Skip to main content

కెరీర్.. ఇన్ ఇండియన్ కోస్ట్‌గార్డ్

దాదాపు రెండువేల కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం.. ఇతర మార్గాల కంటే జలమార్గంలో విదేశీ చొరబాటుదారుల ప్రవేశానికి ఆస్కారం ఎక్కువగా ఉండటం.. దేశ భద్రతకు ప్రమాదకరంగా మారడం.. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం ‘ఇండియన్ కోస్ట్ గార్డ్’. డెరైక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో తీరగస్తీ విభాగంలో పలు స్థాయిలో నియామకాలు జరుగుతుంటాయి.

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో.. ఆఫీసర్స్ ఎంట్రీ, సెయిలర్స్ ఎంట్రీ.. అనే రెండు విధానాల ద్వారా కెరీర్ ప్రారంభించవచ్చు.

వాటిలో సెయిలర్స్ ఎంట్రీ వివరాలను పరిశీలిస్తే..
సెయిలర్స్ ఎంట్రీలో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ హోదాలు ఉంటాయి. వాటి వివరాలు..

నావిక్స్(జనరల్ డ్యూటీ):
అర్హత:
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2/ఇంటర్మీడియెట్(10+2+3 విధానంలో).
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు కలిగుండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: 157 సెంటీ మీటర్ల ఎత్తు, దానికి తగిన బరువు, 6/6, 6/9 కంటిచూపు కలిగుండటం వంటి శారీరక ప్రమాణాలకు సరితూగాలి.

శిక్షణ ఇలా:
కోస్ట్ గార్డ్ 10+2 ఎంట్రీ స్కీం ద్వారా.. నావిక్స్(జనరల్ డ్యూటీ)గా అడుగుపెట్టిన అభ్యర్థులకు సీమ్యాన్, కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, ఏవియేషన్ వంటి విభాగాల్లో శిక్షణనిస్తారు. మొత్తం 24 వారాలపాటు ఐఎన్‌ఎస్ చిల్కా (ఒడిశా)లో ఈ శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఎంపికైన కేడర్ ఆధారంగా మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణనిస్తారు.

కెరీర్:
కోస్ట్ గార్డ్ 10+2 ఎంట్రీ హోదాలో అడుగుపెట్టిన అభ్యర్థి సీనియారిటీ ప్రాతిపదికగా నావిక్, ఉత్తమ్ నావిక్, ప్రధాన్ నావిక్, అధికారి, ఉత్తమ్ అధికారి, ప్రధాన్ అధికారి వరకు ఎదగొచ్చు. అదేవిధంగా పనితీరు ఆధారంగా ఆఫీసర్ కేడర్ కూడా అందుకోవచ్చు.

వేతనాలు:
ప్రారంభంలో నావిక్ (జీడీ) హోదాలో రూ.5,200-20, 200 (గ్రేడ్ పే రూ. 2000) పే స్కేల్ లభిస్తుంది. ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్ ఆధారంగా ప్రధాన్ అధికారి స్థాయికి చేరుకుంటే రూ.9,300- 34,800(గ్రేడ్ పే రూ. 4,800) పే స్కేల్ సొంతమవుతుంది. వీటితోపాటు అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత రేషన్, దుస్తులు, వైద్య చికిత్సలు వంటి సదుపాయాలు లభిస్తాయి.

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్):
అర్హత
: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో వయసు కలిగుండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: 157 సెంటీ మీటర్ల ఎత్తు, దానికి తగిన బరువు, 6/6, 6/9 కంటిచూపు కలిగుండటం వంటి శారీరక ప్రమాణాలకు సరితూగాలి.

శిక్షణ ఇలా:
నావిక్ (డొమెస్టిక్) బ్రాంచ్ అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో మూడు నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్-హమ్లా (ముంబై)లో ఆరు నెలలపాటు బ్రాంచ్ ట్రైనింగ్ ఉంటుంది.

కెరీర్:
కోస్ట్ గార్డ్ నావిక్ (డొమెస్టిక్) ఎంట్రీ హోదాలో అడుగుపెట్టిన అభ్యర్థి సీనియారిటీ ప్రాతిపదికగా నావిక్, ఉత్తమ్ నావిక్, ప్రధాన్ నావిక్, అధికారి, ఉత్తమ్ అధికారి, ప్రధాన్ అధికారి వరకు ఎదగొచ్చు. అదేవిధంగా పనితీరు ఆధారంగా ఆఫీసర్ కేడర్ కూడా అందుకోవచ్చు.

