Skip to main content

ఈ విదేశీ స్కాలర్‌షిప్‌లు అందుకోండ‌లా.. మంచి భవిష్యత్తు సాధించండిలా..!

విదేశీ విద్య.. ఖరీదైన కల! విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఎంతోమంది కలలు కంటుంటారు. కానీ, భారీ ఫీజులు, భరించలేని వ్యయాలు గుర్తొచ్చి వెనకడుగేస్తుంటారు. ప్రతిభావంతులకు ఆర్థిక అవరోధాలు అడ్డురాకూడదనే సదాశయంతో ఆయా దేశాలు, పలు ట్రస్టులు.. స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపే.. అమెరికా, బ్రిటన్‌లకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్‌షిప్స్‌పై ప్రత్యేక కథనం..

అమెరికా ఫుల్‌బ్రైట్‌–నెహ్రూ ఫెలోషిప్స్‌..
ఫుల్‌బ్రైట్‌–నెహ్రూ మాస్టర్స్‌ ఫెలోషిప్స్‌ను అమెరికాలోని ఎంపిక చేసిన వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆర్ట్స్, కల్చర్, మేనేజ్‌మెంట్, ఎన్విరా¯ŒSమెంటల్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ లీగల్‌ స్టడీస్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, పబ్లిక్‌ హెల్త్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ఉమెన్‌ స్టడీస్‌/జెండర్‌ స్టడీస్‌ చదువుతున్న ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు అందిస్తారు. ఫెలోషిప్‌ వ్యవధి ఒకటి లేదా రెండేళ్లు. దీనికి ఎంపికైతే జే-1 వీసా సపోర్ట్, ఎకానమీ క్లాస్‌ ఎయిర్‌ ట్రావెల్‌(రౌండ్‌ ట్రిప్‌), ట్యూషన్‌ ఫీజు, కొంత వరకు లివింగ్‌ కాస్ట్‌ వ్యయాలను గ్రాంట్‌ రూపంలో అందిస్తారు. అలాగే సిక్‌నెస్‌ అండ్‌ యాక్సెడెంట్‌ కవరేజ్‌లు లభిస్తాయి.
అర్హతలు: భారతీయ విశ్వవిద్యాలయాల నుంచి అమెరికన్‌ బ్యాచిలర్‌ డిగ్రీకి తత్సమాన‡డిగ్రీని కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ, ఫుల్‌ టైమ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.usief.org.in

ఇన్‌లాక్స్‌ స్కాలర్‌షిప్స్‌..
దీన్ని ఇన్‌లాక్స్‌ శివ్‌దాసానీ ఫౌండేషన్‌ అందిస్తోంది. అమెరికా, ఐరోపా, యూకేల్లోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాస్టర్స్, ఎంఫిల్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌ను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. శాస్త్రీయ, సాంస్కృతిక, కళాత్మక విభాగాల్లో ప్రతిభావంతులైన యువత వీటిని పొందేందుకు అర్హులు. వయసు 30ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.30 సీజీపీఏ ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, రవాణా ఖర్చులు లభిస్తాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.inlaksfoundation.org

హ్యూబర్ట్‌ హంప్రే ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌..
అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ ఇది. ప్రొఫెషనల్‌ అనుభవం పొందేందుకు అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరిన వారికి వీటిని అందిస్తారు. హ్యూమన్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్, రైట్స్‌ అండ్‌ ఫ్రీడమ్స్, సస్టెయినబుల్‌ ల్యాండ్స్, థ్రైవింగ్‌ కమ్యూనిటీస్‌ విభాగాల్లో అధ్యయనం చేసేవారికి పది నెలల పాటు ఈ ఫెలోషిప్‌ లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు, నివాస ఖర్చులకు సరిపడే మొత్తాన్ని చెల్లిస్తారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.humphreyfellowship.org

ఏఏసీఈ స్కాలర్‌షిప్స్‌..
యూఎస్‌లో ఇంజనీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్కాలర్‌షిప్‌..అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటింగ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(ఏఏసీఈ). అగ్రికల్చర్, కెమికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఫాల్‌ సెమిస్టర్‌ సెషన్‌లో ఎంఎస్‌లో చేరిన అభ్యర్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ లభిస్తాయి. ఎంపికైన వారికి ఏటా రెండు వేల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్ల వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. అభ్యర్థుల ప్రతిభ, ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌ ఆధారంగా వీటిని ప్రదానం చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.aace.org

