Skip to main content

ఆయుష్‌లో నీట్‌ స్కోర్‌ ఆధారంగా.. ఆల్‌ ఇండియా, రాష్ట్రాల కోటాల్లో సీట్ల భర్తీ ఇలా..

ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్‌ బైపీసీ(కనీసం 50 శాతం మార్కులు). దాంతోపాటు జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)–యూజీలో ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

ముందుగా నీట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లను భర్తీ చేస్తారు.

  • ఆ తర్వాత ఆయుష్‌ కోర్సులకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.
  • ఈ నోటిఫికేషన్‌ను అనుసరించి..నీట్‌ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమకు ఆసక్తి ఉన్న కోర్సుకు సంబంధించి ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాథమ్యాలు, నీట్‌–స్కోర్‌/ర్యాంకు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.

ఆల్‌ ఇండియా కోటా..
ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న ఆల్‌ ఇండియా కోటా విధానాన్నే.. ఆయుష్‌ కోర్సుల విషయంలోనూ అమలు చేస్తున్నారు. ముందుగా మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటాకు కేటాయిస్తారు. ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించిన సీట్లను జాతీయ స్థాయిలో ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆయుష్‌ అడ్మిషన్స్‌ సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఏఏసీసీసీ) ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని సీట్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. ఈ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

రాష్ట్రాల పరిధిలో సీట్ల భర్తీ ఇలా..
రాష్ట్రాల పరిధిలోని సీట్ల భర్తీని ఆయా రాష్ట్రాలకు చెందిన హెల్త్‌ యూనివర్సిటీలు చేపడతాయి. ఇందుకోసం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించిన 15 శాతం సీట్లను మినహాయించగా..మిగిలిన 85 శాతం సీట్లకు ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను ఎ–కేటగిరీ కింద కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేట్‌లోని మిగతా 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా విధానాల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీనారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీలు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కూడా యూనివర్సిటీ పరిధిలోనే సంబంధిత వెబ్‌సైట్‌ ఆధారంగా కౌన్సెల్సింగ్‌ నిర్వహిస్తారు.

ఏపీ, టీఎస్‌.. సీట్ల వివరాలు

  • బీఏఎంఎస్‌కు సంబంధించి ఏపీలో రెండు ప్రభుత్వ కళాశాలల్లో వంద సీట్లు, ఒక ప్రైవేటు కళాశాలలో వంద సీట్లు; తెలంగాణలో రెండు కళాశాలల్లో వంద సీట్లు ఉన్నాయి.
  • బీహెచ్‌ఎంఎస్‌కు సంబంధించి ఏపీలో.. మూడు ప్రభుత్వ కళాశాలల్లో 120 సీట్లు, నాలుగు ప్రైవేట్‌ కళాశాలల్లో నాలుగు వందల సీట్లు; తెలంగాణలో.. ఒక ప్రభుత్వ కళాశాలలో వంద సీట్లు, ప్రైవేట్‌ కళాశాలల్లో మరో నాలుగు వందల సీట్లు ఉన్నాయి.
  • బీఎన్‌వైఎస్‌ కోర్సుకు సంబంధించి తెలంగాణలో సీట్ల సంఖ్య 100; కాగా ఏపీలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 200.
  • యునానీ(బీయూఎంఎస్‌) కోర్సుకు సంబంధించి తెలంగాణలో 75 సీట్లు, ఏపీలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • 2020–21 విద్యా సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని హెల్త్‌ యూనివర్సిటీలు నోటిఫికేషన్‌లో ప్రకటించిన వివరాల మేరకు ఈ సీట్ల సంఖ్యను పేర్కొనడం జరిగింది.

నీట్‌–పీజీ..
ఆయుష్‌ విభాగంలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు నీట్‌–పీజీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీట్‌–పీజీ స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల పరిధిలో వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి.

అవకాశాలు మెరుగు..
ఆయుష్‌ విభాగంలో కెరీర్‌ అవకాశాలు మెరుగవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రజలు ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి సారిస్తుండటమే. అల్లోపతితోపాటు ఆయుర్వేద, హోమియో, యోగిక్‌ సైన్స్‌ విభాగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఆయుర్వేద, హోమియో కోర్సుల ఉత్తీర్ణులకు సంబంధిత ఫార్మా సంస్థల్లో సైతం ఉపాధి లభిస్తోంది.
– ఆర్‌.మీనా కుమారి, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ సభ్యులు

ఇంకా చదవండి : part 1: ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న ‘ఆయుష్‌’తో.. మంచి కెరీర్‌ అందుకోండిలా!

Published date : 29 Jun 2021 05:45PM

Photo Stories