Skip to main content

కెరీర్ గైడెన్స్.. కౌన్సెలింగ్

ఉరుకులు పరుగుల జీవితంలో నిత్యం ఎదురవుతున్న ఒత్తిడి.. ఉన్నత స్థానాలు అధిరోహించే క్రమంలో ఎదురయ్యే సందేహాలు.. భార్యభర్తల మధ్య తలెత్తే సమస్యలు.. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపించే వారే కౌన్సెలర్‌లు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా చిన్న కుటుంబాలు, పోటీ వాతావరణం నేపథ్యంలో మనుషుల్లో ఒత్తిడి, అశాంతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సమస్యల నుంచి విముక్తి కోసం కౌన్సెలర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా కౌన్సెలర్ల అవసరం బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సంబంధించిన కోర్సుల్లో పట్టాలు పొందిన వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

కోర్సులు:
కౌన్సెలర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పలు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. నేరుగా కౌన్సెలింగ్ కోర్సులే కాకుండా పీజీ స్థాయిలో క్లినికల్, కమ్యూనిటీ సైకాలజీ డిగ్రీలు పొందిన వారు కూడా కౌన్సెలర్లుగా రాణిస్తున్నారు. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ పేరుతో పీజీ డిప్లొమా కోర్సులను కూడా అందిస్తున్నాయి.

ఉపాధి విభాగాలు.. విధులు
కెరీర్ కౌన్సెలర్లు:
తమ కెరీర్ గురించి ఆందోళన చెందే విద్యార్థులకు.. వారి అభిరుచులు, శక్తి సామర్థ్యాలు, ఆసక్తి ఆధారంగా తగిన మార్గనిర్దేశనం చేయడమే వీరి విధి. ప్రస్తుతం పలు కార్పొరేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా కెరీర్ కౌన్సెలర్లను నియమిస్తున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఎదురవుతున్న ఒత్తిడిని దూరం చేయడానికి ఈ కౌన్సెలింగ్‌ను ఓ చక్కని సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.

ఫ్యామిలీ కౌన్సెలర్లు:
కుటుంబంలో భార్యభర్తల మధ్య ఏర్పడే వివాదాలకు సరైన మార్గం చూపించడం ఫ్యామిలీ కౌన్సెలర్ల విధి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు, మ్యారేజిబ్యూరోల్లో వీరికి అవకాశాలు లభిస్తున్నాయి.

కార్పొరేట్ కౌన్సెలర్లు:
బహుళజాతి సంస్థలు, భారీ వ్యాపార సంస్థల్లో నిత్యం ఒత్తిడి వాతావరణంలో పనిచేసే సిబ్బందికి రిఫ్రెష్‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వారిలో నూతనోత్తేజాన్ని నింపడం కార్పొరేట్ కౌన్సెలర్ల విధి. ప్రస్తుతం పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు, డెడ్‌లైన్ల ఒత్తిడిలో ఉండే ఇతర ఎంఎన్‌సీలు తమ సిబ్బంది కోసం కౌన్సెలర్ల నియామకం చేపడుతున్నాయి. ఈ విభాగంలో సర్టిఫికేషన్లు పొందిన వారు విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మానసిక చికిత్సా కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాల్లో కౌన్సెలర్లుగా అడుగుపెట్టవచ్చు.

ఫ్రీలాన్సింగ్:
కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్లు పొందిన వారు సొంతగా ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

వేతనం:
ప్రారంభంలో నెలకు రూ. 15 వేల వరకు.. రెండు మూడేళ్ల అనుభవం గడిస్తే రూ. 35 వేల వరకు సంపాదించవచ్చు. ఇక సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్న వారు పేరు గడిస్తే ఆదాయానికి హద్దే ఉండదు. గంటకు రూ. 2 వేల ఫీజు తీసకుంటున్న కౌన్సెలర్లు కూడా ఎందరో

కావాల్సిన స్కిల్స్:
ఓర్పు
ఎదుటి వారి బాధను గుర్తించే నేర్పు
సమస్యకు మూల కారణాన్ని శోధించే సామర్థ్యం.

అందుబాటులోని కోర్సులు:

డిప్లొమా ఇన్ కౌన్సెలింగ్:
ఎన్‌సీఈఆర్‌టీ (అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్)
వెబ్‌సైట్: www.ncert.nic.in

యూనివర్సిటీ ఆఫ్ బాంబే.
వెబ్‌సైట్: www.mu.ac.in

కర్నాటక యూనివర్సిటీ.
వెబ్‌సైట్: https://www.kud.ac.in/

హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ.
వెబ్‌సైట్: hpuniv.nic.in/

డిప్లొమా ఇన్ గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్
ది మహరాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా (గుజరాత్)
వెబ్‌సైట్: www.msubaroda.ac.in

పంజాబ్ యూనివర్సిటీ (వ్యవధి ఏడాది; అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత)
వెబ్‌సైట్: www.tiss.edu/

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (వ్యవధి: ఏడాది; అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత) వెబ్‌సైట్: www.tiss.edu/

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (వ్యవధి: ఏడాది; అర్హత: బ్యాచిలర్ డిగ్రీ)
వెబ్‌సైట్: www.ignou.ac.in

ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా మార్చి నుంచి జూన్ నెలల మధ్యలో నోటిఫికేషన్‌లు విడుదలవుతాయి.
Published date : 04 Dec 2012 03:25PM

Photo Stories