‌లలో.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. నెస్ట్-2019 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నెస్ట్‌తో ప్రయోజనాలు.. పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...
దేశంలో పరిశోధనలు పెరగాలి. విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులే కాకుండా.. ప్యూర్, బేసిక్ సెన్సైస్‌పై దృష్టిపెట్టాలి. అందుకోసమే భారత ప్రభుత్వం.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్)-భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై- డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లను దశాబ్దం క్రితమే నెలకొల్పి..అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూప్‌లు అర్హతగా పేర్కొన్న ఈ కోర్సులో ప్రవేశించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్‌లో టాప్ ర్యాంకు తప్పనిసరి. ఏటా నెస్ట్ పరీక్ష జరుగుతోంది. తాజాగా 2019-2024 విద్యాసంవత్సరానికి ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి నెస్ట్-2019 నోటిఫికేషన్ విడుదలైంది.

నెస్ట్ స్వరూపం :
నెస్ట్ ఎంట్రెన్స్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. మొత్తం అయిదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..
1. సెక్షన్ 1-జనరల్ ఆప్టిట్యూడ్-30 మార్కులు.
2. సెక్షన్ 2-బయాలజీ-50 మార్కులు.
3. సెక్షన్ 3-కెమిస్ట్రీ-50 మార్కులు.
4. సెక్షన్ 4-మ్యాథమెటిక్స్-50 మార్కులు.
5. సెక్షన్ 5-ఫిజిక్స్-50 మార్కులు.

పరీక్ష వ్యవధి: మూడున్నర గంటలు.
  • ఈ విభాగాల్లో విద్యార్థులందరికీ సెక్షన్-1(జనరల్ ఆప్టిట్యూడ్) తప్పనిసరి. మిగతా నాలుగు సెక్షన్లలో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు మూడు సెక్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే నాలుగు సెక్షన్లు కూడా రాసే అవకాశముంది. సబ్జెక్ట్ సెక్షన్ల (2-5)కు సంబంధించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నల క్లిష్టత స్థాయి జేఈఈ స్థాయిలో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు సన్నద్ధత దిశగా ప్రత్యేక కసరత్తు చేయాలి.
ఇలా చదివితే..
  • నెస్ట్‌లో పేర్కొన్న అన్ని విభాగాల నుంచి అడిగే ప్రశ్నలు అభ్యర్థుల్లో సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తిని గుర్తించే విధంగా ఉంటున్నాయి.
జనరల్ ఆప్టిట్యూడ్ (సెక్షన్-1): ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు విద్యార్థుల్లో సైన్స్ కోర్సుల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించేలా ఉంటాయి. కాబట్టి ఇటీవల కాలంలో సైన్స్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోవడం వల్ల సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
  • బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల నుంచి విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగ్రహణ సామర్థ్యం, తులనాత్మక విశ్లేషణను పరీక్షించేలా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి. అంతేకాకుండా ఆయా కాన్సెప్ట్‌లను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించేలా అనువర్తిత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
ఎన్‌సీఈఆర్‌టీపుస్తకాలు :
నెస్ట్ ఎంట్రన్స్.. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నలన్నీ సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు పది, పదకొండు, పన్నెండు తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది.

245 సీట్లు.. లక్ష మంది పోటీ !
నెస్ట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా నైసర్-భువనేశ్వర్‌లో 200 సీట్లు, యూనివర్సిటీ ఆఫ్ ముంబై- డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో 45 సీట్లు అందుబాటులో ఉండగా..వీటికి దాదాపు లక్ష మంది పోటీపడుతున్నారు. ఈ సీట్లకు అదనంగా రెండు ఇన్‌స్టిట్యూట్‌లలో రెండేసి సీట్లు చొప్పున మొత్తం నాలుగు సీట్లను జమ్మూకాశ్మీర్ విద్యార్థులకు సూపర్ న్యూమరరీ కోటాలో అందుబాటులో ఉన్నాయి.

