Skip to main content

ఈ కొత్త టెక్నాలజీల‌తో యువ‌త‌కు కొలువుల క‌ల్పన‌లో విప్లవం.. వివ‌రాలు తెలుసుకోండిలా..

సాంకేతిక అభివృద్ధి మనిషి జీవితాన్ని కొత్తగా ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) వంటి సాంకేతికతలు సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు వినూత్నతను ప్రదర్శిస్తూ.. కొత్త అనుభూతులకు వేదికలవుతున్నాయి. వీటితోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి టెక్నాలజీలు రోజురోజుకీ విస్తరిస్తూ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయా టెక్నాలజీ విభాగాల్లో ఉద్యోగాలకు అవసరమైన జాబ్‌ స్కిల్స్, అందుబాటులో ఉన్న కోర్సులు, సర్టిఫికేషన్స్, అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, కెరీర్‌ స్కోప్‌పై ప్రత్యేక కథనం...

వీఆర్‌ అండ్‌ ఏఆర్‌..
వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌).. టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన ఓ వినూత్న అనుభూతి! వీఆర్‌ సాంకేతికతలో ఓకులస్‌ క్వెస్ట్‌ లేదా వాల్వ్‌ ఇండెక్స్‌గా పిలిచే హెడ్‌సెట్స్‌ను పెట్టుకొని ఉన్నచోట నుంచే వేరే ప్రదేశం సందర్శించిన అనుభూతిని పొందవచ్చు. హెడ్‌సెట్‌ను ఆన్‌ చేయగానే ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ ప్యానల్స్‌ లెన్స్‌ ద్వారా పరావర్తనం చెంది స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యే వీడియో 360 డిగ్రీల కోణంలో కనిపిస్తుంది. దాంతో వీక్షకులు హెడ్‌సెట్‌లో డిస్‌ప్లే అయ్యే ప్రదేశాల్లో సంచరిస్తున్నట్టు, దగ్గరగా చూస్తున్న భావనకు లోనవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వాస్తవ పరిస్థితులను మరిపించి ఊహాజనిత లోకంలోకి తీసుకెళ్లేదే.. వర్చువల్‌ రియాలిటీ. వర్చువల్‌ ఆబ్జెక్ట్స్‌ (ప్రతిబింబాలు)ను నిజ జీవితంతో కలిపి చూపించడాన్ని ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఎఆర్‌) అంటారు.

టాప్‌ ట్రెండ్స్‌..
వీఆర్, ఎఆర్‌ టెక్నాలజీల వినియోగం రాబోయే రోజుల్లో మరింతగా విస్తృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతోంది. దాంతో ఆగ్మెంటెడ్‌æ రియాలిటీ సైతం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పోక్‌మాన్‌ గో, ఇతర స్పోర్ట్స్‌ గేమ్స్‌ యువతలో విశేష ఆదరణ పొందుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సామ్‌సంగ్, ఆపిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు.. ఏఆర్‌ను స్మార్ట్‌ ఫోన్స్‌తో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నాయి.

ఏఐతో అనుసంధానం..
వర్చువల్, ఆగ్మెంటెడ్‌ రియాలిటీలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో అనుసంధానిస్తున్నారు. సాంకేతికంగా ఇదొక తాజా ట్రెండ్‌! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు పనిచేసే తీరును మార్చివేస్తోంది. కంప్యూటర్ల స్వీయ ఇంటరాక్షన్‌ కారణంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగం ప్రయోజనం పొందుతోంది. ఆగ్మెంటెడ్‌æరియాలిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానించడం ద్వారా.. యాప్‌ ఫిల్టర్స్, ఫేస్‌బుక్‌లో ఫోటో ట్యాగింగ్‌ సమయంలో ఫేస్‌ రికగ్నిషన్‌ వంటి సౌకర్యాలు లభిస్తాయి.

కొలువులెక్కడ..
కోర్సెరా, ఎడెక్స్, ఉడెమీ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఈ టెక్నాలజీపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంది. ఫలితంగా ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో వివిధ రకాల ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ టెక్నాలజీలో గేమ్‌ డిజైనర్, గేమ్‌ డెవలపర్, 2డీ కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్, 3డీ ఆర్టిస్ట్, 3డీ యానిమేటర్, సౌండ్‌ ఇంజనీర్‌ వంటి కొలువులు దక్కించుకోవచ్చు.

