Skip to main content

షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్స్...`డిప్లొమా`కు అదనపు బలం!

ప్రస్తుత పరిస్థితుల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కొలువులు ఖాయం. అయితే అవకాశాలను వేగంగా అందుకోవటం, కెరీర్‌ను సక్సెస్‌పుల్‌గా కొనసాగించటంలో అదనపు నైపుణ్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి. విద్యార్థులు షార్ట్ టర్మ్ కోర్సులతో డిప్లొమాకు అదనపు అర్హతలను అద్దుకోవచ్చు.
దీనికోసం అనేక షార్ట్ టర్మ్ జాబ్ ఓరియెంటెడ్ సర్టిఫికేషన్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. మరికొద్ది నెలల్లో పాలిటెక్నిక్ కోర్సుల వార్షిక పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో డిప్లొమా విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల వివరాలు..
  • ‘ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు లభిస్తున్నారు. కానీ, డిప్లొమా అభ్యర్థులు లభించట్లేదు’ పరిశ్రమ వర్గాల నుంచి నియామకాల పరంగా వినిపిస్తున్న మాట. పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు ఖాయం అని చెప్పడానికి ఇదే నిదర్శనం.
  • వృత్తిలో మంచి పనితీరు ప్రదర్శించటం ద్వారా ఆకర్షణీయమైన వేతనం అందుకోవచ్చు. ఇందులో భాగంగా విద్యార్థులు అప్‌డేటెడ్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
  • డిప్లొమా విద్యార్థులు ఈ దిశగా షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందటం ద్వారా అదనపు నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు.

క్యాడ్
  • డిప్లొమా బ్రాంచ్‌తో సంబంధం లేకుండా మెకానికల్, ఆటో మొబైల్, ఈసీఈ, సివిల్.. ఇలా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు ఉపయోగపడే కోర్సు CAD (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్). ఈ కోర్సు ద్వారా కంప్యూటర్ ఉపయోగించి నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ ఆధారంగా డిజైన్ రూపకల్పన, విశ్లేషణ, పరిస్థితులకు తగ్గట్లు డిజైన్లను ఆవిష్కరించటం వంటి నైపుణ్యాలను అందుకోవచ్చు.
  • క్యాడ్ శిక్షణ ద్వారా టెక్నికల్ డ్రాయింగ్, మెకానికల్ డిజైన్ ఆటోమేషన్ వంటి ఇతర నైపుణ్యాలు కూడా లభిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లతో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా అంశాల్లో నైపుణ్యం పొందాల్సిన అవసరం ఉంది.
  • ఆటోడెస్క్ సంస్థ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులో ప్రస్తుతం ఎన్నో సంస్థలు శిక్షణనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆటోడెస్క్ అధీకృత శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా శిక్షణ పొందితే సర్టిఫికెట్లు కూడా అందుకోవచ్చు.
వెబ్‌సైట్: www.autodesk.in

సీఎన్‌సీ ట్రైనింగ్
మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు ఉపయోగపడే షార్ట్ టర్మ్ కోర్సు సీఎన్‌సీ (కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్). ముఖ్యంగా ఉత్పత్తుల తయారీ క్రమంలో సీఎన్‌సీ మెషీన్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో ఈ విభాగంలో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
  • యంత్రాన్ని రూపొందించే నైపుణ్యాలతో పాటు దాని పనితీరును కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా సమీక్షించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం వంటి నైపుణ్యాలు కూడా సీఎన్‌సీ ట్రైనింగ్ ద్వారా లభిస్తాయి.
  • లేజర్ కటింగ్, వెల్డింగ్, అల్ట్రాసోనిక్ వెల్డింగ్, ప్లాస్మా కటింగ్ వంటి ఆధునిక కార్యకలాపాల పర్యవేక్షణలో సీఎన్‌ఎసీ మెళకువలు ఎంతో ఉపకరిస్తాయి. సీఎన్‌సీ అకాడమీ రూపొందించిన ఈ కోర్సుకు సంబంధించి పలు శిక్షణ సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.cncacademy.com

