Skip to main content

కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటేనే..!

ప్రైవేటు ఉద్యోగాలకే కాదు.. ప్రభుత్వ ఉద్యోగాలకూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా మారుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ నుంచి ఉద్యోగానికి ఎంపికవడం, విధులు నిర్వర్తించడంలోనూ కంప్యూటర్ పాత్ర గణనీయంగా పెరిగింది.
అందుకే ప్రభుత్వ నియామక సంస్థలు అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు తెస్తున్నాయి. అంతేకాకుండా ఏకంగా ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాల తోపాటు సర్కారీ కొలువులకు తప్పనిసరిగా మారుతున్న కంప్యూటర్ నాలెడ్జ్‌పై పట్టు సాధించడమెలాగో తెలుసుకుందాం...

ఇటీవల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వెలువరిస్తున్న ఉద్యోగ ప్రకటనల్లో కంప్యూటర్ నాలెడ్జ్‌ తప్పనిసరనే నిబంధనలు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా మారిన తాజా నిబంధనలతో ఉద్యోగ ఔత్సాహికులందరూ ప్రాథమిక కంప్యూటర్ ఆపరేషన్స్‌, పనితీరు గురించి తెలుసుకోవడం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ఆర్‌‌ట్స నేపథ్య మున్న విద్యార్థులు, దూరవిద్యలో చదివిన విద్యార్థుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంది. కానీ, నేటి డిజిటల్ యుగంలో పనులన్నీ ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లోనూ పెన్ను, పేపర్ విధానంలో కంటే కంప్యూటర్ ఆధారిత సేవలు ఎక్కువ య్యాయి. కాబట్టి ప్రభుత్వ నియామక సంస్థలు అభ్యర్థుల్లో కంప్యూటర్ స్కిల్స్‌ను పరీక్షిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే గ్రామీణ విద్యార్థులు కంప్యూటర్ నాలెడ్జ్‌ పెంపొందించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రాథమిక పరిజ్ఞానానికి ఎంఎస్ ఆఫీస్ :
కంప్యూటర్ వినియోగంలో ప్రాథమికంగా ఉండాల్సిన బేసిక్ స్కిల్స్‌ను సొంతం చేసుకోవడానికి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే సరిపోతుంది. దీనిద్వారా ఎన్నో ముఖ్య నైపుణ్యాలు అందిపుచ్చుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్‌లో భాగంగా ఎంఎస్ వర్డ్‌లో లెటర్ టైపింగ్, పేరా టైపింగ్, ప్యాసేజ్ టైపింగ్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఒక ఫైల్‌ను ఎలా క్రియేట్ చేస్తారు? డిలీట్ చేసిన పదాలను వెంటనే తిరిగి పొందడమె లా? కాపీ, పేస్ట్ చేయడం, కంటెంట్‌కు ఫార్మట్ ఇవ్వడం, స్పెల్లింగ్ తప్పులు, గ్రామర్ తప్పులు లేకుండా చూసుకోవడం, ప్రింట్ ఇచ్చే విధానం, టేబుల్ క్రియేట్ చేయడం ఎలా.. మొదలైన ఆపరేషన్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎంఎస్ ఎక్సెల్ ముఖ్యమే :
క్యాలికులేషన్స్‌కోసం విరివిగా ఉపయోగించే ఎంఎస్ ఎక్సెల్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ఉన్న ఫీచర్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. ఎంఎస్ ఎక్సెల్‌లో వర్క్‌షీట్‌లో డేటా ఎంట్రీ చేయడం, ఎడిటింగ్, క్యాలికులేషన్స్‌ కోసం ఫార్ములాలు రాయడం, టేబుల్ డ్రా చేయడం, గ్రాఫ్స్ క్రియేట్ చేయడం తదితరాలకు సంబంధించి ఆప్షన్లు ఉపయోగించడం తెలుసుకోవాలి.

పవర్ పాయింట్ :
ఎంఎస్ పవర్ పాయింట్‌ను ఉపయోగించి కొత్త ప్రజెంటేషన్‌ను ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఎంఎస్ పవర్ పాయింట్‌లో ఉన్న టూల్స్ బార్స్ ఆప్షన్‌ను ఉపయోగించగలగాలి. కొత్త స్లైడ్స్ ప్రవేశపెట్టడం, లేఔట్ ఇవ్వడం, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, స్లైడ్ షోలు, పిక్చర్లకు, టెక్స్ట్‌కు యానిమేషన్ సెట్ చేయడం లాంటి ఆప్షన్లు వాటికి కస్టమైజ్డ్ సెట్టింగ్‌‌స ఇవ్వడం తెలుసుకోవాలి.

