NDA - NA Exam 2022 : చదువు + కొలువు (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్ )
- ఎన్‌డీఏ,ఎన్‌ఏ–1(2022)నోటిఫికేషన్ విడుదల
- మహిళా అభ్యర్థులకూ అవకాశం
- ఇంటర్‌తోనే త్రివిధ దళాల్లో కెరీర్‌కు మార్గం
- శిక్షణ తర్వాత బ్యాచిలర్ డిగ్రీతోపాటు కొలువు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంక్షిప్తంగా ఎన్‌డీఏ. నేవల్ అకాడమీ.. ఎన్‌ఏ! ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లోకి చురుకైన యువతను ఎంపిక చేసి.. శిక్షణనిచ్చి.. దేశ రక్షణలో భాగస్వాములను చేసే అకాడమీలు ఇవి! త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్ హోదా మొదలు.. జనరల్, అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్ వరకూ.. ఇలా.. వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా.. ఎన్‌డీఏ, ఎన్‌ఏలో శిక్షణ పొందిన వారే!! ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఎన్‌డీఏ, ఎన్‌ఏలలో అడుగు పెట్టొచ్చు. ఇందుకోసం రెండంచెల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది!! తాజాగా యూపీఎస్సీ.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ(1)–2022 రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియ, అర్హతలు, రాత పరీక్ష విధా నం, భవిష్యత్తు అవకాశాలు, విజయానికి అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ..
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్.. త్రివిధ దళాల్లో ఎంట్రీ లెవల్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష. ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 2022కు సంబంధించి ఎన్‌డీఏ, ఎన్‌ఏ–1(2022)కు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.
మహిళలకూ అవకాశం
ఎన్‌డీఏ, ఎన్‌ఏ తాజా నోటిఫికేషన్‌లో మహిళా అభ్యర్థులకూ అవకాశం కల్పించారు. రక్షణ దళాల్లో మహిళలకూ పర్మనెంట్ కమిషన్ ర్యాంకు అర్హత కల్పించాలనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2021 ఎంపికలోనే ఈ నిర్ణయం అమ లైంది. అప్పుడు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మహిళలకు అర్హత కల్పించారు. ఈసారి ప్రధాన నోటిఫికేషన్‌లోనే మహిళా అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. దాంతో త్రివిధ దళాలపై ఆసక్తి ఉన్న మహిళా విద్యార్థులు ముందుగానే సన్నద్ధత పొందేందుకు అవకాశం లభిస్తోంది.
మొత్తం 400 ఖాళీలు
- ∙ఎన్‌డీఏ,ఎన్‌ఏ(1)–2022 ఎంపిక ప్రక్రియ ద్వారా.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో మొత్తం నాలుగు వందల పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని పోస్ట్‌లలో భాగంగానే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు వేర్వేరుగా ఖాళీలను ప్రకటించారు.
- ∙పోస్టుల వివరాలు: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ–370(ఆర్మీ–208, నేవీ–42, ఎయిర్‌ఫోర్స్–120); నావల్ అకాడెమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) –30.
Also read: NDA-NA Preparation:ఎన్‌డీఏ, ఎన్‌ఏ..రాత పరీక్ష ఇలా
విద్యార్హత
- ∙ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి.
- ∙ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యా ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అభ్య ర్థులు 24 డిసెంబర్ 2022 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
- ∙వయోపరిమితి: జూలై 2, 2003–జూలై 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
- ∙అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
- ∙ఎన్‌డీఏ,ఎన్‌ఏకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అవి.. రాత పరీక్ష(ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్); ఎస్‌ఎస్‌బీ సెలక్షన్ ప్రక్రియ.
- ∙ముందుగా యూపీఎస్సీ–ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఎంపికైన వారికి తదుపరి దశలో ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి.
శిక్షణ, డిగ్రీ పట్టా
రెండు దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పుణెలో, నేవల్ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణను విజయ వంతంగా పూర్తి చేసుకున్న వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్ పట్టాలు కూడా అందజేస్తారు. అంటే.. ఒకే సమయంలో కొలువు, ఉన్నత విద్య రెండింటినీ సొంతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.
శిక్షణ ఇలా
నేషనల్ డిఫెన్స్ అకాడమీ–పుణెలో మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకే విధంగా శిక్షణ ఇస్తారు. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ నుంచి బీఏ, బీఎస్‌సీ, బీఎస్‌సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను అందిస్తారు. ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలను ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న వారికి బీటెక్ చదివేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీరు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి.
10+2 క్యాడెట్ ఎంట్రీ
10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు.
ఫిజికల్ ట్రైనింగ్
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి వారు ఎంపికైన దళం పరిధిలో నిర్దిష్ట వ్యవధిలో మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్), నేవీ క్యాడెట్స్‌కు నేవల్ అకాడమీ(ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది.
స్టైపెండ్ రూ.56,100
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి శిక్షణ సమయంలో పే లెవల్–10కు సమానమైన రూ.56,100 స్టైపెండ్‌గా అందిస్తారు. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్; నేవీ విభాగంలో సబ్ లెఫ్ట్‌నెంట్; ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్‌తో కెరీర్ ప్రారంభమవుతుంది.
పర్మనెంట్ కమిషన్‌తో కొలువు
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాల్లో లభించే హోదాలు, పదోన్నతుల వివరాలు..
- ∙ఆర్మీ: లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్ట్‌నెంట్ కల్న ల్, కల్నల్(సెలక్షన్), కల్నల్(టైమ్ స్కేల్), బ్రిగేడి యర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్, జనరల్.
- ∙నేవీ: సబ్ లెఫ్ట్‌నెంట్, లెఫ్ట్‌నెంట్, లెఫ్ట్‌నెంట్ కమాండర్, కమాండర్, కెప్టెన్(సెలక్షన్), కెప్టెన్(టైమ్ స్కేల్), కమొడోర్, రేర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్, అడ్మిరల్.
- ∙ఎయిర్ ఫోర్స్: ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్(సెలక్షన్), గ్రూప్ కెప్టెన్(టైమ్ స్కేల్), ఎయిర్ కమొడోర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్.
- ∙మొత్తంగా చూస్తే ఆర్మీలో కల్నల్(టైమ్ స్కేల్), నేవీలో కెప్టెన్(టైమ్ స్కేల్), ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్(టైమ్ స్కేల్) స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంది.
- ∙ఆ తర్వాత ఆయా విభాగాల్లో ప్రత్యేక ఎంపిక కమిటీ ద్వారా ఖరారయ్యే పదోన్నతుల ఆధారంగా ఆర్మీ జనరల్, నేవీ అడ్మిరల్, ఎయిర్ చీఫ్ మార్షల్ వంటి అత్యున్నత హోదాలు అందుకునే అవకాశం ఉంది.
- ఎన్‌డీఏ–ఎన్‌ఏ(1)–2022
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు upsconline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.01. 2022
- ఆన్‌లైన్ దరఖాస్తు ఉపసంహరణ: జనవరి 18, 2022–జనవరి 24, 2022
- ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2022
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in