రోబోటిక్స్
  • మెకానికల్ విద్యార్థులకు ఉపయోగపడే మరో కోర్సు రోబోటిక్స్. వైర్డ్ కంట్రోలింగ్, వైర్‌లెస్ కంట్రోలింగ్, ఇండస్ట్రియల్ రోబోస్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చే రోబోటిక్స్ కోర్సు పూర్తి చేస్తే అవకాశాలు అందుకునే విషయంలో ఇతరుల కంటే ఒకడుగు ముందుండవచ్చు.
వెబ్‌సైట్: www.indianinstituteofrobotics.com

ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ
  • ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ సర్టిఫికెట్ కోర్సు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లతో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు చాలా ఉపయోగపడతుంది. స్టీల్, అల్యూమినియం, రాగి వంటి లోహాలను వినియోగిస్తూ వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ చేయడం,కంప్యూటర్ నియంత్రణా నైపుణ్యాలు ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ ద్వారా లభిస్తాయి.
వెబ్‌సైట్: www.aws.org , www.agma.org

బిల్డింగ్ డిజైన్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్
  • సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థులకు అదనపు ప్రయోజనాలు కల్పించే షార్ట్ టర్మ్ సాఫ్ట్‌వేర్ కోర్సు.. బిల్డింగ్ డిజైన్ సాఫ్ట్‌వేర్. ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ ఆధారంగా సర్వేయింగ్, డ్రాయింగ్, 2డీ డ్రాఫ్టింగ్, 3డీ మోడలింగ్, అనాలిసిస్ వంటి నైపుణ్యాలు ఈ కోర్సులో లభిస్తాయి.
  • క్యాడ్‌కు అడ్వాన్స్‌డ్ వర్షన్‌గా ఈ సాఫ్ట్‌వేర్‌ను పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్ సర్టిఫికెట్‌కు జాబ్ మార్కెట్లో డిమాండ్ నెలకొంది. పలు సంస్థలు ఆటో డెస్క్ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ శిక్షణను అందిస్తున్నాయి.
వెబ్‌సైట్: www.autodesk.com లేదా www.caddcentre.com

వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ ఇంజనీరింగ్
ఈసీఈలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపయోగపడే కోర్సు వీఎల్‌ఎస్‌ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్) డిజైన్ ఇంజనీరింగ్. ఈ కోర్సు ద్వారా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్‌ను వేలసంఖ్యలో ఉండే ట్రాన్సిస్టర్లతో సమ్మిళితం చేసి చిన్న చిప్ రూపంలో పొందుపర్చే నైపుణ్యాలు లభిస్తాయి. వీటికి అదనంగా సెమీ కండక్టర్ చిప్స్ రూపకల్పన, రూటింగ్ వంటి అంశాల్లోనూ శిక్షణ అందుకోవచ్చు.
  • ఈ కోర్సులో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థల నుంచి అకడమిక్ సంస్థల వరకు శిక్షణ అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీఓఈఏసీఈ, సీడాక్ తదితర సంస్థలు కూడా శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి.
  • శిక్షణ పూర్తి చేసిన ఈసీఈ అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో అవకాశాలు మరింత మెరుగవుతాయి. ప్రస్తుతం నానో టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వీఎల్‌ఎస్‌ఐ నైపుణ్యాలు ఆవశ్యకంగా మారాయి.