యూకే కామన్వెల్త్‌ స్కాలర్‌షిప్స్‌..
కామన్వెల్త్‌ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు యూకే వర్సిటీల్లో ఫుల్‌టైమ్‌ మాస్టర్స్‌ కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించేందుకు వీటిని ప్రారంభించారు. ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను యూకే వర్సిటీలు సంయుక్తంగా అమలుచేస్తున్నాయి. దీనికి అవసరమైన నిధులను యూకే డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(డీఎఫ్‌ఐడీ) సమకూరుస్తుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్‌మెంట్, స్ట్రెంథనింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ కెపాసిటీ, ప్రమోటింగ్‌ గ్లోబల్‌ ప్రాస్పెరిటీ, గ్లోబల్‌ పీస్, సెక్యూరిటీ అండ్‌ గవర్నెన్స్, యాక్సెస్, ఇంక్లూజన్‌ అండ్‌ ఆపర్చునిటీ వంటి విభాగాల్లో ఏటా 800 స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నారు.lపీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు అర్హులు. స్కాలర్‌షిప్‌ కింద ట్యూషన్‌ ఫీజు మినహాయింపుగా లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cscuk.fcdo.gov.uk/

గ్రేట్‌ బ్రిటన్‌ స్కాలర్‌షిప్స్‌..
యూకేలో భారతీయ విద్యార్థులకు సంబంధించి ముఖ్యమైన స్కాలర్‌షిప్స్‌ ఇవి. వీటిని యూకే ప్రభుత్వ గ్రేట్‌ బ్రిటన్‌ క్యాంపైన్, బ్రిటిష్‌ కౌన్సిల్‌లు సంయుక్తంగా అందిస్తున్నాయి. ఏటా యూకే విశ్వవిద్యాలయాల్లో వివిధ మాస్టర్స్‌ కోర్సులు అభ్యసిస్తున్న 60 విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. స్కాలర్‌షిప్‌ వ్యవధి ఒక సంవత్సరం. స్కాలర్‌షిప్‌ కింద పదివేల పౌండ్లు ట్యూషన్‌ ఫీజుగా లభిస్తుంది. గ్రాడ్యుయేషన్‌తోపాటు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యం తప్పనిసరి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.britishcouncil.in

చార్లెస్‌ వాలెస్‌ ఇండియా ట్రస్ట్‌ స్కాలర్‌షిప్స్‌..
వీటిని 1981 నుంచి అందిస్తున్నారు. ఇప్పటి వరకు 3,000 మంది భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌ను అందుకున్నారు. 10 నెలల వ్యవధితో లాంగ్‌టర్మ్‌ స్కాలర్‌షిప్స్, మూడు నెలల వ్యవధితో విజిటింగ్‌ ఫెలోషిప్స్, అలాగే షార్ట్‌టర్మ్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌ కింద మూడు వేల పౌండ్లు నుంచి ఏడు వేల పౌండ్లు వరకు దక్కుతుంది. ఆర్ట్స్, హెరిటేజ్, కల్చర్‌ స్టడీస్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.britishcouncil.in

ఛెవెనింగ్‌ స్కాలర్‌షిప్స్‌..
వీటిని యూకే ప్రభుత్వం నేరుగా అందిస్తోంది. పీజీ స్థాయిలో అన్ని కోర్సుల విద్యార్థులు వీటిని పొందవచ్చు. ఎంపికైన వారికి ట్యూషన్‌ ఫీజు మినహాయింపు లభిస్తుంది. విద్యార్థులు యూకే యూనివర్సిటీ నుంచి పొందిన అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌ ఆధారంగా చెవెనింగ్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల అకడమిక్‌ ట్రాక్‌ రికార్డుతోపాటు ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్స్‌ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.chevening.org

ఫెలిక్స్‌ స్కాలర్‌షిప్‌..
యూకే యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌ ఇది. దీనికి ఎంపికైన వారికి ట్యూషన్‌ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.felixscholarship.org

Published date : 24 Jun 2021 01:28PM

Photo Stories