ఉజ్వల భవిత ఖాయం..
నెస్ట్‌లో ప్రతిభ ద్వారా నైసర్(భువనేశ్వర్), యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో ప్రవేశం లభిస్తే..ఉజ్వల భవిష్యత్ ఖాయమని చెప్పొచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సు ద్వారా పరిశోధనలకు అవసరమైన నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. మొత్తం పది సెమిస్టర్ల కోర్సులో.. ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్‌లోని ఫ్యాకల్టీ సభ్యులు చేస్తున్న రీసెర్చ్‌లో తప్పనిసరిగా పాల్పంచుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్ కేటాయింపు ఉంటుంది.
కోర్సులివే: నెస్ట్‌లో ఉత్తీర్ణత ద్వారా ప్రవేశం లభించే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల వివరాలు..
  • బయలాజికల్ సెన్సైస్
  • కెమికల్ సెన్సైస్
  • మ్యాథమెటిక్స్
  • ఫిజిక్స్
ఆర్థిక ప్రోత్సాహం :
నెస్ట్ ఉత్తీర్ణతతో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు నెలకు రూ.5 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇన్‌స్పైర్ విజేతలకు నేరుగా స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ లేని వారికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన దిశ ప్రోగ్రామ్ ద్వారా నెలకు రూ.5 వేల స్కాలర్‌షిప్ అందుతుంది. దీనికి అదనంగా ఏటా సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసేందుకు రూ.20 వేలు గ్రాంట్ మంజూరు చేస్తారు. కోర్సు ఫీజులు సెమిస్టర్‌కు రూ.40 వేల లోపు ఉంటాయి.

నెస్ట్-2019 సమాచారం :
అర్హత: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూప్‌లతో 2017, 2018లలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2019లో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం మినహాయింపు.
వయసు: జనరల్ కేటగిరీ విద్యార్థులు ఆగస్ట్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి.

ఇంటిగ్రేటెడ్ పీజీతో ప్రయోజనాలు...
నైసర్-భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌తోపాటు.. ప్రస్తుతం దేశంలో పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు అయిదేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటివల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనం.. సెన్సైస్‌పై పరిపూర్ణ అవగాహన, నైపుణ్యం లభించడం. కొన్ని యూనివర్సిటీలు మూడేళ్ల తర్వాత.. విద్యార్థులు పీజీ కోర్సు చదవడంపై ఆసక్తి లేకపోతే.. బ్యాచిలర్ డిగ్రీ పట్టాను అందిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అన్ని యూనివర్సిటీలు అందించాలని యూజీసీ దాదాపు పదేళ్ల క్రితమే పేర్కొంది. విద్యార్థులను ఇంటర్మీడియెట్ స్థాయి నుంచే పరిశోధనలు, సెన్సైస్ దిశగా అడుగులు వేయించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇలా.. ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీ ప్రవేశాల్లోనూ ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

కెరీర్ అవకాశాలు..
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి భవిష్యత్తులో రీసెర్చ్ ల్యాబ్స్‌లో, సంస్థల ఆర్ అండ్ డీ సెంటర్లలో ఉద్యోగాలు లభిస్తాయి. అదే విధంగా ఈ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. దాన్ని కూడా పూర్తిచేస్తే యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, ప్రముఖ రీసెర్చ్ సంస్థల్లో సైంటిస్ట్‌లుగా రూ.లక్షల వేతనంతో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సుల పరంగా మౌలిక సదుపాయాల కొరత, స్కిల్ గ్యాప్ వంటి సమస్యలు, మెడికల్ కోణంలో పరిమిత సంఖ్యలో సీట్ల నేపథ్యంలో విద్యార్థులు సైన్స్ కోర్సులపైనా దృష్టి సారిస్తే మెరుగైన కెరీర్ అవకాశాలు లభించడం ఖాయం అనేది నిపుణుల అభిప్రాయం.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
మార్చి11, 2019
నెస్ట్ ఎంట్రన్స్ తేదీ: జూన్ 1 (రెండు సెషన్లలో).
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: ఏప్రిల్ 24, 2019 నుంచి.
ఫలితాల వెల్లడి: జూన్ 17, 2019
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nestexam.in
Published date : 23 Jan 2019 06:17PM

Photo Stories