వీహెచ్‌డీఎల్
ఆధునిక ప్రపంచంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఈసీఈ అభ్యర్థులకు... వీహెచ్‌డీఎల్ (వీహెచ్‌ఎస్‌ఐసీ హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్) కోర్సు తప్పనిసరిగా మారుతోంది.
  • ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ ద్వారా డిజిటల్, మిక్స్‌డ్ సిగ్నల్ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రూపకల్పన, పర్యవేక్షణకు సంబంధించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా ఈ కోర్సు గుర్తింపు పొందింది.
వెబ్‌సైట్: www.xilinx.com

బీఎస్‌ఎన్‌ఎల్ సర్టిఫికేషన్ కోర్సు
  • టెలికం రంగంలో మానవ వనరుల డిమాండ్ - సప్లయ్ వ్యత్యాసాలను తగ్గించే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేకంగా ‘సర్టిఫైడ్ టెలికం ప్రొఫెషనల్-వైర్‌లెస్’ కోర్సుకు రూపకల్పన చేసింది.
  • సింక్‌రూట్ ఇన్‌ఫ్రా నెట్ సంస్థ భాగస్వామ్యంతో అందిస్తున్న ఈ కోర్సులో 4జీ టెక్నాలజీ, బ్రాడ్ బ్యాండ్ డేటా తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తిచేసిన తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్ కూడా అందిస్తారు.
వెబ్‌సైట్: www.syncroute.com

అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌తో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఉపయోగపడే కోర్సు అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది.
  • పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, క్వాలిటీ పవర్ డెలివరీ వంటి అంశాల్లో శిక్షణిస్తారు. అంతేకాకుండా విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.ignou.ac.in

పోస్ట్ డిప్లొమా ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్
ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్‌లతో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపయోపగడే కోర్సు.. పోస్ట్ డిప్లొమా ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ . దీన్ని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది.
  • విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి అడ్వాన్స్‌డ్ నైపుణ్యాలతోపాటు, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ ఉంటుంది. కోర్సు వ్యవధి ఏడాది.
వెబ్‌సైట్: www.nptineyveli.in

థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్
  • ఈఈఈ విద్యార్థులకు దూర విద్యా విధానంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్సు పీజీ ఎగ్జిక్యూటివ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన బాయిలర్స్,స్టీమ్ టర్బైన్స్, జనరేటర్స్ అండ్ ఆక్సిలరీస్‌కు సంబంధించి రూపొందుతున్న కొత్త అంశాలు, అదే విధంగా పవర్ ప్లాంట్ ఆపరేషన్‌లో వస్తున్న తాజా మార్పులపై శిక్షణనిస్తారు.
వెబ్‌సైట్: www.synergemindia.org
సర్టిఫికేషన్లతో తాజా నైపుణ్యాలు
డిప్లొమా అభ్యర్థులకు ప్రతిభ ఉంటే కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తాయనటంలో సందేహం లేదు. అయితే ఇదే సమయంలో విద్యార్థులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు, సాఫ్ట్‌వేర్ ఆధారిత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌తో ఎప్పటికప్పుడు తాజా నైపుణ్యాలను అలవరచుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఆధారిత షార్ట్‌టర్మ్ కోర్సుల్లో అధిక శాతం మెకానికల్, ఈసీఈ అభ్యర్థులకు అనుకూలించేవిగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లోనూ కొత్త కోర్సులు వస్తే బాగుంటుంది.
- రాములు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, హైదరాబాద్

విస్తృత దృష్టితో ఆలోచించాలి
పాలిటెక్నిక్ విద్యార్థులు విస్తృత దృష్టితో ఆలోచించి కొత్త నైపుణ్యాలు పొందేందుకు కృషి చేయాలి. కొన్ని కోర్సుల వ్యవధి 15 రోజుల నుంచి 30 రోజుల మధ్యలోనే ఉంటున్నాయి. కానీ, వాటి ద్వారా లభించే పరిజ్ఞానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించి వ్యవధిని పరిగణనలోకి తీసుకోవద్దు. కోర్సు షెడ్యూల్‌ను క్షుణ్నంగా పరిశీలించి ఉపయుక్తం అనుకుంటే తప్పనిసరిగా చేరడం మంచిది.
- మాగేశ్, సీడాక్, హైదరాబాద్
Published date : 25 Dec 2015 12:58PM

Photo Stories