వేతనాలు:
ప్రారంభంలో నావిక్(జీడీ) హోదాలో రూ.5,200-20, 200 (గ్రేడ్ పే రూ. 2000) పే స్కేల్ లభిస్తుంది. ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్ ఆధారంగా ప్రధాన్ అధికారి స్థాయికి చేరుకుంటే రూ.9,300- 34,800(గ్రేడ్ పే రూ. 4,800) పే స్కేల్ సొంతమవుతుంది. వీటితోపాటు అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత రేషన్, దుస్తులు, వైద్య చికిత్సలు వంటి సదుపాయాలు లభిస్తాయి.

యాంత్రిక్స్:
అర్హత
: డిప్లొమా ఇన్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఏరోనాటికల్).
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో వయసు కలిగుండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: 157 సెంటీ మీటర్ల ఎత్తు, దానికి తగిన బరువు, 6/6, 6/9 కంటిచూపు కలిగుండటం వంటి శారీరక ప్రమాణాలకు సరితూగాలి.

కెరీర్:
యాంత్రిక్ పోస్టుకు ఎంపికైన అభ్యరులుసీనియారిటీ ప్రాతిపదికగా యాంత్రిక్, ఉత్తమ్ యాంత్రిక్, ప్రధాన్ యాంత్రిక్, సహాయక్ ఇంజనీర్, ఉత్తమ్ సహాయక్ ఇంజనీర్, ప్రధాన్ సహాయక్ ఇంజనీర్ వరకు ఎదగొచ్చు. అదేవిధంగా పనితీరు ఆధారంగా ఆఫీసర్ కేడర్ కూడా అందుకోవచ్చు.

శిక్షణ:
యాంత్రిక్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 9 వారాలపాటు ఐఎన్‌ఎస్ చిల్కా (ఒడిశా)లో ఈ శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత మూడు నెలలపాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఎంపిక చేసుకున్న బ్రాంచ్ ఆధారంగా ఐఎన్‌ఎస్ శివాజీ/ఐఎన్‌ఎస్ వల్సూరా/నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఏటీ)/షిప్ రైట్ స్కూల్‌లలో 90-100 వారాలపాటు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు.

వేతనాలు:
ప్రారంభంలో నావిక్ (జీడీ) హోదాలో రూ.5,200-20, 200 (గ్రేడ్ పే రూ. 2000) పే స్కేల్ లభిస్తుంది. ఆ తర్వాత సీనియారిటీ, ప్రమోషన్ ఆధారంగా ప్రధాన్ అధికారి స్థాయికి చేరుకుంటే రూ. 9,300- 34,800 (గ్రేడ్ పే రూ. 4,800) పే స్కేల్ సొంతమవుతుంది. వీటితోపాటు అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత రేషన్, దుస్తులు, వైద్య చికిత్సలు వంటి సదుపాయాలు లభిస్తాయి.

ఎంపిక ఇలా:
వచ్చిన దరఖాస్తుల్లోంచి మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా జోన్ల పరిధిలోని నిర్దేశిత కేంద్రాల్లో సెలక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్) టెస్ట్, ఇంటర్వ్యూ దశలను అధిగమించాల్సి ఉంటుంది. రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లోనూ ఉత్తీర్ణత సాధించాలి. ఈ క్రమంలో 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో చేరుకోవడం, 20 స్క్వాట్ అప్స్, 10 పుషప్స్ తీయాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు చివరగా వైద్య పరీక్షలు, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలోనూ సంతృప్తికర ఫలితాలు పొందిన వారికి తుదిజాబితాలో చోటు లభిస్తుంది. తద్వారా కోస్ట్‌గార్డ్‌గా కాలుమోపే అవకాశం సొంతమవుతుంది.

టెస్ట్ సెంటర్లు:
కోస్ట్‌గార్డ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం ఆరు జోన్ల పరిధి (పశ్చిమ, తూర్పు, ఈశాన్య, ఏ అండ్ ఎన్, వాయవ్య, ఉత్తర)లో ఉంటుంది. మన రాష్ట్ర అభ్యర్థులు చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు జోన్ పరిధిలోకి వస్తారు. మన రాష్ట్ర అభ్యర్థులు విశాఖపట్నం, సికింద్రాబాద్‌లలో ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. సంబంధి రిక్రూట్‌మెంట్ సమాచారాన్ని ఎంప్లాయిమెంట్ న్యూస్, అన్ని ప్రముఖదిన పత్రికలు, మ్యాగజీన్లు, అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ రీసోర్సెస్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్: indiancoastguard.nic.in
Published date : 08 Jul 2013 03:21PM

Photo Stories