అన్నీ ఇంటర్నెట్ ఆధారితంగానే...
ప్రస్తుతం కంప్యూటర్‌తో కార్యకలాపాలన్నీ ఇంటర్నెట్ ఆధారంగా జరుగుతున్నాయి. అందుకే ఇంటర్నెట్‌ను సరిగ్గా వినియోగించు కోవడం తెలుసుకోవాలి. ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ చేస్తున్నారు, యాక్సెస్ చేయడానికి ఉపయోగించే మీడియం ఏంటి.. బ్రౌజర్ అంటే ఏంటి.. వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు.. ఎన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి.. సెర్చ్ ఇంజిన్స్‌లో కావాల్సిన సమాచారం కోసం వెతకటం ఎలా.. ఈ- మెయిల్ క్రియేట్ చేయడం ఎలా.. మెయిల్స్ ఎలా పంపాలి.. ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో పేమెంట్స్ అన్ని ఆన్‌లైన్లోనే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి.. తదితర అంశాల గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం మేలు.

షార్ట్‌కట్ ముఖ్యమే :
మొత్తంగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్‌పై అవగాహన తోపాటు కీబోర్డ్ షార్ట్‌కట్ మెథడ్స్‌, ఫైల్స్-డాక్యుమెంట్ ప్రొఫార్మాలపై అవగాహన, డాక్యుమెంట్ కన్వర్షన్ మెథడ్స్‌, టైపింగ్ స్కిల్స్ కెరీర్‌లో ఉద్యోగ సాధనకు ఉపయోగపడతాయి. ఇందుకోసం ఆఫీస్ ఆటోమేషన్ వంటి డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

అవకాశాలు మెరుగు :
ప్రభుత్వ ఉద్యోగ సాధనకోసం నేర్చుకునే కంప్యూటర్ స్కిల్స్ వ్యక్తిగతంగా ఎదగడానికి కూడా ఎంతో దోహదం చేస్తాయి. ఉదాహరణకు టైపింగ్ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఏదో ఒక ప్రైవేటు సంస్థలో డేటాఎంట్రీ ఆపరేటర్‌గా చేరొచ్చు. అలానే, పౌర సేవలు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్న నేపథ్యంలో సొంతకాళ్లపై నిలబడటానికి కంప్యూటర్ నాలెడ్జ్‌, ఇంటర్నెట్‌పై అవగాహన ఉపకరిస్తుంది.

పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే..
ఇటీవల కాలంలో పరీక్షల నిర్వహణ విధానం కూడా మారింది. బ్యాంకు పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్లోనూ నిర్వహిస్తున్నారు. ఇక బ్యాంకు పరీక్షలైతే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ కూడా కంప్యూటర్ ఆధారంగానే జరుగుతున్నాయి. డిగ్రీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయడానికి కనీసం కంప్యూటర్ వినియోగం తెలిసి ఉండాలి. ఇందుకోసం బేసిక్ టెక్నికల్ స్కిల్స్, నావిగేషన్ టూల్స్‌పై ముందుగా అవగాహన అవసరం.

తక్కువ సమయంలోనే నేర్చుకోవచ్చు :
టెక్నాలజీ ప్రభుత్వ శాఖల్లో చేరిపోయింది. కాబట్టి కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలు అవసరం. ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్, ఇంటర్నెట్ వినియోగం, హార్డ్‌వేర్ ఫండమెంటల్స్.. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఏదైనా చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా గుర్తించి పరిష్కరించుకునే నాలెడ్జ్‌ అవసరం. ఇక ఈ-మెయిల్ అకౌంట్ క్రియేట్‌చేసుకోవడం, ఈ - మెయిల్స్ పంపడం వంటి కనీస ఆప్షన్లు తెలిసి ఉండటం తప్పనిసరి. ఇవన్నీ నేర్చుకోవడానికి వారం రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు.
- కోటి, పీర్స్ టెక్నాలజీస్, హైదరాబాద్.
Published date : 26 Oct 2018 05:27PM

Photo Stories