డేటా అనలిటిక్స్‌..
ప్రస్తుతం ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్‌ పరంగా కీలకంగా నిలుస్తున్న మరో విభాగం.. డేటా అనలిటిక్స్‌. విస్తృతంగా ఉన్న డేటాను విశ్లేషించి.. సంస్థలకు ఉపయోగపడే వివరాలను అందించే డేటా అనలిస్ట్‌లకు ఐటీ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ విభాగంలో కొలువులు అందించేందుకు సంస్థలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను పేర్కొంటున్నాయి. అవి.. మ్యాథమెటికల్‌ స్కిల్స్, స్టాటిస్టికల్‌ స్కిల్స్, కంప్యుటేషనల్‌ స్కిల్స్, స్టాటిస్టికల్‌ అనాలిసిస్‌ సిస్టమ్‌. ఆయా విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి నైపుణ్యాలతోనూ డేటా సైంటిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు ఉంటే వేతనాల పరంగా ప్రయోజనం పొందొచ్చు. పీజీ స్థాయి లో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్లు చేయడం లాభిస్తుంది. వీటితోపాటు హడూప్, స్టాటిస్టికల్‌ అనాలిసిస్‌ సిస్టమ్‌ వంటి ప్రోగ్రామ్‌లలో శిక్షణతో మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. అకడమిక్‌ శిక్షణ విషయానికొస్తే.. ఇటీవల కాలంలో ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్‌ సంబంధిత కోర్సులు అందిస్తున్నాయి. ఐఐఎం–రాంచీ, కోల్‌కత, ఐఎస్‌బీ–హైదరాబాద్, ఐఐఎస్‌సీ బెంగళూరులు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు ప్రస్తుతం పలు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి కోర్సెరా, ఎడెక్స్, ఉడెమీ వంటి ఆన్‌లైన్‌ వేదికల్లో శిక్షణ పొందొచ్చు.

సైబర్‌ సెక్యూరిటీ..
ఐటీ సంస్థల్లో అవకాశాల పరంగా ఇటీవల కాలంలో అత్యంత ప్రాధాన్యం లభిస్తున్న విభాగం... సైబర్‌ సెక్యూరిటీ. హ్యాకర్ల ముప్పు అడ్డుకునేలా ప్రోగ్రామింగ్‌ చేయడమే సైబర్‌ సెక్యూరిటీ ప్రధాన ఉద్దేశం. క్లయింట్‌ సంస్థలకు ఐటీ సేవలు అందించే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. వెబ్‌సైట్స్, ఈ–మెయిల్స్, ఇతర ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ పరంగా సైబర్‌ భద్రతను కల్పిస్తాయి. ఐటీ సంస్థలు.. డేటా సెక్యూరిటీ, అప్లికేషన్‌ సెక్యూరిటీ, సెక్యూరిటీ మానిటరింగ్‌ విభాగాల్లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి నైపుణ్యాలు అందించేందుకు పలు శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి..

  • సిస్కో సీసీఎన్‌ఏ సెక్యూరిటీ; సీసీఎన్‌పీ సెక్యూరిటీ; సీసీఐఈ సెక్యూరిటీ

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.cisco.com

  • EC కౌన్సిల్‌; సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.eccouncil.org

  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సులు

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.iisecurity.in

  • డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్‌ కోర్సులు

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.dsci.in

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ..
ఐటీ రిక్రూట్‌మెంట్స్‌ పరంగా ఎమర్జింగ్‌ సెగ్మెంట్‌గా నిలుస్తున్న మరో విభాగం.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ. ప్రస్తుతం పేపర్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్, డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో కొలువుల పరంగా సీఎస్‌ఈ విద్యార్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, జావా, పైథాన్‌ వంటి లాంగ్వేజెస్‌ల్లో పట్టున్న అభ్యర్థులకు నియామకాల పరంగా ప్రాధాన్యం దక్కుతోంది. ప్రస్తుతం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో పలు ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల వెబ్‌సైట్స్‌ వివరాలు..

రోబోటిక్స్‌..
ప్రస్తుతం ఐటీ రంగంలో కార్యకలాపాల పరంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న మరో టెక్నాలజీ..రోబోటిక్స్‌. ఐటీ సంస్థలు క్లయింట్‌ సంస్థలకు సర్వీసులు అందిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కాగా, బ్యాం కింగ్,మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్‌ విభాగాల్లోని సంస్థలు రోబో ఆధారిత సేవలను విస్తృతం చేస్తున్నాయి. సదరు రోబోలు సరిగా విధులు నిర్వర్తించేలా ప్రోగ్రామింగ్, కోడింగ్‌ రూపొందించే విధులను ఐటీ సంస్థల చేపడుతున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీల్లో రోబోటిక్స్‌ స్కిల్స్‌ ఉన్న వారికి రిక్రూట్‌మెంట్‌ పరంగా ప్రాధాన్యం దక్కుతోంది. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్‌; నానో టెక్నాలజీ; డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో కోర్‌ నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్‌ పెరుగుతోంది. రోబోటిక్స్‌ టెక్నీషియన్స్‌; రోబో ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌; రోబోటిక్స్‌ టెస్ట్‌ ఇంజనీర్స్‌; సీనియర్‌ రోబోటిక్స్‌ ఇంజనీర్స్‌; ఆటోమేటెడ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌; అగ్రికల్చర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌; రోబోటిక్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌ వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే నెలకు రూ.50 వేల వేతనం దక్కుతోంది.

సర్టిఫికేషన్‌ కోర్సులు..

  • సర్టిఫైడ్‌ ఆటోమేషన్‌ ప్రొఫెషనల్‌:

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.isa.org

  • రోబోటిక్స్‌ టెక్నీషియన్‌ అండ్‌ ఆటోమేషన్‌ ట్రైనింగ్‌:

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.onlinerobotics.com

  • రోబోటిక్స్‌ ఆన్‌లైన్‌:

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.robotics.org

  • రోబో జీనియస్‌ అకాడమీ:

పూర్తి వివ‌రాల‌కువెబ్‌సైట్‌: www.robogenious.in

Published date : 21 Apr 2021 03:06PM

Photo Stories